close
శివకేశవులు... ఎదురెదురుగా!

శ్రీమాహావిష్ణువు అశ్వర్థ నారాయణుడిగా, మహాశివుడు శ్రీచక్రభీమలింగేశ్వరుడిగా ఒకేచోట కొలువైన ప్రాంతం అనంతపురంలోని చిన్నపప్పూరు అశ్వర్థ క్షేత్రం. పాపాలను తొలగించే స్వామిగా అశ్వర్థ నారాయణుడు పూజలందుకుంటుంటే భక్తులపాలిట కొంగుబంగారంగా భీమలింగేశ్వరుడు భాసిల్లుతున్నాడు.

శివకేశవులకు అభేదాన్ని తెలుపుతున్న అశ్వర్థ క్షేత్రం అనంతపురం జిల్లా చిన్నపప్పూరులో ఉంది. పెన్నానది ఒడ్డున కొలువైన ఈ క్షేత్రం జిల్లాలోనే ప్రముఖ దర్శనీయ స్థలంగా వెలుగొందుతోంది. ఇక్కడ స్వయంభూలుగా వెలసిన అశ్వర్థ నారాయణుడూ శ్రీచక్రభీమలింగేశ్వరుడూ ఎదురెదురుగా దర్శనమివ్వడం విశేషం. వేములవాడ భీమ కవి ఈ క్షేత్రంలోనే చాలా ఏళ్లు గడిపాడని చెబుతారు. ఇక్కడి పెన్నానదిలో స్నానమాచరించి శివకేశవులను దర్శించుకుంటే పాపాలు తొలగి, కోరిన కోర్కెలు నెరవేరతాయనీ సంతానం లేనివారికి తప్పక సంతానం కలుగుతుందనీ భక్తుల విశ్వాసం.

స్థలపురాణం
పూర్వం శింగరభట్టు అనే మునీశ్వరుడికి విధివశాత్తు బ్రహ్మహత్యా దోషం ప్రాప్తిస్తుంది. దీని నుంచి విముక్తి పొందేందుకు నివారణోపాయాన్ని తెలపమంటూ వేదవ్యాసుడిని అడుగుతాడు శింగరభట్టు. అప్పుడు వేదవ్యాసుడు దక్షిణ భారదేశంలోని ఒక చోట పెన్నానది దక్షిణం నుంచి ఉత్తరంగా ప్రవహిస్తూ ఉంటుందని చెప్పి, ఆ నదీతీరంలోనే అశ్వర్థం అనే ప్రాంతం ఉందనీ అక్కడికి వెళ్లి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేయమని చెబుతాడు. వేదవ్యాసుడు చెప్పిన విధంగానే శింగరభట్టు ఆ ప్రాంతానికి చేరుకుని తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అతడి తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై శింగరభట్టుకు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. అనంతరం శింగరభట్టు కోరికమీద స్వామివారు ఆ ప్రాంతంలోనే అశ్వర్థ నారాయణుడిగా వెలశాడని ప్రతీతి. తన భక్తితో గోవిందుడిని మెప్పించిన శింగరభట్టు కూడా స్వామి చెంతనే శిలారూపంలో దర్శనమివ్వడం విశేషం.

భీముడు ప్రతిష్ఠించిన లింగం
పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతంలోని పెన్నానదిలో స్నానమాచరించి గట్టుమీద కొంతసేపు సేదతీరుతారు. ఆ సమయంలో పాండవ మధ్యముడు భీముడికి ఇక్కడే భూమిలో శివలింగం ఉన్నట్టు కల వస్తుంది. ఈ విషయాన్ని అగ్రజుడైన ధర్మరాజుకు చెబుతాడు. అనంతరం అన్నదమ్ములందరూ కలిసి ఆ ప్రాంతంలో తవ్వి చూడగా శివలింగం దర్శనమిస్తుంది. భీముడి చేత ఆ లింగాన్ని పైకి తీయించి, పంచామృతాలతో అభిషేకించి ఆ ప్రదేశంలోనే శ్రీచక్రం మీద ప్రతిష్ఠచేయిస్తాడు ధర్మరాజు. అందుకే ఈ క్షేత్రానికి భీమలింగేశ్వర ఆలయం అన్న పేరు వచ్చిందని చెబుతారు. హైందవ సంప్రదాయంలో శ్రీచక్రానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఆదిశక్తి అనంత రూపాలూ నవావరణాల్లో ఇమిడి ఉంటాయని ప్రతీతి. ఒక్కో ఆవరణంలో దుర్గ, లలిత, మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి, గాయత్రి, త్రిపుర, చండి, కాళీ అమ్మవార్లు కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. అంతటి శక్తిసంపన్నమైన శ్రీచక్రం మీద శివయ్య కొలువై ఉండటంతో ఇక్కడి స్వామిని శ్రీచక్రభీమలింగేశ్వరుడిగా కూడా అర్చిస్తారు. కార్తికమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో స్వామివారిని వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.

విశేష పూజలు
శివకేశవులు ఇద్దరూ కొలువైన ఆలయం కావడంతో కార్తిక, మాఘమాసాల్లో భక్తులు విశేషంగా పూజలు చేస్తారు. మాఘమాసంలో అశ్వర్థనారాయణుడి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. దీంతోపాటు ప్రతి పౌర్ణమికి స్వామివారి కల్యాణోత్సవం కనుల పండగగా నిర్వహిస్తారు. కార్తికమాసంలో భీమలింగేశ్వరుడు శోభాయమానంగా దర్శనమిస్తాడు. శివయ్య ఈ మాసమంతా నిత్యాభిషేకాలూ, విశేషపూజలతో అలరారుతాడు. ఆలయ ఆవరణలోనే ఆంజనేయస్వామి, నాగదేవతల విగ్రహాలూ ఉన్నాయి.

ఇలా చేరుకోవచ్చు
అనంతపురం జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్లు, తాడిపత్రి పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో అశ్వర్థ క్షేత్రం ఉంది. రోడ్డు మార్గం ద్వారా తాడిపత్రి నుంచి ఆలయానికి చేరుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మాఘమాసంలో తాడిపత్రి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు.

- సూగూరు రవీందర్‌రావు, ఈనాడు, అనంతపురం డెస్క్‌.

చిత్రాలు: శివయ్య


ఏ వారం ఏ దేవుడికి పూజ చేయాలి?

పంచాంగం ప్రకారం ప్రతి రోజుకీ ఒక దేవుడు అధిపతిగా ఉంటాడు. ఆ రోజున ఆ దేవుడికి పూజచేస్తే కార్యసిద్ధితోపాటు దైవానుగ్రహం తప్పక లభిస్తుందంటారు. ఏ రోజు ఎవరిని అర్చించాలంటే...
ఆదివారం నవగ్రహాల్లో అగ్రజుడైన సూర్యభగవానుడిని స్మరించుకోవాలి. ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల నేత్ర వ్యాధులూ చర్మ వ్యాధులూ తగ్గుతాయని చెబుతారు.
సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు.
ఆ రోజున నీలకంఠేశ్వరుడిని పూజించాలి.
పాలూ బియ్యం పంచదారతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.
మంగళవారం హనుమంతుడిని అర్చించాలి.
కాళీదేవతనూ దుర్గామాతనూ పూజించినా మంచి ఫలితం ఉంటుంది.
బుధవారం విఘ్నేశ్వరుడిని పూజించాలి.
గణనాథుడిని గరికతో అర్చించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
గురువారం విష్ణుభగవానుడినీ లేదా ఇష్టదైవాన్నీ ఆరాధించడం వల్ల శుభఫలితాలు ఉంటాయి.
దక్షిణామూర్తిని పూజిస్తే సకల దోషాలూ తొలగిపోతాయి.
శుక్రవారం దుర్గాదేవినీ, రాజరాజేశ్వరినీ అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలూ విజయాలూ చేకూరుతాయి.
శనివారం పూట రుద్రాది దేవతల ఆరాధన మంచిది. శని దేవుడికి దీపారాధన చేయాలి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.