close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భీముడు నన్ను ఆదుకున్నాడు!

భీముడి గురించి తెలియని భారతీయులు ఉండనట్టే, ఛోటాభీమ్‌ తెలియని పిల్లలూ ఉండరు. మన చిన్నారులు విదేశీ కార్టూన్‌ బొమ్మల్ని చూస్తున్నరోజుల్ని మార్చి ఇక్కడి చిత్రాలు విదేశాలకూ వెళ్లగలిగేలా ఛోటాభీమ్‌ పాత్రని సృష్టించిన వ్యక్తి రాజీవ్‌ చిలకలపూడి. తన కథల్లో ఛోటాభీమ్‌ పాత్రలానే రాజీవ్‌ కూడా చాలా సాహసాలు చేశాకే విజయాన్ని అందుకోగలిగాడు. ఆ సాహసయాత్ర గురించి అతని మాటల్లోనే... 
మా పూర్వీకులది మచిలీపట్నం. నాన్న హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌ (డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లేబొరేటరీ)లో శాస్త్రవేత్తగా పనిచేసేవారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. నా చిన్నపుడు నారాయణగూడలో ఉండేవాళ్లం. ఇంట్లో పెద్దవాళ్లు మన పురాణాలూ ఇతిహాసాల గురించి చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వినేవాణ్ని. కాస్త పెద్దయ్యాక చందమామ, అమరచిత్రకథ... చదవడం అలవాటయింది. వాటితోపాటు పౌరాణిక సినిమాల్నీ చూసేవాణ్ని. నేను, చదివిన కథల్నీ, చూసిన సినిమాల్నీ నా ఫ్రెండ్స్‌కి చెప్పేవాణ్ని. నాకు బొమ్మలు గీయడమన్నా ఇష్టమే కానీ, సరిగ్గా గీయడం వచ్చేది కాదు. అయినా మానేవాణ్నికాదు. ఏడేళ్ల వయసులో జంగిల్‌ బుక్‌ సినిమా చూశాను. ఆ సినిమా ఒక అద్భుతంలా అనిపించింది. కార్టూన్‌లతో సినిమా ఎలా తీస్తారని నాన్నని అడిగితే బొమ్మలు గీసి యానిమేషన్‌ చేస్తారని చెప్పారు. ‘యానిమేషన్‌’ అనే మాటను మొదటిసారి విన్నది అప్పుడే. ఆ సినిమా చూసి వచ్చాక కూడా రెండు మూడేళ్లపాటు మోగ్లీ నా బుర్రలోనే ఉండిపోయాడు.

 

అమెరికా నుంచి వచ్చేశా... 
పెద్దయ్యేకొద్దీ నేనూ అందరిలానే ఆటపాటలు తగ్గించి చదువులో మునిగిపోయాను. ఇంజినీరింగ్‌ పూర్తిచేసి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేయడానికి అమెరికా వెళ్లాను. అక్కడ యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నపుడు ‘లైఫ్‌ ఆఫ్‌ వాల్ట్‌ డిస్నీ’ పుస్తకం కనిపిస్తే చదివాను. టెక్నాలజీ అంతగా లేని రోజుల్లోనే అద్భుతాలు చేశారాయన. ఆయన జీవితకథ ఎంతో స్ఫూర్తినిచ్చింది. నాకు కార్టూన్లపైన ఉన్న ఆసక్తి మరోసారి గుర్తొచ్చింది. మిక్కీమౌస్‌లాగా ఇండియా నుంచి ఒక కార్టూన్‌ క్యారెక్టర్‌ సృష్టించాలన్న ఆలోచన మొదటిసారి అప్పుడే వచ్చింది. మాస్టర్స్‌ చదువుతున్నాను కానీ, నచ్చడంలేదు. చదువు ఆపేసి యానిమేషన్‌ కోర్సు చేయాలనుకున్నాను. అమెరికాలోనే ఉన్న అన్నయ్యతో విషయం చెబితే ‘బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో’ అన్నాడు. నేను స్కాలర్‌షిప్‌మీద వెళ్లి చదువుతున్నాను. యానిమేషన్‌ కోర్సులో చేరాలంటే సెమిస్టర్‌కి 20వేల డాలర్లు కట్టాలి. నాకు ఫీజు కట్టి సాయం చేయమని అన్నయ్యని అడిగితే, ‘డబ్బు ఇవ్వలేక కాదు. నువ్వు పెద్ద రిస్కు తీసుకుంటున్నావు. దీనికి బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. ముందు ఎం.ఎస్‌. పూర్తిచెయ్యి ఉద్యోగంలో చేరు. కొంత డబ్బు సంపాదించి దాంతో నీకు ఇష్టమైన యానిమేషన్‌ కోర్సు చెయ్యి’ అని సలహా ఇచ్చాడు. నాక్కూడా అది సబబుగానే అనిపించింది. పీజీ చేసి మూడేళ్లపాటు ఉద్యోగం చేశాను. సరిపడినంత డబ్బు సంపాదించాక ఉద్యోగం మానేశాను. ఇంట్లో ఒప్పుకోలేదు. నాన్నకి నా ఆలోచన నచ్చలేదు. అమ్మ మాత్రం ప్రోత్సహించింది. నా ఆలోచనని వివరంగా చెప్పాక నాన్న కూడా కాస్త మెత్తబడ్డారు. దాంతో ‘అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌- యూనివర్సిటీ ఆఫ్‌ శాన్‌ఫ్రాన్సిస్కో’ అందించే యానిమేషన్‌ కోర్సులో చేరాను. మామూలుగా నాలుగైదు గంటలు చదివే నేను... యానిమేషన్‌ కోర్సు చేస్తున్నపుడు రాత్రి రెండింటివరకూ పనిచేస్తుండేవాణ్ని. అందులో ఒక రకమైన ఉత్సాహం వచ్చేది. ఇప్పటికీ ఆ ఉత్సాహం అలానే ఉంది.

2001లో ఇండియా తిరిగొచ్చాక హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఒక గదిని ఆఫీసుగా మార్చుకుని ‘గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌’ని ప్రారంభించాను. మొదట్లో ఇక్కడ యానిమేషన్‌ నిపుణులు లేరు. ఓ నలుగురు యువకుల్ని తీసుకుని వాళ్లకి శిక్షణ ఇచ్చేవాణ్ని. ప్రారంభంలో బ్రోచర్లూ, వెబ్‌పేజీ డిజైనింగ్‌ లాంటివీ చేసేవాళ్లం. తర్వాత కేవలం పిల్లలకు ఆసక్తి ఉండే కార్టూన్‌ సీరియల్స్‌ తీయడం మొదలుపెట్టాం. మేం చేసిన మొదటి ప్రాజెక్టు ‘బోంగో’ 2004లో దూరదర్శన్‌లో ప్రసారమైంది. దానికి శక్తిమాన్‌కంటే కూడా మంచి రేటింగ్‌ వచ్చింది. అది ప్రసారమైన రోజే రాత్రికిరాత్రి మా పోటీ కంపెనీ మా టీమ్‌ని రెట్టింపు జీతమిచ్చి తీసుకుపోయింది. తర్వాత ఓ వారంపాటు అమీర్‌పేటలోని ఇన్‌స్టిట్యూట్‌ల చుట్టూ తిరిగి ఎనిమిది మంది యువకుల్ని ఎంపికచేసుకుని పని కొనసాగించాను. బోంగో ప్రాజెక్టు డిజైనింగ్‌లో నేనే ప్రధాన పాత్ర పోషించాను కాబట్టి పెద్దగా ఇబ్బంది కాలేదు. తర్వాత 2005లో విక్రమ్‌- బేతాళ సిరీస్‌ తీసుకొచ్చాం. 2006లో కృష్ణుడి మీద ఒక సీరియల్‌ చేశాం. వరసగా ప్రాజెక్టులు చేస్తూనే ఉన్నాం కానీ, లాభాలైతే పెద్దగా రాలేదు. పెట్టుబడుల కోసం చాలామందిని అడిగేవాణ్ని. లాభాలు రావడానికి అయిదారేళ్లు పడతాయని చెప్పేసరికి అంతా వెనకడుగు వేసేవారు. ఆ దశలో పరిచయమైన సమీర్‌ జైన్‌ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు.

ఛోటాభీమ్‌ వచ్చాడు... 
అప్పటివరకూ మేం చేస్తున్న సీరియళ్లలో ప్రధాన పాత్ర తప్పించి మిగతా క్యారెక్టర్లూ, అవి ఉండే ప్రదేశాలూ తరచూ మారేవి. అలా కాకుండా కొన్ని స్థిరమైన పాత్రలతో ఒకే ప్రదేశంలో భిన్నమైన కథలు చెప్పగలిగితే చాలావరకూ ఖర్చు తగ్గించుకోవచ్చనుకున్నాం. మరోసారి చందమామ, అమర చిత్రకథ పుస్తకాలూ తిరగేశాను. అప్పుడే భీముడు నా మైండ్‌లోకి వచ్చాడు. భీముడు చిన్నప్పట్నుంచీ నాకు ఇష్టమైన పాత్ర. ‘లిటిల్‌ భీమ’ పేరుతో ఏదైనా చేద్దామా అనిపించింది. కానీ కృష్ణుడిలా భీముడు చిన్నపుడు చేసిన సాహసాల గురించి పురాణాల్లో లేవు. ఏదేమైనా భీముడితోనే సిరీస్‌ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అప్పుడే ‘ఛోటాభీమ్‌’ అన్న పేరు ఫిక్స్‌ చేసుకుని వేర్వేరు స్కెచ్‌లు గీయడం మొదలుపెట్టాం. భీముడు బలశాలి, భోజన ప్రియుడు... అని చదువుకున్నాం. కానీ భారీకాయుడిగా చూపిస్తే ఇప్పటిరోజుల్లో కుదరదు. మేం గీసిన పదుల స్కెచ్‌లనుంచి ఇప్పుడున్న రూపాన్ని ఎంచుకున్నాం. భీముడిలానే ఛోటాభీమ్‌ కూడా బలవంతుడు, దృఢమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. కానీ చూడ్డానికి సామాన్యంగా ఉంటాడు. అతిగా తినకూడదు. అలాగని ఏదీ తినకుండానూ ఉండకూడదు. అందుకే భీమ్‌కి లడ్డూ అంటే ఇష్టమని చూపించాం. అలా ‘ఛోటాభీమ్‌’ సిద్ధమయ్యాడు. తర్వాత ఢోలక్‌పూర్‌ అనే ఊహాత్మక గ్రామాన్ని ఎంచుకున్నాం. ఆపైన చుట్కీ, రాజు, కాలియా, జగ్గూ, డోలూ బోలూ పాత్రల్ని జోడించాం. వీరితో చెప్పే కథలన్నీ చాలా సింపుల్‌గా ఉండాలనుకున్నాం. కథల్లో సాహసం, స్నేహం, హాస్యం, గౌరవం, ప్రేమ, ఆప్యాయతల్ని చూపించాం. అప్పటికి ‘పోగో’ ఛానెల్‌ మూతపడే దశలో ఉంది. మేం వెళ్లి కలిస్తే చివరి ప్రయత్నంగా మాకో ఛాన్స్‌ ఇచ్చారు. మేం కూడా అప్పటికి ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నా గుర్తింపు రాలేదు. అందుకే భీమ్‌ ప్రాజెక్టుని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాం. మంచి ప్రాజెక్టు దొరికిందన్న ఆనందంలో స్టాఫ్‌ని కూడా పెంచాలనుకుని 2008లో బేగంపేట్‌లో కొత్త ఆఫీసుని సిద్ధం చేశాం. అప్పటికే మొదటి ఎపిసోడ్‌ని ఛానెల్‌ వాళ్లకి పంపాం. వారం, పదిరోజుల్లో ప్రసారం చేస్తామని చెప్పారు. కొత్త ఆఫీసులోకి మరో నాలుగు రోజుల్లో వెళ్తాం అనగా షార్ట్‌ సర్క్యూట్‌వల్ల ఆఫీసు భవనం కాలిపోతోందని ఓరోజు అర్ధరాత్రి ఫోన్‌ వచ్చింది. వెంటనే వెళ్లాను. కళ్లముందే ఆఫీసు తగలబడుతోంది. ఫైరింజిన్‌ వచ్చి మంటల్ని ఆర్పుతోంది. నా కళ్ల నిండా నీళ్లు. మూడు ఫ్లోర్లలో ఉన్న ఫర్నిచర్‌, ఏసీ, ఇంటీరియర్‌ అంతా బూడిదై కనిపించాయి. నా పని అయిపోయిందనుకున్నాను. అదృష్టం కొద్దీ నాలుగో ఫ్లోర్‌కి మంటలు వెళ్లలేదు. మా డేటాకీ ఏం కాలేదు. నేను మెటీరియల్‌ కొన్న వాళ్లందరి దగ్గరికీ వెళ్లి నా పరిస్థితి చెప్పాను. వాళ్లు నాకు అమ్మిన సామాన్లని ఈసారి అప్పుగా ఇస్తే మూడు నాలుగు నెలల్లో డబ్బు తిరిగి ఇస్తానన్నాను. నా పరిస్థితిని అర్థంచేసుకుని అందరూ అందుకు అంగీకరించారు. మళ్లీ ఆఫీసుని సిద్ధం చేస్తుండగానే ‘ఛోటాభీమ్‌’ టీవీలో ప్రసారమై, మంచి స్పందన వచ్చింది. ఆ టీవీ ఛానెల్‌ వాళ్లు వెంటనే మరో 13 ఎపిసోడ్లు చేయమని పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌ ఇచ్చారు. అలా మళ్లీ కొత్త జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత ఛోటాభీమ్‌ను రూపొందించిన సంస్థగా మాకు గుర్తింపు రావడం మొదలైంది. మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భీమ్‌కి మంచి గుర్తింపు వచ్చింది. భీమ్‌ ప్రాజెక్టు మొదలవ్వక ముందు ఎనిమిదేళ్లలో కనీసం 20 సార్లయినా కంపెనీ మూతపడే దశవరకూ వెళ్లింది. భీమ్‌ వచ్చాక మాత్రం అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. భీమ్‌ తర్వాత కృష్ణుడిమీద తెచ్చిన సిరీస్‌ కూడా హిట్‌ అయింది. లవ్‌కుశ్‌, చోర్‌ పోలీస్‌, అర్జున్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ బాలి, మైటీరాజు, కలారీ కిడ్స్‌, కికో అండ్‌ స్పీడ్‌... ఇలా చేసిన ప్రాజెక్టులన్నీ మాకు పేరుతెచ్చాయి.

 

థీమ్‌ పార్కు లక్ష్యం 
త్వరలో ‘మైటీ లిటిల్‌ భీమ్‌’లో భీమ్‌ని పాపాయిగా చూపిస్తున్నాం. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది. ఛోటాభీమ్‌ మొదటి ప్రాజెక్టు చేస్తున్న సమయంలో మా దగ్గర 40 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు మా ఉద్యోగుల సంఖ్య వెయ్యి దాటింది. ఒక్క హైదరాబాద్‌లోనే 600 మంది పనిచేస్తున్నారు. కోల్‌కతా, ముంబయి, రాజమండ్రిల్లోనూ మాకు యానిమేషన్‌ స్టూడియోలు ఉన్నాయి. ఈ మధ్యనే అమెరికాలోనూ ప్రారంభించాం. నాకు డిస్నీ స్ఫూర్తి. మమ్మల్ని ‘డిస్నీ ఆఫ్‌ ఇండియా’ అంటారు. డిస్నీకి మిక్కీ మౌస్‌లా, ఛోటాభీమ్‌ మా ముఖచిత్రం అయిపోయింది. భీమ్‌తో మేం మర్చెండైజ్‌ వైపూ వెళ్లగలిగాం. ఛోటాభీమ్‌ బ్రాండ్‌ విలువ రూ.700 కోట్లు ఉంటుంది. మరో అయిదేళ్లలో థీమ్‌ పార్కుని మనదేశంలో నెలకొల్పాలన్నది నా కల.

ఇంకొంత

 

దేశంలో 73 శాతం మంది పిల్లలు ఛోటాభీమ్‌ సీరియళ్లని చూస్తారని ఒక సర్వేలో తేలింది. 
* గ్రీన్‌ గోల్డ్‌ సంస్థ మర్చెండైజ్‌, లైసెన్సింగ్‌, రిటైల్‌ స్టోర్స్‌, ఈవెంట్‌్్స, డిజిటల్‌ బిజినెస్‌, సినిమా పంపిణీ విభాగాల్లోనూ ఉంది. 
* అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, వూట్‌లాంటి స్ట్రీమింగ్‌ ఆప్స్‌లోనూ వీరి ప్రాజెక్టులు ప్రసారమవుతున్నాయి. 
* ఛోటాభీమ్‌ అండ్‌ ద కర్స్‌ ఆఫ్‌ దమ్యాన్‌, ఛోటాభీమ్‌ అండ్‌ ద థ్రోన్‌ ఆఫ్‌ బాలి, ఛోటాభీమ్‌ హిమాలయన్‌ అడ్వెంచర్‌ పేరుతో ఇప్పటివరకూ మూడు సినిమాలు వచ్చాయి. ‘చైనాలో ఛోటాభీమ్‌’ అన్న కాన్సెప్ట్‌తో త్రీడీ సినిమా ‘ఛోటాభీమ్‌ కుంగ్‌ఫూ ధమాకా’ తీస్తున్నారు. 2019లో రాబోతున్న ఆ సినిమా చైనాలోనూ విడుదల అవుతుంది.

- రాళ్లపల్లి రాజావలి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.