close
శివలింగంలో బ్రహ్మ దేవుడు..!

‘బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం...’ అంటూ శివలింగాన్ని పూజించేటప్పుడు ముందుగా బ్రహ్మని తల్చుకుంటాం. కానీ, భృగు మహర్షి శాపం కారణంగా బ్రహ్మదేవుడికి ఆలయాలు పెద్దగా కనిపించవు. కాశీలో కొలువైన బ్రహ్మ దేవుడి ఆలయం తర్వాత రెండోది చేబ్రోలులో నెలకొని ఉండటం విశేషం. అందుకే ఈ ఆలయాన్ని రెండో కాశీగా పేర్కొంటారు. ఈ క్షేత్రంలోని శివలింగం చుట్టూ బ్రహ్మ నాలుగు ముఖాలు ఉండటంతో ఒకేసారి శివయ్యనూ బ్రహ్మదేవుడినీ దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది. పూర్వం ఇక్కడ 101 దేవాలయాలూ 101 బావులూ ఉండేవంటారు స్థానికులు. కాలక్రమంలో చాలా వరకూ దేవాలయాలు అంతరించిపోయాయి. ప్రస్తుతం నిత్యపూజలు అందుకుంటున్న దేవాలయాల్లో బ్రహ్మలింగేశ్వర దేవాలయం ప్రధానమైంది. ఇక్కడ రోజూ స్వామివారికి పంచామృతంతో అభిషేకాలూ, విశేష అర్చనలూ నిర్వహిస్తారు.

ఇదీ చరిత్ర
ఈ ఆలయాన్ని 1817వ సంవత్సరంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు బహదూర్‌ నిర్మించారు. పద్మాకారంలో నల్లరాతితో ఉన్న లింగానికి నాలుగు వైపులా బ్రహ్మ నాలుగు ముఖాలను తీర్చిదిద్దారు. స్వామిని దర్శించడానికి గర్భగుడికి నాలుగు వైపుల నుంచీ నాలుగు ద్వారాలు ఉండటం విశేషం. ఈ క్షేత్రం కొలను మధ్యలో ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మలింగ దేవాలయానికి నాలుగు దిక్కుల్లో, నాలుగు మూలల్లో వివిధ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. తూర్పున చంద్రమౌళీశ్వరుడూ, పడమర సహస్రలింగేశ్వరుడూ, ఉత్తరాన వేణుగోపాల స్వామీ, దక్షిణాన రంగనాథ స్వామీ కొలువై ఉన్నారు. నాలుగు మూలల్లో రాజ్యలక్ష్మీ, పార్వతీ అమ్మవార్ల విగ్రహాలతో నాలుగు శక్తి ఆలయాలను ఏర్పాటుచేశారు. ఇందులోనే సహస్రలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఒకేసారి 999 చిన్న చిన్న శివలింగాలున్న బృహత్‌ లింగాన్ని ప్రతిష్ఠించారు. రంగనాథ ఆలయంలో ఆదిశేష తల్పంమీద రాజ్యలక్ష్మీ, గోదాదేవిలతో స్వామి కొలువై ఉన్నాడు. రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి చూడముచ్చటగా భక్తులకు దర్శనమిస్తాడు. ఆలయానికి దక్షిణాన పురాతన గాలిగోపురం, ఎర్రరాతితో నిర్మించిన భారీ నందీశ్వరుడి విగ్రహం ఉంటాయి.

చోళులకాలం నాటి ఆలయాలు
ఈ ఆలయ ప్రాంగణానికి దక్షిణంగా చోళులు నిర్మించిన ఆదికేశవస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ కొలువైన విష్ణుమూర్తి కుడిచేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం అపసవ్యంగా ధరించి ఉండటం విశేషం. ఈ ఆలయానికి వెనక వైపున తిరుమలలో ఉన్నట్టు విమాన ఆదికేశవస్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ఈ గోపురం త్రితల విమాన ఆకారంలో ఉంటుంది. ఆలయం మూసి ఉన్న సమయంలో కూడా భక్తులు ఈ విమాన స్వామిని దర్శిస్తే గర్భాలయంలోని ఆదికేశవుడిని దర్శించినట్లేనని భక్తుల విశ్వాసం. కాకతీయుల సేనాధిపతి ఆ కాలంలోనే ఆలయ స్తంభాల కింద కూర్చుని నాట్యశాస్త్రం గురించి రాసుకునేవాడని చెబుతారు. దసరా, ఉగాది, ధనుర్మాస సమయాల్లో స్వామివారికి ప్రత్యేక అలంకరణలూ కల్యాణోత్సవాలూ ఊరేగింపులూ నిర్వహిస్తారు. ఈ ప్రాంగణంలోనే ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది. దీని గోపురం పిరమిడ్‌ ఆకృతిని పోలి ఉంటుంది.

ఇలా చేరుకోవచ్చు
చేబ్రోలులోని చతుర్ముఖబ్రహ్మలింగేశ్వర ఆలయాన్ని చేరుకోవడానికి రైలూ రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. గుంటూరుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం. ప్రధాన బస్‌స్టేషన్ల నుంచి గుంటూరుకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి పొన్నూరు వెళ్లే బస్సు ఎక్కి, చేబ్రోలులో దిగొచ్చు. రైల్లో అయితే గుంటూరు రైల్వే స్టేషన్‌లో దిగి, రోడ్డుమార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

- ఏకాంబర్‌ రాజు గుండ్లపల్లి, ఈనాడు జర్నలిజం స్కూల్‌
ఫొటోలు: ఎస్‌.వంశీ కృష్ణ

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.