close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మజిలీ... మా వైజాగ్‌ కథే!

తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు ప్రభావితం కాని కుర్రాళ్లు ఉండరు. కానీ ఆ ప్రభావం చాలామందిలో తాత్కాలికమే. ఎందుకంటే సినిమా కష్టాలు ఎలా ఉంటాయో వాళ్లకి తొందరగానే అర్థమవుతుంది. అవి తెలిశాక కూడా ‘సినిమానే జీవితం’ అనుకునేవారు అతి కొద్దిమంది ఉంటారు. అలాంటివారిలో శివ నిర్వాణ ఒకరు. దర్శకుడిగా మారడానికి అతడు సుదీర్ఘ ప్రయాణం చేశాడు. ‘నిన్నుకోరి’ తో హిట్‌ అందుకుని, ‘మజిలీ’తో మరోసారి మనముందుకు వచ్చిన శివ సినిమా జర్నీ గురించి అతడి మాటల్లో...

డిగ్రీ పూర్తవగానే ‘చదివింది చాలు ఇక సినిమాల్లోకి వెళ్లాల్సిందే’... అనుకుని ఇంట్లో చెప్పాపెట్టకుండా చెన్నై రైలెక్కేశాను. కొన్నాళ్లు అక్కడ ఉండివచ్చిన ఫ్రెండ్‌ని తోడు తీసుకువెళ్లాను. అక్కడ మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరి, కొన్నాళ్లు పనిచేస్తే దర్శకుణ్ని కావొచ్చన్న నమ్మకంతో నా ప్రయాణం మొదలుపెట్టాను. చెన్నైలో దిగాక రైల్వే స్టేషన్లో స్నానం చేసి, దగ్గర్లోని షాపింగ్‌ మాల్‌లో సెక్యూరిటీ దగ్గర బ్యాగులు పెట్టి మణిగారి ఆఫీసుకి వెళ్లాం. పరిస్థితి చూస్తే ఆయన్ని కలవడం కాదు, గేటు దాటడమే కష్టంగా ఉంది. అలా అయిదు రోజులు తిరిగాక ఆరో రోజు సెక్యూరిటీ గార్డు పిలిచి రోజూ వస్తున్నారెందుకని అడిగాడు. మా వాడు విషయం చెబితే, ‘రాత్రి ఈ ప్రాంతంలో పెద్ద దొంగతనం జరిగింది. అనుమానంగా కనిపిస్తే పోలీసులు మక్కెలు ఇరగ్గొట్టి బొక్కలో పడేయగలరు’ అని బెదరగొట్టేశాడు. అప్పటికి మా దగ్గరున్న డబ్బూ అయిపోయింది. ఇంట్లో వాళ్లు మమ్మల్ని వెతుకుతున్నారనీ, అమ్మ నామీద బెంగ పెట్టుకుందనీ చెప్పాడో ఫ్రెండ్‌. లాభం లేదని తిరిగి వచ్చేశాం. ఆ తర్వాత నాన్నతో సినిమాలపైన నాకున్న ఇష్టం గురించి చెప్పాను. ‘వెళ్దువుగానీ ఇంకా చదువుకో’ అన్నారు. దాంతో తొమ్మిది నెలల్లో పూర్తయిపోతుందని బీఈడీలో చేరాను. కాదు పీజీ చెయ్యి అనడంతో ఎమ్మెస్సీ చేశాను. తర్వాత 2005లో వైజాగ్‌లో ట్రైన్‌ ఎక్కి హైదరాబాద్‌ వచ్చాను. అసలు నాకు సినిమా పిచ్చి ఎక్కడ మొదలైందో చెప్పాలంటే మళ్లీ వైజాగ్‌ వెళ్లాలి.

ఆ సినిమా మార్చేసింది!
మా ఊరు విశాఖ జిల్లా సబ్బవరం. టెన్త్‌ వరకూ అందరిలాగే నాకూ సినిమాలంటే ఆసక్తి. అప్పట్లో శివరాత్రి, వినాయక చవితికి టీవీలో వీసీపీ ద్వారా సినిమాలు వేసేవారు. అలాంటపుడు అక్కడ కచ్చితంగా ఉండేది మా బ్యాచ్‌. ఇంటర్మీడియెట్‌కి వైజాగ్‌లోని బీవీకే కాలేజీలో చేరి బైపీసీ గ్రూప్‌ తీసుకున్నాను. కాలేజీ ఒంటి గంటవరకూ ఉండేది. మధ్యాహ్నం ఖాళీ... అందరికీ. కానీ నేను మాత్రం మ్యాట్నీ సినిమా చూడ్డంలో బిజీగా ఉండేవాణ్ని. వైజాగ్‌లో అప్పట్లో 25 థియేటర్లు ఉండేవి. నేను చూడని సినిమా ఏ థియేటర్‌లో ఆడితే ఆరోజు అక్కడికి వెళ్లిపోయేవాణ్ని. ఆదివారం కాలేజీకి సెలవు కాబట్టి ఆరోజు మాత్రమే సినిమాకి సెలవు. 1997లో ‘ప్రేమించుకుందాం రా’ సినిమాని జగదంబా థియేటర్‌లో చూశాను. ఆ థియేటర్‌లో సినిమా చూడ్డం అదే ఫస్ట్‌ టైమ్‌. ఏసీ, డీటీఎస్‌, 70 ఎం.ఎం. ఆ అనుభవం చాలా విలాసంగా అనిపించింది. సినిమా ప్రేక్షకుడిగా నా అనుభవాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. తర్వాత నుంచి ఆ థియేటర్లో రిలీజైన హాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాల్నీ చూసేవాణ్ని. 1998లో వచ్చిన ‘సత్య’ సినిమా చూడ్డానికి దాదాపు రోజూ వెళ్లేవాణ్ని. కానీ రోజురోజుకీ జనాలు తగ్గిపోతుండేవారు. ‘ఈ సినిమా జనాలకి నచ్చలేదు, నాకెందుకు నచ్చుతోంది’ అన్న సందేహం వచ్చింది. తర్వాత అర్థమైందేంటంటే... పాటలూ, ఫైట్లూ, హీరోహీరోయిన్లకంటే కూడా కథ, తీసిన విధానం నాకు నచ్చిందని. ఆరోజునుంచి సినిమాలకి సంబంధించిన టెక్నికల్‌ టీమ్‌ ఎవరో కూడా చూడ్డం మొదలుపెట్టాను.

సీరియల్‌కీ పనిచేశాను...
ఇంటర్‌ తర్వాత డిగ్రీకి అనకాపల్లిలో చేరాను. అక్కడా నా సినిమా ప్రయాణం కొనసాగింది. బీఈడీ అక్కడే చేశాను. ఆపైన వైజాగ్‌ వచ్చి భాష్యం స్కూల్లో సైన్స్‌ టీచర్‌గా పనిచేస్తూ దూరవిద్యలో పీజీ చేశాను. రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌ వచ్చి కృష్ణానగర్‌లో వాలిపోయాను. ఎంత కష్టమొచ్చినా భరించి నా సినిమా కలని నిజం చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో వచ్చాను. కానీ ఊహించినదానికంటే ఎక్కువ కష్టాలు పడాల్సి వచ్చింది. డైరెక్టర్‌ పరశురామ్‌గారిది నర్సీపట్నం. తెలిసిన వాళ్లద్వారా ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాలని ప్రయత్నించాను. కానీ అప్పటికే ఆయన దగ్గర డజనుకుపైగా అసిస్టెంట్లు ఉండటంతో చోటు దొరకలేదు. రోజూ ఏదో ఒక డైరెక్టర్‌ ఆఫీసుకి వెళ్లి అసిస్టెంట్‌గా చేరుతానని అడిగేవాణ్ని. ‘రేపు రా’, ‘వారం తర్వాత కనబడు’ అనేవారు. వాళ్లు చెప్పినట్టే వెళ్లేవాణ్ని. ఖాళీల్లేవని అప్పుడు చెప్పేవారు. కానీ నా దండయాత్ర కొనసాగుతూనే ఉండేది. మధ్యలో కొన్నిసార్లు షూటింగ్‌ చూడ్డానికి వెళ్లేవాణ్ని. డైరెక్టర్‌ కాదు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయినా కాగలమా అన్న సందేహం వచ్చేది షూటింగ్‌ స్పాట్‌లో హడావుడి చూస్తే. ఇంకొందరు ‘సీరియల్‌ చేస్తున్నాం పనిచేస్తావా’ అనేవారు. ఆ ఛాన్స్‌నీ వదులుకునేవాణ్ని కాదు. అక్కడా ‘24 ఫ్రేమ్స్‌’ ఉంటాయి కదా! వి.ఎన్‌.ఆదిత్య గారి దగ్గర ‘మనసు మాట వినదు’ సినిమాకి మొదటిసారి అసిస్టెంట్‌గా పనిచేశాను. అలా కొందరితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఒకసారి రామ్‌ గోపాల్‌వర్మ గారికి ఒక కథ చెప్పడానికి కలిశాను. అది ఓకే అవ్వలేదు కానీ ఆయన అప్పుడు చేస్తున్న ‘రక్తచరిత్ర’ షూటింగ్‌ని పరిశీలించే అవకాశం ఇచ్చారు. దాదాపు నెల రోజులు ఆ సినిమాతో పరోక్షంగా ప్రయాణించాను. తర్వాత మళ్లీ పరశురామ్‌ని సంప్రదిస్తే రమ్మన్నారు. ఆయన దగ్గర ‘సోలో’, ‘సారొచ్చారు’ సినిమాలకి అసిస్టెంట్‌గా పనిచేశాను. నిజం చెప్పాలంటే అప్పుడే నాకు వర్క్‌ నేర్చుకునే అవకాశం బాగా వచ్చింది. సినిమా రంగంలో ఒకరు చేయూత ఇవ్వందే పైకి రాలేం. ఎవరూ మనకు ఊరకే చేయందించరు కూడా. మన క్రమశిక్షణ, పనితీరు, స్వభావం అన్నీ పనిచేస్తాయి. ‘అవకాశం రాకపోవడం తప్పుకాదు. కానీ, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే తప్పే’ అనుకుని పనిచేసేవాణ్ని. ఇండస్ట్రీలో ఉండాలని మనం అనుకుంటాం, అలాగే మనతోటి వాళ్లూ ఫీలైతే మన గురించి పరిశ్రమలో అందరికీ తెలుస్తుంది.

షార్ట్‌ఫిల్మ్స్‌ ఓ పాఠం
పరశురామ్‌ గారి దగ్గర అనుభవంతో సొంతంగా సినిమా తీయగలనన్న నమ్మకం వచ్చింది. దాంతో పరిశ్రమలోని కొందరు వ్యక్తుల్ని కలిసి కథలు వినిపించేవాణ్ని. వాళ్లకి కథ నచ్చినా కూడా నేను తీయలేనేమో అన్న సందేహం ఉండేది. ఇలా కాదని, నా దగ్గరున్న కొద్దిపాటి మొత్తంతో, ఫ్రెండ్స్‌ సాయం తీసుకుని 2014లో ‘వన్‌మోర్‌ స్మైల్‌’, ‘లవ్‌ ఆల్‌జీబ్రా’ అని రెండు షార్ట్‌ఫిల్మ్స్‌ తీశాను. ఎవరికైనా కథ చెప్పి తర్వాత నా షార్ట్‌ఫిల్మ్స్‌ లింక్‌లు పంపించేవాణ్ని. బడ్జెట్‌, చిత్రీకరణ వ్యవధి ఈ అంశాల్నీ క్లియర్‌గా చెప్పేవాణ్ని. నా షార్ట్‌ఫిల్మ్స్‌ని చూసిన శివ తుర్లపాటి ఫోన్‌చేసి మెచ్చుకున్నాడు. తను టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌. కలిసి షార్ట్‌ఫిల్మ్స్‌ తీద్దాం అన్నాడు. నా సినిమా లక్ష్యాన్ని ఆయనకి చెప్పాను. తనూ హెల్ప్‌ చేస్తానన్నాడు. నా కథల్ని తనతో పంచుకునేవాణ్ని. అలా నేను చెప్పిన ఓ కథ లైన్‌ని ‘కోన వెంకట్‌’గారికి చెప్పాడు. ఆయనకీ నచ్చింది. దాంతో వచ్చి కలవమన్నారు. వెళ్లి కథ మొత్తం చెప్పాను. అదే ‘నిన్నుకోరి’. తర్వాత ఆయన అనుభవాన్ని జోడించి స్క్రీన్‌ప్లే, డైలాగుల్ని ఇంప్రూవ్‌చేసి స్క్రిప్టు రెడీ చేశాం. నా కథ ఒక పక్కింటి అబ్బాయి కథలా ఉంటుంది. దానికి నానీ సరిపోతారనిపించింది. నానీకి కథ చెబితే ఓకే అన్నారు. దానయ్యగారు నిర్మాతగా వచ్చారు. చాలా సినిమాలకి కథ ఓకే అనుకున్నాక హీరో డేట్స్‌ కుదిరి అన్నీ తెరకెక్కడానికి ఏడాదైనా పడుతుంది. ‘నిన్నుకోరి’ మాత్రం నానీ ఓకే అనగానే త్వరత్వరగా పట్టాలెక్కింది. రెండు నెలల్లో షూటింగ్‌ మరో రెండు నెలల్లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ అన్నీ పూర్తయిపోయి, సినిమా రిలీజై హిట్‌ టాక్‌ వచ్చింది. ఆరు నెలల్లో అంతా అయిపోయింది. ‘దీనికోసమేనా ఇన్నాళ్లు కష్టపడ్డాను’ అనిపిస్తుంది. కానీ అన్నాళ్లు కష్టపడి పనిచేయకుంటే ఆ సినిమాని అంత బాగా తీయగలిగేవాణ్ని కాదేమో!

జీవితాల నుంచే కథలు...

నాన్న ముత్యం నాయుడు, అమ్మ రామలక్ష్మి. చాలాసార్లు ‘నీకీ కష్టాలు అవసరమా వచ్చేయ్‌ ఇంటికి’ అన్నారు. కానీ నేను ఇష్టంగా చేస్తున్నానని నచ్చజెప్పేవాణ్ని.
* దాదాపు నాలుగేళ్లు ఎలాంటి ఆదాయం లేకుండా హైదరాబాద్‌లో ఉండటమంటే మాటలా! కానీ ఆ సమయంలో నా స్నేహితుడు సుందర్‌ రామ్‌, తమ్ముడు విజయ్‌... నా లక్ష్యం, కష్టం సినిమానే కావాలి తప్ప మరోటి కాకూడదని నాకు ఆర్థికంగా ఎంతో సాయపడ్డారు.
* జీవితంలో స్థిరపడేంతవరకూ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. ‘నిన్నుకోరి’ తర్వాత ధైర్యం వచ్చి ఇంట్లో పెళ్లికి ఓకే చెప్పాను. గతేడాది ఏప్రిల్‌లో నా పెళ్లి జరిగింది. నా శ్రీమతి పేరు భాగ్యశ్రీ. మాకో అబ్బాయి.
* నా బలం నా డైరెక్షన్‌ టీమ్‌. వీళ్లు నా రూమ్మేట్స్‌, ఫ్రెండ్స్‌ కూడా. లక్ష్మణ్‌, నాయుడు, నరేష్‌... మేమంతా ఉంటే సినిమాని ఆడుతూ పాడుతూ చేసుకోగలం.
* నా సినిమాలకు బలం గోపీ సుందర్‌ సంగీతం కూడా. ఆయన మలయాళ సినిమాల్లోని పాటలు నాకు బాగా నచ్చుతాయి. తెలుగులోనూ మంచి పాటలు ఇచ్చారు. గోపీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరోజు కూర్చుంటే రెండు మూడు ట్యూన్లు ఇచ్చేస్తారు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పే ఫ్రీడమ్‌ ఉంటుంది.
* నేను కథలకోసం ఎక్కడెక్కడో ఆలోచించను. నా జీవితంలో, నా చుట్టుపక్కలవారి జీవితాల్లో జరిగే సంఘటనల్లో బాగా సంతోషం కలిగించే, బాగా బాధ పెట్టే సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుంటాను. ఆ పాయింట్‌ నుంచి కథను అల్లుకుంటాను.

‘మజిలీ’ ఇలా...
నిన్నుకోరి తర్వాత కొందరు ఫోన్లు చేసి సినిమా తీయమని అడిగారు. కథ ఓకే అవ్వకుండా అలా మాటివ్వడం నాకు నచ్చదు. అవన్నీ కాదనుకుని ఇంటికి వెళ్లిపోయి మూడు నెలలు ఉన్నాను. దాదాపు పుష్కర కాలం తర్వాత నేను విశ్రాంతి తీసుకున్నది అప్పుడే. తర్వాత హైదరాబాద్‌ వచ్చి నా దగ్గరున్న కొన్ని కథల్ని సిద్ధం చేసుకున్నాను. ప్రేమకథలు కాకుండా కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నాను. ఆ క్రమంలో నాగచైతన్య గారిని కలిశాను. ‘నిన్నుకోరి’ నాకు బాగా నచ్చింది. ఏదైనా వాస్తవిక, హృదయాన్ని హత్తుకునే కథ ఉంటే చెప్పమన్నారు. నా దగ్గర భార్యాభర్తల కథకి సంబంధించిన ఒక లైన్‌ ఉంది. దాన్ని ఇంప్రొవైజ్‌ చేసి చెప్పాను. చైతూకి నచ్చింది. జోడీగా సమంతాగారైతే బావుంటుందని చెప్పాను. తనూ విన్నాక ఓకే చెప్పారు. అలా ‘మజిలీ’ మొదలైంది. వాళ్ల కాంబినేషన్‌ అంటే ఒక మేజిక్‌లా ఉంటుంది. అది ఈ సినిమాలో బాగా కనిపించింది. కొన్ని సంభాషణలు చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమాని కూడా విశాఖపట్నం నేపథ్యంలోనే తీశాను. కానీ ‘నిన్నుకోరి’ మాదిరిగా అందాల వైజాగ్‌ని కాకుండా పాత వైజాగ్‌ని చూపించాను. వైజాగ్‌లో ఉండకపోతే నాకు సినిమా ఆలోచన రాకపోయేది. నేను ఎక్కడ ఉన్నా కూడా అక్కడి సముద్రం, స్నేహితులు, ఆహారం, భాష... వీటి ప్రభావం నామీద ఉంటుంది. నా కథల్లో కనిపిస్తుంది!

- సుంకరి చంద్రశేఖర్‌
ఫొటోలు: పేకేటి నాయుడు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.