close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అప్పట్నుంచి గుడ్‌మార్నింగ్‌ చెప్పను

అప్పట్నుంచి గుడ్‌మార్నింగ్‌ చెప్పను

బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌... అని పరిమితులు పెట్టుకోలేదామె. ఫిల్మ్స్‌, షార్ట్‌ ఫిల్మ్స్‌ అన్న అవధులూ లేవామెకు. అవకాశం వచ్చిన ప్రతిచోటా తన ప్రతిభను చూపిస్తుంది, చేసిన ప్రతి పాత్రకూ న్యాయం చేస్తుంది. మిగతా హీరోయిన్లకి సాధ్యం కానిది ఆమెకు మాత్రమే ఇలా ఎలా సాధ్యమవుతోందంటే... ఆమె రాధికా ఆప్టే కాబట్టి. తనను హీరోయిన్‌గా కాకుండా ఒక నటిగా భావిస్తుంది కాబట్టి. తాజాగా ‘కబాలి’లో రజనీతో జతకట్టింది. ఈ సందర్భంగా నటిగా తన దశాబ్దకాల అనుభవాలని చెబుతోందిలా!

మా సొంతూరు పుణె. కాలేజీ రోజులనుంచే క్లాసులోకంటే రంగస్థలంపైనే ఎక్కువగా ఉండేదాన్ని. నిజానికి పాఠశాల రోజులనుంచే నాకు నాటకాలంటే ఇష్టం. అమ్మానాన్నా ఇద్దరూ వైద్యులే అయినా, నాటకాలపైన నాకున్న ఆసక్తికి వారు అడ్డుచెప్పలేదు. ఓ పక్క చదువుతూనే పుణెలో మోహిత్‌ తకల్కర్‌ ఆధ్వర్యంలోని మరాఠీ నాటక బృందం ‘ఆసక్త కళామంచ్‌’లో సభ్యురాలిగా చేరాను. నాన్న ఎంత బిజీగా ఉన్నప్పటికీ నా నాటకాల్ని చూసేవారు. చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దనేవారు. అర్థశాస్త్రం, గణితం సబ్జెక్టులతో ఫెర్గ్యూసన్‌ కాలేజీలో డిగ్రీ చేశాను. చిన్నపుడు ఎనిమిదేళ్లపాటు కథక్‌ నేర్చుకున్నాను.

నాటకంలో చూసి
సినిమాల్లోకి వెళ్తానన్నపుడు మొదట నాన్న అంగీకరించలేదు. కానీ వ్యక్తుల నిర్ణయాలనీ, అభిప్రాయాలనూ గౌరవించే కుటుంబం మాది. డిగ్రీలో ఉండగానే 2005లో వచ్చిన ‘వాహ్‌: లైఫ్‌ హో తో ఐసీ’ అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. తర్వాత ఓ హిందీ షార్ట్‌ఫిల్మ్‌లోనూ చేశాను. కళామాంచ్‌... ప్రదర్శించిన ఒక ప్రయోగాత్మక నాటకంలో నన్ను చూసిన బాలీవుడ్‌ హీరో రాహుల్‌ బోస్‌ తాను చేయబోతున్న బెంగాలీ సినిమా, ‘అంథీన్‌’లో అవకాశం ఇప్పించారు. 2009లో వచ్చిన ఆ సినిమాలో రాహుల్‌తోపాటు అపర్ణాసేన్‌, షర్మిలా ఠాగోర్‌ కూడా ఉన్నారు. మంచి అవకాశమని చేశాను. ఆ సినిమాకి నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. నాకూ మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత మరాఠీ, హిందీలలో రెండు సినిమాలు చేశాను. 2010లో రామ్‌గోపాల్‌ వర్మ నుంచి పిలుపు వచ్చింది. ఆయన మూడు (తెలుగు, హిందీ, తమిళ)భాషల్లో తీసిన ‘రక్త చరిత్ర’ రెండు భాగాల్లోనూ చేశాను. వర్మకి సెట్లో ‘గుడ్‌ మార్నింగ్‌’ చెప్పడం ఇష్టం ఉండదు. ‘గుడ్‌ మార్నింగ్‌ చెప్పినంతమాత్రాన ఆ మార్నింగ్‌ నాకు అంతా మంచే జరుగుతుందా’ అనడిగేవారు. ఆ లాజిక్‌ నాకూ నచ్చింది. అప్పట్నుంచీ నేను గుడ్‌మార్నింగ్‌ చెప్పడం మానేశాను. అదే కాదు, ఏదైనా కృతకంగా ఉంటే ఆయనకు నచ్చదు. వర్మ దగ్గర నటనతోపాటు దర్శకత్వానికి సంబంధించిన విషయాల్నీ నేర్చుకున్నాను. అలాగే ప్రకాశ్‌రాజ్‌ సినిమా ‘ధోనీ’లోనూ నటించాను. అందులో నాది వేశ్య పాత్ర. కానీ మంచితనం ఉన్న మనిషిగా కనిపించాలి. సవాలుగా అనిపించింది. అందుకే అది చేశాను. తర్వాత బాలకృష్ణతో లెజెండ్‌, లయన్‌ సినిమాల్లో చేశాను. దక్షిణాదిలో తెలుగు తర్వాత తమిళం, మలయాళ సినిమాల్లోనూ చేశాను. దక్షిణాది సినిమాలు చేసేటపుడు షూటింగ్‌ సమయానికి ముందే నా డైలాగుల్ని దేవనాగరి లిపిలో రాసుకుంటాను. ప్రతి పదానికీ అర్థం తెలుసుకోవడంతోపాటు పలకడంలోనూ జాగ్రత్త తీసుకుంటాను. అలా చేయకపోతే డబ్బింగ్‌ కష్టమవుతుంది. భారతీయ సినిమాల్లో, చేస్తూనే మరోవైపు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో కూడా చేస్తున్నాను.

లండన్‌లో పాఠాలు
చిన్నపుడు నా ఆలోచనలు బాలీవుడ్‌ చుట్టూ తిరిగేవి. ప్రపంచ సినిమా గురించి తెలుసుకున్నాక అటువైపు మళ్లాయి. నాటకరంగంలోకి అడుగుపెట్టాక అదే నా ప్రపంచం అనుకున్నాను. మరోవైపు మార్షల్‌ ఆర్ట్స్‌, కథక్‌లతోపాటు ‘కాంటెంపరరీ డ్యాన్స్‌ ఆఫ్‌ ఇండియా’లో శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత 2011లో లండన్‌ వెళ్లి ఏడాదిన్నరపాటు ‘కాంటెంపరరీ డ్యాన్స్‌ అండ్‌ రిలీజ్‌ థెరపీ’లో శిక్షణ తీసుకున్నాను. అప్పట్నుంచీ ‘కెమెరా ముందు నిలబడాలి. అది ఏ స్థాయి సినిమా అన్నది ముఖ్యం కాదు’ అని నిర్ణయించుకున్నాను. నిజానికి బాలీవుడ్‌లో 2011లో నేను చేసిన ‘షోర్‌ ఇన్‌ ద సిటీ’ విడుదలయ్యాక అవకాశాలు బాగా వచ్చాయి. కానీ వాటిని వదులుకొని లండన్‌ వెళ్లాను. అక్కడ గడిపిన సమయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ విరామం వ్యక్తిగతంగా నాలో ఎన్నో మార్పుల్ని తీసుకురావడంతోపాటు నటిగా నూతనోత్తేజాన్ని నింపింది. మావారు ‘బెనెడిక్ట్‌ టేలర్‌’ అక్కడే పరిచయం. ఆయన సంగీతకారుడు. రెండేళ్లపాటు మేం సహజీవనం చేశాం. నాకు పెళ్లి మీద అంత నమ్మకంలేదు. కానీ వీసా, ఇతర పత్రాల సమస్యలు తలెత్తకుండా 2012లో పెళ్లిచేసుకున్నాం.

మర్చిపోలేని ఏడాది
2015కి ముందు ఎన్నో సినిమాలు చేసినా.. నాకు సంతృప్తినిచ్చిన సినిమాలు 2015 నుంచి వస్తున్నాయి. గతేడాది నావి 11 సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో బద్లాపూర్‌, మాంఝీ, హంటర్‌ సినిమాలు పేరుతెచ్చాయి. 14 నిమిషాల ‘అహల్య’ లఘు చిత్రం కూడా ఎంతో గుర్తింపు తెచ్చింది. అందులో ఒక వృద్ధుడి భార్యగా నటించాను. దర్శకుడు సుజోయ్‌ ఘోష్‌ ఒకరోజు ఫోన్‌ చేసి ‘అహల్య’ కథ చెప్పారు. అతను చెప్పిన తీరు నచ్చి వెంటనే ఒప్పేసుకున్నాను. అది తీసిన విధానానికే అంత మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో దాదాపు 60 లక్షల మంది చూశారు. 2016లో ‘ఫోబియా’ సినిమా చేశాను. అందులో నేను నిర్జన ప్రదేశాల్ని చూసినా, బాగా జనాలున్న ప్రాంతాన్ని చూసినా భయపడే ‘అగరాఫోబియా’తో బాధపడతాను. ఆ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తాను. సున్నితమైన అంశం. మిగతా పాత్రల మాదిరిగానే నటించేయడం సరి కాదనిపించింది. అందుకే ఆ ఫోబియా గురించి చాలా లోతుగా చదివాను. సైకాలజిస్టు అయిన నా స్నేహితురాలి దగ్గరా, వైద్యులైన అమ్మానాన్నల దగ్గరా ఈ వ్యాధితో బాధపడేవారి గురించి తెలుసుకున్నాను. ఆ సినిమాలో నటన నాకెంతో సంతృప్తినిచ్చింది. నేను చేస్తున్న లఘు చిత్రాల్ని చూసి దర్శకుడు ‘పవన్‌ కృపలానీ’ నాకు ఫోబియాలో అవకాశం ఇచ్చారని చెప్పినపుడు... చిత్రం చిన్నదైనా, పెద్దదైనా నటనతో మెప్పించడమే ముఖ్యమనే నా నమ్మకం వమ్ముకాలేదనిపించింది.

రజనీ మెచ్చుకున్నారు
కాలేజీ రోజుల నుంచీ అనురాగ్‌ కశ్యప్‌ సినిమాల్ని చూస్తున్నాను. అతడి ‘దేవ్‌ డి’ ఆడిషన్స్‌కీ వెళ్లాను. అనురాగ్‌కి ధైర్యం ఎక్కువ. మనసు చెప్పిందే చేస్తారు. ఈ లక్షణాలు నాలోనూ ఉన్నాయి. అందుకే అతడు నిర్మాతగా, దర్శకుడిగా ఉన్న సినిమాలూ, సీరియళ్లూ లఘు చిత్రాలూ ఎక్కువగా చేశాను. ‘దట్‌ డే ఆఫ్టర్‌ ఎవ్రీడే’, ‘బద్లాపూర్‌’, ‘మ్యాడీ’్ల, ‘హంటర్‌’... ఇవన్నీ అనురాగ్‌తో కలిసి చేసినవే. త్వరలో ‘గిడ్డీ’ చేయబోతున్నాం. పీకూ, క్వీన్‌, ఎన్‌హెచ్‌10 లాంటి సినిమాల్లో కొన్ని భాగాలు ఎంతో బాగా తీశారు. నాకూ అలాంటివి చేయాలనుంటుంది. కానీ కొన్ని కారణాలవల్ల అవి స్టార్‌ హీరోయిన్లకే వెళ్తున్నాయి. అలాగని చేయలేకపోయినా నేను బాధపడను. నటిగా కొన్నిసార్లు రాజీ పడతాను. రాజీ పడకుంటే పని చేయలేం కదా! అయితే, రాజీపడి ఒక పరిధి వరకే చేయగలను. పూర్తిగా పతివ్రత పాత్రలు ఇస్తారంటే అస్సలు చేయను. కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్లది నటన కాదని నేననను. అక్కడ నటనకంటే ఫిట్‌నెస్‌కీ, అందానికీ ప్రాధాన్యం ఇస్తారు. నటిగా నాకు అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంటుంది. నేనూ ఫిట్‌గా ఉండటానికి రన్నింగ్‌, యోగా చేస్తాను, డ్యాన్స్‌ కూడా చేస్తుంటాను. కానీ అదే పనిగా డైట్‌ గురించీ అందం గురించీ ఆలోచించడం నావల్ల కాదు. ‘కబాలీ’లో నటించమని దర్శకుడు రంజిత్‌ అడిగినపుడు నేను ఆశ్చర్యపోయాను. నాకు పెళ్లయింది, నే చేసే సినిమాలు భిన్నంగా ఉంటాయి. అయినా నన్ను అడిగేసరికి నమ్మలేకపోయాను. దీన్లో నాకు మంచి పాత్ర ఇచ్చారు. సెట్‌లో రజనీ చాలా సింపుల్‌గా, వినయంగా ఉంటారు. కొన్ని నెలలపాటు విరామం లేకుండా పనిచేశారు. మొదటిరోజు షూటింగ్‌లో నాకు చాలా ఇంగ్లిష్‌ డైలాగులు ఉన్నాయి. కొద్దిగా నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ సింగిల్‌ టేక్‌లో ఓకే అయ్యింది. రజనీ సర్‌ వచ్చి ‘నీ నటన చాలా బాగుంది’ అంటూ భుజంతట్టి ప్రోత్సహించారు.

మేకప్‌ వేసుకోను
దాదాపు నా పాత్రలన్నీ తక్కువ మేకప్‌తో ఉండి సహజంగా కనిపించేలా చేసినవే. బయటకూడా సింపుల్‌గా ఉండటమే నాకు నచ్చుతుంది. బయటకు వెళ్లేటపుడు మేకప్‌ వేసుకోను, మామూలు చెప్పులు వేసుకొని వచ్చేస్తాను. అలా ఉండటమే నాకిష్టం. నా పెళ్లికి 50 మందిని మాత్రమే పిలిచాం. నేను వెడ్డింగ్‌ గౌను కాకుండా సాధారణమైన డ్రెస్‌ వేసుకున్నానంతే. ఓసారి నాతో ఒక వ్యక్తి సెల్ఫీ దిగుతానన్నాడు. ముందు నేను చేసిన మూడు సినిమాల పేర్లు చెప్పమని అడిగాను. ‘మేడమ్‌, ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్‌’ అని చెప్పాడు. హీరోయిన్‌ని కాబట్టి నాతో ఎవరైనా ఫొటో దిగుతానంటే నచ్చదు. మరోసారి ఓ వ్యక్తి నా నాటకాలూ, సినిమాల గురించి మాట్లాడారు. 15 నిమిషాలు ఆగి మరీ ఆయనతో చర్చించాను. మరి అభిమానులకు దగ్గరయ్యేదెలా అంటారా... సోషల్‌ మీడియాలో ఉన్నాను. నాకు సంబంధించిన విషయాల్ని అందులో పెడతాను.


దర్శకుల మాట
రాధికా వృత్తికి సంబంధించి పెద్దగా వ్యూహాలేవీ రచించుకోదు. ముఖ్యంగా ‘ఎన్నో స్థానంలో ఉన్నాను’ లాంటివి ఆలోచించదు. నటిగా తనను తాను మెరుగుపర్చుకుంటున్నానా లేదా అనే చూస్తుంది. నవాజుద్దీన్‌ సిద్దిఖీ, రాధికా.. ఈ ఇద్దరితో ఎలాంటి సినిమానైనా తీయగలను.
- అనురాగ్‌ కశ్యప్‌

మె చాలా ఓపెన్‌గా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఏం చేసినా నిర్భయంగా చేస్తుంది. రాధికాతో రిహార్సల్స్‌ చేసే అవసరమే ఉండదు.
- పవన్‌ కృపలానీ

రాధికా తన పాత్రకు సిద్ధమవ్వడానికి ప్రత్యేకంగా సమయం తీసుకోదు. పాత్ర గురించి వివరించిన మరుక్షణమే తను సిద్ధమైపోతుంది. ఆమెకు ఆ సామర్థ్యం ఎలా వచ్చిందో మరి
- సుజోయ్‌ ఘోష్‌

నాటకాలను వదలను
పదేళ్ల నా కెరీర్‌లో చిన్నవీ పెద్దవీ అన్నీ కలిపి 30కిపైగా సినిమాల్లో నటించాను. సినిమాలు చేయడం ఒక డిగ్రీ చేయడంలాంటిది కాదు. ఇక్కడ కచ్చితంగా ఇలానే చేయాలనే నియమాలేవీ ఉండవు. ఈ ప్రయాణంలో కొన్ని చేదు అనుభవాలూ ఎదురయ్యాయి. కానీ అవన్నీ నేర్చుకోవడంలో భాగంగానే భావిస్తాను. వేర్వేరు భాషల్లో చేయడంవల్ల ఏ ఒక్క చోటా కమర్షియల్‌గా విజయవంతం కాలేకపోతున్నాను. అలాగని ఏదో ఒక భాషకి పరిమితం కాను. నా సినిమాల ఖాతాలో ఎక్కువ భాషల్ని చేర్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇప్పటివరకూ మరాఠీ, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, బంగ్లా, ఇంగ్లిష్‌లలో నటించాను. విదేశీ భాషల్లోనూ సినిమాలు చేయాలనేది నా కల. అంతర్జాతీయంగా అవకాశాలు దక్కాలంటే మంచి ఏజెంట్‌ ఉండాలి. మంచి ఏజెంట్‌ దొరకాలంటే మంచి సినిమా చేసి ఉండాలి. ‘పిల్ల ముందా గుడ్డు ముందా’ అన్నట్టు ఉంటుందా వ్యవహారం. సినిమాలు ఉన్నా లేకున్నా, ‘ఆసక్త కళామంచ్‌’ తరఫున నాటక ప్రదర్శనలు ఇవ్వడానికి మాత్రం వెళ్తున్నాను, వెళ్తూనే ఉంటాను. అంతేకాదు, సినిమా ప్రపంచం నన్ను వద్దనుకున్న రోజున పుణెలోనే స్థిరపడిపోతాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.