close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ పనికన్నా చావే నయమనుకున్నా!

తెలుసా మీకు... స్వచ్ఛభారత్‌ అంటూ ఊరూవాడా హోరెత్తిపోతున్న ఈరోజుల్లోనూ మానవ విసర్జితాలని చేతుల్తో తీసే పాకీ పనివాళ్లు మనదేశంలో లక్షలాది మంది ఉన్నారు! అలాంటి కుటుంబం నుంచే వచ్చి ఆ అమానుషానికి చరమగీతం పాడాలని ఉద్యమకర్తగా మారారు బెజవాడ విల్సన్‌. ‘సఫాయి కర్మచారి ఆందోళన్‌’ సంస్థను ఏర్పాటు చేసి దేశంలోని ఆ కార్మికులందరినీ ఒకతాటిపైకి తెచ్చి వాళ్లకి గౌరవప్రదమైన ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నారు. ఒక పాకీ పనివాడిగా వెళ్లాల్సిన విల్సన్‌ రామన్‌మెగసెసే విజేతగా ఎలా ఎదిగాడో ఆయన మాటల్లోనే...

అది 1982వ సంవత్సరం. పదోతరగతి ఫస్ట్‌క్లాస్‌లో పాసై... కాలేజీలో చేరాలనుకున్నాను. అలా చేరడానికి ముందు పదో తరగతి అర్హతతో ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్ఛేంజ్‌లో రిజిస్టర్‌ చేసుకోవడం మంచిదన్నాడు మా అన్న. తనే నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. ఎక్స్ఛేంజ్‌లో నా సర్టిఫికెట్స్‌ ఇస్తే అక్కడుండే గుమాస్తానే అప్లికేషన్‌ నింపి... నా చేతికి ఓ చిట్టీ మాత్రం ఇచ్చాడు. అందులో ఉద్యోగం అనే కాలమ్‌ కింద రోమన్‌ సంఖ్య నాలుగు పక్కనే రెండు పొడి ఇంగ్లిషు అక్షరాలున్నాయి. అదేం ఉద్యోగమో నాకు అర్థం కాలేదు. ‘నాకు ఏ ఉద్యోగానికని రాశారు సార్‌!’ అన్నాను ఆ గుమాస్తాతో. ‘స్వీపర్‌ కాలనీవాళ్లకి ఏ ఉద్యోగం వస్తుందో అదే రాశాను... మీ అన్నని అడుగు వివరంగా చెబుతాడు!’  అన్నాడు చిరాగ్గా. అన్నని అడిగితే ‘పాకీ పనే రాశాడ్రా!’ అన్నాడు. ఆ క్షణాన కోపం, ఉక్రోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎంతగా స్వీపర్‌ కాలనీ నుంచి వచ్చినా నా పదో తరగతి మార్కులనైనా చూడాలికదా! నాక్కూడా ఆ ఉద్యోగమే రాయడమేంటీ! ఆ క్లర్క్‌ ముందుకెళ్లి నాకిచ్చిన చీటిని ముక్కలు ముక్కలు చేసి పడేసి వచ్చాను.

అమ్మ కల ఇది!
మాది కర్ణాటకలోని కోలార్‌గోల్డ్‌ ఫీల్డ్స్‌... క్లుప్తంగా కేజీఎఫ్‌. బంగారు గనుల కారణంగా వస్తున్న నిధులతో అందంగా తీర్చిదిద్దిన ఆ టౌన్‌షిప్‌కి మా మురికివాడ ఓ మచ్చలా ఉండేది! మా పూర్వీకులది ప్రకాశం జిల్లాలోని కంబాలదిన్నె. అక్కడి నుంచి నాన్న 1930లలోనే ఇక్కడికొచ్చి స్థిరపడ్డారట. ఆయన పారిశుద్ధ్య కార్మికుడు. ఆయనే కాదు అమ్మా, అన్నయ్యలిద్దరూ కూడా పాకీ పనికే వెళ్తుండేవారు. ఇంట్లోవాళ్లందరూ ఇదే వృత్తిలో ఉన్నా నేనుమాత్రం అటువైపు వెళ్లకూడదని చెబుతుండేది అమ్మ. నేను ఎప్పుడు పరీక్షలకి వెళ్లబోతున్నా నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ‘ఇవెప్పుడూ మేం చేసిన పనులు చేయకూడదయ్యా. నువ్వెప్పుడూ రాసే ఉద్యోగమే చేయాలి!’ అని ముద్దుపెట్టేది. నిజానికి, ఆమెకున్న ఒకే ఒక కల అది. ఆ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌లో ఆ కలని ఎక్కడ కూలదోస్తారోననే భయం వల్లే ఆ క్లర్క్‌పైన అంత కోపం వచ్చిందేమో! ఆ అవమానం నన్ను చాలా రోజుల దాకా తొలుస్తూనే ఉండిపోయింది. అసలు దీనంతటికీ కారణం మా కాలనీవాళ్లు తాగి తందనాలాడటమేనని అప్పట్లో నాకు తోచింది. దాంతో ఇంటింటికీ వెళ్లి ‘మీ పిల్లలు చదువుకోవాలంటే... తాగొద్దన్నా!’ అని చెప్పేవాణ్ణి. ‘మేం చేసే పనికి తాగక తప్పదురా అబ్బాయ్‌!’ అనేవాళ్లు. ‘మరి ఇదే పనిచేస్తున్న ఆడవాళ్లు తాగడం లేదుకదన్నా!’ అని వాదించేవాణ్ణి. ఓసారి అలా వాదన ముదిరి ‘ఒరే! మా కష్టమేంటో చూద్దువు రారా!’ అన్నారు. వెళ్లాను. అక్కడ నేను చూసిన దృశ్యాలే నా జీవితాన్ని మార్చేశాయి.

మనుషులు చేసే పనేనా?
ఆవు పేడని ఎరువులుగా వాడటం మనకు తెలుసు. కేజీఎఫ్‌ ఎంతైనా ‘చాలా ప్రణాళికాబద్ధమైన’ సిటీ కదా! మానవ విసర్జితాలని ఎరువులుగా మార్చి అమ్మి సొమ్ము చేసుకునేది! బ్రిటిష్‌వాడి బుర్రకుపుట్టిన ఆ ఆలోచనని స్వతంత్రం తర్వాత కేంద్రప్రభుత్వం కూడా కొనసాగించడమే పెద్ద విషాదం! ఆ పనిలో మా కాలనీవాళ్లే సమిధలయ్యేవారు.
మావాళ్లు ఇంటింటా పాయిఖానాల్లోనూ, ప్రజా మరుగుదొడ్లలోనూ చేరిన విసర్జితాలని ఓ ఇనుప పెంకు సాయంతో ఎత్తి, దాన్నంతా ఆటోలో పోసి... ఊరి శివారులోని ఓ పెద్ద తొట్టెలో వేసేవారు. ఆరోజు నన్ను ఆ పెద్ద తొట్టె దగ్గరకే తీసుకెళ్లారు. వాళ్లు తాము ఊరంతా శుభ్రం చేసి తెచ్చిన మలమూత్రాల్ని ఓ బకెట్టు సాయంతో అందులో పోస్తుండటం చూసి... ‘అన్నా...! ఇదేమిటిది... మనం మనుషులం కదా... ఇలాంటివి చేయొచ్చా... ఆపండి!’ అని పెద్దగా అరవడం మొదలుపెట్టా. నా అరుపులకి ఉలిక్కిపడ్డ ఓ వ్యక్తి బెదిరిపోయి తన చేతిలో ఉన్న బాల్చీని అందులోనే పడేశాడు. వెంటనే ‘అరె! బకెట్‌ లోపల పడిపోతే మేస్త్రీ అరుస్తాడే!’ అంటూ తొట్టెలో దూకేశాడు... అంటే మెడలోతు మలంలోకి!! ఆ దృశ్యం చూసి నా కళ్లు తిరిగిపోయాయి. ఒళ్లంతా జుగుప్సతో నిండిపోయింది. ఆ దుర్వాసనకి డోకు వచ్చేస్తోంది. ‘పేడ పురుగులకన్నా హీనమైన బతుకా మనది!’ అన్న ఆలోచనతో ఏడుపు తన్నుకొచ్చింది. నేను ఏడవడం చూసి ‘మీ ఇంట్లోవాళ్లూ ఇదే చేస్తారోయ్‌!’ అన్నారు వాళ్లు నవ్వుతూ. మా ఇంట్లోవాళ్లూ పారిశుద్ధ్య కార్మికులని తెలిసినా అప్పటిదాకా చెత్తని మాత్రమే ఊడుస్తారని అనుకునేవాణ్ణి. అలా కాదని తెలిశాక హుటాహుటిన ఇంటికి వెళ్లాను. నాన్నా, అన్నా ఇదంతా చాలా మామూలే అన్నట్టు మాట్లాడటమే కాదు,  నన్నే తిట్టారు. ఉక్రోషం, బాధ, కోపం... ఏం చేయాలో అర్థంకాలేదు. ఇలాంటి బతుకుకన్నా చావే నయమని ఊరిబయట ఉన్న చెరువు దగ్గరికెళ్లాను. అందులో దూకి చచ్చిపోదామనుకున్నాను. కానీ చివరి క్షణాన ఏదో నన్ను ఆపింది... అది పిరికితనమో నావల్ల ఇక్కడి వాళ్లకి మంచి జరిగితీరుతుందనే నమ్మకమో తెలియదు.

నేనే ఎమ్మెల్యే అన్నారు...
వారం తర్వాత పిచ్చమ్మ అనే అరవైఏళ్ల ముసలామె నా దగ్గరకొచ్చింది. ‘ఆరోజు నువ్వు ఏడవడం చూశాను బాబూ! నీకోసం ఏడవకుండా ఎదుటివాళ్ల కోసం ఏడ్చావు కదా... అప్పటి నుంచీ నేను పాకీ పని మానేసి హోటల్‌లో కప్పులు కడుగుతున్నాను. రా... మనిద్దరం కలిసి అందరితో ఈ పనిచేయొద్దని చెబుదాం!’ అంది. నాకు ఆమె ఓ దేవతలాగే కనిపించింది ఆ రోజు! తనే నా మొదటి కార్యకర్తయింది. ఇద్దరం కలిసి ఇంటింటికీ వెళ్లి చెప్పడం మొదలుపెట్టాం. ఎవరూ వినిపించుకోలేదు. కార్మికులకి చెప్పడం కన్నా కేజీఎఫ్‌ యాజమాన్యంతో తలపడటం మంచిది అనిపించింది. భారత్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ ఆఫీసుకెళ్లి అక్కడి మేనేజర్‌తో మాట్లాడబోతే నన్ను మెడపట్టి బయటికి గెంటించాడు. అప్పుడే నాకు తెలిసిన ఓ లాయర్‌ సలహాతో ‘మీరు నీళ్లులేని మరుగుదొడ్లు(డ్రై లెట్రిన్స్‌) మూసేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను...’ అంటూ లేఖ రాశాను. దానికి స్పందనొచ్చింది. కొత్తగా ఫ్లష్‌ లెట్రిన్స్‌ని టౌన్‌షిప్‌లో అంచలంచలుగా ఏర్పాటుచేస్తున్నామనీ... అందుకోసం మూడులక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామనీ దానికి జవాబు ఇచ్చారు. ‘నిజంగానే ఫ్లష్‌ టాయిలెట్స్‌ని నిర్మిస్తున్నారా?’ అని ఆరా తీస్తే ఒక్కటీ లేవు. ఆ విషయాన్ని పత్రికల దాకా తీసుకెళ్లా. దాంతో దాదాపు ఎనిమిది మంది మంత్రులు అక్కడికొచ్చి కేజీఎఫ్‌(అది కేంద్రప్రభుత్వం అధీనంలో ఉంటుంది)పైన ఒత్తిడి తెచ్చారు. రెండు నెలల్లో కేజీఎఫ్‌లోని డ్రై లెట్రిన్స్‌ని పూర్తిగా కూల్చివేశారు. నా తొలి విజయం అది! ఇరవై నాలుగేళ్లయినా నిండని నన్ను ఎమ్మెల్యేగా నిలుపుతామన్నారు! కానీ అప్పటికే నేనో నిర్ణయానికి వచ్చేశాను. కేజీఎఫ్‌లో నా విజయంతో దేశమంతా ఇలాంటి మరుగుదొడ్లన్నింటినీ కూల్చేయాలనుకున్నాను. ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్‌ వచ్చేశాను.

ఆయనే నా గురువు...
హైదరాబాద్‌లో మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్సార్‌ శంకరన్‌గారిని కలిశాను. నా ఆశయాలూ, ఆలోచనలూ ఆయనకు చెప్పాను. ‘ఇంత చిన్న వయసులో గొప్ప సంకల్పం నీది. నీకెప్పుడూ తోడుగా ఉంటా’ అన్నారు. ఆ మాట నిలుపుకున్నారాయన... తన తుదిశ్వాస దాకా మమ్మల్ని వీడలేదు. ఈ వ్యవస్థపట్ల చాలా కోపంతో ఉన్న నాకు... మన రాజ్యాంగం గొప్పతనాన్నీ, మన ప్రజాస్వామ్యంలోని సమానత్వ విలువలనీ అర్థమయ్యేలా చేసింది ఆయనే. 1993లో కేంద్రప్రభుత్వం ‘డ్రై లెట్రిన్స్‌’ విధానాన్ని నిషేధిస్తూ ఓ చట్టం తెచ్చింది. దాని కోసం నాటి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడ అలాంటి మరుగుదొడ్లున్నాయో చెప్పేలా ఓ జాబితా తయారుచేశాం. అవన్నీ నా ముందు పెట్టిన శంకరన్‌గారు కొత్త చట్టం సాయంతో ‘వీటిని నిర్మూలించడానికి నీకెంత కాలం పడుతుంది!’ అని అడిగారు. నేను నా కేజీఎఫ్‌ అనుభవంతో ‘ఆరునెలలు చాలండీ!’ అంటే ఆయన పడీపడీ నవ్వారు!

ఇవే మేం సాధించింది...
శంకరన్‌గారి నవ్వులోని ఆంతర్యమేంటో నాకు పోనుపోను అర్థమైంది. ఆరునెలలు కాదు... ఆరేళ్లు కూడా కాదు... పన్నెండేళ్లు పట్టింది నాకు! 2001లో నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి 90 శాతం దాకా వాటిని నిర్మూలించేశాం. మరి మిగతా రాష్ట్రాలు ఇలా ఎందుకు చేయలేకపోయాయనే ప్రశ్న వచ్చింది... లోపమంతా 1993లో కేంద్రం తెచ్చిన చట్టంలోనే ఉందని అర్థమైంది. దాన్ని బలోపేతం చేయాలని కోరుతూ 2003లో మా సంస్థ తరఫున సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశాను. అందుకోసమే తొలిసారి దిల్లీ వెళ్లాను. ఓవైపు చట్టపరంగా పోరాడుతూనే... ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితులు మనకన్నా దారుణంగా ఉండటంతో అక్కడి సఫాయి కార్మికులందరినీ ఒకతాటిపైకి తెచ్చే పనిలో పడ్డాను. చూస్తుండగానే దేశవ్యాప్తంగా 500 జిల్లాలకు మా సంస్థని విస్తరించాం. ఏడువేలమందిని కార్యకర్తలుగా చేసుకున్నాం. వీళ్లలో 90 శాతం స్త్రీలే! మా యాత్రలూ, ఆందోళనలతో 1993 చట్టాన్ని పూర్తిగా పక్కనపెట్టి 2013లో కొత్త చట్టం తీసుకొచ్చేలా ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చాం. ఈ కొత్త చట్టంలో డ్రైనేజీలోపలికి దిగి శుభ్రం చేసే కార్మికులనీ చేర్చేలా చూశాం. అప్పటి నుంచీ డ్రైనేజీల్లో పనిచేస్తూ చనిపోయినవారి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తున్నారు. పారిశుద్ధ్య వృత్తి నుంచి బయటకు రావాలనుకుంటే 40 వేల రూపాయలు ఇప్పిస్తున్నాం. ఇప్పటిదాకా మూడులక్షలమంది కార్మికులకి కొత్త జీవితాలనిచ్చాం!
నిజానికి, వీటన్నింటితో మేం సంతృప్తి పడటానికీ ఏమీలేదు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లాంటి రాష్ట్రాలు ఇప్పటికీ డ్రై లెట్రిన్స్‌ని కొనసాగిస్తున్నాయి. ఇంకా లక్షలమంది కార్మికులు ఇదే వృత్తిలోనే బతుకీడుస్తున్నారు. వాళ్లందరికీ కొత్త జీవితాన్ని ఇవ్వందే మేం విజయం సాధించినట్టు ఎలా అవుతుంది?!


ఈ అవార్డు వాళ్లదే...!

ఇంట్లో చంటిపిల్లలుంటే వాళ్ల మలమూత్రాలన్నీ తీసేది తల్లి మాత్రమే! ఎప్పుడో తప్ప ఇంట్లో మగవాళ్లెవరూ ఆ పని చేయరు. దీని వెనకున్నది పురుషాధిక్య భావజాలమే. ఆ భావజాలమే పారిశుద్ధ్య పనుల్లోనూ కనిపిస్తుంది. మగవాళ్లు ఎక్కువ కూలీ, సౌకర్యాలూ ఉండే పనులు ఎంచుకుంటే... మలమూత్రాల్ని ఎత్తే పనుల్ని స్త్రీలకి అప్పగిస్తారు. అందుకే డ్రై లెట్రిన్స్‌ని శుభ్రం చేస్తున్నవారిలో 98 శాతం మహిళలే ఉంటారు. ఆ కారణం వల్లే మా సంస్థ సభ్యుల్లోనూ, ప్రధాన కమిటీలోనూ మూడింట రెండొంతులు స్త్రీలే ఉన్నారు. నేను కేవలం వాళ్లని సంఘటితం చేసే సమన్వయకర్తని మాత్రమే. అందుకే రామన్‌ మెగసెసె అవార్డు అందుకునేటప్పుడూ ఈ అవార్డు ఆ తల్లులదేనని చెప్పాను!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.