close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేను తాకానని.. రిజిస్టర్‌ను శుద్ధి చేశారు!

పెనుతుపాన్లకి మహావృక్షాలు కూలొచ్చేమో కానీ గడ్డిపోచకేమీ కాదు. జీవితంలో తుపానులాంటి పరిణామాలనీ అలాగే దాటొచ్చారు కొలకలూరి ఇనాక్‌. గడ్డిపోచలాగే పెనుగాలులకి తలొంచి తప్పించుకుని స్నేహానికి చేయిచాచారు. కూకటివేళ్లతోసహా తనని పెకలించాలనుకున్న చేతుల్ని ఆర్తిగా హత్తుకున్నారు! తనని తక్కువ కులస్థుణ్ణి చేసి ఏడిపించేవాళ్లు... ఓ చారిత్రక పరిణామం చేతిలో పావులు మాత్రమేనని నమ్మారు. ఆ నమ్మకాన్నే కన్నీటి సిరాతో కథలుగా చెప్పారు! ఆ సిరా వెనక ఏముందో ఇలా చెప్పుకొచ్చారు... 
ట్టిలో ఆడుకుంటున్నవాణ్ణల్లా రెక్కలు పట్టుకుని తీసుకొచ్చి మరీ నన్ను ఆ కొత్త వ్యక్తి ముందు నిలబెట్టారు. ఆయన్ని చూపించి ‘దండం దొరా... అని చెప్పరా!’ అన్నాడు మానాన్న. దండం ఎలా పెట్టాలో కూడా చూపించాడు. ఆ వచ్చిన వ్యక్తి వెళ్లిపోయాక నాన్న ‘ఆయన మన స్వామి. ఆయన పొలంలో మనం జీతగాళ్లం. దొర వచ్చినప్పుడు మంచంపైన కూర్చోకూడదు. ఎదుటపడ్డా పక్కకు జరగాలి. ఆయన్ని ముట్టుకోకూడదు. దూరంగా నిల్చునే మాట్లాడాలి!’ అని చెప్పాడు. ఊహ తెలిసి నేను నేర్చుకున్న మొదటి ‘సామాజిక’ పాఠం అదే. వయసు పెరిగేకొద్దీ ఇంకొన్ని నియమాలనీ నేర్చుకున్నా. మా ఊరి చివర్న మా పల్లె ఉంటే... మరో చివర చింతతోపు ఉండేది. ఆ తోపులోనే ఆడుకుంటూ ఉండేవాళ్లం. అక్కడి నుంచి ఊరి ప్రెసిడెంటుగారుండే వీధి మార్గంలో వస్తే పది అడుగుల్లో మా ఇళ్లకు చేరుకోవచ్చు. కానీ ఆ వీధిలోకి నేను అడుగుపెట్టకూడదని చెప్పారు. నడిస్తే ఒళ్లు చీరేస్తారని భయపెట్టారు. ఓరోజు ఆటల్లో పడి మరచిపోయి అటువైపుగా వెళ్లిపోయా! వెళితే అక్కడే కూర్చుని ఉన్నారు ప్రెసిడెంటు. ‘ఎవడ్రా...’ అన్నాడు

గుడ్లురుముతూ. ఆయన అనుచరులు నా రెక్కలు లాగి పట్టుకుని ‘ఊరిచివర బుడ్డోడండీ!’ అన్నారు. ‘ఇంకొక్కసారి ఇలా వస్తే కొంకలిరగ్గొడతా!’ అన్నాడు. వాళ్లు గట్టిగా పట్టుకోవడంతో రెక్కలు బాగా నొప్పి పుట్టి ఏడుస్తూ ఇంటికెళ్లాను. అలా ఊర్లోకి వెళ్లడం నాకు తెలియకుండా చేసినదైతే... తెలిసి చేసిన ‘అపచారం’ ఇంకొకటుంది. మా ఊర్లో వీధి పాఠశాలని ‘సత్రం బడి’ అనేవారు. అక్కడి అయ్యోరు దీర్ఘాలు తీస్తూ ‘క కాకి దీర్ఘమిస్తే కా...’ అని చెబుతుంటే వినడం సరదాగా ఉండేది. ఓసారి రహస్యంగా బడి చివర్న నిల్చుని వింటూ ఆయన కంటపడ్డా. ‘నువ్వెందుకు వచ్చావురా...!’ అంటూ కొట్టబోతే పరుగెత్తి వచ్చేశాను. అప్పట్నుంచీ రోజూ అలా చాటుగా పాఠాలు వినడం, ఆయన కొట్టబోతే పరుగెత్తుకు రావడం ఓ ఆటలా అనిపించేది. అప్పట్లో సరదాగానే ఉన్నా దాని వెనకున్న విషాదం, వివక్ష తర్వాత్తర్వాతే అర్థమయ్యాయి!

పేరు అలా వచ్చింది... 
అప్పుడే మా ఊరికి కొత్తగా ఏబీఎం క్రైస్తవ బడి వస్తే, నన్ను అందులో చేర్చారు.  అక్కడ చేర్చేటప్పుడు నా పేరేమిటో ఎవరికీ తెలియలేదు! నాకు ‘ఇనాక్‌’ అనే పేరుని గుంటూరు నుంచి వచ్చిన క్రైస్తవ మిషనరీ ఎవరో పెట్టారు. కానీ అది నోరు తిరక్క నూకలయ్యా, ఎకోనా అనే పిలుస్తుండేవారు. నన్ను బడిలో చేర్చడానికొచ్చిన అయ్యవారు ఆ రెండు పేర్లకి దగ్గరగా ఉన్న బైబిల్‌ పదం ‘ఇనాక్‌’ అన్నదే నా పేరై ఉంటుందని ఊహించి అటెండెన్స్‌లో రాశారు. నాకూ పదో తరగతి దాకా ఆ పేరు స్పెల్లింగ్‌ సరిగ్గా రాయడం రాదు! అలా చేరిన నేను మూడో తరగతిలోనే బడి మానేయాల్సి వచ్చింది. మా రైతు దగ్గర నాన్నతోపాటూ జీతగాడిగా చేరాల్సి వచ్చింది. ఆ రోజు నుంచీ పశువుల్ని కాసుకురావడం, పేడ తీయటం, వాటిని కడగడం, కుడితి పెట్టడం ఇవే నా పనులయ్యాయి. అలాగే సాగితే నా జీవితం ఏమయ్యుండేదో తెలియదు కానీ... మా పల్లెకొచ్చిన దేవదాస్‌ మాస్టారు నా గీత మార్చాడు. నాలాగా జీతాలకెళుతున్న పిల్లలకి సాయంత్రంపూట ఆయనే పాఠాలు చెప్పేవాడు. నా చేత ఎంట్రన్స్‌ రాయించి నేరుగా ఫస్ట్‌ఫారమ్‌లో చేర్చేశాడు. జీతగాడిగా ఉండిపోవాల్సిన నా జీవితంలో చదువుల దీపం వెలిగించింది ఆయనే. కానీ మూడేళ్లకి మళ్లీ ఆ దీపం కొడిగట్టే పరిస్థితొచ్చింది. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. అమ్మ ఆ బాధతో మంచానపడడంతో... పట్టించుకునేవాళ్లు లేక నేనూ, మా చెల్లెలూ, తమ్ముడూ దిక్కులేనివాళ్లమైపోయాం.

గట్టి మనిషే... 
మా అమ్మవాళ్లు 14 మంది సంతానం. తనే చివరిపిల్ల కావడంతో కాస్త గారాబంగానే పెంచారు. తల్లిని కోల్పోయి సవతి తల్లి ఆగడాలు భరించలేక ఇల్లొదిలి... మేనమామల పంచన చేరిన నాన్నని అమ్మమ్మవాళ్లు ఇల్లరికం తెచ్చుకున్నారు. ఏ ఆస్తీలేకుండా అనాథగా వచ్చినవాడు కాబట్టి... ఆయన్నీ, ఆయనకు పుట్టిన సంతానమైన మమ్మల్నీ మా బంధువులందరూ చిన్నచూపు చూసేవాళ్లు. ‘అలగావోడు’ అనే పిలిచేవాళ్లు నన్ను. ఓ రకంగా మేం అగ్రకులాల వాళ్ల నుంచే కాకుండా మావాళ్ల నుంచీ తీవ్రమైన వివక్ష ఎదుర్కొనేవాళ్లం. నాన్న అవన్నీ పట్టించుకోడు. వేకువన మా ‘ఆసామి’ 
పొలానికెళ్లి... రోజంతా కష్టపడటం తప్ప ఆయనకేమీ పట్టదు. కానీ అమ్మ అలాకాదు. తిరగబడేది. తిట్టేదీ కొట్టేదీ కూడా. ఒకస్థాయిలో బంధువుల నుంచి దూరంగా ఉండాలనుకుని పల్లెకి దూరంగా సర్కారువాళ్లు చూపిన స్థలంలో ఇల్లుకట్టించింది. నాన్న జీతానికి పోతే వచ్చే వడ్లకి తోడు పశువుల్ని పెంచి పాలమ్మీ, కోళ్లని పెంచీ డబ్బు పోగేసేది. ఆ డబ్బుతోనే ఎకరం పొలం కొంది! అలా అమ్మవల్ల తొలిసారి నాన్న జీవితంలో ఆస్తిపరుడయ్యాడు. కానీ అది జరిగిన ఏడాదిన్నరకే అనారోగ్యంతో చనిపోయాడు. ధైర్యంగా ఉండాల్సిన అమ్మ కుంగిపోయింది. పశువులూ, కోళ్లన్నింటినీ అమ్మి, పొలం కౌలుకిచ్చి ఇంట్లోనే కూర్చుండిపోయింది. నేను చదువు మానేసే పరిస్థితిలో పడ్డాను. కానీ మా అదృష్టం బావుందేమో సర్కారు ఎస్సీ హాస్టళ్లని తెరిచింది. మా మేష్టార్లతో మాట్లాడి తమ్ముణ్ణీ, చెల్లెల్నీ చేర్చాను. నేనూ హాస్టల్లో చేరాను. పదో తరగతి గట్టెక్కాను.

‘పులుల బోను’లోకి... 
టెన్త్‌దాకా క్రైస్తవ స్కూలు, ఇంటర్‌లో గుంటూరు ఏసీ కాలేజీలో చదవడం వల్ల నేనెక్కడా పెద్దగా వివక్షను ఎదుర్కోలేదు... మా ఊరి నుంచి గుంటూరుకి వెళ్లే రైల్లో తప్ప. రైల్లో సీటుదొరికిందికదాని కూర్చుంటే మా గ్రామంలోని అగ్రకులస్థులు ఒప్పుకునేవారు కాదు. నాకన్నా చిన్నపిల్లలైనా సరే నన్ను ‘రేయ్‌ లేచి... అటుపోయి నిల్చో!’ అనేవారు. నోరుమూసుకుని వెళ్లేవాణ్ణి. వాళ్ల కంటపడటం ఎందుకని రైలెక్కగానే మరుగుదొడ్డి పక్కనున్న ఖాళీ స్థలంలోకెళ్లి నిల్చునేవాణ్ణి. కంపే... కానీ ఏం చేస్తాను! వీటన్నింటికీ పరాకాష్ట అనిపించే అనుభవాలు వాల్తేరు ఆంధ్రవిశ్వవిద్యాలయంలోఎదురయ్యాయి. అది నాకో పులిబోనులాగే అనిపించింది. బీఏ ఆనర్స్‌ క్లాసులోకి వెళ్లిన తొలిరోజే మొదటి బెంచీలో కూర్చున్నా. మిగతా విద్యార్థులొచ్చి ‘ఇంకెప్పుడూ ఇక్కడ కూర్చోకు. వెనక బెంచీలో కూర్చో పో..!’ అని కసురుకున్నారు. రోజూ మాస్టారు రాకముందే నా సహాధ్యాయి ఒకడు చాక్‌పీస్‌, డస్టర్‌, అటెండెన్స్‌ రిజిస్టర్‌ తెచ్చేవాడు. ఓసారి అతను రాకపోతే నేను వెళ్లి తెచ్చా. అది తెలుసుకుని మాస్టారు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఆ రోజంతా ఆయన ఆ మూడింటినీ తాకకుండానే పాఠం చెప్పాడు! తర్వాతి రోజు అటెండెన్స్‌పైన ఉన్న షీటు తీయించి పసుపు నీళ్లు చల్లి... శుద్ధిచేశాకే ముట్టుకున్నారు. మూడేళ్లూ అలాగే గడిచాయి. నన్ను శత్రువులా చూసే కొందరు విద్యార్థులు ఆనర్స్‌ చివరి పరీక్ష రాయనీయకుండా చేయడానికి... మా అమ్మ చనిపోయినట్టు టెలిగ్రాము కూడా ఇప్పించారు! అది బోగస్‌ టెలిగ్రామ్‌ అని చివరి నిమిషంలో తెలుసుకుని ఆగిపోయా. మూడేళ్లపాటు ఇలాంటివెన్నో జరిగాయి. ఒకస్థాయిలో నా లోలోపలి మనిషి తిరగబడమనేవాడు. పిడికిలి బిగించి కొట్టమనేవాడు. కానీ ఏదో తెలియని ఫీలింగ్‌ నన్ను ఆపేది. దాన్ని పిరికితనమని మొదట్లో అనుకునేవాణ్ని. హింసవైపు మొగ్గని హృదయ సంస్కారమని తర్వాతెప్పుడో అర్థమైంది.

అది ఆగలేదు... 
బీఏ ఆనర్స్‌ తర్వాత గుంటూరు కాలేజీలో లెక్చరర్‌గా చేరాను. తర్వాత అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీలో పనిచేశాను. లెక్చరర్‌ను అయినా కులవివక్ష వేధింపులు మాత్రం అలాగే ఉండేవి. ఉస్మానియాలో నేను పీహెచ్‌డీ చేయడానికీ పదేళ్లు అడ్డుపడ్డారు. లెక్చరర్లని అడిగితే హెచ్‌ఓడీని అడగమనేవారు. ఆయన్ని అడిగితే ‘వాళ్లు చేర్చుకుంటానంటే నాదేముంది, నోటిఫికేషన్‌ రానీయ్‌’ అనేవారు. కానీ నోటిఫికేషన్‌ వచ్చిన ప్రతిసారీ నాకు మొండిచేయే ఎదురైంది. చివరికి, ఎస్వీ వర్సిటీ వీసీ జీఎస్‌ రెడ్డి దయతలచి అనుమతిచ్చారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి అదే యూనివర్సిటీకి వీసీగా చేశాను. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీకి డీన్‌గా రిటైరయ్యాను. ఇన్ని సాధించినా అడుగడుగునా ఏదో రూపంలో వివక్ష తప్పలేదు.

వీసీగా ఉన్నప్పుడు కొందరు స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకులు అందరి ముందూ కులం పేరుతోనే తిట్టారు! సాహితీ లోకం కూడా ఇందుకు అతీతం కాదు. అయితే అందుకు నేనెప్పుడూ కుంగిపోలేదు. చరిత్ర, సామాజిక పరిణామాలేవీ తెలియనివాళ్ల అజ్ఞానాన్నే ప్రేమగా ప్రశ్నిస్తూ సాహిత్య సృజనకి పూనుకున్నాను. ఆ ప్రేమని నాలో పరిపూర్ణంగా నింపిన వ్యక్తి నా భార్య భాగీరథి.

అంతటి విషాదం... 
నేను జీవితంలో నిలదొక్కుకోవాలని అమ్మ కలలుకంటే... నేను గొప్ప వ్యక్తినవుతానని నమ్మి, నన్నూ నమ్మించింది నా భార్యే. 
గుంటూరులో లెక్చరర్‌గా ఉన్నప్పుడు మహిళా స్త్రీ శిశుసంక్షేమశాఖ కోసం లెక్చరివ్వడానికి వెళ్లినప్పుడు ఆమె నాకు పరిచయమైంది. ఆమె అక్కడ అధికారిగా చేస్తుండేది. మొదటి రోజే మొదలైన స్నేహం... ఐదునెలలు తిరక్కుండానే పెళ్లిదాకా వచ్చింది. నేను వెళ్లి వాళ్ల నాన్నతో మాట్లాడాను. కులాలు వేరుకావడంతో ఆయన ఒప్పుకోలేదు. ‘నువ్వు ఈ పెళ్లితో గడపదాటితే జన్మలో నీ మొహం చూడం’ అన్నాడు కూతురితో. అయినా ఆమె నా వెంటే వచ్చింది. మా పెళ్లి మా అమ్మకీ ఇష్టం లేదు. అనంతపురంలోనే కాపురం పెట్టాం. ఇద్దరం ఉన్నతోద్యోగులం కాబట్టి ఆర్థిక ఇబ్బందులు లేవు కానీ... తన తొలి ప్రసవం అప్పుడు అటు వాళ్లమ్మకానీ, ఇటు మా అమ్మకానీ రాలేదు! బిడ్డపుట్టాక పలకరించేందుకైనా తన తల్లి రాకపోతే... లోలోపల ఎంతగా కుమిలిపోయిందో తెలియదుకానీ నాతో ఎప్పుడూ చెప్పుకోలేదు. అడిగితే ‘నువ్వు నా తల్లికన్నా ప్రేమగా చూస్తున్నావ్‌... అంతకంటే ఏం కావాలి!’ అనేది. వాళ్ళ అమ్మని తర్వాతెప్పుడూ తను చూడనేలేదు. ఆమె చనిపోయిన నెలరోజులకికానీ ఆ విషయం మాకు తెలియనివ్వలేదు! ఓ కూతురిగా ఆమెకి అంతకంటే పెద్ద విషాదం ఏముంటుంది?! ఆ బాధని గుండెల్లో దాచుకునే నాకూ, పిల్లలకీ ప్రేమ పంచింది. 
ఆ ప్రేమని నా కలంలో సిరాగా మిగిల్చి... పదేళ్లకిందట హృద్రోగంతో కనుమూసింది!

ఫొటోలు: యాజ్ఞవల్క్యుడు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు...

‘ఊరబావి’, ‘ఆకలి’ ‘కులవృత్తి’, ‘అనంత’ జీవనం వంటి గొప్ప సృజన సాహిత్యం అందించిన ఇనాక్‌ది వ్యాసాల్లోనూ అందె వేసిన చేయి! ఆధునిక సాహిత్యానికి సంబంధించి కథలూ, కవితల్ని కాకుండా వ్యాసాలనే ఎంచుకుని పీహెచ్‌డీ చేశారాయన. ‘తెలుగు వ్యాస పరిణామం’ అనే ఆ పరిశోధనని ఓ రిఫరెన్స్‌ బుక్‌గా భావిస్తుంటారు. ఆయన రాసిన ‘తెలుగు కావ్యాలపైన జానపదుల విమర్శ’కీ మంచి పేరుంది. ఆయన ‘విమర్శిని’ వ్యాసం సంపుటిలో సాహిత్య విమర్శకి సంబంధించి కొత్త పద్ధతుల్ని ప్రతిపాదించబట్టే ఈ ఏడాదిగ్గాను కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఇనాక్‌ తన సృజన సాహిత్యానికి జ్ఞానపీఠ సంస్థ అందించే మూర్తిదేవి అవార్డూ, వ్యాసాలకి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డూ, మొత్తం సాహిత్య సేవలగ్గానూ ‘పద్మశ్రీ’ అందుకోవడం విశేషం!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.