close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందరం చచ్చిపోదామనుకున్నాం!

అందరం చచ్చిపోదామనుకున్నాం!

ఎం.జిబ్రాన్‌... అతడి పేరూ, పాటలూ, ప్రయాణం అన్నీ కొత్తగానే ఉంటాయి. ఎవరు అనుకుంటారు... గుళ్లొ ప్రసాదం తింటూ కడుపు నింపుకున్న కుర్రాడు, వరసగా నాలుగు కమల్‌ హాసన్‌ సినిమాలకు సంగీతం అందిస్తాడని! ఎవరు వూహించగలరు... లాటరీ టికెట్లు అమ్ముకొని బతికిన పిల్లాడు దక్షిణాదిలో సంగీత దర్శకుడిగా దూసుకెళ్తాడని! మొదట ‘రన్‌ రాజా రన్‌’తో అద్దిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. తరవాత గోపీచంద్‌తో ‘జిల్‌’ అనిపించాడు. ఇప్పుడు ‘బాబు బంగారం’ అంటూ థియేటర్లో వెంకటేష్‌తో పాటు ప్రేక్షకులతోనూ స్టెప్పులేయిస్తున్నాడు. జిబ్రాన్‌ పాట వింటే పాదాలకు వూపొస్తుంది. అదే అతడి కథ వింటే... ఆత్మస్థెర్యానికే ఓ కొత్త వూపిరొస్తుంది.

విశ్వరూపం-2, ఉత్తమ విలన్‌, పాపనాశం (దృశ్యం రీమేక్‌), చీకటి రాజ్యం... కమల్‌హాసన్‌ లాంటి సూపర్‌స్టార్‌ సినిమాలకు ఇలా వరసగా సంగీతం అందించానంటే, ఎంత అదృష్టవంతుడినో అనుకుంటారు. కానీ దురదృష్టం నన్ను ఎన్నిసార్లు వెక్కిరించిందో ఎవరికీ తెలీదు. తెలుగులో మూడో ప్రాజెక్టుగా వెంకటేష్‌-మారుతీల కలయికలో వచ్చిన ‘బాబు బంగారం’కి పనిచేశానంటే, ప్రతిభకు దక్కిన గుర్తింపని అంటున్నారు. కానీ ఆ నైపుణ్యాన్ని సాధించడం కోసం ఎన్ని కష్టాలు పడ్డానో నేనెప్పుడూ బయట పెట్టలేదు. గతంలో పన్నెండు వందలకుపైగా టీవీ ప్రకటనలకు పనిచేశానని చెబితే ఇప్పటికీ చాలామంది నమ్మలేరు. కెరీర్‌లో అన్నీ విజయాలే ఉన్నట్లు కనిపించినా, నా జీవితం మాత్రం ఎదురుదెబ్బలతోనే మొదలైంది. నేను పుట్టి పెరిగింది తమిళనాడులోని కోయంబత్తూరులో. ఓసారి మా కాలనీలో జరిగిన పాటల పోటీలో నేను పాడిన పాటకే మొదటి బహుమతి వచ్చింది. దాంతో చుట్టుపక్కలవాళ్లంతా నాకు సంగీతం నేర్పించమని అమ్మానాన్నలకు సలహా ఇచ్చారు. అలా పదేళ్ల వయసులో పాడటం, వీణ వాయించడం నేర్చుకోవడం మొదలుపెట్టా. టీవీలో యానీ అనే కీబోర్డ్‌ ప్లేయర్‌ షో చూసి, పెద్దయ్యాక ఆయనలానే కంపోజర్‌గా మారాలని అప్పట్నుంచీ కీబోర్డ్‌ సాధనపైన దృష్టిపెట్టా.

వూరొదిలి వచ్చేశాం
రోజులు హాయిగా గడుస్తున్న సమయంలో ఓ వూహించని పరిణామం మా జీవితాలను తలకిందులు చేసింది. నాన్న నడిపించే హోటల్‌ విపరీతమైన నష్టాల్లోకి వెళ్లింది. క్రమంగా వ్యాపారం కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. నాన్న మానసికంగా చాలా కుంగిపోయారు. ఓ దశలో కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాం. చివరికి ధైర్యం కూడదీసుకుని పోరాడాలని నిర్ణయించుకున్నాం. ఇల్లూ, సామగ్రితో సహా అన్నీ అమ్మేసి అప్పులవాళ్లకి ముట్టజెప్పాం. బాగా బతికిన ప్రాంతంలోనే చితికిపోయి రోజులు గడపడం కష్టంగా అనిపించి, కట్టుబట్టలతో చెన్నైకి వలసొచ్చేశాం. చేతిలో చిల్లి గవ్వలేదు. చదువూ పదితో ఆగిపోయింది. చెన్నైలో అన్నయ్య ఓ మెడికల్‌ షాపులో పనికి కుదిరాడు. నేను ఓ ఏజెన్సీలో మెడికల్‌ రిప్రెజంటేటివ్‌గా చేరా. నాన్నకీ చిన్న పనేదో దొరకడంతో మా తమ్ముడిని చదువు కొనసాగించమని చెప్పాం.

లాటరీషాపులో పని
పుట్టుకతో పేదవాళ్లయితే ఆ పరిస్థితులకు అలవాటు పడటం కష్టం కాకపోవచ్చు. కానీ బాగా బతికి ఒక్కసారిగా సున్నాకి పడిపోవడం ఎంత నరకమో అనుభవిస్తే కానీ తెలీదు. అలాంటి పరిస్థితికి క్రమంగా అలవాటు పడటం మొదలుపెట్టా. నేను ఇంటర్‌ పాసయ్యానని అబద్ధం చెప్పి ఉద్యోగంలో చేరా. కానీ నా పర్సనాలిటీ చూసి ఏజెన్సీ వాళ్లకు అనుమానం వచ్చి కొన్ని నెలల తరవాత వాకబు చేయడంతో విషయం బయట పడింది. దాంతో ఉద్యోగం వూడింది. ఆ తరవాత కొన్నాళ్లు ఓ లాటరీ టికెట్లు అమ్మే షాపులో పనిచేశా. అక్కడ డబ్బులు కూడా బాగానే వచ్చేవి. చదువు ఎలాగూ దూరమైంది కాబట్టి నెలకు మూడొందలు పెట్టి నాకిష్టమైన కీబోర్డు నేర్చుకుంటూ మిగతా ఎంత మిగిల్తే అంత ఇంట్లో ఇచ్చేవాణ్ణి. అలా పనిచేస్తూనే ట్రినిటీ మ్యూజిక్‌ కాలేజీలో కీబోర్డులో గ్రేడ్‌ 8 కోర్సు పూర్తిచేశా. ఆ తరవాత ఐదారుగురు పిల్లలకు మ్యూజిక్‌లో హోం ట్యూషన్లు చెప్పేవాణ్ణి. నెలకు మూడు, నాలుగు వేలు వచ్చేవి.

1200కి పైగా ప్రకటనలు!
ట్యూషన్లు చెబుతుండగానే ఓ యానిమేషన్‌ కంపెనీలో కీబోర్డు ప్లేయర్‌గా ఉద్యోగం వచ్చింది. ఐదు వేలు జీతం. మూడేళ్ల పాటు అక్కడే పనిచేయడంతో ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగైంది. దాంతో లోన్‌ తీసుకొని ఓగదిలో సొంతంగా చిన్న స్టూడియో ఏర్పాటు చేశా. ఉద్యోగంలో భాగంగా పరిచయమైన ఓ వ్యక్తి ద్వారా మొదట ఓ టీ కంపెనీ టీవీ యాడ్‌కు నేపథ్య సంగీతం అందించే అవకాశం వచ్చింది. నిజానికి ఆ ప్రకటనను థమన్‌ చేయాల్సింది. అతడు అందుబాటులో లేకపోవడం నాకు కలిసొచ్చి అనుకోకుండా యాడ్‌ ఫిల్మ్స్‌కి మ్యూజిక్‌ చేయడం మొదలుపెట్టా. తొలి ప్రకటనకు మంచి పేరు రావడంతో క్రమంగా అవకాశాలూ పెరిగాయి. చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. పన్నెండు వందలకు పైగా ప్రకటనలకు నేపథ్య సంగీతం అందించా. ఆ క్రమంలోనే నా రంగంలోనే పనిచేసే ఓ పెద్దాయన పరిచయమయ్యాడు. ఒకప్పుడు ఆయన రెహమాన్‌తో కలిసి యాడ్‌ ఫిల్మ్స్‌కి పనిచేసేవాడట. కానీ ఆ తరవాత కెరీర్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. ఆయన్ని చూశాక నేను కూడా భవిష్యత్తులో అలానే మిగిలిపోతానేమో అని భయమేసింది. ఓరోజు వెస్లీ అనే సౌండ్‌ ఇంజినీర్‌ టీవీలో వస్తున్న ఓ ప్రకటన చూపించి, దానికి జింగిల్స్‌ రెండేళ్ల క్రితం నేనే చేశానని చెప్పాడు. నేనెంత ప్రయత్నించినా ఆ ప్రకటన చేసినట్లు గుర్తురాలేదు. అప్పుడే డబ్బు కోసం నేనెంత యాంత్రికంగా పనిచేస్తున్నానో అర్థమైంది. నా లక్ష్యం ఆ రంగం కాదనిపించింది. సంగీతాన్ని లోతుగా నేర్చుకోవాలనీ, నాకంటూ ఓ ప్రత్యేకత సాధించాలనీ అనుకున్నా. సింగపూర్‌లోని లాసల్లే మ్యూజిక్‌ కాలేజీలో ‘ఆర్కెస్ట్రల్‌ కంపోజిషన్‌, ఫిల్మ్‌ స్కోరింగ్‌’ కోర్సులో సీటు రావడంతో తెలీని మొండి ధైర్యంతో చేస్తున్న పనీ, క్లయింట్లూ, ఆదాయం అన్నింటినీ వదులుకొని బయల్దేరా.

రాత్రి భోజనం గుళ్లొనే
సింగపూర్‌లో నేను తీసుకెళ్లిన డబ్బులు మొదటి సెమిస్టర్‌ నాటికి అయిపోయాయి. దాంతో ఆమధ్యే లోన్‌ తీసుకుని కొన్న ఇంటిని అమ్మేసి అమ్మావాళ్లు కొంత డబ్బు పంపించారు. చెన్నైలో ఉండగా మా ఇంటి పక్కన ఓ తెలుగు కుటుంబం ఉండేది. వాళ్ల బంధువులమ్మాయి ఎవరో చదువుకోవడానికి సింగపూర్‌ వచ్చిందట. నేను కూడా అక్కడే ఉన్నానని తెలిసి ఆ అమ్మాయికి కాస్త సాయంగా ఉండమని వాళ్లడిగారు. క్రమంగా ఆ అమ్మాయికీ నాకూ పరిచయం పెరిగింది. వాళ్లదీ మధ్య తరగతి కుటుంబం కావడంతో మా ఇద్దరి ఆలోచనా డబ్బుల్ని పొదుపు చేయడం మీదే ఉండేది. నా పరిస్థితి మరీ దుర్భరం. ఉదయం పూట మ్యాగీలాంటిదేదో తిని కాలేజీకి వెళ్లేవాణ్ణి. సాయంత్రం ఆ అమ్మాయి కాలేజీ కూడా అయిపోయాక ఇద్దరం ‘లిటిల్‌ ఇండియా’ అనే ప్రాంతంలో కలిసేవాళ్లం. అక్కడ అయ్యప్ప, మరియమ్మ గుళ్లలో ఉచితంగా భోజనం పెట్టేవారు. అలా రోజూ సాయంత్రాలు అక్కడి అన్న ప్రసాదమే మాకు ఆహారం. ఆ కష్టాల ప్రయాణంలోనే మా ఇద్దరి మనుసులూ కలిశాయి. కొన్నాళ్లకు ఇద్దరం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యాం.

ఒట్టి చేతులతో చెన్నైకి
సింగపూర్‌లో మూడేళ్ల కోర్సు పూర్తవగానే ఒకప్పుడు రూపాయి లేకుండా చెన్నైకి ఎలా వచ్చానో, మళ్లీ అలానే తిరిగివెళ్లా. కానీ ఈసారి చేతిలో నైపుణ్యం ఉంది. ఎలాగైనా బతకొచ్చన్న ధైర్యం ఉంది. ఒకప్పుడు యాడ్‌ ఫిల్మ్స్‌ని తీసిన సర్గుణం అనే స్నేహితుడు, ఆ సమయంలోనే దర్శకుడిగా మారి ఓ సినిమా తీశాడు. రెండో సినిమా తీయబోతున్న సమయంలోనే నేనతడిని కలిశా. నా పనితనం తెలుసు కాబట్టి ఆ సినిమాకి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. అలా తమిళంలో ‘వాగై సూడ వా’ అనే సినిమాతో నా రెండో ఇన్నింగ్స్‌ మొదలైంది. ఆ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డూ వచ్చింది. ఆ తరవాత మురుగదాస్‌ నిర్మించిన ‘వత్తికూచి’ సినిమాకు సంగీతం అందించా. ఆ పైన ధనుష్‌ నటించిన ‘నయాండీ’తో సంగీత దర్శకుడిగా నా స్థానం స్థిరపడిపోయింది.

తెలుగులోకి అలా...
ఓ రోజు కెమెరామన్‌ మదీ ఫోన్‌ చేసి హైదరాబాద్‌ నుంచి సుజీత్‌ అనే కొత్త దర్శకుడు నన్ను కలవాలనుకుంటున్నాడని చెప్పారు. తమిళంలో నా మొదటి సినిమాలోని ఓ పాట ఏడాది పాటు సుజీత్‌ ఫోన్‌కి రింగ్‌ టోన్‌గా ఉండేదట. ఆ తరవాత ధనుష్‌తో నేను చేసిన సినిమాలో ఓ పాట కూడా సుజీత్‌కి బాగా నచ్చిందట. ఆ రెండు సినిమాల సంగీత దర్శకుల్లో ఎవరో ఒకరిని పరిచయం చేయమని మదీని అడిగాడు. తరవాత ఆ రెండూ నా సినిమాలే అని తెలియడంతో, మరో ఆలోచన లేకుండా నాతోనే తాను చేయబోయే సినిమాకు సంగీతం చేయించాలని నిర్ణయించుకున్నాడు. అలా ‘రన్‌ రాజా రన్‌’తో తెలుగులో నా ప్రయాణం మొదలైంది. సినిమాతో పాటు అందులో పాటలూ సూపర్‌ హిట్టయ్యాయి. ‘బుజ్జీమా’, ‘వద్దంటూనే నువ్వు వద్దంటూనే’, ‘రాజాధి రాజానప్పా’ లాంటి పాటలు ఎఫ్‌ఎంలో, ఛార్ట్‌బస్టర్స్‌లో ఏడాదంతా టాప్‌లోనే కొనసాగాయి. ఆ తరవాత చేసిన ‘జిల్‌’ సినిమా ఆడియో కూడా హిట్టయి టాలీవుడ్‌లో మంచి పేరు తీసుకొచ్చింది.

కమల్‌హాసన్‌తో ప్రయాణం

సినిమాల్లో అలా అడుగులు ముందుకు పడుతున్న సమయంలో ఓ రోజు తెలిసిన వ్యక్తి ఒకాయన, ‘కమల్‌ సార్‌ నీ పాటల గురించి మాట్లాడటం విన్నాను’ అన్నాడు. అతడేదో జోక్‌ చేస్తున్నాడులే అనుకున్నా. మరోసారి ఇంకో పెద్దాయన కూడా అదే మాట చెప్పడంతో నాకది నిజమేనేమో అనిపించింది. ఇంకొన్ని రోజుల తరవాత కమల్‌ హాసన్‌గారు నన్ను కలవాలనుకుంటున్నట్లు ఆయన ఆఫీసు నుంచే ఫోనొచ్చింది. మొదట దిల్లీలోని ఓ హోటల్‌ గదిలో కమల్‌గారిని చూడగానే చాలా కంగారుగా అనిపించింది. నన్ను తేలిక పరచడానికి ‘మ్యూజిక్‌లో బాగా చదువుకున్నావటగా, ఏం చదివావు?’ అని అడిగారు. అలా నా చదువుతో మొదలైన సంభాషణ నాలుగ్గంటల పాటు కొనసాగింది. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలూ, ఎవరికీ తెలీని రహస్యాలూ తొలిసారి ఆయనతో పంచుకున్నా. కాసేపటి తరవాత ‘విశ్వరూపం’ చూశావా అని అడిగారు. చూశానని చెప్పా. ‘సరే అయితే, ఇప్పుడు నువ్వు చేయబోయేది విశ్వరూపం-2’ అన్నారు. అప్పటికప్పుడు ఓ సన్నివేశం చెప్పి పాటకు ట్యూన్‌ చేయించారు. కమల్‌ హాసన్‌గారికి నా పనితనం ఎంతలా నచ్చిందంటే, ఆయన ఇటీవల చేసిన నాలుగు సినిమాలకూ నన్నే తీసుకున్నారు. ‘ఉత్తమ విలన్‌’కి అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో సంగీత విభాగంలో చాలా పురస్కారాలొచ్చాయి. తెలుగులో ‘జిల్‌’ తరవాత ఎస్‌కేఎన్‌ అనే స్నేహితుడి ద్వారా నేను మారుతిని కలిశా. అలా ‘బాబు బంగారం’ సినిమాకి మా జోడీ కుదిరింది. ప్రస్తుతం తెలుగులో హీరోలు సునీల్‌, శిరీష్‌, రాజ్‌ తరుణ్‌, రామ్‌లు నటిస్తోన్న మరో నాలుగు సినిమాలకు సంగీతం అందిస్తున్నా.

జీవితంలో పాతాళానికి పడిలేచిన వ్యక్తికి ఏ సమస్యా పెద్దదిగా తోచదు. అలాగే ఏ విజయమూ గొప్పదిగా అనిపించదు. ఇప్పుడు నా పరిస్థితీ అలాంటిదే. చిన్నతనంలో కోయంబత్తూరు నుంచి వలసొచ్చినప్పుడు ఏదో తెలీని అవమాన భారంతో అమ్మానాన్నల పేర్లను బయట చెప్పకపోవడం అలవాటైంది. ఇప్పటికీ వాళ్ల పేర్లెక్కడా ప్రస్తావించను. నిజంగా వాళ్లు గర్వపడే స్థాయికి చేరానని అనిపించినప్పుడు వాళ్ల గురించి చెబుతా. ప్రస్తుతం ఆ స్థాయికి చేరడానికే ప్రయత్నిస్తున్నా.

శ్రీమతి తెలుగమ్మాయే!

నా భార్య అలీషాది విజయవాడ. ‘రన్‌ రాజా రన్‌’ చెన్నైలో కూడా విడుదలైనా, తెలుగు నేల మీదే ఆ సినిమా చూడాలని తను పట్టుబట్టి అప్పటికప్పుడు మమ్మల్ని హైదరాబాద్‌కి తీసుకొచ్చింది. సింగపూర్‌లో ఉన్నప్పట్నుంచీ తన వల్లే తెలుగు సినిమాలు చూడటం అలవాటైంది.
* కమల్‌ హాసన్‌గారిని తొలిసారి కలిసేవరకూ నా వ్యక్తిగత విషయాల్ని బయటకు చెప్పేవాణ్ణి కాదు. కానీ ఓ స్థాయికొచ్చాక మన జీవితం ఒక్కరికి స్ఫూర్తినిచ్చినా చాలని ఆయన చెప్పాకే నా పద్ధతిని కాస్త మార్చుకున్నా.
* సంగీతం, సినిమాలు చూడటం తప్ప నాకు మరో ప్రపంచం తెలీదు. నాకు సంబంధించిన ఇతర అన్ని విషయాలనూ మా అమ్మా, అలీషా చూసుకుంటారు. ఏడాదిన్నరక్రితం బాబు పుట్టాక నా ప్రపంచం ఇంకాస్త పెద్దదైంది.

- శరత్‌ కుమార్‌ బెహరా

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.