close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అగ్గి పిడుగు... అజిత్‌ దోవల్‌!

అగ్గి పిడుగు... అజిత్‌ దోవల్‌!

భారత్‌ కయ్యానికి కాలు దువ్వదనీ, అదే సమయంలో మన భద్రతకు ముప్పు కలిగిస్తే రక్షణాత్మక దాడులు తప్పవనీ శత్రువులకు స్పష్టమైన సంకేతాలు వెళ్తున్నాయి. ఈ మార్పు వెనుక కారణం ప్రభుత్వంతోపాటు వ్యూహకర్తలు మారడం కూడా! భారత్‌ పంథాలో మార్పు రావడం వెనక కీలకవ్యక్తి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ కుమార్‌ దోవల్‌. 71 ఏళ్ల వయసులోనూ దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న దోవల్‌ ప్రస్థానం జేమ్స్‌బాండ్‌ కథలకు ఏమాత్రం తీసిపోనిది...
జిత్‌ కుమార్‌ దోవల్‌... 1968 బ్యాచ్‌ కేరళ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌. 23 ఏళ్లకే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. తండ్రి సైన్యంలో పనిచేయడంతో అజ్మీర్‌లోని రాష్ట్రీయ మిలటరీ స్కూల్లో చదువుకున్నారు. ఆపైన ఆగ్రా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పీజీ చేశారు. సర్వీసులో చేరిన నాలుగేళ్లకు ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు మారారు దోవల్‌. అక్కడ పనిచేస్తూ సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తుల పీచమణిచే చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. తన సర్వీసులో ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే ఉన్నారీయన. 1980ల్లో మిజో నేషనల్‌ ఆర్మీ(ఎమ్‌ఎన్‌ఏ)లో ఒకరిగా చేరి మయన్మార్‌, చైనా సరిహద్దుల్లో ఉంటూ క్షేత్రస్థాయిలోనే వారి పతనానికి పాచికలు వేశారు. ఆ సమయంలో ఎమ్‌ఎన్‌ఏ అధినేత బైక్చ్‌చుంగాకు ఎంతో సన్నిహితుడయ్యారు. ఒక దశలో ‘దోవల్‌ మాటల్ని వింటే మిమ్మల్ని పక్కన పెట్టాల్సి వస్తుంద’ని వారి నాయకుడు లాల్డెంగా ఆ అధినేతను హెచ్చరించాడట. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో లాల్డెంగా ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ‘దోవల్‌వల్లనే ఆ ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. నా కింద ఏడుగురు మిలటరీ కమాండర్స్‌ ఉండేవారు. వారిలో ఆరుగురిని దోవల్‌ నా నుంచి దూరం చేశారు’ అని లాల్డెంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలా 20 ఏళ్లపాటు సైన్యానికి తలనొప్పిగా ఉన్న ఎమ్‌ఎన్‌ఏ సమస్యకు ముగింపు పలికారు దోవల్‌. చాలామంది తమ కెరీర్‌ మొత్తంలో చేయలేని పనిని దోవల్‌ స్వల్ప వ్యవధిలో చేశారంటూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కితాబిచ్చారు. ‘ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌’ను అందుకున్న పిన్న వయస్కుడు దోవల్‌.

స్వర్ణదేవాలయంలోకి వెళ్లి...
1988 ప్రాంతంలో ‘ఆపరేషన్‌ బ్లాక్‌ థండర్‌’ పేరుతో స్వర్ణదేవాలయంలో దాగున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్‌ని ప్రభుత్వం చేపట్టినపుడు దోవల్‌ కీలక పాత్ర పోషించారు. ఒక రిక్షావాలాగా వేషం మార్చి ఖలిస్తాన్‌ తీవ్రవాదులతో మాట కలిపి తనను పాకిస్థాన్‌ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్నారు. ఆపరేషన్‌ నిర్వహణకు కొద్ది రోజులు ముందు స్వర్ణదేవాలయంలోకి వెళ్లి ఉగ్రవాదుల ఆయుధ బలం, సంఖ్యా బలం, బలగాల మోహరింపుని క్షుణ్ణంగా పరిశీలించి సమాచారాన్ని భద్రతాదళాలకు అందించారు. సైన్యం ఆ ఆపరేషన్‌ చేపడుతున్న సమయంలో స్వర్ణదేవాలయం లోపలే ఉండి ఉగ్రవాదుల ఏరివేతకు విలువైన సమాచారాన్ని చేరవేశారు కూడా. దాంతో ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడంతోపాటు ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం ఆ ఆపరేషన్‌ పూర్తిచేయగలిగింది. ‘తీక్షణమైన పరిశీలనా శక్తి, అంతుచిక్కని నవ్వు...’ దోవల్‌ ప్రత్యేకతలని చెబుతారు ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ నిఘా అధికారి. ఆ ఆపరేషన్‌కుగానూ దోవల్‌ ‘కీర్తి చక్ర’ అవార్డుని అందుకున్నారు. సైన్యంలో పనిచేసేవారికే అప్పటివరకూ ఆ అవార్డు ఇచ్చేవారు. దోవల్‌ ఆ అవార్డు అందుకున్న మొదటి పోలీసు అధికారి.

పాక్‌లో ఏడేళ్లు
’90ల్లో ఉగ్రవాదులు పేట్రేగుతున్న సమయంలో దోవల్‌ కశ్మీర్‌లో అడుగుపెట్టారు. వేర్పాటువాదిగా ఉన్న కుకా పర్రయ్‌ లొంగిపోయేలా చేయడమే కాకుండా అతడి మనసు మార్చి భారత ప్రభుత్వానికి అనుకూలంగా తయారుచేశారు. తర్వాత ఓ సంస్థను ప్రారంభించి తీవ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేశాడు పర్రయ్‌. ప్రభుత్వ ఏజెంట్‌గా పనిచేయడం గురించి అక్కడ కొందరికి శిక్షణ కూడా ఇచ్చారు. మరోవైపు వేర్పాటువాద గ్రూపుల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపేలా వాతావరణంలో మార్పు తెచ్చారు. రాజకీయంగానూ అదో కీలక మలుపు. ఆ చర్యలతో 1996లో జమ్ము, కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో దిల్లీ వర్గాలు దోవల్‌ పనితనాన్ని ఎంతగానో కొనియాడాయి. కొన్నిసార్లు ఆయన్ని విమర్శించినవారు కూడా ఆ విజయంతో ప్రశంసించారు. అంతవరకూ గూఢచారిగా పేరుతెచ్చుకున్న దోవల్‌... వ్యూహకర్తగానూ గుర్తింపు సంపాదించారు. ఈశాన్య భారత్‌, పంజాబ్‌, కశ్మీర్‌... భారత్‌ వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నాసరే అక్కడికి వెళ్లి వారి భరతం పట్టడానికి తన ప్రతిభాపాటవాల్ని ఉపయోగించేవారు దోవల్‌. అంతేకాదు, ఏడేళ్లపాటు పాకిస్తాన్‌లో గూఢచారిగానూ ఉన్నారు. లాహోర్‌లో ఒక ముస్లిం వేషంలో ఉండేవారు దోవల్‌. ఆ సమయంలో పాక్‌తోపాటు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్‌ అనుకూల ఏజెంట్‌లను నియమించారు. ఓసారి లాహోర్‌లో బయటకు వెళ్లినపుడు పెద్ద గడ్డంతో మత పెద్దలా ఉన్న ఒక వ్యక్తి దోవల్‌ను చూసి ‘నువ్వు హిందూ కదా!’ అని అడిగాడట. కాదని దోవల్‌ సమాధానమిచ్చినా తనతో రమ్మని రెండు మూడు సందులు తిప్పి తన గదికి తీసుకొని వెళ్లాడట ఆ వ్యక్తి. ‘నువ్వు కచ్చితంగా హిందూవే’ అని చెప్పడంతో ఎందుకలా అడుగుతున్నావని దోవల్‌ ప్రశ్నిస్తే, ‘నీ చెవికి కుట్టు ఉంది. ఈ సంప్రదాయం హిందువులదే. అలా బయట తిరగకు. దానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకో. నాకు ఈ విషయం ఎలా తెలిసిందనుకుంటున్నావు, నేను కూడా హిందువునే’ అని చెప్పి, తన గదిలో ఒక మూలన దాచిన హిందూ దేవుళ్ల ప్రతిమలు చూపించాడట. తన కుటుంబాన్ని అక్కడివారు పొట్టన పెట్టుకున్నారనీ, తాను వేషం మార్చి బతుకుతున్నాననీ దోవల్‌తో చెప్పాడట అతడు. తర్వాత కొన్నాళ్లు లండన్‌లోని భారత రాయబార కార్యాలయంలోనూ పనిచేశారు దోవల్‌. క్షేత్రస్థాయిలో తానుగా లేదంటే, ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరించడం, దాన్ని భద్రతా దళాలకు చేరవేసి విద్రోహ శక్తుల్ని కోలుకోలేని దెబ్బకొట్టడం దోవల్‌కు వెన్నతో పెట్టిన విద్య.

1995 నుంచి ‘ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆపరేషన్స్‌’ విభాగ అధిపతిగా దశాబ్దంపాటు పనిచేశారు దోవల్‌. ఆయన హయాంలో కోవర్ట్‌ ఆపరేషన్లలో భాగమయ్యేవారంతా ఆఫీసుకి కుర్తా పైజమాల్లో, పెరిగిన గడ్డాలతో, లుంగీల్లో, సాధారణ చెప్పులు వేసుకొని వచ్చే వెసులుబాటు ఉండేదంటారు. దోవల్‌కు ఉర్దూ భాషపైన మంచి పట్టు ఉంది. దాని ప్రయోజనం ఆయనకు తెలుసు. అందుకే కోవర్ట్‌లుగా వెళ్లేవారు ఉర్దూ, అరబిక్‌లు నేర్చుకోవడానికి ప్రత్యేకంగా మౌల్వీలను పెట్టుకోనిచ్చేవారు. ‘దోవల్‌ ఎప్పుడూ రిస్కు తీసుకోవడానికి సందేహించరు. ఆ లక్షణమే ఆయన్ని అత్యుత్తమ నిఘా అధికారిగా తయారుచేసింది’ అని చెబుతారు రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా) మాజీ అధినేత, ఐబీలో దోవల్‌ సీనియర్‌ అయిన ఏ.ఎస్‌.దూలత్‌.

చర్చల్లోనూ ముందే
1999లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కాఠ్‌మాండూ-దిల్లీ విమానాన్ని తీవ్రవాదులు హైజాక్‌ చేసి కాందహార్‌ తరలించిన సమయంలో బందీలను విడిపించడంకోసం తీవ్రవాదులతో చర్చించిన బృందంలో దోవల్‌ ఒకరు. అంతకు ముందు కూడా ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పలు విమానాల హైజాకింగ్‌ సంఘటనల సమయంలోనూ దోవల్‌ చర్చలకు వెళ్లారు. కార్గిల్‌ యుద్ధం తర్వాత భద్రతా దళాల్నీ, నిఘా వర్గాల్నీ సమన్వయం చేసేందుకు ‘మల్టీ ఏజెన్సీ సెంటర్‌’ను ఏర్పాటుచేసి దాని సారథ్య బాధ్యతలు దోవల్‌కు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో ఏర్పాటైన మరో నిఘా విభాగం ‘జాయింట్‌ ఇంటెలిజెన్స్‌ టాస్క్‌ ఫోర్స్‌’కూ సారథ్యం వహించేవారాయన. ఎన్డీఏ ప్రభుత్వం మొదటి విడతలో హోం మంత్రి ఎల్‌.కె.అడ్వాణీకి సన్నిహితంగా ఉండేవారు. మన్మోహన్‌ సింగ్‌ మొదటిసారి ప్రధాని అయ్యాక దోవల్‌ని ‘ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌’గా నియమించింది యూపీఏ. కానీ ఆ స్థానంలో ఆయన ఎనిమిది నెలలే ఉన్నారు. 2005లో అధికారికంగా రిటైరైనా, ఆ తర్వాత కూడా అనధికారికంగా ఎన్నో కోవర్ట్‌ ఆపరేషన్లకు వ్యూహకర్తగా పనిచేశారు. రిటైర్మెంట్‌ తర్వాత దావూద్‌ ఇబ్రహీంని మట్టుబెట్టే ఆపరేషన్‌కు ఆయన స్కెచ్‌ గీశారు. దావూద్‌ కూతురు పెళ్లికి దుబాయ్‌లోని హోటల్‌కు వచ్చినపుడు చంపాలన్నది ప్రణాళిక. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో ఛోటా రాజన్‌ ముఠాకు చెందిన ఇద్దర్ని అందుకు సిద్ధం చేశారు దోవల్‌. ఆ దశలో ముంబయి పోలీసు వర్గాల్లో దావూద్‌కు అనుకూలంగా ఉన్నవారు ఆ పని కానివ్వలేదు. దిల్లీలో ఛోటా రాజన్‌ అనుచరులతో దోవల్‌ మంతనాలు జరుపుతున్న హోటల్‌కు వచ్చి తీవ్రవాదులంటూ వారిద్దరినీ అరెస్టు చేసి దోవల్‌ మాట చెల్లనివ్వకుండా చేశారు.

ఐబీ డైరెక్టర్‌గా రిటైరయ్యాక ‘వివేకానంద ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌’ అనే వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. భద్రత, దౌత్య, సైనిక విభాగాల్లో పనిచేసిన మాజీ అధికారులు సభ్యులుగా ఉండే ఈ సంస్థలో జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన మేథోపరమైన చర్చలు జరుగుతుంటాయి. అవి ప్రభుత్వ విధానాలకూ పనికొచ్చేవి. ప్రభుత్వం ఆయన సేవలకు సెలవు ఇచ్చినా దోవల్‌ మాత్రం తన ఆలోచనలకు సెలవు ఇవ్వలేదన్నమాట.

భద్రతా సలహాదారుగా...
మోదీ ప్రధాని అయ్యాక దోవల్‌ని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ)గా నియమించారు. ఆ వార్త వెలువడగానే పాక్‌కి కలవరం మొదలైంది. వివిధ ఆపరేషన్లలో క్షేత్రస్థాయి అనుభవం ఉన్న మొదటి ఎన్‌ఎస్‌ఏ అయిన దోవల్‌కి చేతల మనిషిగా గుర్తింపు ఉండటమే అందుకు కారణం. అప్పుడే దావూద్‌ ఇబ్రహీం తన స్థావరాన్ని కరాచీ నుంచి పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుల్లోకి మార్చుకున్నాడనీ చెబుతారు. రా, ఇంటెలిజెన్స్‌ బ్యూరోలు సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారుతోనే పంచుకుంటాయి. దాన్నిబట్టి ఎన్‌ఎస్‌ఏగా దోవల్‌ పాత్ర ఎలాంటిదో అర్థమవుతుంది. ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే ఇరాక్‌లో ఐసిస్‌ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు దోవల్‌. 2015 జనవరిలో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి అన్నింటా చైనాకు వత్తాసు పలుకుతున్న అప్పటి అధ్యక్షుడు మహింద రాజపక్సను గద్దె దించడంలోనూ దోవల్‌ వ్యూహ రచన చేశారంటారు. గతేడాది మణిపూర్‌లో మన సైన్యానికి సంబంధించిన వాహనశ్రేణిపైన దాడిచేసి 18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న తీవ్రవాదులపైన ప్రతీకారంగా వారాల వ్యవధిలో మన సైన్యం మయన్మార్‌లోకి వెళ్లి మెరుపుదాడి చేసి 40 మంది తీవ్రవాదుల్ని హతమార్చింది. గత అక్టోబరులో మయన్మార్‌ ప్రభుత్వం అతివాద వర్గాలతో శాంతి ఒప్పందం చేసుకున్నపుడు దోవల్‌ అక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని పరిశీలించారు. బంగ్లాదేశ్‌లో తలదాచుకుంటున్న ఉల్ఫా ప్రధాన కార్యదర్శి అనూప్‌ ఛేతియాని గత నవంబరులో ఆ దేశం మనకు అప్పగించింది. సరిహద్దు వివాదాలు పరిష్కరించుకోవడం సహా చాలా అంశాల్లో సానుకూలంగా స్పందించిన బంగ్లాదేశ్‌ మనకు సన్నిహితమైన పొరుగుదేశమంటూ బహిరంగంగానే ప్రకటించారు దోవల్‌. ఐబీ మాజీ డైరెక్టర్‌ సయ్యద్‌ ఆసిఫ్‌ ఇబ్రహీమ్‌ను 2015లో తీవ్రవాదం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ప్రధానమంత్రి ప్రత్యేక రాయబారిగా పశ్చిమాసియా, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, ఆగ్నేయాసియా దేశాల ప్రభుత్వాలతో చర్చించేందుకు నియమించారు. ఇదివరకు ఇలాంటి రాయబారి హోదా లేదు. అదే సమయంలో పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో నిఘా వర్గాలు చురుగ్గా పనిచేసేలా దోవల్‌ మార్పులు తెచ్చారనీ, అందువల్లే ఛోటా రాజన్‌ను పట్టుకోగలిగారనీ చెబుతారు.

పాక్‌... ఖబడ్దార్‌!
పీఓకేలో మెరుపుదాడి తర్వాత దోవల్‌ వార్తల్లో ప్రధాన వ్యక్తిగా మారిపోయారు. ఆ దాడికి వ్యూహరచన చేసింది ఆయనేనంటారు. ఉగ్రవాదుల్ని అడ్డం పెట్టుకొని భారత్‌లో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తోన్న పాక్‌ దుశ్చర్యలు ఇక ఎంత మాత్రం సాగవన్న సంకేతాలు ఆ దేశానికి ఇప్పటికే వెళ్లాయి. ‘భారత్‌పైన దాడులు ఎక్కడనుంచి జరుగుతాయో అక్కడ మేం దాడి చేస్తాం’ అని భారత్‌ అవలంబిస్తోన్న ‘డిఫెన్సివ్‌ అఫెన్స్‌’ గురించి బాహాటంగానే చెబుతున్నారు దోవల్‌. ‘మీరు మరొక ముంబయి ఘటనకు పాల్పడితే బలూచిస్థాన్‌ మీ నుంచి దూరమవుతుంది. భారత్‌కంటే ఎన్నో రెట్లు బలహీనతలు పాకిస్థాన్‌కు ఉన్నాయి. మీకు మించిన తెలివి మాకుంద’ని చెబుతారు దోవల్‌. అందుకే శత్రువులకు ఆయనో అగ్గి పిడుగు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.