close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నా తొలిప్రేమ వాటిపైనే...

నా తొలిప్రేమ వాటిపైనే...

‘ఉయ్యాలా జంపాలా’... ఆబాలగోపాలాన్నీ అలరించిన బావామరదళ్ల కథ. ‘మజ్ను’... అబ్బాయిలు ఆనంద్‌ రూపంలో తమలోని మజ్నూనీ, అమ్మాయిలు కిరణ్మయి రూపంలో లైలానీ గుర్తుచేసుకున్న ప్రేమకథ. ఈ రెండింటినీ మనకు అందించిన యువ దర్శకుడు విరించి వర్మ గుంటూరి. ఈ గోదావరి కుర్రాడు సెల్యులాయిడ్‌ కలను ఎలా నిజం చేసుకున్నదీ చెబుతున్నాడిలా...
అందరూ సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌ వస్తుంటారు. నేను మాత్రం హైదరాబాద్‌ వచ్చాకే సినిమాల గురించి ఆలోచించాను. అంతకు ముందు సినిమాలకు నా జీవితంలో ప్రాధాన్యం లేదు. మా సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర పెండ్యాల. నేను పెరిగింది మాత్రం అమ్మమ్మ వాళ్ల వూరు ఆకివీడు దగ్గర సిద్ధాపురంలో. ఇంటర్మీడియెట్‌ దిబ్బగూడెంలో చదువుకున్నాను. ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వెళ్లడం తప్పదు... అదే డిగ్రీ నుంచే ఇక్కడ ఉంటే ఈ వాతావరణానికి అలవాటు పడతానని ఇంట్లోవాళ్లు హైదరాబాద్‌లోని మా బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకోమన్నారు. దాంతో ఇక్కడ లక్డీకాపూల్‌లోని ‘న్యూ గవర్న్‌మెంట్‌ డిగ్రీ కాలేజీ’లో బీకామ్‌లో చేరాను. డిగ్రీకి ముందు సినిమాలు చూడ్డం కూడా తక్కువే. అలాగని పుస్తకాల పురుగునీ కాదు. కాకపోతే చిన్నప్పట్నుంచీ కథల పుస్తకాలూ, నవలలూ చదివేవాణ్ని. హైదారాబాద్‌ వచ్చిన నెల రోజులకు టీవీలో సాగరసంగమం, సితార, సీతాకోకచిలుక... సినిమాలు చూశాను. అవి చూశాక మంచి ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ పంచుకోవడానికి సినిమా అద్భుతమైన వేదిక అనిపించింది. అప్పటివరకూ సాధారణ కథల పుస్తకాలూ, నవలలూ చదివిన నేను... ఆ తర్వాత చలం, గోపీచంద్‌, బాలగంగాధర్‌ తిలక్‌, శ్రీశ్రీ లాంటి వారి రచనలు ఎక్కువగా చదవడం ప్రారంభించాను. డిగ్రీ ఫైనలియర్‌లో ఉండగా సినిమాల్లోకి వెళ్లే దారేంటని ఆలోచించినపుడు... సినిమా ప్రచార చిత్రాలు డిజైన్‌ చేసే ‘కిరణ్‌ యాడ్స్‌’ నిర్వాహకుడు రమేష్‌ వర్మ తెలుసని మావాళ్లలో ఎవరో చెప్పారు. వాళ్లద్వారా ఆయన దగ్గర అసిస్టెంట్‌ డిజైనర్‌గా చేరాను. నాకు బొమ్మలు వేయడం వచ్చు. అది అక్కడ ఉపయోగపడింది. అక్కడ పనిచేస్తూనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయ్యేందుకు ప్రయత్నించాను. మూడేళ్లకు ఓ స్నేహితుడి సాయంతో దర్శకుడు మదన్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. ఆయన నాతో చాలాసేపు మాట్లాడాకే అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. అప్పటివరకూ ఇండస్ట్రీ గురించి చాలామంది రకరకాలుగా చెప్పి భయపెట్టేవారు. మదన్‌ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇప్పటికీ ఆయన గైడెన్స్‌ మాకు ఉంటుంది. ఆయన దగ్గర పెళ్లైనకొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు సినిమాలకు పనిచేశాను.

పల్లెటూరి కథ వద్దన్నారు
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయ్యాక సినిమాలపైన ఒక స్పష్టత రావడంతోపాటు నాలో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ సమయంలో కథలు రాస్తూ స్నేహితులకు వినిపించేవాణ్ని. కొన్ని కథలు వారి వడపోతలో పోయేవి. ‘ఉయ్యాలా జంపాలా’ కథ రాసుకునేసరికి అసిస్టెంట్‌ డైరెక్టెర్‌గా మూడేళ్లు పూర్తయ్యాయి. ఆ కథ స్నేహితులకు వినిపిస్తే బావుందన్నారు. అది పట్టుకొని ఆరేడు మంది నిర్మాతల్ని సంప్రదించాను. ఎవ్వరికీ నచ్చలేదు. కథలో ప్రత్యేకత లేదనీ, పల్లెటూరు నేపథ్యంతో ఇప్పుడు సినిమాలు రావడమే లేదనీ... చెప్పేవారు. రామ్మోహన్‌ గారితో అదివరకు పరిచయం కూడా లేదు. ఫోన్‌ నంబర్‌ దొరికితే మాట్లాడాను, రమ్మన్నారు. ఆయనకి కథ చెబితే బావుందన్నారు. ‘కథ ఓకే. నీ టేకింగ్‌ ఎలా ఉంటుందో చూడాలి. ఒక షార్ట్‌ఫిల్మ్‌ తీసి చూపించు’ అని చెప్పి రూ.20వేలు ఇచ్చారు. షార్ట్‌ఫిల్మ్‌ కోసం నాకో ఆలోచన వచ్చింది. ఆ కథ కొత్తదేమీ కాకపోయినా కథ అక్కడ ప్రధానం కాదు, ఎమోషన్స్‌ ఎలా చూపిస్తున్నానో గమనిస్తారనిపించింది. ‘నిన్నటి వెన్నెల’ పేరుతో షార్ట్‌ఫిల్మ్‌ తీశాను. అది చూశాక సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తర్వాత కథని నాగార్జున గారికి వినిపించాం. ఆయన నిర్మాణంలో భాగస్వామిగా చేరారు.

మా వూళ్లొ ఒక ఫ్రెండ్‌ ఉండేవాడు. మంచివాడు, అందరితో సరదాగా ఉంటాడు. అలాంటి వ్యక్తిని తెరపైన చూపిస్తే బావుంటదనిపించింది. నేనూ మా అక్క చిన్నప్పుడు బాగా కొట్టుకునేవాళ్లం. కాస్త పెద్దయ్యాక మాత్రం మా మధ్య గొడవలు పోయి ప్రేమాభిమానాలు వచ్చాయి. ఇలా చిలిపి తగాదాలూ, ఆపైన ప్రేమాభిమానాలు బావామరదళ్ల మధ్య ఉంటే ఎలా ఉంటుందో వూహించి కథ రాసుకున్నాను. సినిమాలో వాణిజ్య అంశాల్ని ఉంచుతూనే, సహజత్వం కనిపించేలా తీయాలనుకున్నాం. అందుకోసమే అందర్నీ కొత్తవాళ్లనే పెట్టుకున్నాం. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వచ్చిన రాజ్‌తరుణ్‌నే హీరోగా పెడదామన్నారు రామ్మోహన్‌. ‘బాగా చిన్నవాడిలా కనిపిస్తున్నాడు కదాండి’ అన్నాన్నేను. ఆ సినిమా కాస్టింగ్‌ డైరెక్టర్‌ గీతా గారు తరుణ్‌కి రెండు నెలలపాటు ఆక్యుపంక్చర్‌ చేయించారు. దాంతో రెండేళ్లు పెరిగినట్లు కనిపించాడు. అప్పుడు సరేననుకున్నాం. సినిమా సెట్స్‌ మీదకు వెళ్లేసరికి ఇంకాస్త సమయం పట్టింది. దాంతో సహజంగానే తరుణ్‌ సరిపోయాడు. హీరోయిన్‌ కోసం మూడు నెలలు ఇంటర్నెట్‌లో వెతికి చూశాం. ఆ సమయంలో అవికాగోర్‌ కనిపించింది. ఆమె చేసిన సీరియల్‌ నేను చూడలేదు. యూట్యూబ్‌లో ఆమెదో వీడియో చూశాక ఆడిషన్స్‌కి పిలిచాం. అమాయకత్వం, ఆవేశం, కోపంతో కూడిన ఆ అమ్మాయి స్వభావం కూడా సినిమాలో పాత్ర స్వభావానికి దగ్గరగా ఉంటుంది. తరుణ్‌ కూడా బయటకి సరదాగా కనిపిస్తాడు కానీ ముఖ్యమైన విషయాల్లో సీరియస్‌గా ఉంటాడు. ఆ సినిమాలో అతడి పాత్ర కూడా అలాంటిదే. సినిమా పూర్తయ్యాక సురేష్‌బాబు గారికి కూడా నచ్చి ఆయన కూడా కలిశారు. అలా మొదటి సినిమాతోనే పెద్దవాళ్లతో, పెద్ద బ్యానర్లతో పనిచేశాను. మిగతాదంతా చరిత్ర.

ప్రేమకు అంతం లేదు...
ఉయ్యాలా జంపాలా తర్వాత మంచి కథతో రావాలని కొంత సమయం తీసుకున్నాను. యాక్షన్‌ ప్రధానంగా నడిచే కథ రాసుకొని కొందరికి వినిపించాను. ‘పరిశ్రమలో చాలామంది యాక్షన్‌ సినిమాలు చేస్తున్నారు. ‘ఉయ్యాలా జంపాలా’లో తీసినట్టు భావోద్వేగాలతో యువతకు సంబంధించిన కథలు రావడంలేదు. ఆ తరహాలో ఇంకొన్ని సినిమాలు తియ్యి. ఆ తర్వాత యాక్షన్‌ సినిమా చేయొచ్చు’... అని చెప్పారు వాళ్లంతా. దాంతో ఆ కథని పక్కనపెట్టి ‘మజ్ను’ కథ రాసుకున్నాను. ఒకబ్బాయి అమ్మాయిని ప్రేమించబోతూ ఒకనాటి ప్రేమికురాలిని గుర్తుచేసుకుంటే, ఆమెను మిస్‌ చేసుకున్నానన్న నిజం తెలుసుకుంటే ఎలా ఉంటుంది... అన్నదగ్గర మొదలైంది కథ. ‘ప్రేమ ఇద్దరిని కలుపుతుంది. కానీ బ్రేకప్‌ వాళ్లని ఎప్పటికీ విడదీయలేదు’ అన్న అంశంతో మిగతా అంశాలు అల్లుకున్నాను. నానీకి కథ చెప్పగానే నచ్చింది. కాకపోతే అప్పటికి వేరే సినిమాలు చేస్తున్నాడు. దానివల్ల కొద్దిగా సినిమా ఆలస్యమైంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు కాస్టింగ్‌ డైరెక్టర్‌ గీత గారు. కథ రాసుకున్నాక సరదాగా ఆమెకు చెప్పాను. నచ్చి నిర్మిస్తానన్నారు. తర్వాత కిరణ్‌ గారికి వినిపించాం. ఆయనా ముందుకు రావడంతో కలిసి నిర్మించారు. నానీతో చేయడం కొత్త కదా ఎలాగని చిన్న ఆందోళన ఉండేది. కానీ పద్ధతైన మనిషి. చిత్రీకరణ సమయంలో ఫ్రెండ్లీగా ఉండేవాడు. సినిమా పూర్తయ్యేసరికి మా మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. హీరోయిన్‌గా కొత్త ఫేస్‌ ఉండాలనుకున్నాం. ‘అను ఇమాన్యుయేల్‌’ ఫొటోస్‌ చూశాక, స్కైప్‌లో ఆడిషన్స్‌ చేసి ఓకే చేశాం. మజ్ను షూటింగ్‌ చాలా వేగంగా, సరదాగా చేశాం. కెమెరామేన్‌ జ్ఞానశేఖర్‌ గారు కూడా చాలా మృదుస్వభావి. అదీ ఒక కారణం. మెదక్‌ కాలేజీలో ఎక్కువ రోజులు షూటింగ్‌ చేశాం. రోజూ షూటింగ్‌ పూర్తిచేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాళ్లం. ‘మజ్ను’... హీరో సిన్సియర్‌ లవర్‌ అని చెప్పడానికి ఆ టైటిల్‌ పెట్టాం. అలాగని అతడి కథ విషాదాంతం కాదని ప్రచార చిత్రాల్లో చూపించాం. ఈ సినిమాలో హీరో రాసే ప్రేమలేఖ కథకు బలం. ముందొక లేఖ రాసుకున్నాం. కానీ ఇంకా బావుండాలి అనిపించింది. అప్పుడు గేయ రచయిత అనంత్‌ శ్రీరామ్‌ని సంప్రదిస్తే లేఖ బాగా రాశారు. నిర్మాత కిరణ్‌గారి అనుభవంతో సినిమాని బాగా ప్రచారం చేశాం. అనూకి అప్పుడే ఆఫర్లు వరసకడుతున్నాయి. ఉయ్యాలా జంపాలా... సమయంలో శారద గారు ఫోన్‌ చేసి ‘సినిమా చాలా బాగా తీశావమ్మా’ అని మెచ్చుకున్నారు. కృష్ణవంశీ గారు బావుందన్నారు. ఆ సినిమాని వూళ్లలో సాధారణ జనాలూ, అన్ని వయసులవాళ్లూ బాగా చూశారు. మజ్ను సినిమాకి యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతారనుకున్నాం. కానీ అన్ని వర్గాలనీ అలరించింది. ఇప్పుడు మళ్లీ కొత్త కథ రాస్తున్నాను. మొదటి రెండు సినిమాలకంటే ఇంకా మంచి కథ అవుతుందిది.

ఆ పాటలు చాలు...
నేను సినిమాల్లోకి రావడానికి కారణం ఒక విధంగా ఇళయరాజానే. స్కూల్‌, కాలేజీ రోజుల్లో ఆయన పాటలు వినిపిస్తే ఆగి మరీ వినేవాణ్ని. ఆ పాటలు మనపాటలే, మనకోసమే అన్నట్టుంటాయి. జీవితంలో నా తొలిప్రేమ ఇళయరాజా పాటలపైనే. నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసిన మూడు సినిమాలకూ సంగీత దర్శకుడు ఆయనే. ఆ ప్రభావంతో డిగ్రీలో ఉండగా వోకల్‌, ఫ్లూట్‌ విభాగాల్లో కొంత వరకూ నేర్చుకున్నాను. ఇళయరాజా గారితో సినిమా చేయగలనో లేనో తెలీదుకానీ ఆయన పాటలు వింటూనే తృప్తి పడుతుంటాను. ఆయన చేసిన తెలుగు పాటలన్నీ సేకరించాను. చెన్నై వెళ్లినపుడు తమిళ పాటల సీడీల కోసం వెతుకుతాను. ఒక దశలో నాలుగైదేళ్లు ఇళయరాజా పాటలు వినడం తప్ప వేరే పనిలేదు నాకు. పాతబడేకొద్దీ ఆయన పాటల్లో కొత్తదనం పెరుగుతుంది. నేను ఎలాంటి మూడ్‌లో ఉన్నప్పటికీ ఒకసారి ఆయన పాట వినగానే అన్నీ మర్చిపోతాను. ‘మజ్ను’ సినిమాలో ఆయన పాటల్ని కొన్ని చోట్ల పెట్టి కొంతవరకూ సరదా తీర్చుకున్నాను.

వారు లేకుంటే...
పొలాల్లో తిరగడం, ముంజికాయలు తినడం, కొబ్బరిబోండాలు తాగడం, చెరువులో ఈత కొట్టడం... ఇవన్నీ నా డైరీలో ఉన్నాయి. అందుకే మొదటి సినిమాలో పల్లెటూరి వాతావరణాన్ని బాగా చూపించగలిగాను. ఖాళీ దొరికితే తెలుగు, హిందీ, తమిళ సినిమాలతోపాటు ప్రపంచస్థాయి సినిమాలూ చూస్తాను. ఒక్కోసారి రోజుకు మూడు సినిమాలు చూస్తాను. పుస్తకాలు చదువుతాను. అవి వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడతాయి, ఆలోచనల పరిధిని పెంచుతాయి. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న సూరపు రాజు, అమ్మ సుబ్బలక్ష్మి. సినిమాల్లోకి వెళ్తాననగానే, ‘నువ్వసలే సాఫ్ట్‌. సినిమా వాతావరణం కష్టమేమో. అక్కడ రకరకాల మనుషులు ఉంటారంటారు’ అని హెచ్చరించారు. నా ఉద్దేశంలో డైరెక్షన్‌ ఒక ఆర్ట్‌. ఒక కథ రాసుకోవాలి. సాంకేతిక నిపుణులతో, నటులతో బాగా తీయాలి. మన స్వభావం నచ్చేవాళ్లే మనతో జట్టు కడతారు. దీంట్లో మోసపోవడాలు లేవనిపించింది. అదే చెప్పాను. ‘సరే, నీ ఇష్టం’ అన్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే అమ్మానాన్న హైదరాబాద్‌ వచ్చారు. నాన్న ఇక్కడో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అమ్మ గృహిణి. ఉయ్యాలా జంపాలాకి ముందే నాకు పెళ్లైంది. నా శ్రీమతి సుందరి. తను కూడా ఉద్యోగం చేస్తోంది. అమ్మమ్మ, అక్కావాళ్లూ అంతా కలిసే ఉంటాం. ఇంటి వాతావరణం చాలా సందడిగా, సరదాగా ఉంటుంది. మొదట్నుంచీ నాకు కుటుంబం నుంచి మద్దతు బాగా ఉంది. పదేళ్లు సినిమా ప్రయత్నాల్లోనే ఉన్నాను. కానీ ఎప్పుడూ ఇంకెన్నాళ్లంటూ ఒత్తిడి చేయలేదు. పెళ్లి తర్వాత కూడా రెండేళ్ల వరకూ డైరెక్టర్‌గా అవకాశం రాలేదు. ఆ సమయంలో మా ఆవిడ కూడా మద్దతిచ్చింది. వీటితోపాటు నాకు నెగెటివ్‌ థింకింగ్‌ లేదు. ‘పరిశ్రమలో తెలిసినవాళ్లెవరూ లేరు, మిత్రులంతా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు...’ అన్న ఆలోచనలు నాకెప్పుడూ రాలేదు. ఎవరైనా చెప్పినా పట్టించుకోలేదు. ఇండస్ట్రీలో సెటిల్‌ కావడానికి టైమ్‌ పడుతుంది. టైమ్‌ తీసుకున్నాక కూడా సక్సెస్‌ అవుతామో లేదో తెలీదు. ఇక్కడ రిస్కు ఉందని వచ్చేటపుడే తెలుసు. కానీ ఆ జర్నీనే ఆస్వాదించగలగాలి. నా సినీ ప్రయాణంలో అమ్మానాన్న, నా శ్రీమతి, ఇద్దరు అక్కలతోపాటు చిన్ననాటి స్నేహితుడు మారుతి, నేను చదివిన పుస్తకాలే నాకు తోడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.