close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బట్టీ పట్టడంలో నేను ఫస్ట్‌..!

అందం, అభినయం, సౌకుమార్యం కలబోస్తే... కియారా అడ్వాణీ. అందుకే అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో అవకాశాలు కొట్టేస్తోంది. గతేడాది ‘భరత్‌ అనే నేను’లో వసుమతిగా నటించి తన అందాలతో తెలుగు కుర్రాళ్ల మతులు పోగొట్టిన కియారా... ఇప్పుడు ‘వినయ విధేయ రామ’లో సీతగా తన నటనతోనూ ఆకట్టుకుంది. కళ్లతోనే ఎన్నో భావాల్ని పలికిస్తూ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొంటున్న కియారా... తన చదువు, కుటుంబం, కెరీర్‌ గురించి ఏం చెబుతోందంటే...

పుట్టి పెరిగింది ముంబయిలో. అమ్మ జెన్వీవ్‌ జఫ్రీ ఒక ప్లేస్కూల్‌ని నడుపుతోంది. నాన్న జగ్దీప్‌ అడ్వాణీ బిజినెస్‌మేన్‌. నాకో తమ్ముడు... పేరు మిషాల్‌. నాకంటే నాలుగేళ్లు చిన్న. అమెరికాలో ఇంజినీరింగ్‌ చేసి తన అభీష్టం మేరకు షెఫ్‌గా స్థిరపడ్డాడు. ఇంట్లో అందరం చాలా క్లోజ్‌గా ఉంటాం. ఎవరి దగ్గరా ఏ విషయమూ దాచే అవసరమే ఉండదు. స్కూల్లో ఉన్నపుడు నేను ఎక్కువగా బట్టీపట్టి చదివేసేదాన్ని. బట్టీ పట్టడంలో క్లాసులో నన్ను మించినవాళ్లు లేరని చెప్పాలి. మంచి ఫొటోగ్రఫిక్‌ మెమొరీ ఉండేది. జవాబు చెప్పడమే కాదు, అది ఏ పేజీలో ఉండేదో కూడా గుర్తుపెట్టుకునేదాన్ని. ఇప్పుడు సినిమా డైలాగులు చెప్పడానికి అది బాగా ఉపయోగపడుతోంది. ఇంటర్మీడియెట్‌లో సైకాలజీ, సోషియాలజీ చదువుకున్నాను. అవి నాకు వ్యక్తిగత, వృత్తి జీవితంలో బాగా సాయపడుతున్నాయి. జైహింద్‌ కాలేజీ నుంచి మాస్‌ మీడియా, అడ్వర్టైజింగ్‌లో డిగ్రీ చేశాను. డిగ్రీ పూర్తిచేశాక ఉదయంపూట అమ్మకి స్కూల్‌ నిర్వహణలో సాయపడుతూనే సినిమా ప్రయత్నాలు కొనసాగించాను. నాకూ పిల్లలంటే ఇష్టం. భవిష్యత్తులో పిల్లలకు దగ్గరగా ఉండే ఏదైనా రంగంలోకి వెళ్తానేమో. 
చాలా మతాలూ, ప్రాంతాలూ, దేశాల సంస్కృతులు మా కుటుంబంలో ఉంటాయి. అమ్మమ్మది స్పానిష్‌-పోర్చుగీసు మూలాలున్న క్రిస్టియన్‌ కుటుంబం. తాత లఖ్‌నవూకి చెందిన ముస్లిం. నాన్నవాళ్లది సింధీ ప్రాంతానికి చెందిన హిందూ కుటుంబం. కుటుంబ మూలాల్ని తెలుసుకోవడం గురించి ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. అలా నా మూలాలు విదేశాల్లోనూ ఉండటం చూస్తే గర్వంగా అనిపిస్తుంది. ఇలాంటి భిన్న సంస్కృతుల కుటుంబంలో పుట్టి పెరగడంవల్ల ప్రపంచాన్ని చూసే దృష్టి భిన్నంగా ఉంటుంది. అమ్మా, నాన్నా స్కూల్‌ రోజుల నుంచీ స్నేహితులు. అదే స్నేహాన్ని కొనసాగించి పెళ్లిచేసుకున్నారు.  నేను చిన్నప్పట్నుంచీ అమ్మా, అమ్మమ్మలతో కలిసి చర్చికి వెళ్లేదాన్ని. అమ్మమ్మ బైబిలులోని విషయాల్ని చదివి వివరించేది. మా ఇంట్లో అన్ని మతాల పండగలూ చేసుకుంటాం. బంధువులతో కలిసి ఏడాదిలో ఒక్కసారైనా విహారయాత్రకు వెళ్తాం.

సినిమా ఛాన్స్‌... 
నటిని అవ్వాలని చిన్నప్పట్నుంచీ ఉండేది. బాలీవుడ్‌ దిగ్గజాలు అశోక్‌ కుమార్‌, సయీద్‌ జఫ్రీ కుటుంబాల నుంచి వచ్చినా... నేను సినిమా కుటుంబం నుంచి వచ్చినట్టు చెప్పను. ఎందుకంటే వాళ్లు నాకంటే రెండు తరాలు ముందున్న నటులు. స్కూల్‌, కాలేజీ రోజుల్లో నాటకాలు ఎక్కువగా వేసేదాన్ని. భరతనాట్యం, కథక్‌ నేర్చుకున్నాను. మాధురిదీక్షిత్‌, శ్రీదేవి, కాజోల్‌, కరీనాలను ఆరాధిస్తూ పెరిగాను. అమ్మానాన్నలతో సినిమా విషయాన్ని చెబితే, ముందు డిగ్రీ పూర్తిచేయి, తర్వాత నీకు నచ్చిన రంగంలోకి వెళ్లు అన్నారు. వాళ్లు చెప్పినట్టే డిగ్రీ పూర్తిచేశాను. ఆ తర్వాత రోషన్‌ తనేజా, అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ స్కూల్స్‌కి వెళ్లి నటనలో పార్ట్‌టైమ్‌ కోర్సులు చేశాను. ‘ఫగ్లీ’తో మొదటి అవకాశం వచ్చింది. నేను ఆ సినిమాకి ఆడిషన్‌ ఇచ్చిన తర్వాత కాసేపు వేచి ఉండమని చెప్పి నిర్మాతకు ఆ వీడియో పంపారు. ఆయన ఓకే చెప్పడంతో అప్పటికప్పుడు ఆ సినిమాకి సంతకం చేశాను. సినిమాలకు ముందు ఫ్యాషన్‌ షోలలో క్యాట్‌ వాక్‌ చేయలేదు, వాణిజ్య ప్రకటనలకీ పని చేయలేదు. కెమెరా ముందు నిలబడటం సినిమాతోనే మొదలైంది. దాంతో మొదటిరోజు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ తర్వాత అంతా అలవాటైపోయింది. ఆ సినిమా టైటిల్‌ సాంగ్‌లో సల్మాన్‌ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ కనిపిస్తారు. వారితో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవం. నా అసలు పేరు ఆలియా. అప్పటికే ఆలియా భట్‌ సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అందుకే నా పేరు మార్చుకోమని సలహా ఇచ్చారు సల్మాన్‌. అలా ఆలియాని కాస్తా కియారా అయ్యాను. అయితే ఈ పేరు సినిమాల వరకే పరిమతం. ‘కష్టపడి పనిచేయి. నీ పనినే మాట్లాడనివ్వు’ అని సల్మాన్‌, ‘పంక్చువల్‌గా ఉండాలి’ అని అక్షయ్‌ ఇచ్చిన సూచనల్ని పాటిస్తున్నాను. ఇప్పటికీ ఏదైనా సలహా కోసం ఒక మెసేజ్‌ పెడితే వెంటనే స్పందిస్తారు సల్మాన్‌.

మొదటి సినిమా ‘ఫగ్లీ’ అనుకున్నంతంగా ఆడలేదు. రెండో సినిమా ‘ఎం.ఎస్‌.ధోనీ’. దీనిమీద నేను పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ మంచి గుర్తింపు తెచ్చింది. ధోనీ భార్య సాక్షిని షూటింగ్‌ సమయంలో కొన్నిసార్లు కలిశాను. తెరమీద నన్ను చూసిన సాక్షి ‘నా మేనరిజంని బాగా పట్టాశావే’ అని మెచ్చుకుంది. నా నటన బాగుందంటూ తన ఫ్రెండ్స్‌ పంపిన మెసేజ్‌ల స్క్రీన్‌షాట్లనీ పంపింది. ఆ సినిమా చూశాక దర్శకుడు రాజూ హిరాణీ తన ఆఫీసుకి పిలిచి అభినందించారు. కెరీర్‌ ప్రారంభంలో ‘ధోనీ’లాంటి సినిమా దొరకడం నిజంగా నా అదృష్టం. ఆ సినిమా తెలుగు, తమిళం, మరాఠీ భాషల్లోకీ అనువాదమైంది. అలా ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా నాకు గుర్తింపు వచ్చింది.

రెండుచోట్లా ఉంటాను... 
బాలీవుడ్‌లో నటిగా కెరీర్‌ ప్రారంభించాక మహేష్‌బాబు భార్య నమ్రతా పరిచయం అయ్యారు. ‘భరత్‌ అనే నేను’లోని వసుమతి క్యారెక్టర్‌కి నేను సరిపోతానని భావించి ఆ సినిమా దర్శకుడు కొరటాల శివగారికి నా గురించి చెప్పారు. శివగారు ముంబయి వచ్చి నన్ను చూసి, కథ వినిపించారు. వాళ్లకి నేను నచ్చాను. నాకు కథ నచ్చింది. అలా దక్షిణాదిలో కనిపించే అవకాశం వచ్చింది. అన్నింటికంటే సూపర్‌స్టార్‌ మహేష్‌తో సినిమా అన్నాక ఎలా కాదనగలను! మహేష్‌గారి సినిమాలతోపాటు శివగారి సినిమాల్నీ అదివరకు చూడటంతో ప్రాజెక్టుమీద నాకు పూర్తి నమ్మకంగా ఉండేది. ఆ ప్రాజెక్టు ఒప్పుకున్నాక చాలా తెలుగు సినిమాలు చూశాను. వాటిలో నచ్చిన పదాల్ని పలకడం ప్రాక్టీసు చేసేదాన్ని. డైలాగులు కూడా ముందే తెప్పించుకుని ప్రాక్టీసుచేసేదాన్ని. వీటన్నింటివల్ల సెట్‌లో ఎలాంటి ఇబ్బందీ పడలేదు. ప్రశాంతంగా పాత్రమీద దృష్టిపెట్టే అవకాశం వచ్చింది. తానో సూపర్‌స్టార్‌ అన్న ఫీలింగ్‌ మహేష్‌లో అస్సలు కనిపించదు. టీమ్‌లో అందరితో కలిసిపోతారు. నవ్వుతూ జోకులు పేల్చుతూ ఉంటారు. ఆ సినిమా రిలీజవ్వకముందే రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’లో అవకాశం వచ్చింది. నా కెరీర్‌లో ఇదే పెద్ద కమర్షియల్‌ సినిమా. ఇది కూడా నాకు నేర్చుకోవడానికి మంచి అవకాశం అని చెప్పాలి. ముఖ్యంగా రామ్‌చరణ్‌ సింప్లిసిటీ నాకు నచ్చుతుంది. అభిమానులు ఎప్పుడు పలకరించినా ఎంతో ఓపిగ్గా బదులిస్తారు. ఈ సినిమా సమయంలో ఉపాసనతోనూ పరిచయమైంది. నమ్రతా, ఉపాసన నాకూ షూటింగ్‌ సమయంలో కొన్నిసార్లు భోజనం పంపించారు. ఇప్పటివరకూ అయితే ఎలాంటి ఇబ్బందీ లేకుండా బాలీవుడ్‌లో, టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ వచ్చాను. దక్షిణాది దర్శకుల కథలు వింటున్నాను. ఇకముందు కూడా అక్కడా, ఇక్కడా సినిమాలు చేయాలనేది నా అభిలాష. కెరీర్‌ ఆరంభంలోనే అటు ఉత్తరాదిలో, ఇటు దక్షిణాదిలో అభిమానుల్ని సంపాదించుకోవడం నటిగా నాకు దక్కిన అదృష్టమనే చెప్పాలి.

హిందీ ‘అర్జున్‌రెడ్డి’లో... 
డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పైన ‘లస్ట్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌లో చేశాను. ‘లైంగిక స్వేచ్ఛ’ అంశంమీద తీసిన సిరీస్‌ అది. కరణ్‌ జోహార్‌ దర్శకుడు. మొదట ఆ కథ నాకు వినిపించిన కరణ్‌...ఏ విషయమూ ఆలోచించుకుని చెప్పమన్నారు. మీ దర్శకత్వంలో చేయడానికి ఆలోచించేదేముంది అని వెంటనే అంగీకరించాను. ఇప్పుడిప్పుడే మళ్లీ వెబ్‌ సిరీస్‌లవైపు వెళ్లనేమో. గతడాది యో యో హనీ సింగ్‌ తీసుకువచ్చిన ప్రైవేట్‌ సాంగ్‌ ‘ఊర్వశి’లో షాహిద్‌ కపూర్‌తో కలిసి కనిపించాను. అది మంచి హిట్‌ అయింది. యూట్యూబ్‌ వీక్షకులు గతేడాది బాగా చూసిన పాటల్లో అదొకటి. ప్రస్తుతం హిందీలో కబీర్‌ సింగ్‌(అర్జున్‌రెడ్డి రీమేక్‌)లో షాహిద్‌ పక్కనే హీరోయిన్‌గా చేస్తున్నాను. అక్షయ్‌ కుమార్‌తో మల్టీస్టారర్‌ ‘గుడ్‌న్యూస్‌’ చేస్తున్నాను. ‘కళంక్‌’ సినిమాలో ఓ ఐటమ్‌ సాంగ్‌ చేస్తున్నాను. ఓ పంజాబీ సినిమాలో నటిస్తున్నాను. తెలుగులో కథలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే మరో సినిమాలో కనిపిస్తా!

చేపల పులుసు ఇష్టం

సినిమాలతో బిజీ అయిపోయాను. విశ్రాంతి దొరకడంలేదు. బిజీగా ఉన్నా, ఖాళీ దొరికినా ఆరోజు జిమ్‌కి వెళ్లనిదే నా దినచర్య పూర్తి కాదు. ఫిట్‌నెస్‌ నాకు చాలా ముఖ్యం. రెగ్యులర్‌గా కిక్‌ బాక్సింగ్‌ చేస్తాను. యోగా, డ్యాన్స్‌, స్విమ్మింగ్‌ చేస్తాను. టైమ్‌ దొరికితే ఇంట్లోనే ఉంటాను. నాకు పెయింటింగ్‌ హాబీ. బొమ్మలు గీస్తుంటాను. అమ్మకి ఇంటి పనుల్లో సాయం చేస్తుంటాను. టీవీ చూస్తూ అమ్మచేతి వంటలు తింటాను. బాగా నిద్రపోతాను. మా ఫ్రెండ్స్‌ ఎక్కడైనా కలుద్దాం అని అడిగితే, అంతా కలిసి ఇంటికి వచ్చేయండి అంటాను. వాళ్లేమో బయటకి వెళ్దాం అంటారు. బయటకి వెళ్తే ఎక్కువగా ఆర్గానిక్‌ కెఫేలకే వెళ్లడానికి చూస్తాను. లేదంటే షాపింగ్‌ చేస్తాను. ఇంకా ఎక్కువ గ్యాప్‌ దొరికితే విహారయాత్రలకూ వెళ్తాను. 

* చాలా కొద్దిమంది మాత్రమే తమ కలల్ని నిజం చేసుకుంటారు. నేను ఆ జాబితాలో ఉండటం నిజంగా నా అదృష్టం. నాటకాలూ, డ్యాన్స్‌, వినోదం... ఇవన్నీ నాకు ఇష్టమైన అంశాలు. నేను ప్రస్తుతం అందులోనే బిజీగా ఉన్నాను.  కష్టపడి పనిచేస్తున్నాను, నా పనిని ఎంజాయ్‌ చేస్తున్నాను. ఇంతకంటే ఇంకేం కావాలి.  
* నేను పనిచేయాలనుకుంటున్న దర్శకుల ఫొటోల్ని ఒక కప్‌బోర్డులో పెట్టుకోవడం నాకు అలవాటు. ఉత్తరాదితోపాటు, దక్షిణాది దర్శకుల ఫొటోలూ అందులో ఉంటాయి. రాజమౌళి, ఇంతియాజ్‌ అలీ, రాజూ హిరాణీ, జోయా అక్తర్‌ ఆ లిస్టు చాలా పెద్దగా ఉంటుంది.  
* దాదాపు అన్ని రకాల వంటలూ రుచి చూస్తా. ముంబయిలో సీ ఫుడ్‌ బాగా దొరుకుతుంది. తెలుగు సినిమాల షూటింగ్‌ సమయంలో పెట్టిన చేపల పులుసు రుచి చూశా. బాగా నచ్చింది. ఇప్పుడది కనిపిస్తే ఆ పూట ఫుల్‌గా లాగించేస్తాను. గుడ్డుతో చేసిన వంటలు మాత్రం నాకు నచ్చవు. 
*  చేసుకోబోయేవాడు... అందరిలో సరదాగా కలిసిపోవాలి.  మంచి స్టయిల్‌ తెలిసి ఉండాలి. కుటుంబానికి ప్రాధాన్యమిస్తూనే తన ఎదుగుదల కోసం కష్టపడి పనిచేసే వ్యక్తి అవ్వాలి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.