close
అమ్మాయి పెళ్లికి... బంతిపూల పందిరి!

పెళ్లంటే... వసివాడని తోరణాలూ సుందర మండపాలూ... కాంతులీనే దీపాలూ మురిపించే పందిరిలూ... ఎన్నెన్నో వర్ణాలు... ఏవేవో అందాలు... స్థూలంగా  ముద్దబంతుల అలంకారాలు. అవునుమరి, పెళ్లంటేనే అలంకారం... అదీ పూబంతుల సింగారం... అనేంత అందంగా బంతిపూల అలంకరణతో ఆహుతుల కళ్లని కట్టిపడేస్తున్నారు నేటి సృజనకారులు.

బంతిపువ్వా... అదేంటీ... అది అసలు పూజకే పనికిరాదని కొందరంటే, సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడికీ శ్రీమహాలక్ష్మీదేవికీ ఆ పూలతో పూజిస్తే ఎంతో ఇష్టమనీ, కొత్త దంపతుల సంతోషకరమైన జీవితానికి దేవతలు పంపించిన అక్షతలే బంతిపూలనేది మరికొందరి విశ్వాసం. పసుపూ ఎరుపూ రంగుల్లోని ఆ పూబంతులు, శుభప్రదమనీ, సిరిసంపదలకి సంకేతాలనీ పసుపూకుంకుమలకి ప్రతీకలనేది చాలామంది చెప్పే భాష్యం. ఆ కారణంతోనే పండగలూ వేడుకలూ పెళ్లీపేరంటాలూ... ఇలా శుభకార్యం ఏదయినాగానీ ఇంటి గుమ్మానికి బంతిపూల తోరణాలు అందంగా వేలాడుతుంటాయనేది పండితులు చెప్పే కారణమైతే, ఈ పూలకి ఉండే ఒకలాంటి వాసన ఒత్తిడిని తొలగించి, వ్యతిరేక ఆలోచనల్ని రానీయకుండా చేయడంతోబాటు క్రిమికీటకాల్నీ దూరంగా ఉంచుతుందనేది శాస్త్రీయ కథనం. ఇప్పుడు ఆ పసుపుపచ్చని, ఎర్రని పూలతోరణం ప్రవేశ ద్వారాన్ని దాటి, పెళ్లిమండపాల్నీ అందంగా అల్లుకుంటోంది.

 

బంతిపూల స్వాగతం!
మిగిలిన పూలతో పోలిస్తే వీటికి మందపాటి కాడ ఉంటుంది. అందుకే మాలకట్టడం, గుచ్చడం తేలిక. ఒకప్పుడు దసరాతో మొదలై సంక్రాంతి వరకూ మాత్రమే విరబూసే బంతిపూలు, ఇప్పుడు కాలంతో పనిలేకుండా పరిమళిస్తున్నాయి. పసుపూ నారింజా వంటి కాంతిమంతమైన రంగుల్లో పూసే ఆ పూబంతులు, సూర్యకాంతితోనే పోటీపడుతూ రోజుల తరబడి వాడిపోకుండానూ ఉంటాయి. ముద్దుగా బొద్దుగా ఉండటంతో కెమెరా క్లిక్కుల్లోనూ స్పష్టంగా కనిపిస్తాయి. పైగా మిగిలిన పూలతో పోలిస్తే ధర తక్కువ. దాంతో నేటి అలంకరణ ప్రియుల సృజనని ముద్దబంతులు తట్టి లేపుతూ కళాత్మకంగా విచ్చుకుంటున్నాయి.

పెళ్లింట స్వాగత తోరణం నుంచి పెళ్లి మండపం వరకూ బంతిపూల అందాలు అతిథుల్ని కళ్లు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు సాదాసీదాగా వేలాడదీసే దండలు కాస్తా నేడు వాకిట్లో వంపులు తిరిగిన పరదాల్లా వేలాడుతున్నాయి. దాన్ని దాటుకుని లోపలకు వెళితే దారిపొడవునా గీసిన అంచుల ముగ్గుల డిజైన్లన్నీ బంతిపూలతోనే వెల్లివిరుస్తున్నాయి. తల ఎత్తి పైకి చూస్తే పసుపూ ఎరుపూ ముద్దబంతులూ ఆ మధ్యలో అక్కడక్కడా ఆకుపచ్చని కొబ్బరాకులతో అల్లుకున్న అందమైన పందిరి కనువిందు చేస్తుంది. మరికాస్త లోపలకు వెళితే భోజనాల హాలు నుంచి వేదిక వరకూ గోడలూ స్తంభాలూ ఎక్కడ చూసినా పూబంతుల అలంకారాలే. ఇక వేదికలూ మండపాలూ అన్నీ ముద్దబంతుల అందాలే.

 

బంతుల బొమ్మలు!
ముద్దొచ్చే బంతిపూలకి మెత్తని శాటిన్‌ వస్త్రాలూ పచ్చని అరటిమొక్కలూ పసిడి వర్ణంలోని జేగంటలూ తోడుంటే చాలు ప్రవేశద్వార అలంకరణ అదిరిపోవడం ఖాయం. పసుపూ ఎరుపూ రంగుల బంతిపూలదండలతోనే పందిరంతా అల్లేసి, వాటి మధ్యలో ఆకుపచ్చని చిలకల్ని వేలాడదీస్తే ఆ పందిరి సొగసు చూడతరమా? ఇక ఆరుబయట వేడుకల్లో కనీకనిపించని దారాలతో పందిరిని అల్లేసి అక్కడో పువ్వూ అక్కడో పువ్వూ గుచ్చి వేలాడదీస్తే బంతిపూల వాన కురుస్తున్నట్లుండదూ.

బంతిపూలకి మామిడాకుల్ని కలిపి చేసే కలశాలతో పందిరి మొత్తంగా వేలాడదీసినా, త్రీడీ లుక్‌ వచ్చేలా పూల ముగ్గేసి అందులో బంతిపూలతోనే విఘ్నేశ్వరుడిని చేసి ఆ పూలతోనే మోదకాలూ ఉండ్రాళ్లూ చేసి నైవేద్యం పెట్టినా, బంతిపూలతో బంతుల్ని చేసి వేలాడదీసినా, బంతిపూల దండల్ని కుండల్లోనుంచి జాలువారేలా అమర్చినా, గుదిగుచ్చిన దండలకి కొబ్బరాకులు జోడించి బొమ్మలుగా చేసినా, కుండమీద కుండపెట్టి రూపొందించిన మండప స్తంభాల్ని బంతిపూలతో చుట్టేసినా, గులాబీలు జతచేసి మండపాన్ని అలంకరించినా... ఎలా చేసినా ఏం చేసినా ఆ అందమే వేరు అంటారు ఈవెంట్‌ డిజైనర్లు. ఆలోచన అంటూ ఉండాలే కానీ బంతిపూలకి ఏవయినా సరిజోడే. ఏవీ లేకుంటే వాటికవే అందమైన జోడీ. బంతిపూల మధ్యలో తెల్లని లిల్లీలో మల్లెల దండల్నో వేలాడదీసే ఆ రంగుల కలబోతని తలతిప్పి మళ్లీ మళ్లీ చూడని వాళ్లుంటారా? మొత్తమ్మీద పెళ్లిపందిట్లో వధూవరుల అలంకరణని తలదన్నేలా బంతిపూలు కళకళలాడుతున్నాయనడంలో కాస్త కూడా అతిశయోక్తి లేదు.

అందుకే హల్దీ, మెహందీ, పెళ్లికూతుర్ని చేయడం, గౌరీపూజ... ఇలా పెళ్లిలో భాగంగా జరిగే వేడుకల్లోనే కాదు, గృహప్రవేశం, బారసాల, పెళ్లిరోజు... సంబరం ఏదయినా బంతిపూలతోనే ఆయా వేదికలకి సోకులద్దుతున్నారు. ఆలయాలనీ పూజా మందిరాలనీ యజ్ఞవాటికల్నీ కూడా ఈమధ్య బంతిపూలతోనే అలంకరిస్తున్నారు. ముఖ్యంగా పగటివేళ జరిగే వేడుకల్లో మిగిలిన పూలతో పోలిస్తే బంతిపూలే రంగురంగుల దీపాలై వెలుగులీనుతున్నాయి. అందుకే అందరూ ‘ముద్దబంతి పువ్వుతో...  ఎన్ని వేడుకలో... మరెన్ని అలంకారాలో...’ అంటూ కొత్త పల్లవిని అందుకుంటున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.