close
ఆ ఊరు... నాలుగు కాలాల్లో నాలుగు రంగుల్లో..!

‘తమదైన భౌగోళిక స్వరూపాన్నీ ప్రకృతినీ ప్రాచీనకాలంనాటి గ్రామాలనీ ఆలయాలనీ కాపాడుకుంటూనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మున్ముందుకు దూసుకుపోతున్న జపాన్‌ను దగ్గరగా చూడాలంటే క్యోటో, టోక్యో నగరాలతోబాటు ఆ చుట్టుపక్కల ప్రదేశాలనీ చూసి తీరాల్సిందే’ అంటున్నారు హైదరాబాద్‌కి చెందిన పులకంటి శృతి.

హైదరాబాద్‌ నుంచి థాయ్‌ ఎయిర్‌వేస్‌లో బ్యాంకాక్‌ మీదుగా క్యోటో చేరుకున్నాం. జపాన్‌ సమయం మనకన్నా నాలుగు గంటల ముందు ఉంటుంది. క్యోటో స్టేషన్‌ నుంచి రైల్లో టకయామ అనే పేరున్న హిల్‌స్టేషన్‌కు చేరుకుని, అక్కడినుంచి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా ఎంపికయిన షిరకావగో అనే గ్రామానికి ఘాట్‌ రోడ్డుమీదుగా బస్సులో బయలుదేరాం.

పాత పల్లెటూరు!
టోక్యో, క్యోటోలతో పోలిస్తే షిరకావగో పూర్తి విభిన్నంగా ఉంది. 20 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఓ చిన్న పల్లెటూరిది. అక్కడ 60-100 వరకూ మాత్రమే ఇళ్లు ఉన్నాయి. చెక్కతోనూ గడ్డితోనూ కట్టిన ఆ ఇళ్లు కూడా ఎంతో అందంగా ఉన్నాయి. అక్కడున్న ఎత్తైన పర్వతం ఎక్కి చూస్తే నాలుగు కాలాల్లో నాలుగు రంగుల్లో కనిపించడమే ఆ ఊరి ప్రత్యేకత. చలికాలంలో మంచుతో కప్పబడి తెల్లగానూ, స్ప్రింగ్‌ సీజన్‌లో గులాబీ, తెలుపూ కలగలిసిన చెర్రీ పూలతో లేతగులాబీ రంగులోనూ, వేసవి చివరలో ఆకుపచ్చగానూ, వర్షాకాలం వెళ్లి చలి తిరిగే క్రమంలో రంగురంగుల ఆకులతోనూ శోభాయమానంగా కనువిందు చేస్తుంటుంది. ఫిబ్రవరిలో అటు ఎండా ఇటు మంచూ పడుతూ అక్కడి వాతావరణం గమ్మత్తుగా అనిపించింది. అక్కడున్న రెస్టరెంట్లన్నీ చెర్రీబ్లోజమ్‌ సీజన్‌లోనే తెరిచి ఉంటాయి. మిగిలిన కాలంలో ఒకటీ లేదా రెండు మాత్రమే ఉంటాయట.

ఆ ఊరి మొత్తంలో ఒక్క డస్ట్‌బిన్‌ కూడా లేదు. మనం తిన్న చెత్తని మన బ్యాగుల్లోనే పెట్టుకుని తిరిగి కిందకొచ్చాక అక్కడున్న పెద్ద డస్ట్‌బిన్‌లో పడేయాలి. ఆ కొండల మధ్యలోనే ఫిజీ పర్వతం కూడా ఉంటుంది. అక్కడి రెస్టరెంట్లలో ఆరుబయట కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ వేడివేడి గ్రీన్‌ టీ, అడవుల్లో పెరిగే కూరగాయలతో చేసిన సూప్‌లూ వేపుళ్లూ గ్రేవీ కర్రీలూ సోబా నూడుల్సూ ఫ్రైడ్‌ రైస్‌ వెరైటీలూ తింటుంటే ఆ అనుభూతే వేరు.

షిరకావగో గ్రామం 250 సంవత్సరాల నాటిదట. ఇక్కడి ఇళ్లని ఘాసో ఝుకురి అంటారు. ఘాసో అంటే జపనీస్‌ భాషలో నమస్కరించడం అని అర్థం. అవి చూడ్డానికి రెండు చేతులు జోడించినట్లుగా ఉంటాయన్నమాట. అందుకే ఆ పేరు. ఆ ఊళ్లో వాళ్ల సగటు వయసు 95 సంవత్సరాలు. ముసలివాళ్లు కూడా ఉత్సాహంతో పనిచేస్తుంటారు. అక్కడ ఉన్న ‘వడాకె అనే ఇల్లు మిగిలిన ఇళ్లన్నింటికన్నా చాలా పెద్దది. 17వ శతాబ్దానికి చెందిన ఓ పట్టు వ్యాపారికి చెందిన బంగ్లా అది. షోగన్‌లూ సమురాయ్‌లూ కూడా అందులో నివసించారట. అప్పట్లో రాజులు పరిపాలనా సౌలభ్యంకోసం షోగన్‌, సమురాయ్‌ అనే రక్షకుల్ని నియమించేవారు. యుద్ధవిద్యలన్నీ తెలిసిన వీళ్లు స్థానికంగా పెత్తనం చేసేవారు. ప్రస్తుతం ఆ ఇంట్లో పట్టు తయారీకి సంబంధించిన మ్యూజియం ఉంది. మల్బరీ చెట్లనీ పట్టుపురుగుల్నీ పెంచడం ద్వారా పట్టుని తీసి చుట్టుపక్కల ఊళ్లకి అమ్మేవారు. మొన్నమొన్నటివరకూ ఆ ఊరికి దారి ఉండేది కాదు. దాంతో ఈ ఊరికి మిగతా దేశంతో ఎలాంటి సంబంధం లేకుండానే అక్కడ ఎన్నో తరాలు జీవించడం విశేషం. అక్కడి సామాజిక, ఆర్థిక సమస్యలకి వాళ్లే చక్కని పరిష్కారాలు వెతుక్కునేవారట.

అక్కడ రెండో ప్రపంచ యుద్ధకాలంలో కేవలం 12 ఇళ్లు మాత్రమే నష్టపోయాయి. ప్రస్తుత జపాన్‌ ప్రభుత్వం ఈ ఊరిపట్ల పూర్తి బాధ్యత వహిస్తూ అక్కడి ప్రజలకు సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. అక్కడ ఇళ్లని చెక్కతోనూ ఎండుగడ్డితోనూ కట్టడం వల్ల అగ్నిప్రమాదాలు అధికం. అందుకోసం గ్రామం మొత్తంగా అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటుచేశారు. ఆ గ్రామీణ అందాలను ఆసాంతం ఆస్వాదించాక అక్కడికి కాస్త దూరంలో వేడినీటి బుగ్గలు ఉన్న ఆన్‌సెన్‌ అనే ప్రదేశానికి వెళ్లాం. జపనీయుల్లో నిద్రాలోపం ఎక్కువ. అందుకే నిద్రపట్టడంకోసం వేడినీటి బుగ్గల్లో స్నానం చేసి రిలాక్స్‌ అవుతుంటారు.

ఎర్రని ద్వారాలు!
అక్కడినుంచి ఇనారా షోడో అనే ఆలయానికి వెళ్లాం. క్యోటో నగర సమీపంలో ఉన్న ఈ ఆలయానికి కొండ చుట్టూ తిరుగుతూ వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్లే మార్గం మొత్తం వెయ్యికి పైగా ఎర్రని రంగు వేసిన ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల్లో నుంచి అలా లోపలకు వెళితే ఆలయం పెద్దగా అందంగా కనిపిస్తుంది. ఒక్క క్యోటో నగరంలోనే దాదాపు 2500 గుడులు ఉన్నాయి. జపనీయులు సంప్రదాయాల్ని తు.చ. తప్పక పాటిస్తారు. ముఖ్యంగా స్త్రీలు కిమొనో అనే సంప్రదాయ దుస్తులు వేసుకునే గుడులకు వెళుతుంటారు. జపాన్‌లో బౌద్ధాలయాలు చాలానే కనిపిస్తాయి. అక్కడ నాటి రాజుల కోటల్ని ఇప్పటికీ చెక్కుచెదరకుండా సంరక్షిస్తున్నారు. తరవాత అక్కడి నుంచి నింజాలా మ్యూజియానికి వెళ్లాం. అందులో నాటి షోగన్‌లూ సమురాయ్‌లూ వేసుకున్న దుస్తులు వేసుకుని మనం ఫొటోలు దిగొచ్చు. తరవాత నగోయా నగరంలో ఉన్న అతి పెద్ద ప్లానెటోరియం చూడ్డానికి వెళ్లాం. అందులో రోబోల నుంచి రోదసి వరకూ అన్నింటి గురించిన సమాచారం ఉంటుంది.

పిల్లి అంటే మహా ఇష్టం!
జపనీయులకి పిల్లి అంటే చాలా ఇష్టం. హలో కిట్టీ అనే బ్రాండ్‌ లోగోతో తయారుచేసిన దుస్తుల్నీ యాక్సెసరీల్నీ ఎక్కువగా ధరిస్తుంటారు. బొమ్మలు కూడా ఎక్కువగా అవే ఉంటాయి.  జపాన్‌లో ఎక్కడికి వెళ్లినా సుమో రెజ్లింగ్‌ కేంద్రాలు చాలానే కనిపిస్తాయి. అంత భారీ శరీరాలతో వాళ్లు ప్రాక్టీసు చేయడం చూస్తుంటే చాలా తమాషాగా అనిపిస్తుంది. జపాన్‌లో 50 లక్షల వెండింగ్‌ మెషీన్లు ఉన్నాయట. హాట్‌ డ్రింకులూ కూల్‌డ్రింకులూ స్నాక్సూ ఐస్‌క్రీములూ బొమ్మలూ పుస్తకాలూ మూవీ టికెట్లూ బూట్లూ దుస్తులూ గొడుగులూ భోజనం... ఇలా అన్నీ వెండింగ్‌ మెషీన్ల ద్వారా లభిస్తాయి. కరెన్సీ మార్పిడి కూడా వాటినుంచే చేసుకోవచ్చు.

మనం ఎక్కడికి వెళ్లినా పబ్లిక్‌ లాకర్లు కనిపిస్తాయి. ఉదయాన్నే షాపింగ్‌ చేసుకుని లాకర్‌లో పెట్టి వేరే ఊరికి రైల్లో వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఈ లాకర్లలో నుంచి తీసుకుని వెళ్లవచ్చు. వీటిల్లో డిజిటల్‌ లాక్స్‌ లేదా కరెన్సీ ఇన్‌సర్ట్‌ అని రెండు రకాలు ఉంటాయి. రెస్టరెంట్స్‌ అయితే చూడముచ్చటగా ఉంటాయి. ప్రతిదానిముందూ మెనూతోబాటు వంటకాలన్నీ పాలిమర్‌ క్లే లేదా ప్లాస్టిక్‌తో తయారుచేసి వాటిని ప్రవేశద్వారం దగ్గర అందంగా ప్రదర్శిస్తుంటారు. రైల్వేస్టేషన్ల మెట్లమీద వీడియో ప్రకటనలు వస్తుంటాయి. వాటిని చూడ్డానికే చాలామంది అక్కడ ఆగి మరీ కాఫీ తాగుతుంటారు.

అక్కడి భూగర్భంలోనూ రైళ్ల వేగం చూస్తుంటే మన గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. స్టేషన్‌మాస్టర్‌ రైలు వచ్చినప్పుడూ వెళ్లేటప్పుడూ అందరికీ వంగి నమస్కరిస్తుంటాడు. దూరం వెళ్లే రైళ్లలో కెఫెలు కూడా ఉంటాయి. అక్కడ ట్యాక్సీలకి ఆటోమేటిక్‌ డోర్స్‌ ఉంటాయి. డ్రైవర్‌ కూర్చున్నచోటు నుంచి కదలకుండా డోర్‌ని పూర్తిగా తెరిచి, తరవాత మూసేయగలడు. బటన్స్‌తో పనిచేసే అక్కడి టాయ్‌లెట్లు బరువునూ బీపీనీ కూడా చెక్‌ చేస్తాయి. బయటకు శబ్దం రాకుండా మ్యూజిక్‌ కూడా ప్లే చేసుకోవచ్చు. ఏ రకంగా చూసినా జపనీయులు ఆటోమేషన్‌లో ప్రపంచ దేశాలకన్నా ఎంతో ముందున్నారు. దీన్ని ఉపయోగించి రోజువారీ పనులను కూడా ఎంతో సులభంగా చేసుకుంటారు. వాళ్ల పరిశోధనలన్నీ ఎంతో సృజనాత్మకంగా ఉంటాయి. కానీ జపనీయులు ఇంగ్లిష్‌ చాలా తక్కువ మాట్లాడతారు. అలా మాట్లాడితే స్టైల్‌ అనుకుంటారని మాట్లాడరట. అందుకే అక్కడ ప్రతీదీ జపనీస్‌ భాషలోనే ఉంటాయి. కింద కూర్చొని తినడం వాళ్ల ఆచారం. గ్రీన్‌ టీ ఐస్‌క్రీమ్‌, పెప్పర్‌ ర్యాడిష్‌, మ్యాపెల్‌ వాల్‌నట్స్‌, టోఫు డిజెర్ట్స్‌, సూషీ... వంటి వంటకాలు ప్రపంచవ్యాప్తంగానూ ప్రాచుర్యం పొందాయి. ప్రపంచంలో మరెక్కడా దొరకని కిట్‌క్యాట్‌ చాక్లెట్స్‌ రకాలూ క్యాండీ వెరైటీలూ జపాన్‌లోనే దొరుకుతాయి. జపనీయులు మసాలా వేసిన పీతల్ని బాగా ఎంజాయ్‌ చేస్తారు. మిగిలిన దేశాలతో పోలిస్తే జపాన్‌లో నేరాలు తక్కువే.

అక్కడ ఎటుచూసినా జనమే!
క్యోటో సందర్శన తరవాత టోక్యోకి బయలుదేరాం. టోక్యోలోని షింగ్‌జుకు స్టేషన్‌ ప్రపంచంలోనే బిజీగా ఉండే రైల్వేస్టేషన్‌. సుమారు 36 లక్షల మంది ప్రయాణికులు రోజూ ఈ స్టేషన్‌కి వచ్చిపోతుంటారు. తరవాత అక్కడ చూడదగ్గది షిబుయా స్క్రాంబిల్‌. ఇది ప్రపంచంలోనే ఎక్కువమంది క్రాస్‌ చేసే స్థలం. ఆ క్రాసింగ్‌కి ఎదురుగా ఉన్న స్టార్‌బక్స్‌ రెస్టరెంట్‌ పై అంతస్తుకి చేరుకుంటే అక్కడి గాజు అద్దాల్లోనుంచి జనం రోడ్డు దాటే విధానాన్ని గమనించవచ్చు. మామూలు సమయంలో వందలమంది దాటితే, శుక్రవారం, శనివారం రాత్రుళ్లు ఒకేసారి మూడువేల మంది పైనే అక్కడ అన్ని వైపులకీ రోడ్డు దాటుతుంటారట.

తరవాత క్యోటో సమీపంలోని అరషియామా అనే ఊరికి వెళ్లాం. ఈ ప్రదేశం వెదురు వనానికి ప్రసిద్ధి. అందుకే దీన్ని అరషియామా బ్యాంబూ గ్రూవ్‌ అంటారు. అక్కడ వెదురు మొక్కల్ని ఓ పద్ధతి ప్రకారం ఎత్తుగా పెంచారు. అక్కడి 1339లో కట్టిన టెన్రూజీ అనే ఆలయాన్ని చూసి తీరాల్సిందే. అప్పట్లో నిర్మించిన సోజెన్‌ కొలను ఎంతో అందంగా ఉంది. దాని ఒడ్డున నాటిన చెట్లు కాలానుగుణంగా రంగులు మారుతూ అందాలవిందు చేస్తుంటాయి. ఈ ఆలయాన్నీ యునెస్కో వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించారు.

జపనీయులకి కొత్తదనం కావాలి. ఒకప్పుడు పెంపుడు జంతువులు లేనివాళ్లు కాసేపు రిలాక్సయ్యేందుకన్నట్లు కెఫేల్లో పిల్లుల్ని పెంచేవారు. ఇప్పుడు వాటి స్థానంలో గుడ్లగూబలు వచ్చాయి. ఈ రకమైన ఔల్‌ కెఫేలకు టోక్యోనగరం పెట్టింది పేరు. అంటే కాఫీ షాపుల్లో గుడ్లగూబల్ని పెంచుతుంటారన్నమాట. వాటన్నింటికీ పేర్లు ఉంటాయి. అక్కడ వాటిని చూస్తూ గడపడమేకాదు, వాటిని ఎత్తుకుని ఫొటోలు దిగొచ్చు. కానీ ఫ్లాష్‌ కొట్టకూడదు. గట్టిగా అరవకూడదు. మంద్రమైన సంగీతం వింటూ కాసేపు వాటిని చూస్తూ గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుందన్న కారణంతో చాలామంది అక్కడికి వస్తుంటారట.

అక్కడి నుంచి మేం టోక్యో స్కై ట్రీ టవర్‌కి వెళ్లాం. ఇది ప్రపంచంలోనే పొడవైన బ్రాడ్‌కాస్టింగ్‌ టవర్‌. ఇక్కడినుంచి నగరం మొత్తం కనిపిస్తుంది. తరవాత డౌన్‌టౌన్‌లోని యువెనో జంతుప్రదర్శనశాలలో పాండాలనీ పెంగ్విన్లనీ చూశాం. అక్కడి బుల్లెట్‌ రైళ్లలో ప్రయాణిస్తూ జపాన్‌ అందాలనీ ఆధునికతనీ ఏకకాలంలో సందర్శించిన అనిర్వచనీయ అనుభూతితో వెనుతిరిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.