close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నష్టాలొస్తున్నాయని తెలిసే చేస్తున్నా!

నష్టాలొస్తున్నాయని తెలిసే చేస్తున్నా!

'నాలుగు వందలకు పైగా సినిమాలూ, నాలుగు నంది అవార్డులూ, కడుపు నింపడానికి ఎప్పటికప్పుడు తలుపు తడుతోన్న కొత్త అవకాశాలూ... మరి మనసు నింపడానికి?'... ఈ ఆలోచనే ఎల్‌బీ శ్రీరాంని ఇంటర్నెట్ ప్రపంచంలోకి తీసుకొచ్చింది. పక్కింటి బాబాయిలా, పేదింటి తండ్రిలా, ఎదురింటి రైతులా, మనింట్లో మనిషిలా మార్చి జీవితం ఎంత అందమైందో చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఎల్‌బీ శ్రీరాం షార్ట్ ఫిలిమ్స్... అతడి సెకండ్ ఇన్నింగ్స్ కాదు, రెండో జీవితం..!

ఎల్‌బీ శ్రీరాం హార్ట్‌ ఫిలిమ్స్‌... నా లఘు చిత్రాలకు నేను పెట్టుకున్న పేరది. చూసిన ప్రతి ఒక్కరి మనసులనూ సంతోష పెట్టాలన్నది నా ఉద్దేశం. ‘ఎల్‌బీ క్రియేషన్స్‌’ అంటే ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ క్రియేషన్స్‌’ అన్నది నా నిర్వచనం. దానిద్వారా మన చుట్టూ ఉన్న మంచిని చూపించాలన్నదే నా ఆలోచన. ఈ పేర్లను చూస్తేనే నేను చిన్నిచిత్రాలు ఎందుకు తీస్తున్నానో, ఎలాంటివి తీయాలనుకుంటున్నానో అర్థమైపోతుంది. నటుడిగా బిజీగా ఉన్నప్పట్నుంచీ లఘు చిత్రాల్లో నటించాలన్న కోరిక ఉండేది. దానికి కారణం నాటకాలు. నా కెరీర్‌కి రంగ స్థలమే పునాది వేసింది. ఆ తరవాత రేడియోలోనూ నా నాటకాలు వచ్చాయి. ఆపైన రచయితగా మారి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు పనిచేశా. చివరికి నటుడిగా మలుపు తీసుకొని క్షణం తీరికలేని స్థితికి చేరుకున్నా. ఎన్ని సినిమాల్లో నటిస్తున్నా ఏదో తెలీని అసంతృప్తి ఉండేది. సినిమాల్లో ఏ సన్నివేశం ఎప్పుడు తీస్తారో తెలీదు. ముందు ఓ కామెడీ సీన్‌ చేసి, వెంటనే ప్రేక్షకుల్ని కన్నీరు పెట్టించాల్సిన సన్నివేశంలో నటించాల్సి రావొచ్చు. అలా ముక్కలుముక్కలుగా నటించడం వల్ల కథలోని భావోద్వేగానికి దూరమవుతున్నా అనిపించేది. కానీ నాటకాల్లో అలా కాదు. అన్నీ వరస క్రమంలో ఉంటాయి. ప్రతి సన్నివేశం ఒక దాని వెంట ఒకటి వస్తుంది కాబట్టి ఎక్కడ ఎంత వరకూ నటించాలో తెలుస్తుంది. ఎక్కడా బ్రేకుల్లేకుండా ఓ కథను అలా చూడటం ప్రేక్షకులకూ హాయిగా ఉంటుంది. నటులకూ సంతృప్తిగా అనిపిస్తుంది. సినిమాలతో బిజీగా ఉన్నా, ఆ ఆనందం కోసమే అవకాశం వస్తే నాటకాలు వేయాలన్న ఆలోచన వచ్చింది.

చాలా ఏళ్ల నుంచే...
మళ్లీ స్టేజీ ఎక్కాలన్న కోరిక నాకు మొదలయ్యే నాటికి నాటకాలకి ఆదరణ కాస్త తగ్గింది. చూసే వాళ్లకోసమే వేయాలన్న ఆలోచన నాకున్నా, సినిమాల వల్ల వాటికి సమయం కేటాయించలేనేమో అనిపించింది. అప్పుడే నాటకాలకు ప్రత్యామ్నాయంగా లఘు చిత్రాల్లో నటించాలనిపించింది. సినిమాల్లో చేస్తూ లఘుచిత్రాలంటే స్థాయి తగ్గిపోతుందనీ, సినిమా అవకాశాలు దెబ్బతింటాయనీ చాలామంది అనుకుంటారు. కానీ నేనలా భయపడకుండా చాలా ఏళ్ల క్రితం ‘రాళ్లు’ అనే ఓ లఘు చిత్రంలో నటించా. భార్యకు వైద్యం చేయించడానికి తపనపడే ఓ పేద శిల్పి కథ అది. ఎదుటి వాళ్ల మాటలే రాళ్ల కంటే పదునైనవనీ, పక్కవాళ్ల బాధల్ని అర్థం చేసుకోలేని మనుషులే నిజమైన రాళ్లనీ చెప్పే మంచి ఇతివృత్తంతో అది సాగుతుంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ చిత్రోత్సవంలో దానికి ఉత్తమ లఘుచిత్రంగా బహుమతి వచ్చింది. నటుడిగా నాకు ఎక్కడలేని సంతృప్తినిచ్చింది. దానివల్ల నా సినిమా అవకాశాలకు ఏమాత్రం ఇబ్బంది రాలేదు. చాలామంది డబ్బుల కోసం కాకుండా ఓ మంచి విషయాన్ని జనాలకు చెప్పే ఉద్దేశంతో షార్ట్‌ ఫిలిమ్స్‌ తీస్తుంటారు. దాంతో అప్పట్నుంచీ అవకాశమొస్తే అలాంటి వాటిల్లోనే రూపాయి తీసుకోకుండా నటించాలని నిర్ణయించుకున్నా.

నాలుగో అడుగు నెట్టింట్లో
సినిమా షూటింగుల్లో ఉన్నప్పుడే విరామంలో లఘు చిత్ర దర్శకులతో మాట్లాడి కథల గురించి చర్చించేవాణ్ణి. ఓసారి అలా ఫణి అనే కుర్రాడు తీసిన ‘పల్లకి’ అనే లఘు చిత్రంలో బోయవాడి పాత్రలో నటించాను. ఓ మంచి కథను చూపించాలన్న ఆశతో ఆ కుర్రాడు అమెరికా నుంచి వచ్చి దాన్ని తీశాడు. అతడి తపనకు న్యాయం చేయడానికి ప్రయత్నించా. ఎంత మంచి ఆదరణ వచ్చిందంటే, ఈటీవీలో దాన్ని ప్రత్యేక చలనచిత్రం పేరుతో ప్రదర్శించారు. ఆపైన ‘ఆర్ట్‌ ఈజ్‌ డెడ్‌’, ‘బిస్లెరీ బాటిల్‌’, ‘అలీస్‌ లెటర్‌’ లాంటి కొన్ని లఘుచిత్రాల్లో నటిస్తూ వచ్చా. సినిమా పనులకు కాస్త విరామం వచ్చినప్పుడల్లా చిన్ని చిత్రాల షూటింగుల్లో పాల్గొనేవాణ్ణి. రోజులు అలా గడుస్తున్నా నా ఆకలి తీరట్లేదు. అప్పుడప్పుడూ ఒక్కొక్కటీ చేయడం కరెక్టు కాదనిపించింది. నటుడిగా మారాక రచనకు కాస్త దూరమయ్యా. దాంతో నేను చెప్పాలనుకున్న చాలా విషయాలు బాకీ పడ్డాయి. వాటన్నింటినీ చెప్పాలంటే సరైన వేదిక కావాలి. సినిమాలు తీద్దామంటే కోట్లలో ఖర్చు. పోనీ కష్టపడి ఏదైనా ఒక సినిమా తీస్తే, అది హిట్టయినా మరో పది సినిమాలు తీసేంత శక్తీ, సమయం లేవనిపించింది. అదే ఫ్లాపయితే ఆర్థిక భారం తట్టుకునే పరిస్థితీ లేదు. టీవీలో డైలీ సీరియళ్లు నాకంతంగా రుచించవు. దాంతో నాకు కనిపించిన చివరి మార్గం ఇంటర్నెట్‌. యూట్యూబ్‌లో ఓ ఛానెల్‌ మొదలుపెట్టి క్రమం తప్పకుండా అసంఖ్యాకంగా లఘుచిత్రాలు తీయాలనీ, అక్కడా నాకంటూ ఓ ముద్ర వేయాలనీ నిర్ణయించుకున్నా. అలా నాటకాలూ, రేడియో, సినిమాలను దాటి నాలుగో అడుగు అంతర్జాలంవైపు వేశా.

నష్టాలకు సిద్ధపడే...
యూట్యూబ్‌లో లఘుచిత్రాలు తీసే కుర్రాళ్లలో ఎక్కువ శాతం మంది వాటిని సినిమా పరిశ్రమలోకి రావడానికి నిచ్చెనలా వాడుకునే ఉద్దేశంతో కనిపిస్తారు. నాకు ఆ అవసరం లేదు. లఘుచిత్రాన్ని కోటి రూపాయలు ఖర్చుపెట్టి తీసినా వంద రూపాయలు కూడా లాభం రాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ డబ్బు సంపాదించాలన్న ఉద్దేశమూ లేదు. అరవయ్యేళ్లు పైబడ్డ అనుభవంతో నేను నేర్చుకున్న, నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలను నలుగురితో పంచుకోవాలన్న తపనతోనే ఈ దారిలోకొచ్చా. అందరి మనసులకూ నా చిత్రాలు దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో ‘హార్ట్‌ ఫిల్మ్స్‌’ అనీ, జీవితం చాలా అందమైనదని చూపించే ఉద్దేశంతో ‘ఎల్‌బీ అంటే లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ క్రియేషన్స్‌’ అనీ పేర్లు పెట్టా. దీని కోసం కొన్ని కచ్చితమైన నిబంధనలూ రాసుకున్నా. అందులో మొదటిది నిడివి. యూట్యూబ్‌ని చూసేవాళ్లలో యువతే ఎక్కువ. ఒక చిత్రంపైన 20, 30 నిమిషాలు కేటాయించేంత ఓపిక వాళ్లకుండదు. అందుకే పది నిమిషాలకు మించి ఏ చిత్రమూ ఉండకూడదని నిర్ణయించుకున్నా. దానివల్ల ఒక్కోసారి మంచి కథలనూ అంత తక్కువ సమయంలో చెప్పలేక దూరం చేసుకోవాల్సి వస్తోంది. రెండోది బడ్జెట్‌... నష్టాలకు సిద్ధపడే లఘుచిత్రాల నిర్మాణానికి పూనుకున్నా. ఉదాహరణకు పది లక్షలు నష్టపోయినా ఫర్వాలేదనుకుంటే, అందులో ఐదేసి లక్షలు పెట్టి రెండు సినిమాలు తీసే బదులు, యాభై వేల చొప్పున పెట్టి ఓ ఇరవై సినిమాలు తీయడం మంచిది. అదే సిద్ధాంతంతో తక్కువ బడ్జెట్‌ కేటాయిస్తూ వస్తున్నా. మూడోది నటీనటులు... డబ్బులు మిగుల్తాయి కదాని ఎవరు పడితే వాళ్లని తీసుకోను. నటనపైన తపన ఉండీ, ఎంతో కొంత అనుభవం ఉన్నవాళ్లకే ప్రాధాన్యమిస్తున్నా. నిర్మాణం, దర్శకత్వం, నటన, ఎడిటింగ్‌, నటీనటుల ఎంపిక లాంటి పనులన్నీ చూసుకుంటూ మళ్లీ నేను కథలు రాయాలంటే సమయం సరిపోదు. అందుకే వీలైనంత వరకూ వేరే వాళ్ల కథలే తీసుకొని నా కథనంతో నడిపించాలని నిర్ణయించుకున్నా. ఇలా కొన్ని కచ్చితమైన నిబంధనలతోనే చిన్ని చిత్రాలకు శ్రీకారం చుట్టా.

కుర్రాళ్లతో కలిసి నాటకాలకు దర్శకత్వం వహించిన అనుభవంతో షార్ట్‌ ఫిల్మ్స్‌ తీయొచ్చని అనుకున్నా. కానీ దిగాకే తెలిసింది అదెంత కష్టమైన పనో. అనుకున్న విషయం చెప్పడానికి సరైన లోకేషన్లూ, నటీనటుల అన్వేషణ కోసం చాలా శ్రమ పడాలి. నిడివి ఎంతున్నా 24 సినిమా విభాగాలూ పనిచేయాలి. నా నుంచి మంచి మాటలూ, హాస్యం, కొత్తదనమున్న కథాంశాలనే జనాలు ఆశిస్తారు తప్ప గ్రాఫిక్‌లూ, ఇతర విషయాలపైన పెద్దగా దృష్టి పెట్టరన్నది నా నమ్మకం. అందుకే కథా వస్తువుకే విలువిస్తూ ఐదు నెలల క్రితం నా పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త ప్రయాణం మొదలుపెట్టా. తొలి విడతగా పదకొండు చిత్రాలు తీసి అందులో రెండు వారాలకు ఒకటి చొప్పున ఏడు చిత్రాలను విడుదల చేశా. వాటికొచ్చే కామెంట్ల ఆధారంగా నన్ను నేను మెరుగు పరచుకునే ప్రయత్నం చేస్తున్నా. యూట్యూబ్‌లో ముఖాముఖి ద్వారా ప్రేక్షకుల ప్రశ్నలకూ సమాధానమిస్తున్నా. రెండో విడతలో తీయబోయే చిత్రాలకూ సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ దఫా ఒకేసారి పది-పదిహేను చిత్రాలు తీసి ప్రతి రెండో శుక్రవారం ఒక్కోటి విడుదల చేయాలన్నది నా ఆలోచన. నాది ఒంటెద్దు బండి ప్రయాణం. ఇప్పటి తరం కార్లలో దూసుకెళ్తొంది. ఆ వేగాన్ని అందుకోవడానికి వాళ్లతో కలిసి ప్రయాణిస్తేనే బావుంటుందని, నా బృందంలో అందరినీ కుర్రాళ్లనే పెట్టుకున్నా. వాళ్లతో పనిచేయడం వల్ల ఈ తరానికి తగ్గట్లుగా నా ఆలోచనలూ మారుతున్నాయి. ఇంటర్నెట్‌తో పాటు టీవీ కోసమూ కొన్ని ప్రాజెక్టులు సిద్ధం చేసుకున్నా.

ఎప్పటికీ గుర్తుండేలా
అమలాపురం దగ్గర ఐదిళ్లు ఉండే ఓ చిన్న అగ్రహారంలో పుట్టి పెరిగిన నేను మొదట నాటకాల్లో రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నా. తరవాత ఆలిండియా రేడియోలోనూ నా ముద్ర వేశా. ఆ పైన పరిశ్రమలోకి వచ్చి ఎన్నో హిట్‌ సినిమాలకు రచయితగా, నాలుగు వందలకుపైగా సినిమాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా. ఆ సుదీర్ఘ అనుభవంతో కొత్తతరానికి నాకు తెలిసిందేదో చెప్పాలన్నదే నా తాపత్రయం. యూట్యూబ్‌లో చిత్రాలకు హిట్లూ, ఫ్లాపులూ అన్న భేదం ఉండదు. ఒకరోజు వంద మంది చూస్తే, మరో రోజు వెయ్యిమంది చూడొచ్చు. వాటికి కాలదోషమూ పట్టదు కాబట్టి ఎప్పటికీ నా సినిమాలు అందులో సంచరిస్తూనే ఉంటాయి. అమరావతి కథలు, మాల్గుడి డేస్‌లాగా వాటికీ ఆదరణ తీసుకురావాలన్నది నా ప్రయత్నం. అలా రావాలంటే ఎక్కువ చిత్రాలు తీస్తే సరిపోదు, వాటిద్వారా ఎంతో కొంత మంచినీ చెప్పగలగాలి. అలా నా లఘుచిత్రాల ప్రభావం ఓ పదిమంది ఆలోచనలను మార్చినా, నా సెకండ్‌ ఇన్నింగ్స్‌... ‘సెకండ్‌ విన్నింగ్స్‌’ అయినట్టే లెక్క.

ఎల్బీ ఏడడుగులు!

మా నాన్న

వూరి నుంచి నాన్న ఇంటికొచ్చాడంటే, అది డబ్బులడగడానికే కాదు, ఇవ్వడానికీ కావొచ్చు. తల్లిదండ్రుల్ని అపార్థం చేసుకునే ముందు ఆలోచించండీ... అని చెప్పే ఇతివృత్తంతో సాగుతుంది.

నర్స్‌

రోగి శరీరానికే కాదు, సందర్భాన్ని బట్టి నర్సులు మనసుకూ ఎలా వైద్యం చేస్తారో చూపించే చిత్రం.

పండగ

పాడీ పంటా లేకపోయినా, ఆవు పేడతో కూడా పండగ ఎంత ఘనంగా చేసుకోవచ్చో చూపే సరదా ప్రయత్నం.

ప్రసాదం

సాధారణంగా గుడిలో ప్రసాదం అంటే తినే పదార్థాలే పెడతారు. దాని బదులు ఓ మంచి పుస్తకాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తే ఎంత లాభమో ఈ ‘ప్రసాదం’ చెబుతుంది.

గంగిరెద్దు

సంక్రాంతి సమయంలో గంగిరెద్దు తన యజమానిని ఆదుకోలేకపోయినా, ఓ వూహించని పోటీ ద్వారా అతడిని అప్పుల నుంచి ఎలా బయట పడేసిందన్నదే గంగిరెద్దు కథ.

దేవుడు

గుళ్లొనో, రాళ్లలోనో కాదు, మనసు పెట్టి చూడాలే కాని దేవుడు అన్ని చోట్లా కనిపిస్తాడని చెప్పడమే ‘దేవుడు’ ఉద్దేశం.

ఉమ్మడి కుటుంబం

పెరిగిపోతోన్న అపార్టుమెంట్ల సంప్రదాయం ద్వారా పక్కింట్లో ఎవరుంటారో కూడా తెలీని పరిస్థితి చాలామందిది. అందరితో కలిసుండటానికి అలవాటు పడ్డ వ్యక్తి, తన అపార్టుమెంట్లో వాళ్లందరినీ తెలివిగా ఎలా దగ్గర చేశాడో చెబుతుందీ ‘ఉమ్మడి కుటుంబం’.

కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి ఎప్పుడూ సిద్ధమేనంటారు ఎల్బీ శ్రీరాం. లఘుచిత్రాలపైన ఆసక్తి ఉన్నవాళ్లూ, సంప్రదించాలనుకునేవాళ్లూ bsriramshortfilms@gmail.com కి వివరాలు మెయిల్‌ చేయవచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.