close
అక్కడ మనుషులకన్నా పశువులు ఎక్కువ!

‘ఎటు చూసినా పచ్చని పచ్చిక మైదానాలూ ఎత్తైన పర్వతాలూ పొగలు కక్కే బురద మడుగులూ మిణుగురుల చీకటి గుహలూ ప్రాచీన తెగలూ కోట్లాది పశువులతో ఎంతో ప్రశాంతంగా అనిపించే ఆ దేశంలో పర్యటిస్తుంటే ·రెప్పవాల్చినా అందం కనుమరుగవుతుందనిపించడం ఖాయం’ అంటూ ఆ పర్యటన గురించి వివరిస్తున్నారు నందిగామ వాస్తవ్యులు డా.దమ్మాలపాటి రామమోహనరావు.

నిత్యం పచ్చదనంతో అలరారే న్యూజిలాండ్‌ దేశాన్ని చూడాలని హైదరాబాద్‌ నుంచి కౌలాలంపూర్‌ మీదుగా ఆక్లాండ్‌కి చేరుకున్నాం. న్యూజిలాండ్‌ దేశం ఉత్తర, దక్షిణ ద్వీపాలుగా విభజింపబడి ఉంది. దేశమంతా సన్నగా పొడవుగా ఉంటుంది కానీ విస్తీర్ణంతో పోలిస్తే జనాభా చాలా తక్కువ. 47 లక్షలు మాత్రమే. నాలుగైదు పెద్ద నగరాల్లో తప్ప మిగిలిన పట్టణాలూ, పల్లెల్లో జనాభా చాలా తక్కువ. కాబట్టి దేశమంతా ప్రశాంతంగా కాలుష్యం లేకుండా ఉంటుంది. వందల సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న ప్రకృతి సంపద- అంటే విస్తారమైన గడ్డి మైదానాలూ సరస్సులూ అడవులూ పర్వతశ్రేణులూ ఇప్పటికీ అలాగే ఉన్నాయంటే ఓ పట్టాన నమ్మశక్యం కాదు. మరో వంద సంవత్సరాలైనా అవన్నీ అలాగే ఉండే అవకాశం ఉంది. జనాభా తక్కువ కాబట్టి, పర్యావరణ కాలుష్యం అన్న ప్రసక్తే లేదక్కడ.
న్యూజిలాండ్‌లో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ చలికాలం. అక్టోబరు నుంచి మార్చి మధ్య వాతావరణం బాగుండటంతో పర్యటనలకు అనుకూలంగా ఉంటుంది. అక్టోబరులో ఉష్ణోగ్రత 18 డిగ్రీల్లోపే. కానీ సూర్యకిరణాలు తీక్షణంగా ఉంటాయి. వాతావరణంలో ఏమాత్రం కాలుష్యంలేకపోవడంవల్ల సూర్యుని కిరణాలు నేరుగా మన చర్మాన్ని తాకుతాయి. అందుకే ఆ దేశంలో చర్మక్యాన్సర్‌ కేసులు ఎక్కువనీ, కాబట్టి అక్కడికి వెళ్లేవాళ్లు చర్మానికి సన్‌స్క్రీన్‌ తప్పక రాసుకోవాలనీ టూర్‌ మేనేజర్‌ ముందుగానే హెచ్చరించారు.

కోట్లాది పశువులు!
దేశమంతా విస్తారమైన గడ్డిమైదానాలే. సగభాగం పైనస్‌ వృక్షాలతో కూడిన అడవులూ కివీ, చెర్రీ తోటలూ తప్ప మరే పంటలూ కనిపించవు. వేల మైళ్లు విస్తరించిన ఆ గడ్డిమైదానాల్లో కోట్ల సంఖ్యలో గొర్రెలూ ఆవుల మందలే కనిపిస్తాయి. పాడి, ఉన్ని పరిశ్రమలే న్యూజిలాండ్‌ ముఖ్య ఆదాయం. మిగిలిన అన్ని సరుకులూ దిగుమతి చేసుకోవాల్సిందే. వారికున్న విస్తారమైన పశు సంపద కారణంగానే అక్కడి వాళ్లంతా అంతులేని సిరిసంపదలతో జీవిస్తారు.
బహుళ అంతస్తుల భవనాలు నగరాల్లోనే కనిపిస్తాయి. స్టార్‌హోటళ్లూ, పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు కూడా రెండు అంతస్తుల్లోనే విశాలంగా ఉంటాయి. నివాస భవనాలు కూడా రెండు అంతస్తులుగా ఉండి పైకప్పు మాత్రం ఏటవాలుగా ఉంటుంది. వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి ఆ విధంగా నిర్మిస్తారట. దేశమంతటా భవనాలన్నీ సగభాగం వరకూ ముదురు బూడిద రంగూ మిగిలిన సగ భాగం లేత బూడిదరంగుతో విశాలమైన ఆవరణతో చూడముచ్చటగా ఉంటాయి. న్యూజిలాండ్‌ క్రికెట్‌ టీమ్‌ ధరించే దుస్తులు కూడా అదే రంగు కావడం చెప్పుకోదగ్గ విషయం.

మరుగుజ్జుల నివాసాలు!
ముందుగా మేం ఆక్లాండ్‌ నగర పర్యటనకు బయలుదేరాం. ఇది న్యూజిలాండ్‌లో అత్యధిక జనాభాగల అతిపెద్ద నగరం. ముందుగా వెయ్‌టెమాటా హార్బర్‌కి వెళ్లాం. అక్కడి హార్బర్‌ వంతెననీ, వార్‌ మెమోరియల్‌ మ్యూజియాలనీ చూసుకుని, ఆక్లాండ్‌ స్కై టవర్‌మీదకి ఎక్కి చూస్తే నగరం నలువైపులా కనిపించింది.

మధ్యాహ్నం ఆక్లాండ్‌ నుంచి రోటోరువ అనే నగరానికి బయలుదేరి, మార్గమధ్యంలో మాటామాటా అనే ప్రదేశంలో కృత్రిమంగా ఏర్పాటుచేసిన హాబిటన్‌ మూవీ సెట్‌ను సందర్శించాం. అక్కడ లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌, ద హాబిట్‌ అనే హాలీవుడ్‌ సినిమాలను నిర్మించే సమయంలో మరుగుజ్జులు నివసించేలా నాలుగైదు అడుగుల ఎత్తు మాత్రమే ఉండే 44 చిన్న చిన్న చెక్క గృహాలను భూగర్భంలో నిర్మించారు. చిత్రనిర్మాణం పూర్తయ్యాక ఆ సెట్‌ను అలాగే ఉంచేసి, పర్యటక ప్రదేశంగా అభివృద్ధి చేశారు.
మర్నాడు ఉదయం టె పుయా థెర్మల్‌ రిజర్వ్‌కు వెళ్లాం. ఈ ప్రాంతం స్థానిక మావొరీ తెగలకు ప్రసిద్ధి. రాతి కొండల మధ్యలో సెగలు కక్కే వేడినీటి బుగ్గలకూ ఈ ప్రాంతం పెట్టింది పేరు. ఇక్కడున్న పొహూతూ గీజర్‌ ప్రాంతంలో బురద, అన్నం ఉడికినట్లుగా నిరంతరం ఉడుకుతుంటుంది. భూగర్భంలోని అగ్నిపర్వతాలూ గంధకంతో కూడిన రాతికొండలే కారణం.

తరవాత అక్కడకు దగ్గరలోనే ఉన్న మావొరీ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటుచేసిన మావొరీ సంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శన ఎంతగానో అలరించింది. న్యూజిలాండ్‌ దేశంలోని స్థానిక పూర్వికులే మావొరీలు. అదేరోజు మధ్యాహ్నం అగ్రోడోమ్‌ అనే అతి పెద్ద వ్యవసాయక్షేత్రానికి వెళ్లాం. అక్కడి విశాలమైన గడ్డి మైదానాల్లో వందలకొద్దీ గొర్రెలూ ఆవులూ జింకలూ లామాలు సంచరిస్తుంటాయి. అవి సందర్శకుల్ని చూడగానే పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆ పక్కనే కివీ పండ్ల తోట కూడా కనువిందు చేస్తుంటుంది. అగ్రోడోమ్‌లో 19 రకాల గొర్రెలతో ప్రదర్శన ఏర్పాటుచేశారు. గొర్రెల శరీరం నుంచి ఉన్నిని వేరుచేయడాన్ని కూడా అక్కడ చూపించారు.
తరవాతి రోజు రోటోరువ నుంచి తిరిగి ఆక్లాండ్‌ వస్తుంటే మిణుగురుల గుహల దగ్గర ఆగాం. సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా విస్తరించిన ఆ చీకటి గుహలో సన్నని కాలువ ఉంటుంది. సందర్శకులను ఓ పడవలో ఎక్కించి ఆ గుహ మొత్తం తిప్పుతారు. ఏమాత్రం శబ్దం చేయకూడదని ముందే చెబుతారు. కటిక చీకటిగా నిశ్శబ్దంగా ఉన్న ఆ గుహలో పైకప్పు మొత్తంగా అతుక్కుని మెరుస్తున్న మిణుగురు పురుగులను చూస్తుంటే అమావాస్యనాటి ఆకాశంలోని చుక్కల్ని చూస్తున్నట్లే అనిపిస్తుంది. అక్కడి మిణుగురు పురుగులకు రెక్కలు ఉండవట. ప్రపంచంలో మరెక్కడా ఇంత పొడవైన మెరిసే గుహలు లేవట. అది చూసి సాయంత్రానికి ఆక్లాండ్‌ చేరుకున్నాం.

సాహస నగరం!
తరవాతి రోజు ఉదయం ఆక్లాండ్‌ నుంచి విమాన ప్రయాణంలో క్వీన్‌టౌన్‌కి చేరుకున్నాం. దీన్ని న్యూజిలాండ్‌ అడ్వెంచర్‌ క్యాపిటల్‌ అంటారు. సరస్సులూ నదులూ హిమనదాలూ కొండలతో నిండి ఉంటుందీ నగరం. అందుకే సాహసికుల్ని ఎంతో ఆకర్షిస్తుంది. అక్కడ ఉన్న ఎత్తైన శిఖరం బాబ్స్‌ పీక్‌ మీదకు గండోలా రైడ్‌ ఏర్పాటుచేశారు. దాన్నుంచి కిందకు పారాగ్లైడింగ్‌ కూడా చేయవచ్చు. సరస్సులో విహరించడానికి స్పీడ్‌బోట్లూ మూడు చక్రాల సైకిళ్లూ ఉన్నాయి. వాటి సాయంతో సరస్సులో విహరిస్తూ నగర వీక్షణం చేశాం. అక్కడకు 30 కి.మీ.దూరంలోనే కవారా నదిమీద ఉన్న ఎత్తైన వంతెన పై నుంచి బంగీజంప్‌ ఏర్పాటుచేశారు. ప్రపంచంలోనే తొలి బంగీ జంప్‌ ఏర్పాటు చేసిన ప్రదేశం ఇదేనట. సరస్సు ఒడ్డునే ఉన్న హోటల్లో బస చేయడంతో మాకు ఆ రెండు రోజులూ ఆహ్లాదకరంగా గడిచింది.
మర్నాడు ఉదయం తే ఆనా నదీతీరం వెంబడి సుమారు 70 కి.మీ. ప్రయాణం. ఓ వైపు నదీతీరం, మరోవైపు దూరంగా కనిపించే మంచు శిఖరాలూ దారి పొడవునా సుందర ప్రకృతి మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అలా ప్రయాణిస్తూ మిలోఫోర్డ్‌ సౌండ్‌ అనే ప్రాంతానికి వెళ్లాం. అక్కడ నుంచి ఓడలో టాస్మానియా సముద్రతీరం వరకూ తీసుకువెళ్లారు. ఓడలో ప్రయాణిస్తుంటే డాల్ఫిన్లు పక్కనే ఎగురుతూ కనిపించడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. తిరుగు ప్రయాణంలో మంచుతో కప్పబడిన పర్వత శిఖరాల మీద హెలీకాప్టర్‌లో విహరించాం. ఆసక్తి ఉన్నవాళ్లు కొంతమంది అక్కడి నుంచి స్కై జంప్‌ కూడా చేశారు.

తరవాతిరోజు మౌంట్‌ కుక్‌ పర్వతశ్రేణి చూడ్డానికి బయలుదేరాం. దాదాపు వంద కిలోమీటర్ల ప్రయాణంలో ఓ పక్క మంచు శిఖరాలూ మరో పక్క స్వచ్ఛ జలాలతో కూడిన నదీప్రవాహం ఎంతో అద్భుతంగా ఉంది. నది పొడవునా మంచు శిఖరాల నీడలు స్పష్టంగా కనువిందు చేస్తున్నాయి. అక్కడి నుంచి ట్విజెల్‌ పట్టణాన్ని చూసి వనాకాలోని పజ్లింగ్‌ వరల్డ్‌ అనే ప్రాంతంలోకి వెళ్లాం. అక్కడ భవనాలు పడిపోతున్నట్లుగా ఉంటాయి. వాటిల్లోని మిర్రర్‌మేజ్‌లూ పజిల్సూ మెదడుకి మేత పెడతాయనడంలో సందేహం లేదు. అందుకే దీన్ని ఓ సాంకేతిక శాస్త్రీయ అద్భుతంగా చెప్పవచ్చు. అవన్నీ చూసి సాయంత్రం ట్విజెల్‌ నగరంలోని మెకంజీ కౌంటీ అనే హోటల్లో బస చేశాం. ఇది కూడా చాలా ప్రశాంతమైన ప్రదేశం. మర్నాడు క్రైస్ట్‌చర్చ్‌కి బయలుదేరాం. ఇది న్యూజిలాండ్‌లోని రెండో పెద్దనగరం. ఆ మార్గమంతా పొడవైన టికాపో సరస్సు వెంటే సాగుతుంది. దారిలో ప్రఖ్యాత శిల్పకారుడు మెకంజీ గొర్రె-కుక్క రూపాలను తలపించేలా చెక్కిన విగ్రహాన్నీ, చర్చ్‌ ఆఫ్‌ గుడ్‌ షెపర్డ్‌నీ చూశాం. ఈ రెండూ న్యూజిలాండ్‌ పురాతన వారసత్వ సంపదకి చిహ్నాలు.
మధ్యాహ్నానికి క్రైస్ట్‌ చర్చ్‌కి చేరుకున్నాం. పేరుకు తగ్గట్లే నగరంలో అనేక క్రైస్తవాలయాలు ఉన్నాయి. 2012లో ఇక్కడ సంభవించిన తీవ్రమైన భూకంపంతో అనేక భవనాలూ చర్చిలూ శిథిలమయ్యాయట. నగరంమధ్యలో వందల ఎకరాల్లో తోటలు ఉండటంతో దీన్ని ఉద్యాననగరం అంటారు. అవన్నీ చూసి అక్కడి నుంచి ఆక్లాండ్‌కు చేరుకుని మలేషియా మీదుగా తిరిగివచ్చాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.