close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అదే తొలిగుండె మార్పిడి!

‘జీవితంలో అన్నీ సమపాళ్లలో ఉండాలనుకుంటే కెరీర్లో ఉన్నత శిఖరాలను చేరుకోలేం...’ అంటారు డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే. తెలుగువారైన డాక్టర్‌ గోఖలేకు గుండె మార్పిడి, శస్త్రచికిత్స నిపుణుడిగా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆగిపోతాయనుకున్న వేల గుండెలకు శస్త్రచికిత్సలు చేసి ఆ గుండెలతోపాటు వారి ఆత్మీయుల గుండెల్లోనూ ఆనందాన్ని నింపిన ఘనత ఆయనది. వైద్యుడిగా మూడున్నర దశాబ్దాల ప్రయాణం గురించి డాక్టర్‌ గోఖలే ఏం చెబుతున్నారంటే... 
గోపాలకృష్ణ గోఖలే, ఈ పేరు పెట్టి నాకు ఊహ తెలియకముందే అమ్మానాన్నా ఓ పెద్ద బాధ్యతని అప్పగించారేమో అనిపిస్తుంది. ఆ మహనీయుడి పేరుపెట్టి ఏం చేసినా సమాజానికి ఉపయోగపడాలి అని చెప్పకనే చెప్పారు. చిన్నపుడు నన్ను రమేష్‌ అని పిలిచేవారు. స్కూల్లో చేర్చినపుడు నేను పుట్టిన సమయాన్నిబట్టి పేరు మార్చారు. పేరులో రెండు ‘గో’లు రావాలంటే... ‘గోపాలకృష్ణ గోఖలే’ అని అమ్మ చెప్పిందట. నేను పుట్టింది 1960లో. అప్పటికింకా స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ప్రజల్లో బాగా ఉంది. అందుకే ఆ పేరు పెట్టారు. నాన్న వెంకటేశ్వరరావు మూడో తరగతి, అమ్మ ఝాన్సీబాయి అయిదో తరగతి చదివారు. జాతీయ నాయకుల పేరు పెట్టడం అమ్మ దగ్గరే మొదలైందని అర్థమైందిగా. నా పేరు చూసి చాలామంది మరాఠావాళ్లు నాతో మరాఠీలో మాట కలుపుతారు. విషయం చెప్పేసరికి నవ్వుకుని వెళ్లిపోతారు. అందుకే నా పేరు ముందు ఇంటి పేరు కచ్చితంగా రాస్తాను. తెలుగువాణ్నని అలా గుర్తించగలుగుతారు.

అందరూ ప్రయోజకులే... 
కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర్లోని గంటావారిపాలెం మా సొంతూరు. మాకు నాలుగు ఎకరాల పొలం ఉండేది. అమ్మానాన్నా అది సాగుచేసేవారు. పిల్లలు మాత్రం ఉద్యోగాల్లో స్థిరపడాలని మమ్మల్ని బాగా చదివించాలనుకున్నారు. నలుగురు తోబుట్టువుల్లో నేను చిన్నవాణ్ని. నాకు పది నెలలు వచ్చేసరికే పెద్దన్నయ్యకి పెళ్లి అయింది. పెళ్లి తర్వాతే ఎంబీబీఎస్‌లో చేరాడు. రెండో అన్నయ్య ఇంజినీర్‌, అక్క టీచర్‌. మా ఊళ్లో 15 ఇళ్లు ఉండేవి. నా చిన్నపుడు ఊరికి కరెంటు కూడా లేదు. ఊళ్లోనే అయిదో తరగతి వరకూ ఉండేది. బడి మొత్తమ్మీద 15 మంది చదివేవాళ్లం. అందరికీ ఒకరే టీచర్‌. తమిరిశ మాకు మూడు కి.మీ. దూరంలో ఉంటుంది. అక్కడి జిల్లా పరిషత్‌ హైస్కూల్లో పదివరకూ చదువుకున్నాను. కాలవ గట్టు వెంబడి బురద, మట్టి, ముళ్లు దాటుకునే స్కూల్‌కి వెళ్లేవాళ్లం. పెద్దన్నయ్యలా డాక్టర్‌ అవ్వాలని ఉండేది కానీ, ఎలా అవ్వాలనేది నాకూ తెలీదు. అన్నయ్యలూ, అక్కా సెలవులకి వచ్చినపుడు నా చదువుని పరీక్షించేవారు. పెద్దన్నయ్య రామశేషయ్య, ఆప్తల్మాలజిస్టు. మిర్యాలగూడలో స్థిరపడ్డాడు. నా చదువు విషయాల్ని ఆయనే చూసుకునేవాడు. స్కూల్‌కి వచ్చి నా చదువు గురించి ఆరా తీసేవాడు. ఇంటర్మీడియెట్‌కి గుంటూరు జేకేసీ కాలేజీలో చేర్పించాడు. అప్పుడే ఇంగ్లిష్‌మీడియంలోకి మారింది. ఓ ఆర్నెల్లు చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత అలవాటు పడ్డాను. ఇంటర్‌ తర్వాత గుంటూరు మెడికల్‌ కాలేజీ(జీఎమ్‌సీ)లో సీటు వచ్చింది. అక్కడే ఎంబీబీఎస్‌తోపాటు ఎం.ఎస్‌. కూడా చేశాను. తర్వాత కార్డియో థొరాసిక్‌ సర్జన్‌(ఎంసీహెచ్‌) కోర్సు చేయడానికి తమిళనాడులోని వేలూరు వెళ్లాను.

డాక్టర్‌ కెరీర్‌... 
వేలూరులో ఎంసీహెచ్‌ పూర్తిచేసి వచ్చాక నిమ్స్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరాను. వేలూరులో చాలా థియరీ నేర్చుకున్నాను కానీ, ప్రాక్టికల్స్‌కి పెద్దగా అవకాశం రాలేదు. నిమ్స్‌కి వచ్చాక కొంతమేర ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ సంపాదించాను. నిమ్స్‌లో డాక్టర్‌ బి.వి.రామారావు నేతృత్వంలో సర్జరీలు చేసేవాళ్లం. ఆయనే నా గురువు అని చెప్పాలి. పనిపట్ల నా నిబద్ధత, ఆసక్తుల్ని గమనించి ‘విదేశాలకు పంపే అవకాశం వస్తే చెబుతాను. సిద్ధంగా ఉండు’ అని చెప్పారోసారి. ఆయనేదో మామూలుగా అన్నారనుకునేవాణ్ని. రెండేళ్లు నిమ్స్‌లో పనిచేశాక ఆస్ట్రేలియాలో అవకాశం ఉందని చెప్పి పంపించారు. 1992లో ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలో నైపుణ్యాలను పెంచుకోవడంతోపాటు, గుండె మార్పిడి విధానాన్నీ నేర్చుకున్నాను. మూడేళ్లు అక్కడున్న తర్వాత అమెరికాలో అవకాశం వస్తే వెళ్లాను. అక్కడో ఏడాది పనిచేసి 1996లో ఇండియా తిరిగి వచ్చాను. అప్పట్నుంచీ హైదరాబాద్‌లో వివిధ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నాను. ప్రస్తుతం అపోలోలో సీనియర్‌ కార్డియో థొరాసిక్‌ కన్సల్టెంట్‌గా ఉన్నాను. గుండె మార్పిడిని మాత్రం 2004లో మొదటిసారి చేశాను. అప్పటికి గ్లోబల్‌ హాస్పిటల్స్‌లో పనిచేసేవాణ్ని. ఆసుపత్రి యాజమాన్యం, కొందరు దాతలూ ముందుకు రావడంతో ఓ తాపీ మేస్త్రీకి ఉచితంగానే గుండె మార్పిడి సాధ్యమైంది. ఆ సర్జరీకి కొద్ది నెలల ముందే మా బృందం విదేశాల్లో ఆధునిక శిక్షణకు వెళ్లి వచ్చింది. దాంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ సర్జరీ చేశాం. తెలుగు రాష్ట్రాల్లో అదే మొదటి గుండె మార్పిడి సర్జరీ. ఆ తర్వాత ఆయన అయిదేళ్లు బతికాడు. ఇప్పటివరకూ నా బృందంతో కలిసి 35 గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేశాను. రోజులూ, వారాల్లో చనిపోతారనుకునేవాళ్లు గుండె మార్పిడి తర్వాత రెండు నుంచి ఏడెనిమిదేళ్లు బతుకుతున్నారు. ఎలాంటి సర్జరీలకూ అవకాశంలేక, దాత గుండె అందుబాటులో ఉన్నపుడు మాత్రమే గుండె మార్పిడికి వెళ్తాం. నేను గుండె మార్పిడి చేసినవాళ్లలో 14 ఏళ్ల పిల్లాడి నుంచి 68 ఏళ్ల వృద్ధుడి వరకూ ఉన్నారు. మూడు ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీలూ చేశాను. నాకు మంచి సహాయక బృందం ఉంది. ప్రతి కేసునీ మేం ఒక ఛాలెంజ్‌గా తీసుకుని చేస్తాం. ఎందుకంటే ఈ సర్జరీల్లో కాస్త తేడా వచ్చినా పేషెంట్‌ చనిపోయే ప్రమాదం ఉంది.


 

బాధ్యత నిర్వర్తిస్తున్నా... 
ఆస్ట్రేలియా, అమెరికాల్లో ఉన్న నాలుగేళ్లూ వృత్తిపరంగా చాలా నేర్చుకున్నాను. వాళ్లు నాకు విద్య నేర్పడమే కాదు, బాగా చూసుకునేవారు, ఆదాయం కూడా బాగా వచ్చేది. అమెరికాలోగానీ ఇంకొన్నాళ్లు ఉంటే అక్కడి సుఖాలకీ, విలాస జీవనానికీ అలవాటు పడిపోతానని అర్థమైంది. అందుకే తిరిగి వచ్చేద్దామనుకున్నాం. నా భార్య వెంకటలక్ష్మి నియోనాటలిస్టు. నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టే పిల్లలకు చికిత్స చేస్తుంది. తను తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. నాకూ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. అమెరికా నుంచి తిరిగి వచ్చేస్తానని చెప్పినపుడు చాలామంది కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు అన్నారు. నాకు మాత్రం మా అవసరం ఇక్కడే ఎక్కువ ఉందనిపించింది. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేస్తే మనవాళ్లు దేవుడిగా చూస్తారు, అమెరికాలో అది ఒక సాధారణ విషయం. అలా ఆత్మసంతృప్తికోసమూ ఇక్కడికి వచ్చేయాలనుకున్నాం. తిరిగి వచ్చినందుకు ఏరోజూ బాధపడలేదు. నేను చదువుకున్నదంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే. ఎక్కడా పెద్దగా ఫీజులు కట్టలేదు. కానీ డాక్టర్‌గా కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లోనే పనిచేస్తూ వచ్చాను. ఒక దశలో సమాజానికి తిరిగి ఇవ్వడంలేదన్న అసంతృప్తి మొదలైంది. అందుకే 2003లో ‘సహృదయ ఫౌండేషన్‌’ను ప్రారంభించాను. ఆ సంస్థద్వారా దాతల సాయంతో పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు చేయడం మొదలుపెట్టాను. నేను చదువుకున్న స్కూల్లో, కాలేజీల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాను. 2013 ప్రాంతంలో జీఎమ్‌సీలో మా సీనియర్లు రూ.20 కోట్లు పెట్టి సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ని కట్టించారు. అందులోని వసతులు ఏ కార్పొరేట్‌ ఆసుపత్రికీ తీసిపోవు. కానీ అక్కడ ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ విభాగం లేదు. నాకు ఆ నైపుణ్యం ఉంది. అనుమతి ఇస్తే ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తానని ప్రభుత్వానికి లేఖ రాశాను. రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లకు అనుమతి వచ్చింది. మా ఫౌండేషన్‌ద్వారా గత మూడున్నరేళ్లలో అక్కడ 500కుపైగా ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలూ, 4 గుండె మార్పిడి శస్త్రచికిత్సలూ చేశాం. రెండేళ్లపాటు వారాంతాల్లో ఆ ఆసుపత్రికి వెళ్తూ అక్కడి మా బృందంతో కలిసి శస్త్రచికిత్సలు చేసేవాణ్ని. ఇప్పుడు నెలకోసారి వెళ్తున్నాను. నేను లేకపోయినా మా బృందమే శస్త్రచికిత్సలు చేయగలుగుతోంది. అక్కడ ప్రభుత్వ వైద్యులకూ శిక్షణ ఇచ్చి, మా పాత్రని క్రమంగా తగ్గించాలనేది నా ఆలోచన. ప్రస్తుతానికి ఆ పనే చేస్తున్నాను. అలా చేయడంవల్ల అక్కడో చక్కని వ్యవస్థ ఏర్పాటవుతోంది.

సేవలోనే సంతృప్తి... 
ఓసారి జీఎంసీలో గుండె మార్పిడి చేయాల్సి వచ్చినపుడు దాత నెల్లూరులో ఉన్నారని తెలిసింది. నాలుగు గంటల్లో గుండెను అక్కణ్నుంచి తెచ్చి అమర్చాలి. అంతకంటే తక్కువ సమయంలో చేస్తే ఇంకా మంచిది. విమానంలో వెళ్లి వచ్చినా సమయం సరిపోదు. అప్పుడు నాకు 
ఆస్ట్రేలియాలో ఎదురైన అనుభవం గుర్తొచ్చింది. అక్కడికి నేను వెళ్లిన కొత్తలోనే ఒక సామాన్యుడి కోసం ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులూ, ప్రజలూ ముందుకు వచ్చి గుండె మార్పిడికి సహకరించారు. పోలీసులు ట్రాఫిక్‌ని కంట్రోల్‌ చేస్తే, ఓ వ్యాపారి తన ఛార్టెర్డ్‌ ఫ్లయిట్‌ని ఉచితంగా ఇచ్చాడు. ఇక్కడా ఓ వ్యాపారవేత్తని సంప్రదిస్తే హెలికాప్టర్‌ ఉచితంగా ఇచ్చారు. నెల్లూరు, గుంటూరులలో పోలీసులు ట్రాఫిక్‌ని నియంత్రించడంతో సకాలంలో ఆ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశాం. ప్రయత్నం అంటూ చేయాలిగానీ అన్ని వైపులనుంచీ సహకారం అందుతుందనడానికి ఇదో ఉదాహరణ. ఆపన్నులు కనిపిస్తే ఇవ్వడానికి మా పెద్దన్నయ్య కారులో ఎప్పుడూ ఒక బ్యాగు నిండా బట్టలు పెట్టుకుంటాడు. అలాంటివాళ్లు ముందు ఉండటంవల్ల సేవలోనూ నాకో దారి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను చదువుకున్న తమిరిశ జెడ్పీ హైస్కూల్‌లో వసతులు మెరుగుపర్చే పనిని పెట్టుకున్నాను. చిన్ననాడు మేం పడిన కష్టాలు 21వ శతాబ్దంలో పిల్లలు పడకూడదు. ఆ స్కూల్లో టీచర్లు అద్భుతంగా పాఠాలు చెబుతున్నారు. 99 శాతం విద్యార్థులు ఫస్ట్‌క్లాస్‌ సాధిస్తున్నారు. కానీ తరగతి గదులూ, ప్రహరీ, టాయిలెట్‌లూ సరిగ్గా లేవు. ప్రభుత్వం కొంతమేర నిధులు మంజూరు చేసింది. అక్కడి పూర్వ విద్యార్థుల తరఫున మరో రూ.50 లక్షలు సేకరించే పనిలో ఉన్నాను. అమెరికాలో స్థిరపడినవారి నుంచీ ఊళ్లో ఉన్నవాళ్లవరకూ అందరితో మాట్లాడుతున్నాను. నేనొక్కణ్నే ఇవన్నీ చేయొచ్చు. కానీ అందరం కలిసి చేస్తే ఇంకాస్త బాధ్యతాయుతంగా, పెద్దగా చేయొచ్చనేది నా ఉద్దేశం!

అవార్డు అందరిదీ...

జీవితంలో అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలని కోరుకుంటే కెరీర్‌లో ఇక్కడివరకూ రాలేనేమో. నా శ్రీమతి లక్ష్మి కూడా డాక్టర్‌ కావడంతో ‘పేషెంట్‌’ ఫస్ట్‌ అన్నది జీవన విధానమైంది.   మా పిల్లల బాల్యాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయాను. అమ్మానాన్నలతో తగినంత సమయం గడపలేకపోయాననే బాధ కూడా ఉంది. నా సేవల్ని గుర్తించి 2016లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. నిజానికి ఇది కుటుంబానికి దక్కిన గుర్తింపు అని చెప్పాలి. 
* మాకు ఇద్దరు అమ్మాయిలు. యామిని, మృణాళిని.. ఇద్దరూ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. 
* నాకు వృత్తీ, ప్రవృత్తీ ఒకటే. ఆట విడుపుకోసం వృత్తిపరమైన సదస్సులకూ, సమావేశాలకూ వెళ్లి నా అనుభవాల్ని పంచుకుంటాను. ఏడాదికోసారి విదేశాలకు వెళ్లి వారం, రెండువారాలపాటు కొత్త అంశాల్ని నేర్చుకుంటాను. ఆదివారాలు మాత్రం కుటుంబ సభ్యులతో గడపడానికి చూస్తాను. 
* రక్తనాళాల పూడిక ఏర్పడటంవల్ల వచ్చే గుండె జబ్బులు మనదేశంలో బాగా పెరిగాయి. ఒత్తిడి పెరగడం, ఆహారపుటలవాట్లు మారడం, శారీరక శ్రమ లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. సరైన ఆహారం తీసుకోవడం, క్రమంతప్పక వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 40 ఏళ్లు దాటాక రెగ్యులర్‌గా చెకప్‌ చేయించుకోవాలి. ఇవ్వడంలో ఆనందం ఉంది. ఆనందంతో ఆరోగ్యం వస్తుందన్న సంగతినీ మర్చిపోవద్దు.

- సుంకరి చంద్రశేఖర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.