close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీమ్‌ ఇండియాలో చైనామేన్‌...

కుల్‌దీప్‌ యాదవ్‌... టీమ్‌ ఇండియా మేటి బౌలర్లలో ఒకడు. అరంగేట్రం చేసిన రెండేళ్లలోనే జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇండియాలో ఒక సాధారణ కుర్రాడు అంతర్జాతీయ ఆటగాడిగా  మారే క్రమంలో ఎంత శ్రమ ఉంటుందో, ఎన్ని మలుపులు ఉంటాయో, ఎందరి సహకారం ఉంటుందో కుల్‌దీప్‌ జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.

నేను క్రికెటర్‌నే అవుతాను, లేదంటే చచ్చిపోతాను... 13 ఏళ్ల కుల్‌దీప్‌ యాదవ్‌ నోట వచ్చిన ఆ మాటలు ఇంట్లో వాళ్లకి ఆందోళన కలిగించాయి. వాళ్లుండే కాన్పూర్‌లో అప్పటికే అలాంటి ఓ సంఘటన జరిగింది. అందుకే వాళ్లు భయపడింది. ‘నువ్వు అలాంటి ఆలోచనలేవీ చెయ్యకుండా మామూలుగా ఆడుకో... జీవితంకంటే ఆట ఎక్కువేమీ కాదు’ తల్లిదండ్రులు ఈ మాటలు చెప్పి కుల్‌దీప్‌ని శాంతింపజేశారు. అతడి ముగ్గురు అక్కలూ, కోచ్‌ కపిల్‌ పాండే... కూడా అన్నివిధాలా సర్దిచెప్పారు. కుల్‌దీప్‌ అలా అనడానికి కారణం లేకపోలేదు. అతడు అప్పటికే కాన్పూర్‌లో క్లబ్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు. అండర్‌-15 ఉత్తర్‌ప్రదేశ్‌ జట్టుకి ఎంపికవడం గురించి చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ సెలక్టర్లు ఎంపికచేయలేదు. ‘క్రికెట్టే జీవితం అనుకుని బతుకుతున్నాడు. నిద్రలోనూ బంతిని వేస్తున్నట్టు చేతులు తిప్పేవాడు’ అని కొడుకు గురించి చెబుతాడు తండ్రి రామ్‌సింగ్‌ యాదవ్‌. నిజానికి కుల్‌దీప్‌ చదువులో ముందుండేవాడు. అందరిలానే సరదాగా క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టి తండ్రి ప్రోత్సాహంతోనే అకాడమీలో చేరాడు.

 

ఫాస్ట్‌ నుంచి స్పిన్‌కి... 
పాండే నిర్వహిస్తున్న కాన్పూర్‌లోని రోవర్స్‌ క్లబ్‌ అకాడమీలో పదేళ్లపుడు 2004లో శిక్షణ కోసం చేరాడు కుల్‌దీప్‌. ‘సర్‌ నన్ను వసీం అక్రమ్‌లా తయారుచేయండి’ అకాడమీలో చేరిన రోజు కుల్‌దీప్‌ కోచ్‌తో అన్నమాటలివి. ‘చాలామంది పిల్లలు బ్యాట్స్‌మన్‌ అవ్వాలని వస్తారు. కుల్‌దీప్‌ బౌలర్‌ అవుతానని వచ్చాడు. కుల్‌దీప్‌ది ఎడమచేతి వాటం కాబట్టి కుల్‌దీప్‌ని చూడగానే ఎంతో సంతోషించాను’ అని ఆరోజుల్ని గుర్తుచేసుకుంటాడు పాండే. కుల్‌దీప్‌ చేత కొన్ని బంతులు వేయించాడు. అనుభవజ్ఞులు పట్టుకున్నట్టే బంతిని పట్టుకుని వికెట్ల మీదకి సంధించాడు. ఎందుకంటే అప్పటికే వసీం అక్రమ్‌ని బాగా గమనించి అతణ్ని అనుకరించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో కుల్‌దీప్‌ పొట్టిగా, సన్నగా ఉండేవాడు. అతడి తండ్రి కూడా పొడగరి కాదు. ఫాస్ట్‌ బౌలర్‌ అవ్వాలంటే ఎత్తు కూడా ఉండాలి. కుల్‌దీప్‌ భవిష్యత్తులో 5’6’’కి మించి పెరగకపోవచ్చని ఊహించాడు కోచ్‌. అందుకే ఫాస్ట్‌బౌలింగ్‌ కాకుండా స్పిన్‌ బౌలింగ్‌కి మారమన్నాడు. ‘కల నిజం చేస్తాడని వస్తే ఇలా మాట్లాడుతున్నాడేంటి’ అనుకుని అయిష్టంగానే బంతిని తీసుకున్నాడు. అతడు వేసిన తొలిబంతిని చూడగానే ఆశ్చర్యపోవడం కోచ్‌ వంతయింది. కారణం... అరుదైన లెఫ్ట్‌ ఆర్మ్‌ రిస్ట్‌ స్పిన్‌ శైలిలో బంతిని విసిరాడు. ఈ శైలినే చైనామేన్‌ శైలి అంటారు. అలాంటి వాళ్లని టీవీలో చూడ్డం తప్ప పాండే కూడా బయట ఎక్కడా చూడలేదు. కుల్‌దీప్‌కి అది సహజంగా వచ్చింది. ఆరోజే ‘నీ శైలిని ఇలాగే కొనసాగించు’ అని చెప్పాడు. ఒకసారి అకాడమీలో కుల్‌దీప్‌ బంతిని అంచనా వేయలేక ఒక సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ స్టంప్‌ ఔట్‌ అయ్యాడు. అప్పట్నుంచీ అతడికీ కోచ్‌ మాటలమీద నమ్మకం పెరిగింది. నిజానికి పాండే బ్యాట్స్‌మన్‌. ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేస్తుంటాడు. కానీ రిస్ట్‌ స్పిన్నర్‌కి శిక్షణ ఎలా ఇవ్వాలో అతడికి అర్థం కాలేదు. అప్పటికి యూట్యూబ్‌ కూడా లేదు. దిగ్గజ ఆటగాడు షేన్‌ వార్న్‌ రిస్ట్‌ స్పిన్నర్‌. కాబట్టి వార్న్‌ ఆడే మ్యాచ్‌లను టీవీలో చూసేవారు ఇద్దరూ. అతడు బంతిని పట్టుకునే తీరు, రనప్‌, బంతిని వదిలే తీరు... అన్నీ పరిశీలించేవారు. మ్యాచ్‌ చూసిన తర్వాత పాండే, కుల్‌దీప్‌ గమనించిన విషయాల్ని గుర్తుచేసుకుంటూ ప్రాక్టీసు చేసేవారు. అదీ మామూలుగా కాదు, వారంలో ఆరు రోజులు. రోజూ ఆరేడు గంటలపాటు ఇద్దరూ కష్టపడేవారు. అలా వార్న్‌కి ఏకలవ్య శిష్యుడు అయ్యాడు కుల్‌దీప్‌. అంతేకాదు, స్వల్ప వ్యవధిలోనే మెరుగయ్యాడు కూడా. కాన్పూర్‌లో పెద్దవాళ్లు ఆడే లీగ్‌ మ్యాచుల్లోనూ అతడికి చోటు దక్కేది. అలాంటి తను రాష్ట్ర అండర్‌-15 జట్టుకి ఎంపికకాకపోవడం బాధించింది. అయితే ఇందులో ఉన్న మతలబు కోచ్‌కి తెలుసు. సెలక్షన్స్‌ సమయంలో కమిటీ సభ్యుడైన ఓ మాజీ ఆటగాడు కుల్‌దీప్‌ బౌలింగ్‌ యాక్షన్‌ని మార్చి వేయమన్నాడట. దాంతో వికెట్లను రాబట్టలేకపోయాడు. తర్వాత అండర్‌-17 సెలక్షన్స్‌కి వెళ్లినపుడు మాత్రం తన సహజశైలిలో బౌలింగ్‌ చేసి జట్టులోకి ఎంపికయ్యాడు.

ఐపీఎల్‌ ఆదుకుంది 
చైనామేన్‌ శైలివల్ల చాలా వేగంగా కెరీర్‌లో పైపైకి వెళ్లగలిగాడు కుల్‌దీప్‌. కారణం ఈ అరుదైన బౌలర్లని ఎదుర్కోవడంలో బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడటమే. 2014లో భారత అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడాడు కుల్‌దీప్‌. అంతకంటే ముందే 2012లోనే ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టు అతణ్ని ఎంపికచేసుకుంది. అక్కడ రెండేళ్లు ఉన్నప్పటికీ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. 2014లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ జట్టు ఎంపికచేసింది. అప్పట్నుంచీ ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. అక్కడ కూడా 2016లో మొదటిసారి ఆడే అవకాశం వచ్చింది. 
కుల్‌దీప్‌ది అరుదైన శైలి కావడంతో అప్పటి కేకేఆర్‌ కెప్టెన్‌ గంభీర్‌ అతన్ని ప్రోత్సహించేవాడు. అప్పటికి ఆ జట్టులో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు బ్రాడ్‌ హాగ్‌ శైలి కూడా కుల్‌దీప్‌ లాంటిదే. అతడి సమక్షంలో తనను తాను మెరుగుపర్చుకున్నాడు కుల్‌దీప్‌. ‘ప్రపంచానికి నేనెవరో తెలియనపుడు గంభీర్‌ నన్ను జట్టులోకి తీసుకున్నాడు. భారతజట్టుకి ఆడాలన్న కలని నెరవేర్చుకోవడానికి కేకేఆర్‌ అద్భుత వేదిక అయింది. ఈ విషయంలో గౌతీ భాయ్‌కి రుణపడి ఉంటాను. అక్కడ అంతర్జాతీయస్థాయి ట్రైనర్ల సమక్షంలో వ్యాయామం చేసి ఫిట్‌నెస్‌ని మెరుగుపర్చుకున్నాను. ఆ తర్వాత నా ఆటలో చాలా మార్పు వచ్చింది’ అంటాడు కుల్‌దీప్‌. ఆ జట్టుకి వసీం అక్రమ్‌ బౌలింగ్‌ కోచ్‌. అలా తన దగ్గర శిష్యరికమూ చేశాడు. 
ఆటపరంగానే కాదు, ఆర్థికంగానూ కుల్‌దీప్‌ని ఐపీఎల్‌ ఆదుకుంది. 2000లో అతడి కుటుంబం కాన్పూర్‌కి వలస వచ్చింది. అక్కడ ఉంటూ దగ్గర్లోని ఉన్నావ్‌ జిల్లాలోని తమ పొలంలో వ్యవసాయానికి బదులు ఇటుకల బట్టీ పెట్టి వ్యాపారాన్ని మొదలుపెట్టారు రామ్‌సింగ్‌. అది కలిసి రావడంతో కుటుంబం ఆర్థికంగా కాస్త నిలదొక్కుకోగలిగింది. కానీ ఓసారి రోడ్డు ప్రమాదంలో గాయపడి రామ్‌సింగ్‌ ఆసుపత్రి పాలవగా, అకాల వర్షం వచ్చి కాల్చడానికి సిద్ధంగా ఉన్న ఇటుకలన్నీ బురదగా మారాయి. ఆ దెబ్బతో రూ.50 లక్షల నష్టం వచ్చింది. 
కుల్‌దీప్‌ సంపాదించేంతవరకూ వాళ్ల కుటుంబం ఆర్థిక కష్టాల్లోంచి బయట పడలేదు. కుల్‌దీప్‌ని అదృష్టం ఐపీఎల్‌ రూపంలో పలకరించింది. ముంబయి జట్టులో ఏడాదికి రూ.10 లక్షలు వచ్చేది. కోల్‌కత్తా రూ.41 లక్షలు ఇచ్చి జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్‌లో వచ్చిన మొత్తంతోనే ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశాడు. కాన్పూర్‌లో చిన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ని కొన్నాడు. ఓసారి కాన్పూర్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగినపుడు కుల్‌దీప్‌ ఇంటికి వస్తానని చెప్పాడట అక్రమ్‌. కానీ ఇరుగ్గా ఉండే ఇంటికి తీసుకురావడానికి ఇష్టంలేక తప్పించుకున్నాడట కుల్‌దీప్‌. ‘చిన్నపుడే కలిమిలేముల్ని చూశాడు మా అబ్బాయి. ఈరోజు ఇంత డబ్బుని చూస్తున్నా కూడా అతడిలో ఏమీ మార్పు రాలేదు’ అంటాడు రామ్‌సింగ్‌. ప్రస్తుతం అతడి కుటుంబానికి కాన్పూర్‌లోని స్థితిమంతులు ఉండే డిఫెన్స్‌ కాలనీలో ఫ్లాట్‌తోపాటు స్థలం కూడా ఉంది.

 

ఆరంభం అదిరింది 
2014లో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో కుల్‌దీప్‌ భారత్‌ తరఫున అత్యధికంగా 14 వికెట్లు తీయడంతో అదే ఏడాది స్వదేశంలో విండీస్‌తో జరిగిన సిరీస్‌కి జట్టులో చోటు దక్కింది. కానీ ఆడే ఛాన్స్‌ మాత్రం దొరకలేదు. ఆ తర్వాత 2017 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌తో ఏకైక మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. అప్పుడూ తుది జట్టులో చోటు దక్కక నిరాశే ఎదురైంది. చివరకు 2017 మార్చిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కి ఎంపికయ్యాడు. అప్పటికే స్పిన్నర్లుగా అశ్విన్‌, రవీంద్ర జడేజా జట్టులో స్థిరపడిపోవడంతో ఆసారి కూడా అతడికి వేచిచూడటం తప్పలేదు. మరోవైపు ఆ సిరీస్‌లో వ్యాఖ్యాతగా ఉన్న షేన్‌వార్న్‌ని అప్పటి కోచ్‌ అనిల్‌ కుంబ్లే సాయంతో కలిసి ఫ్లిపర్‌ బంతిని వేయడమెలాగో నేర్చుకున్నాడు. ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ముగిసేసరికి 1-1తో రెండు జట్లు సమానంగా నిలిచాయి. ఆఖరి మ్యాచ్‌ గెల్చినవాళ్లదే సిరీస్‌. అదే కుల్‌దీప్‌ ఆరంగేట్ర మ్యాచ్‌ అయింది. కుల్‌దీప్‌ జట్టులోకి వచ్చింది విరాట్‌ స్థానంలో. అవును, ధర్మశాల టెస్టులో గాయం కారణంగా విరాట్‌ ఆటకు దూరమయ్యాడు. కానీ బ్యాట్స్‌మన్‌కు కాకుండా కుల్‌దీప్‌కు అవకాశం వచ్చింది. అతడు తీసిన మొదటి వికెట్‌ డేవిడ్‌ వార్నర్‌ది. ఆస్ట్రేలియాకే చెందిన వార్న్‌ దగ్గర నేర్చుకున్న ఫ్లిపర్‌ బంతితో వార్నర్‌ను అవుట్‌ చేశాడు. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. ఆరోజు సాయంత్రం సచిన్‌ ఫోన్‌... ‘నువ్వు 500 వికెట్లు తీయాలి’ అని దీవెనలాంటి కోరికను చెప్పాడు. అదే ఏడాది జూన్‌లో విండీస్‌పైన వన్డేల్లో అరంగేట్రం చేశాడు. సెప్టెంబరులో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌లో తన సొంత గ్రౌండ్‌ అయిన ఈడెన్‌ గార్డెన్స్‌లో హ్యాట్రిక్‌తో చేతన్‌ శర్మ, కపిల్‌ దేవ్‌ల తర్వాత ఆ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. తర్వాత జట్టులో అతడి స్థానం పదిలంగా ఉంది. ‘విదేశాల్లో ఆడేటపుడు కుల్‌దీప్‌ మా మొదటి ప్రాధాన్య స్పిన్నర్‌’ అని ఇటీవల కోచ్‌ రవిశాస్త్రి చెప్పాడు. ఇటీవల ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకులో రెండో స్థానంలో నిలిచాడు. స్వల్ప వ్యవధిలోనే ఈ స్థాయికి కుల్‌దీప్‌ చేరుకోవడం విశేషం. తను సాధించిన దానిగురించి గుర్తుచేస్తే, ‘నేనింకా కెరీర్‌ ప్రారంభంలోనే ఉన్నాను. కనీసం 15 ఏళ్లు టీమ్‌ ఇండియాకి ఆడాలనేది నా లక్ష్యం’ అని చెబుతాడు. 


వార్న్‌ మెచ్చాడు...

వీలున్నప్పుడల్లా షేన్‌వార్న్‌ని కలవడానికి చూస్తాడు కుల్‌దీప్‌. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌ సమయంలోనూ అతడి సమక్షంలో ప్రాక్టీసు చేశాడు. ఆ సిరీస్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసిన కుల్‌దీప్‌ను మెచ్చుకుంటూ వార్న్‌ ట్వీట్‌ చేయడం గమనార్హం. 
* ప్లేస్టేషన్‌ కుల్‌దీప్‌ ఫేవరెట్‌ వీడియో గేమ్‌. ఈ ఆట అనుభవం తనకు నిజ జీవితంలో ఎదురయ్యే కష్టాల్ని ఎదుర్కోవడంలో సాయపడుతుందంటాడు. 
* కుల్‌దీప్‌కి సినిమాలన్నా ఇష్టమే. నెట్‌ఫ్లిక్స్‌ని ఎక్కువగా చూస్తాడు. ఫుట్‌బాల్‌నీ ఫాలో అవుతాడు. నెయ్‌మర్‌ అభిమాని. 
తనకు సిగ్గు ఎక్కువని చెప్పే కుల్‌దీప్‌, కొత్తవాళ్లతో అంత వేగంగా మాట కలపలేడు. అమ్మాయిలతో అయితే రెండు మూడు సార్లు మాట్లాడితేకానీ బిడియం పోదట. ఈ విషయంలో ఇప్పుడిపుడే కొద్దిగా మార్పు వస్తోందని చెబుతాడు. 
* కుల్‌దీప్‌ మ్యాచ్‌ ఆడే రోజున తల్లి ఉష పూజ గదిలోనే కూర్చుంటుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.