close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇండియా వెళ్తే కెరీర్‌కి నష్టమన్నారు!

ఇండియా వెళ్తే కెరీర్‌కి నష్టమన్నారు!

అశోక్‌ లేలాండ్‌... హిందుజా గ్రూపునకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ. దేశంలోనే రెండో అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఇది. రూ.18వేల కోట్ల విలువైన ఈ కంపెనీకి తెలుగువారైన దాసరి వినోద్‌కుమార్‌ ఎండీగా అయిదేళ్ల నుంచి సారథ్యం వహిస్తున్నారు. తన తండ్రి పిల్లల కోసం అమెరికా వెళ్తే, తాము తమ పిల్లలకోసం భారత్‌ వచ్చామని చెప్పే వినోద్‌, ఇంకా తన జీవనయానం గురించి ఏమంటున్నారంటే...

నాన్న మాధవరావు. అమ్మ వసుంధర. నాన్న పుట్టింది కృష్ణా జిల్లా పడమటి లంక పల్లెలో. తాతయ్య సుబ్బయ్య. నాన్నమ్మ రాఘవమ్మ. తాత చిన్న రైతు. దానివల్ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయిదుగురు పిల్లల్లో మా పెదనాన్న మాత్రమే చదివేవారు. తాతయ్యకి పొలం పనుల్లో సాయంగా ఉండేవారు నాన్న. అప్పట్లో కాకాని వెంకటరత్నంగారు మా పక్క వూరైన శ్రీకాకుళంలో హైస్కూల్‌ పెట్టడంతో నాన్నని అక్కడ చేర్చారు. నాన్న నేరుగా ఎనిమిదో తరగతిలో చేరారు. తాతయ్య పేరుమీద నాన్న చదివిన బళ్లొ ఒక భవనం కట్టించాం. ఎనిమిదితో మొదలైన నాన్న చదువు పీహెచ్‌డీ వరకూ వెళ్లింది. ‘జియాలజీ’లో పీజీ చేసి ఓఎన్‌జీసీలో జియాలజిస్టుగా గుజరాత్‌లో ఉద్యోగం చేసేవారు. కుటుంబానికి దూరంగా ఉండలేక కొన్నాళ్లకు ఆ ఉద్యోగం వదిలేసి ఐఐటీ కాన్పూర్‌లో చిన్న ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేస్తూనే తిరుపతి ఎస్వీయూలో పీహెచ్‌డీ చేశారు. పెళ్లి సమయానికి అమ్మ టెన్త్‌ చదువుకుంది. తర్వాత బీఏ, ఎంఏ చేసింది. అమ్మా వాళ్ల నాన్న కాజా శివరామయ్య. వాణిజ్యపన్నుల శాఖలో అధికారి. నిజాయతీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జైఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అమ్మానాన్నలు ఎంతో కష్టపడి పైకి రావడం చూశాను. పిల్లల జీవితాలు బాగుపడతాయని అమెరికా వెళ్లడానికి రేయింబవళ్లు కష్టపడ్డారు. వీళ్లందరి జీవితాలే నాకు స్ఫూర్తి.

రెండేళ్లు ఒంటరిగా...
నేను 1966లో నంద్యాలలో పుట్టాను. తాతగారు అప్పుడక్కడ పనిచేసేవారు. పెరిగింది మాత్రం ఐఐటీ కాన్పూర్‌ క్యాంపస్‌లో. 12వ తరగతి వరకూ అక్కడే చదివాను. పదకొండులో ఉన్నపుడు నాన్న అమెరికా వెళ్లారు. అమ్మ అమెరికా వెళ్లడానికి ఉపయోగపడుతుందని లఖ్‌నవూ వెళ్లి ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌’ చదివింది. అన్నయ్య విజయవాడలో చదువుకునేవాడు. దాంతో నేనొక్కణ్నే రెండేళ్లు ఐఐటీ క్యాంపస్‌లోని క్వార్టర్స్‌లో ఉండి అక్కడ హాస్టల్లో భోజనం చేసేవాణ్ని. తర్వాత నాక్కూడా అక్కడ ఇంజినీరింగ్‌ కాలేజీలో సీటు వచ్చింది. కానీ నా ఆరోగ్యం బావుండేది కాదు. ఆ సమయానికి అమ్మ కూడా అమెరికా వెళ్లిపోయింది. వీసా వచ్చేంతవరకూ నన్ను విజయవాడలో తాతగారింట్లో ఉండమన్నారు. అప్పుడు లయోలాలో బిఎస్సీలో చేరాను. రెండేళ్ల తర్వాత వీసా రావడంతో అమెరికా వెళ్లాను. నాన్న ప్రొఫెసర్‌గా, అమ్మ లైబ్రేరియన్‌గా పనిచేసిన కెంటకీలోని ‘లూవిల్‌ యూనివర్సిటీ’లోనే ఇంజినీరింగ్‌లో చేరాను. మొదట్నుంచీ తయారీరంగంలో పనిచేయాలనేది నా లక్ష్యం. అందుకే దానికి సంబంధించిన ‘ఫ్యాక్టరీ ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌’ కోర్సులో చేరాను. అయిదేళ్ల కోర్సుని కష్టపడి మూడేళ్లలో పూర్తిచేశాను. నా ఫీజులు నేనే కట్టుకోవాలని క్యాంపస్‌లోని రెస్టారెంట్లో పనిచేసేవాణ్ని.

జీఈలో తొలి ఉద్యోగం
ఇంజినీరింగ్‌ చదువుతూనే ఇంటర్న్‌షిప్‌ కోసం స్థానికంగా ఉన్న జీఈ కంపెనీలో చేరాను. వాళ్లకి నా పని నచ్చి. ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యాక కూడా చదువుతూనే వీలున్నప్పుడల్లా వచ్చి పనిచేయమన్నారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడింటి వరకూ క్లాసులకి వెళ్లి, మూడు నుంచి రాత్రి పన్నెండు వరకూ జీఈలో పనిచేసేవాణ్ని. అప్పుడక్కడ ఫ్యాక్టరీలో ఆటోమేషన్‌ పనులు జరిగేవి. దాంతో ఆ కంపెనీ నాకో ప్రయోగశాలలా అనిపించేది. 1988 ఆగస్టులో ఇంజినీరింగ్‌ పూర్తయింది. నాల్రోజుల వ్యవధిలో మరో వూళ్లొ జీఈలోనే ఉద్యోగిగా చేరిపోయాను. జీఈలో ‘మాన్యుఫాక్చరింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’ అని ఉంటుంది. అందులో భాగంగా ఏడాదిలో 50-60 మంది యువ ఇంజినీర్లని మేనేజ్‌మెంట్‌ ట్రైనీలుగా తీసుకుంటారు. దానికి ఎంపికైన వారు సంస్థకు సంబంధించిన వేర్వేరు విభాగాల్లో పనిచేసే అవకాశం వస్తుంది. వారంలో నాలుగు రోజులు పని, ఒకరోజు క్లాసులూ ఉంటాయి. అశోక్‌ లేలాండ్‌లోనూ ఇలాంటి కార్యక్రమం మొదలుపెట్టాను.

జీఈలో చేరిన రెండేళ్లకు పెళ్లి నిశ్చయమైంది. అమ్మాయి సరిత. స్నేహితుల ద్వారా పరిచయం. తనది విజయవాడ. మెడిసిన్‌ చేసింది. అప్పటికి నాకు ‘బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌’పైన పెద్దగా అవగాహన లేదు. కెరీర్‌లో ఎదుగుదలకూ ఎంబీఏ ఉండాలనేవారు మిత్రులు. కానీ ఎంబీఏకి వెళ్లేముందు ఏదైనా సోషల్‌ వర్క్‌ చేస్తే మంచిదన్నారు. డాక్టర్‌ని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి ఆ రంగం గురించి తెలుసుకుంటే బావుంటుందనిపించింది. అందుకని నేనుండే చోటే అంబులెన్స్‌ యూనిట్‌లో వలంటీర్‌గా చేరాను. శుక్ర, శనివారాల్లో రాత్రుళ్లు అంబులెన్స్‌ని నడపడంతోపాటు ప్రమాదాలు జరిగినపుడు, హార్ట్‌ ఎటాక్‌ కేసుల్లో ప్రాథమిక చికిత్స చేసేవాణ్ని. వాళ్లే అందుకు అవసరమైన శిక్షణ ఇచ్చారు. ఏడాదిపాటు అంబులెన్స్‌లో పనిచేశాను. తర్వాత ఎంబీఏ కోసం కెల్లాగ్‌లో చేరాను. ఆ సమయంలోనే అక్కడ అదనంగా ‘ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌’లో మాస్టర్స్‌ కోర్సునీ చేశాను.

స్వదేశానికి వద్దామని!
1992లో ఎంబీఏ పూర్తిచేశాక చాలా కంపెనీల నుంచి అవకాశాలొచ్చాయి. కానీ బేరింగ్స్‌ తయారు చేసే ‘టిమ్‌కెన్‌’ని ఎంచుకున్నాను. కారణం... వాళ్లు భారత్‌లో ‘టాటా’తో కలిసి 1988 నుంచి ఒక భాగస్వామ్య కంపెనీని నడపటమే. ‘నాకు ఇండియాలో పనిచేయాలని ఉంది. అక్కడ తయారీ రంగం ఏమంత బాగాలేదు. నా సామర్థ్యం మేరకు ఏదైనా చేయాలనుకుంటున్నా’నని చెప్పాను. కొన్నాళ్లు అమెరికాలో పనిచేయమనీ ఆ తర్వాత పంపిస్తామనీ చెప్పారు. 1990లో మాకు పెళ్లైంది. పెళ్లయ్యాక సరిత అక్కడే ఎండీ(జనరల్‌ మెడిసిన్‌) చేసింది. నేను ఎంబీఏ చదువుతున్నపుడు పెద్దబ్బాయి, టిమ్‌కెన్‌లో చేరాక చిన్నబ్బాయి పుట్టారు. 1996లో టిమ్‌కెన్‌ నన్ను జంషెడ్‌పూర్‌లోని ప్లాంట్‌కి మేనేజర్‌గా పంపింది. అప్పటికి కంపెనీది దాదాపు దివాలా పరిస్థితి. ’98 ప్రారంభంలో నన్ను సంస్థకి ఎండీని చేశారు. రెండేళ్లపాటు శ్రమించి సంస్థని లాభాల బాట పట్టించాను. యాజమాన్యానికి అది నచ్చి 2000లో అమెరికాకి పిలిచి ఒకేసారి ఎన్నో దశలు దాటించి ‘ఆఫీసర్‌ ఆఫ్‌ ద కంపెనీ’గా పదోన్నతినిచ్చింది. అలా 34 ఏళ్లకే కంపెనీలో టాప్‌-15 స్థాయి అధికార్లలో ఒకడిగా, ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ద గ్లోబల్‌ రైల్‌రోడ్‌ బిజినెస్‌’ హోదాలో రెండేళ్లు పనిచేశాను. ఆ సమయంలోనే సరిత ‘నెఫ్రాలజీ అండ్‌ హైపర్‌టెన్షన్‌’లో సూపర్‌ స్పెషాలిటీ కోర్సు చేసింది. అప్పటికి ఇద్దరం కెరీర్లో ఉన్నతంగా ఉన్నాం. కానీ పిల్లల్ని అమెరికాలో పెంచాలా, ఇండియాలోనా... అన్న మీమాంస ఎదురైంది. వృత్తి పరంగా, ఆర్థికంగా చూసుకుంటే అమెరికా బావుంటుంది. కానీ, మాకు మా తల్లిదండ్రులతో ఉన్నటువంటి అనుబంధమే మా పిల్లలకు మాతో ఉండాలనుకున్నాం. అందుకోసం ఇండియా తిరిగి రావడమే మంచిదని నిర్ణయించుకున్నాం. అలా 2002లో ఇండియా తిరిగి వచ్చి ఇంజిన్లూ ఇతరత్రా యంత్ర సామగ్రి తయారుచేసే ‘కమిన్స్‌’ సంస్థలో ‘ప్రెసిడెంట్‌’ హోదాలో చేరాను. పుణెలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌లో ఉండేవాళ్లం. ఆ సమయంలో చాలామంది మిత్రులు ‘ఇండియా వెళ్లడమంటే కెరీర్‌ని త్యాగం చేయడమే’నన్నారు. కానీ అది ఒక రకమైన పెట్టుబడి. ఆ ఫలితాల్ని ఇప్పుడు మేమెంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నాం. ‘కమిన్స్‌’లో చేరాక స్వల్ప వ్యవధిలోనే సంస్థ భారతీయ విభాగానికి ‘జాయింట్‌ ఎండీ’గా పదోన్నతి వచ్చింది. ఆ కంపెనీ పరిస్థితి కూడా నేను చేరే సమయానికి అంత బాగా లేదు. దాన్నికూడా గాడిలో పెట్టాను. ఆ సమయంలో వారు కూడా అమెరికా రమ్మన్నారు. అమెరికా వెళ్లనని చెప్పి చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ‘అశోక్‌ లేలాండ్‌’లో చేరాను. 2005లో 39 ఏళ్ల వయసులో ‘చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌’గా ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాను. తర్వాత మూడేళ్లకు కంపెనీలో శాశ్వత డైరెక్టర్‌గా పదోన్నతి వచ్చింది. 2011లో ఎండీగా బాధ్యతల్ని తీసుకున్నాను.

ఎండీగా బాధ్యతలు చేపట్టిన సంస్థలన్నింటిలోనూ తయారీ, మార్కెటింగ్‌... రెండు విభాగాల్నీ గమనిస్తూ మార్పులు చేసేవాణ్ని. మార్కెట్‌ని విస్తరిస్తూ, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తుల్ని తీసుకొచ్చేలా ప్రణాళికలు వేసేవాణ్ని. ‘ఆప్‌కీ జీత్‌ హమారా జీత్‌(మీ విజయమే మా విజయం)’... అశోక్‌ లేలాండ్‌ నినాదం. మా ట్రక్కులూ, బస్సుల్ని వాణిజ్య అవసరాల కోసం కొంటారు. కొనుగోలుదార్ల లాభాలు పెరగాలంటే ఆ వాహనాలు నిరంతరాయంగా పనిచేస్తుండాలి. దానికోసం సరైన నెట్‌వర్క్‌ కావాలి. అయిదేళ్లకిందట దేశంలో అశోక్‌ లేలాండ్‌ ఔట్‌లెట్‌లు 200, ఇప్పుడా సంఖ్య 1200. సర్వీసు సెంటర్లనీ ఇదే విధంగా పెంచాం. నిర్మాణ, రవాణా సంస్థలకు ప్రాజెక్టుల దగ్గర్లోనే సర్వీసు సెంటరు కావాలంటే ఒక కంటైనర్లో ఆ ఏర్పాటుచేసి పంపుతుంటాం. ఇటీవల కాలంలో మేమున్న విభాగంలోకి విదేశీ కంపెనీలూ వచ్చాయి. సాంకేతికత విషయంలో వాటికి ధీటుగా ముందుకు వెళ్తున్నాం. గత అయిదేళ్లలో అంతర్జాతీయంగానూ విస్తరించాం. ఈ రెండేళ్లలో ప్రపంచ ఆటోమోటివ్‌ రంగ సంస్థలన్నింటిలోకీ స్టాక్‌ మార్కెట్లో షేర్‌ విలువ మాదే ఎక్కువగా పెరిగింది. ప్రఖ్యాత ‘సీవీ మ్యాగజీన్‌’ సంస్థ వరుసగా రెండేళ్లపాటు ‘కమర్షియల్‌ వెహికల్‌ మేకర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుని మా సంస్థకు అందించింది. ‘సీవీ మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా వరుసగా మూడేళ్లు నాకు అవార్డు వచ్చింది. తాజాగా ‘సీయీవో మ్యాగజీన్‌’... ‘సీయీవో ఆఫ్‌ ద ఇయర్‌(తయారీ రంగం) 2016’గా నన్ను ప్రకటించింది. ఇవన్నీ మా ప్రగతికి చిహ్నాలని భావిస్తాను.

ఆంధ్రాలో కొత్త ప్లాంట్‌
‘అశోక్‌ లేలాండ్‌’కు ప్రస్తుతం తొమ్మిది తయారీ కేంద్రాలున్నాయి. వాటిలో ఏడు భారత్‌లో ఉన్నాయి. విజయవాడ సమీపంలో కొత్త కేంద్రం పెట్టాలని చూస్తున్నాం. అశోక్‌ లేలాండ్‌ లాంటి కంపెనీ వస్తే అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. చెన్నైలో 50 ఏళ్ల కిందట అశోక్‌ లేలాండ్‌ ప్రారంభించాకే చాలా వాహన సంస్థలు అక్కడకి వచ్చాయి. వచ్చే 18 నెలల్లోనే ఆంధ్రాలో ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తాం. ఆ విధంగా పుట్టిన ప్రాంత రుణం తీర్చుకున్న సంతృప్తీ దొరుకుతుంది. ఇప్పటికీ తరచూ విజయవాడ, ఎప్పుడైనా సొంతూరు వెళ్తుంటా. మా అత్తగారు విజయవాడలోనే ఉంటున్నారు. ఈమధ్యనే పుష్కరాలకూ వెళ్లొచ్చాం.


క్రికెట్‌ ఆడాల్సిందే...

ప్రతి ఆదివారం టీ20 లీగ్‌ మ్యాచ్‌లు ఆడతాను. అక్కడ మైదానంలో నేనే అందర్లోకీ పెద్దవాణ్ని. ఒత్తిడి నుంచి ఉపశమనానికీ, పోటీతత్వం పెరగడానికీ క్రికెట్‌ ఉపయోగపడుతుంది. రోజూ రెండు గంటలపాటు మా కుటుంబ సభ్యులందరం టీవీలో సినిమా లేదా ఏదైనా కార్యక్రమం చూస్తాం. తరచూ థియేటర్లకీ వెళ్తుంటాం.
* సరిత... చెన్నైలో సొంతంగా క్లినిక్‌ నడుపుతోంది. అక్కడికి చికిత్స కోసం వచ్చేవారి నుంచి నామమాత్రపు ఫీజు తీసుకుంటుంది.
* పెద్దబ్బాయి విశాల్‌... అమెరికాలో మెడిసిన్‌ చదువుతున్నాడు. చిన్నబ్బాయి సంజయ్‌... అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ చేశాడు. ‘సన్నీ బీ’ పేరుతో చెన్నైలో కాయగూరలూ, పండ్లూ అమ్మే రిటైల్‌ సంస్థని పెట్టాడు.
* అమ్మానాన్నా, అన్నయ్యవాళ్లూ అమెరికాలోనే ఉంటున్నారు.
* మా కుటుంబం పేరున ఒక ట్రస్టు ప్రారంభించాను.
* దేశంలో వాహన రంగంలో దాదాపు మూడుకోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగం అభివృద్ధి దేశ ప్రగతికి అవసరం. అందుకోసం ‘సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌’, ‘ఆటోమేటివ్‌ స్కిల్స్‌ డవలప్‌మెంట్‌ కౌన్సిల్‌’లకు అధ్యక్షుడిగా ఉంటూ నా వంతు సాయం అందిస్తున్నాను.

- సుంకరి చంద్రశేఖర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.