close
అక్షర సైనికులు...

మార్పు ఎన్ని రకాలుగా మొదలైనా అక్షరంద్వారా వచ్చినదానికి సాటి రాదేదీ. అందుకే చదువుకి అంత విలువ. కానీ 21వ శతాబ్దంలోనూ మెరుగైన చదువులు అందని పిల్లలు ఎందరో ఉంటున్నారు మనదేశంలో. ఆ పరిస్థితిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నవాళ్లే ఈ అక్షర సైనికులు!

ఆ మాస్టారు... డ్రైవర్‌ కూడా!

తగినంత మంది విద్యార్థులు లేని కారణంగా చాలా ప్రభుత్వ పాఠశాలలు మూతపడిపోవడాన్ని చూస్తున్నాం. ఆ జాబితాలో తమ పాఠశాల కూడా చేరే రోజు వస్తుందేమోనని ఆందోళన చెందాడా ఉపాధ్యాయుడు. టీచర్లకి అది కాకుంటే ఇంకో బడి. కానీ ఆ చుట్టుపక్కల పిల్లలకు అదొక్కటే బడి. ఆయన ఆందోళనకు అదే కారణం. కానీ చుట్టుపక్కల ఊళ్లవాళ్లు ఆ స్కూల్‌కి పోవాలంటే కొంతమేర అడవి బాటన నడవాలి. అందుకే బడికి వెళ్లమని తల్లిదండ్రులు పిల్లల్ని బలవంతం చేయరు. టీచర్లు కూడా ఈ విషయంలో గట్టిగా అడగలేరు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న బారలి ప్రాథమికోన్నత పాఠశాల పరిస్థితి ఇది. ‘దీనికి పరిష్కారం ఎలా?’ అని ఆలోచించారు అక్కడ పనిచేసే ఉపాధ్యాయుడు రాజారాం. ఆయనకి ఒక్కటే దారి కనిపించింది... పిల్లల్ని బస్సులో క్షేమంగా స్కూల్‌కి తీసుకొచ్చి సాగనంపడం. ఇదే విషయాన్ని తన స్నేహితులూ, పాఠశాల పూర్వ విద్యార్థులూ అయిన విజయ్‌, గణేష్‌లకు చెప్పారు. వారు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేశారు. ఆ మొత్తంతో ఒక స్కూల్‌ బస్‌ కొన్నారు. కానీ దాన్ని నడిపేందుకు డ్రైవర్‌ని పెట్టాలంటే నెలకు రూ.10వేలు ఖర్చు. అంత మొత్తం కేటాయించడం కష్టమని తానే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకుని డ్రైవర్‌ అవతారమెత్తారు రాజారాం. నాలుగు విడతల్లో విద్యార్థుల్ని స్కూల్‌కి తీసుకొచ్చి తిరిగి పంపుతారు. రోజూ రానూపోనూ రెండుగంటల పాటు బస్సుని నడుపుతారు. ఈ మార్పుతో విద్యార్థుల సంఖ్య గత రెండేళ్లలో 50 నుంచి 90కి పెరిగింది కూడా.

ఆంగ్లంలో అదుర్స్‌!

ఆ ఊరి బడికి అప్పటివరకూ చాలామంది టీచర్లు వచ్చారు, వెళ్లారు. కానీ అన్నపూర్ణ టీచర్‌ వచ్చాక ఆ పిల్లల రాత మారిపోయింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కందాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువుకునేది తమిళ మీడియంలోనే. అయినా ఇంగ్లిష్‌లో కాన్వెంట్‌ పిల్లలకంటే చాలా మెరుగ్గా ఉంటారు. ఎందుకంటే అన్నపూర్ణ వాళ్ల ఇంగ్లిష్‌ టీచర్‌. పిల్లలు ఇంగ్లిష్‌ నేర్చుకోవడంలో ఇబ్బంది పడటాన్ని చూసి ఆ స్కూల్లోనే ఒక క్లాస్‌రూమ్‌ని ఇంగ్లిష్‌ ల్యాబ్‌గా మార్చారామె. అక్కడ పిల్లలకు ప్రొజెక్టర్‌ సాయంతో స్మార్ట్‌ బోర్డుమీద పాఠాలు చెబుతారు. ఆంగ్లంలో ఉచ్చరణ మెరుగుపర్చడానికి పిల్లలకు ఫొనెటిక్స్‌ నేర్పుతారు. తద్వారా పిల్లలు బట్టీ పట్టకుండా ఆంగ్ల భాషని సులభంగా అర్థంచేసుకుని నేర్చుకుంటున్నారు. పిల్లలకు ట్యాబ్‌ల సాయంతో ఆంగ్లకథలూ, పద్యాలూ చెబుతారు. ఇంకా చాలా రకాల బోధన సామగ్రి ఉంటుంది ఆ తరగతి గదిలో. తన నగలు అమ్మి రెండు లక్షల రూపాయలతో ఇవన్నీ కొన్నారామె. ‘ప్రభుత్వ పాఠశాల కదా అని తేలిగ్గా కొట్టిపడేయకండి’ అంటూ ఫేస్‌బుక్‌లో తమ పిల్లల ఆంగ్ల ప్రతిభను తెలిపే వీడియోల్ని పెడుతుంటారామె. అది చూసి చాలామంది ప్రోత్సాహకంగా ఆ స్కూల్‌కి విరాళాలు పంపుతున్నారు. పిల్లలతో ఆంగ్లంలోనే మాట్లాడుతూ వారు కూడా తనతో అదే భాషలో మాట్లాడేలా ప్రోత్సహిస్తుండటంతో వాళ్లు స్పష్టంగా ఇంగ్లిష్‌లో మాట్లాడగలగుతున్నారు. ఈ క్లాస్‌రూమ్‌ని చూడ్డానికి జిల్లాలోని ఇతర ప్రభుత్వ స్కూళ్లనుంచీ ఉపాధ్యాయులు వస్తుంటారు.

శ్మశానవాటికే పాఠశాల!

బెంగళూరులోని కల్పల్లి శ్మశానవాటిక ప్రాంతం... అక్కడ పిల్లలు సమాధుల మధ్యనే ఆడుతూ కన్పిస్తారు. ఎందుకంటే వాళ్ల కుటుంబాలు ఉండేదీ అక్కడే. ఆ పిల్లలు బడికి వెళ్లేది తక్కువ. సోషల్‌ వర్క్‌ విద్యార్థులుగా ఈ కుటుంబాల జీవనశైలి మీద పరిశోధన చేయడానికి వచ్చిన సామ్యూల్‌, గ్లీడా డిసిల్వా... తమ చదువు పూర్తయ్యాక ‘హ్యాండ్‌ ఇన్‌ హ్యాండ్‌’ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి ఇక్కడి పిల్లలకు చదువు చెప్పే బాధ్యతను తీసుకున్నారు. ఈ పిల్లలు పదో తరగతి దాటి చదువుకున్నది అరుదు. 13-14 ఏళ్లకే చదువు మానేసి మగ, ఆడ అని తేడా లేకుండా పిల్లలందరూ తల్లిదండ్రులతోపాటు శవాల్ని ఖననం చేసేందుకు అవసరమైన గుంతల్ని తవ్వే పనిలో మునిగిపోతారు. దాంతో అటు చదువుకీ ఇటు మెరుగైన ఉపాధికీ దూరమైపోయి జీవితకాలం పేదరికంలోనే మగ్గిపోతుంటారు. అందుకే పిల్లల దగ్గరకే వచ్చి సాయంత్రం వేళల్లో పాఠాలు చెబుతున్నారు ఈ మిత్ర ద్వయం. వారిని స్కూళ్లకి వెళ్లేలా ప్రోత్సహిస్తూ, ఈ పిల్లలకు సాధారణ పాఠాలతోపాటు జీవిత పాఠాల్ని నేర్పుతున్నారు. కంప్యూటర్‌ క్లాసులూ చెబుతారు. ఇక్కడ దాదాపు 40 మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. మరోతరం మట్టిపాలు కాకూడదన్న వీరి ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.