close
శుభకరుడు... సూర్యభగవానుడు!

చిమ్మచీకట్లను అందమైన కాంతిరేఖలతో చీల్చుకుంటూ... చలిపులిని నులివెచ్చని కిరణాలతో తరిమేస్తూ... తూరుపు దిక్కుకు సిందూరాన్ని దిద్దేస్తూ... తన గమనాన్ని ప్రారంభించే సూర్యనారాయణుడి పుట్టిన రోజే రథసప్తమి. కర్మ సాక్షిగా, ప్రత్యక్ష భగవానుడిగా, ఆరోగ్య ప్రదాతగా పూజలందుకుంటున్న ఆ దివాకరుడు తన కిరణంలోని ఏడు రంగులనే ఏడు అశ్వాలుగా కలిగిన ఏక చక్ర రథాన్ని అధిరోహించింది కూడా ఈ రోజే.

రోజులూ వారాలూ నెలలూ... ఇలా మన కాలానికి సూర్యుడే కొలమానం. ఆరోగ్యానికీ చైతన్యానికీ సూర్యుడే కారణం. సమస్త జీవరాశికీ సూర్యుడే ఆధారం. అందుకే సూర్యుడిని వేదాలు త్రిమూర్తి స్వరూపంగా పేర్కొన్నాయి. మూడు సంధ్యల్లోనూ ఆదిత్యుడిని ఆరాధించేందుకు సంధ్యా వందన నియమాన్ని ఏర్పాటు చేశాయి. భూమ్మీద మొదట దర్శనమిచ్చిన దైవంగా హైందవులు భాస్కరుడిని పూజిస్తారు... పండగలు జరుపుకుంటారు. అలా సూర్యుడి ఆధారంగా జరిగే పండగలు రెండు. మొదటిది మకర సంక్రాంతి. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అడుగిడిన సందర్భంగా ఈ పండగను చేసుకుంటారు. రెండోది... ఆ దివాకరుడు పుట్టిన రోజైన రథసప్తమి. మాఘ శుద్ధ సప్తమినే రథ సప్తమిగా పేర్కొంటారు. ఉత్తరాయణంలోకి ప్రవేశించిన దినకరుడు రథసప్తమి రోజు నుంచే ఉత్తరంగా తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ‘ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్‌’ అంటే ఆరోగ్యాన్ని భాస్కరుడు ప్రసాదిస్తాడని అర్థం. అందుకే రథసప్తమినే ఆరోగ్య సప్తమి అనికూడా అంటారు. ఈ రోజు చేసిన సూర్యుడి ఆరాధనా, దానధర్మాల వల్ల ఈ జన్మలోనేకాదు గడిచిన జన్మల్లోనూ తెలిసీతెలియక చేసిన పాపాలన్నీ పరిహారమవుతాయని ప్రతీతి.

ఇలా చేయాలి...
రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలన్నదానికి పెద్దలు కొన్ని విధివిధానాలను రూపొందించారు. ఆ రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, ‘సప్తాశ్వ రథామారూఢం ప్రచండం కశ్యపాత్మజం...’ అంటూ సూర్యుడిని స్తుతిస్తూ జిల్లేడాకులు వేసిన నీటితో స్నానం చేయాలి. స్నానం మధ్యలో తలమీద ఏడు జిల్లేడాకులూ రేగు పండ్లూ పెట్టుకుంటారు. జిల్లేడుకు సంస్కృతంలో అర్క అని పేరు. సూర్యుడి సహస్ర నామాల్లో అర్క ఒకటి. అలాగే రేగుపండు సూర్యనారాయణుడికి ప్రీతికరమైందని చెబుతారు. అందుకే రథసప్తమినాడు ఆ రెండూ తలమీద పెట్టుకుని స్నానంచేసి, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల కోటి రెట్లు పుణ్యం లభిస్తుందన్నది పెద్దల మాట.
ప్రతక్ష భగవానుడు పరమాన్న ప్రియుడు. అందుకే రథసప్తమినాడు సూర్యుడికి ఎదురుగా (తులసికోట దగ్గరో, కళ్లాపిజల్లి అందమైన రంగవల్లులతో అలంకరించిన వాకిట్లోనో) నేల మీద ఆవుపిడకలను పేరుస్తారు. దానిమీద ఆవుపాలూ బెల్లం కొత్తబియ్యంతో క్షీరాన్నాన్ని వండుతారు.
చిక్కుడాకుల్లో దాన్ని పెట్టి దివాకరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. చిక్కుడు కాయలతో రథాన్ని చేసి, అందులో ఎర్రచందనాన్ని కలిపి తయారుచేసిన అక్షతలను ఉంచి సూర్యభగవానుడిని ఆవాహన చేస్తారు. అనంతరం పూలూ పండ్లూ పత్రి మొదలైనవాటితో ఆయన్ను అర్చిస్తారు. సూర్యుడికి ప్రీతికరమైన రంగు ఎరుపు. అందుకే సూర్యజయంతి రోజు ఎర్రటి వస్త్రం, గోధుమలు, బంగారం, ఎర్రటి పువ్వులూ యథాశక్తిగా దానమివ్వాలని చెబుతారు పెద్దలు.

పురాణాల్లో...
సూర్యుడిని ఆరాధించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న హైందవ సంప్రదాయం. హిందువుల ఆరాధ్య దైవాలైన రాముడూ శ్రీకృష్ణుడూ మొదలైనవారు సూర్యోపాసన చేశారని మన పురాణాలు పేర్కొంటున్నాయి. రామాయణంలో... శ్రీరాముడు రావణాసురుడిని సంహరించడానికి ముందు ఆదిత్యుణ్నే స్తుతించాడు. ఆ సందర్భంలో అగస్త్యముని రాముడికి ఉపదేశించిన మంత్రమే ఆదిత్య హృదయం. అమూల్యమైన బీజాక్షరాలను తనలో పొదువుకున్న ఆదిత్య హృదయం ఎల్లవేళలా జయాన్నే కలిగిస్తుందని ప్రతీతి.
బాల్యంలో ఆంజనేయుడు సూర్యుడిని ఎర్రటి పండుగా భావించి మింగడానికి బయలుదేరుతాడు. ఆ తర్వాతి కాలంలో ఆదిత్యుడి దగ్గరే అన్ని విద్యలనూ అభ్యసిస్తాడు. సూర్యుడికి అభిముఖంగా నిలబడి, అతడి గమనానికి ఏమాత్రం అడ్డురాకుండా వెనక్కివెనక్కి నడుస్తూ హనుమ విద్యాభాసాన్ని పూర్తిచేయడం విశేషం.
సూర్యుడి నుంచే ధర్మరాజు అక్షయపాత్రను పొందాడని తెలుపుతోంది మహాభారతం. శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడికి కుష్ఠువ్యాధి సోకినప్పుడు సూర్యారాధనతోనే విముక్తి పొందాడు. భవిష్యోత్తర పురాణం ప్రకారం...మహాభారత సంగ్రామానికి సంసిద్ధులవుతున్న సమయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సూర్యవ్రతాన్ని చేయించాడు.
సూర్యుడంటే ప్రకృతి, ప్రకృతంటే సూర్యుడు... అనేంతలా ప్రకృతిలో మమేకమై, తిరిగి ఆ ప్రకృతికే ప్రాణాధారమయ్యాడు సూర్యభగవానుడు. అందుకే దేవతలూ మనుషులూ అని తేడాలేకుండా అందరికీ ఆరాధ్యుడయ్యాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.