close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రతన్‌ టాటా థ్యాంక్స్‌ చెప్పారు!

సాంకేతికతకూ, తెలుగువాళ్లకీ ఒక ప్రత్యేక బంధం ఉంది. సిలికాన్‌ వ్యాలీ వెళ్లినా, సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాలో చూసినా మనవాళ్ల ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది. ఐటీ విభాగంలో జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగువారి పేరుని నిలబెట్టిన వ్యక్తుల్లో వి.రాజన్న ఒకరు. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌లో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, హైదరాబాద్‌ ప్రాంతీయ విభాగం అధిపతిగా ఉన్న రాజన్న స్ఫూర్తిదాయక ప్రయాణం ఆయన మాటల్లో.....

నిట్‌ వరంగల్‌ నుంచి 1990లో ఎం.టెక్‌.(కంప్యూటర్స్‌) పూర్తిచేశాను. తర్వాత పీహెచ్‌డీ చేయాలన్నది నా ఆలోచన. అప్పుడు నా ఫ్రెండ్స్‌ చాలామంది టీసీఎస్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ‘చేరుతామా లేదా అన్నది తర్వాత ముందయితే ఓ ప్రయత్నం చేద్దాం’ అని దరఖాస్తు పెట్టాను. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తర్వాత టీసీఎస్‌ నుంచి పిలుపు వచ్చింది. సాధారణ ఉద్యోగం వస్తే చేరేవాణ్నో లేదో తెలీదు కానీ, పుణెలోని ‘టాటా రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిజైన్‌ సెంటర్‌(టీఆర్‌డీడీసీ)’లో పనిచేసేందుకు ఎంపికయ్యానని చెప్పారు. చాలా నాణ్యమైన, సరికొత్త పరిశోధనలు జరుగుతాయక్కడ. ఎం.టెక్‌, పీహెచ్‌డీ చేసినవాళ్లకే అవకాశం వస్తుంది. వారిలోనూ చాలా కొద్దిమందికి మాత్రమే! మా ప్రొఫెసర్ల సూచనతో అందులో చేరిపోయాను. టీఆర్‌డీడీసీలో ప్రొఫెసర్‌ నూరి, పవన్‌ కుమార్‌ లాంటి గొప్ప కంప్యూటర్‌ సైంటిస్టులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ని మిషన్‌ లాంగ్వేజ్‌(కోడ్‌)గా మార్చే కంపైలర్‌ విభాగంలో పనిచేశాను. చేరిన రెండేళ్లకు అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే టాండమ్‌ కంప్యూటర్స్‌, టీసీఎస్‌ కలిసి చేసిన ప్రాజెక్టులో భాగమయ్యాను. అక్కడ దాదాపు మూడేళ్లు పనిచేశాను. తర్వాత అక్కడే రేషనల్‌ సాఫ్ట్‌వేర్‌ కార్పొరేషన్‌ సంస్థలో మరో ఏడాది పనిచేశాను. ఆ ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు పైవాళ్ల ప్రశంసలూ అందుకున్నాను. అక్కణ్నుంచి తిరిగి ముంబయి ఆఫీసుకి వచ్చాను. ఆ సమయంలోనే తైవాన్‌లో డెలివరీ సెంటర్‌ను ప్రారంభించాలనుకుంది టీసీఎస్‌. ప్రస్తుత టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ అప్పుడు నాకు బాస్‌. ‘తైవాన్‌ వెళ్లండి, మీకు మంచి అనుభవం దొరుకుతుంది’ అని చెప్పారు. అప్పటికి అందరూ అమెరికా, యూకే లాంటి దేశాలకు వెళ్లాలని కోరుకునేవారు. ఎందుకంటే అక్కడ భాష సమస్య కాదు. కెరీర్‌తోపాటు, జీవనశైలి కూడా బావుంటుంది. కానీ ఇంగ్లిష్‌ మాట్లాడని తైవాన్‌ వెళ్లడమంటే సాహసమేనని మొదట కాస్త సంశయించాను. చివరకు ఆ సాహసానికి సిద్ధమని చెప్పాను. తైవాన్‌లో ‘కంట్రీ హెడ్‌’గా ఖాతాదారుల్ని సంపాదించడం, వారికి అవసరమైన ఐటీ సేవలు అందేలా చూడటం నా బాధ్యతలు.

చైనా ప్రయాణం
2000 సంవత్సరం వచ్చేసరికి చైనాలో అవకాశాల గురించి బాగా చర్చ మొదలైంది. అప్పటికి భారతీయ ఐటీ కంపెనీలేవీ అక్కడ తమ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి కేంద్రాలను ప్రారంభించలేదు. 2000లో టీసీఎస్‌ చైనాకు వెళ్లాలనుకుంది. చంద్ర నాకు ఫోన్‌చేసి చైనాకు సీఈఓగా వెళ్లమని చెప్పారు. ఓరోజు ఉదయాన్నే విషయం చెప్పి సాయంత్రానికి ఆలోచించి నిర్ణయం చెప్పమన్నారు. వెళ్తున్నానని చెప్పాను. అక్కడ ఎవరికీ ఇంగ్లిష్‌ రాదు, శాకాహారం దొరకదు... లాంటి విషయాల్ని కొందరు మిత్రులు చెప్పారు. నేను అప్పటికే తైవాన్‌లో ఉన్నాను. ఈ రెండు దేశాల సంస్కృతులూ ఒకేలా ఉంటాయి. కాబట్టి అవేవీ నాకు సమస్యలుగా అనిపించలేదు. నా జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం చైనా వెళ్లడమేనని ఇప్పటికీ చెబుతాను. బీజింగ్‌, షాంఘై, హంగ్జూ నగరాల్లో టీసీఎస్‌ కార్యాలయాల్ని ప్రారంభించాం. హంగ్జూలో ప్రధాన డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. షాంఘై, హంగ్జూ నగరాల మధ్య ఎక్కువగా తిరిగేవాణ్ని. హంగ్జూ నగరాన్ని హెవెన్‌ ఆన్‌ ఎర్త్‌, హనీమూన్‌ క్యాపిటల్‌గా పిలుస్తారు. ఆ నగరం చాలా సుందరమైంది. నగరం మధ్యలో ‘వెస్ట్‌ లేక్‌’ అని ఉంటుంది. అక్కడి వాతావరణం 24 గంటలూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చైనాలో బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజులకే తర్వాత సీఈఓ కచ్చితంగా చైనా వ్యక్తే ఉండాలని నాకు చెప్పారు. మన పని సంస్కృతిని వాళ్లకి అలవాటు చేయడం, వాళ్ల సంస్కృతిని మేం అర్థం చేసుకోడం... ఈ రెంటినీ మేళవించి ఓ ప్రత్యేక పని వాతావరణాన్ని అక్కడ అలవాటు చేశాం. ఇదంతా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేయడమెలాగో నేర్చుకునే అవకాశంలా ఉండేది. అప్పటికి అధికార పత్రాలన్నీ మాండరిన్‌ భాషలోనే ఉండేవి. వాటిపైన నా సంతకం మాతరమే ఇంగ్లిష్‌లో ఉండేది. అంత నమ్మకమైన స్థానిక బృందాన్ని తయారుచేసుకోగలిగాం. చైనావాళ్లు పనులు నిర్వర్తించడంలో చాలా చురుగ్గా ఉంటారు. ఈ మధ్యనే కొచ్చిలో టీసీఎస్‌ అంతర్జాతీయ నాయకుల సదస్సు జరిగింది. అక్కడికి చైనా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. 2002లో నేను అతణ్ని నియమించాను. ఒక చైనా వ్యక్తి ఇన్నేళ్లుగా టీసీఎస్‌లో కొనసాగడమంటే నిజంగా నమ్మలేకపోయాను. విదేశాల్లో పనిచేయడం ఎంత కష్టమో, అంత మంచి అవకాశం కూడా. నేను చైనాలో ఉండగానే అప్పటి ప్రధాని వాజ్‌పేయీ అక్కడ పర్యటించారు. అప్పుడు వ్యాపార ప్రతినిధుల బృందంలో నేనూ ఉన్నాను. అలాగే చైనా దేశనాయకులు భారత్‌లో పర్యటించినపుడు వారితో వచ్చాను. వాళ్లు బెంగళూరు, ముంబయిలలోని టీసీఎస్‌ కార్యాలయాల్ని సందర్శించారు. నేను చైనాలో ఉన్నపుడే రతన్‌ టాటా... నాలుగురోజుల చైనా పర్యటనకు వచ్చారు. ఆ నాల్రోజులూ మూడు నగరాల్లో రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, విద్యా ప్రముఖులతో 30 సమావేశాలు ఏర్పాటుచేశాం. ఆయన ఇండియా తిరిగి వచ్చాక కృతజ్ఞతలు తెలుపుతూ నాకు మెయిల్‌ పంపారు. ఆయన నా బాస్‌ బాస్‌కి బాస్‌. అయినా కూడా నాకు మెయిల్‌ పంపారు. గొప్పవాళ్ల నుంచి నేర్చుకున్నవంటే ఇలాంటివే. ఎప్పుడైనా పనిలో కాస్త డీలాపడినపుడు ఇలాంటి విషయాలు తల్చుకుంటే కిక్‌ వస్తుంది. నేను అక్కడ ఉన్నపుడు టీసీఎస్‌కు అత్యుత్తమ ప్రమాణాలతో పనిచేసే కంపెనీలకు ఇచ్చే అయిదు సర్టిఫికెట్‌లు దక్కాయి. అప్పటికి చైనాలో ఆ అయిదు సర్టిఫికెట్‌లనీ దక్కించుకున్న ఏకైక ఐటీ కంపెనీ టీసీఎస్‌ మాత్రమే. జేజియాంగ్‌ ప్రావిన్స్‌లో ఐటీ పరిశ్రమ ఎదుగుదలకు చేసిన కృషికిగానూ ‘వెస్ట్‌ లేక్‌’ అవార్డుని అందజేసింది. హంగ్జూ నగర ప్రభుత్వమూ నాయకత్వ విభాగంలో ప్రత్యేక అవార్డుని ఇచ్చింది. హంగ్జూలో పిల్లల చదువులకి మంచి అవకాశం ఉండేది. మా అమ్మాయి మేఘన ఆరో తరగతి వరకూ అక్కడే చదువుకుంది. అక్కడ జీవన ప్రమాణాలూ బాగుంటాయి. 2000లో వెళ్లిన ఉద్యోగుల్లో చాలామంది ఇంకా అక్కడ ఉన్నారంటే నమ్మండి. నేను అక్కడున్న ఆరేళ్లు... నా జీవితంలో అత్యుత్తమ సమయమని చెప్పాలి. ఆ రోజుల్ని మర్చిపోలేను.

హైదరాబాద్‌ రాక...
చైనా తర్వాత సింగపూర్‌లో ఆసియా డెలివరీ సెంటర్‌ని ప్రారంభించినపుడు అక్కడికి వెళ్లాను. వెళ్లిన ఏడాదికి చంద్ర ఒకరోజు ఫోన్‌ చేసి ‘హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్ర అభివృద్ధి బాధ్యతని ఇవ్వాలనుకుంటున్నాను. సిద్ధమేనా’ అన్నారు. ‘తప్పకుండా...’ అని చెప్పాను. అలా 2007లో హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్ర విభాగం హెడ్‌గా బాధ్యతలు తీసుకున్నాను. ఇంత సుదీర్ఘకాలం ఇక్కడ హెడ్‌గా ఉన్నది నేనే. నేను వచ్చినపుడు హైదరాబాద్‌లో టీసీఎస్‌ ఉద్యోగుల సంఖ్య 4500. ఇప్పుడు 43వేల మందికిపైగా ఉన్నారు. డెక్కన్‌ పార్క్‌, సినర్జీ పార్క్‌, ఆదిభట్ల... ఈ మూడు కేంద్రాల్లో పనిచేస్తున్నాô. కంపెనీ ఆదాయంలో ఏడు శాతం ఇక్కణ్నుంచే వస్తోంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌, టెలికామ్‌, టెక్నాలజీ, ప్రభుత్వ పాలనకు సాంకేతికత... ఇలా ఎన్నో విభాగాల్లో సాఫ్ట్‌వేర్‌ సేవల్ని హైదరాబాద్‌ నుంచి అందిస్తున్నాం. దీనివల్ల అత్యధికంగా కొత్తతరం నాయకత్వాన్ని హైదరాబాద్‌లో తయారుచేయగలుగుతున్నాం. ఒకప్పుడు టీసీఎస్‌ ఉద్యోగుల సంఖ్యా పరంగా హైదరాబాద్‌ విభాగం ఎనిమిదో స్థానంలో ఉండేది. ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది. 2011లో ఇక్కడ శిక్షణ కేంద్రాన్నీ ప్రారంభించాం. దాంట్లో ఒకేసారి 6000 మంది శిక్షణ పొందే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఐటీ ఎదుగుదల, టీసీఎస్‌ ఎదుగుదల సమాంతరంగా జరిగాయి. హైదరాబాద్‌లో మొట్టమొదటి పెద్ద ఐటీ కంపెనీ మాదే. 1979లోనే ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. 2020 నాటికి హైదరాబాద్‌లో టీసీఎస్‌ ఉద్యోగుల సంఖ్యను 50వేలకు చేర్చాలని చూస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రంతోపాటు, ‘అంతర్జాతీయ టెక్నాలజీ బిజినెస్‌ యూనిట్‌ విభాగాన్నీ పర్యవేక్షిస్తున్నాను. వీటికితోడు ఏపీ, టీఎస్‌ ఆన్‌లైన్‌ విభాగాలకు డైరెక్టర్‌గా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి 40 వరకూ ఇంజినీరింగ్‌ కాలేజీలతో కలిసి అధ్యాపకుల శిక్షణ, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ మొదలైన అంశాల్లో పనిచేస్తున్నాం.

వెనక ఎందరో....
కుటుంబ సభ్యులూ, ఉపాధ్యాయులూ, స్నేహితులూ, సహోద్యోగులూ... వీరంతా నా వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని నిర్మించుకోవడంలో సాయపడ్డారు. నాన్న మ్యాథ్స్‌ టీచర్‌. నా చిన్నపుడు మంచిర్యాల జిల్లా ఆవడం అనే చిన్న పల్లెటూళ్లో ఉండేవాళ్లం.  లెక్కల మాస్టార్లందరి మాదిరిగానే నాన్న కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. నాకూ అలా క్రమశిక్షణ చిన్నప్పట్నుంచీ అలవాటైంది. ఇప్పటికీ ఏదైనా సమావేశం ఉంటే టైమ్‌కి ఉంటాను. చదువుకునే రోజుల్లో గణితం, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో చురుగ్గా ఉండేవాణ్ని. నాన్న దగ్గరే లెక్కలు నేర్చుకున్నాను.
ఇంటర్మీడియెట్‌లో పద్మారావు గారు చెప్పిన ఇంగ్లిష్‌ పాఠాలు ఇప్పటికీ గుర్తే. ఎన్‌ఐటీలో ప్రొఫెసర్‌ రామారావు ప్రోత్సాహం మర్చిపోలేనిది. ఉద్యోగంలో చేరిన కొత్తలో నూరి, పవన్‌ కుమార్‌లు మంచి ప్రోత్సాహమిచ్చారు. గత 18 ఏళ్లుగా చంద్ర నాకు మార్గదర్శిగా ఉన్నారు. విదేశాలకు వెళ్లినా, హైదరాబాద్‌కు తిరిగి వచ్చినా ఆయనకు నామీద ఉన్న నమ్మకంవల్లనే సాధ్యమయ్యాయి. ప్రస్తుత టీసీఎస్‌ సీఈఓ రాజేశ్‌ నాకు బాస్‌ అయినా, ఏదైనా ముఖ్యమైన సలహా లేదా సూచన కావాలంటే చంద్రాతోనూ మాట్లాడుతుంటాను. ఉద్యోగంలో బిజీగా ఉండి ఇంటి బాధ్యతలకు నేను దూరంగా ఉన్నప్పటికీ, ఆలోటు తెలియకుండా నా శ్రీమతి లత అన్నీ చక్కగా చూసుకుంటుంది.

వ్యాయామం చేయాల్సిందే!

ఒత్తిడి... పోటీ ప్రపంచంలో అన్నిచోట్లా ఉంటోంది. వ్యాయామం, నడక, యోగా... వీటిద్వారా నాకు ఒత్తిడి నుంచి ఉపశమనం దొరుకుతుంది. వ్యాయామం చేస్తున్నపుడు పనికి సంబంధించి మంచి ఆలోచనలు కూడా వస్తాయి. వెంటనే నోట్‌ చేసుకుంటాను

* పుస్తక పఠనం హాబీ. ముఖ్యంగా మేనేజ్‌మెంట్‌ పుస్తకాలు చదువుతాను. ఎగ్జిక్యూషన్‌(రామ్‌ చరణ్‌), విన్నర్స్‌ డ్రీమ్‌ బిల్‌(మెక్‌డెర్మాట్‌), కాంట్‌ ఈజ్‌ నాట్‌ ఏన్‌ ఆప్షన్‌(నిక్కీ హాలే)... ఇవన్నీ నా ఫేవరెట్‌ పుస్తకాలు. వ్యాయామం, పుస్తక పఠనం... నాకు కావాల్సిన శక్తినీ, స్ఫూర్తినీ, ఉత్సాహాన్నీ ఇస్తాయి. 
* ఏ స్థాయికి వెళ్లినా నాలోని సామాన్యుణ్ని కాపాడుకుంటూ వచ్చాను. సుప్రభాతం లేదంటే ఏదో ఒక భక్తిగీతంతో రోజుని ప్రారంభిస్తాను. ఉదయాన్నే టీ తాగుతూ పేపర్‌ చదవడం అలవాటు. ఆ సమయంలో పక్కన లత ఉండాల్సిందే. వారాంతాల్లో సినిమాలు చూస్తాను. సినిమాహాల్‌కి వెళ్లడం లేదంటే ఇంట్లో టీవీలో చూస్తాను. 
* ఇప్పటికీ పుస్తకంలోనే ఆలోచనల్ని రాసుకుంటాను. ప్రఖ్యాత మాంట్‌ బ్లాంక్‌, వాటర్‌మేన్‌ పెన్నుల్ని సేకరిస్తాను. పాటలు బాగా వింటాను.
* ‘అందరిలానే ఉంటే, అందరిలానే చేస్తే నేను ఎందుకు’ అని ప్రశ్న వేసుకుంటాను. అత్యుత్తమ ఫలితం వచ్చేంతవరకూ పనిచేయాల్సిందే, అది నేనైనా నా బృందం అయినా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.