close
రాజంటే రామచంద్రుడే!
శ్రీరామచంద్రమూర్తి సకల గుణనిధి. ధర్మానికి నిలువెత్తు రూపం. భయమంటే తెలియని వాడు. పక్షపాతం ఎరుగని వాడు. తల్లిదండ్రులంటే అమిత గౌరవం. ప్రజలంటే అంతకు మించి అభిమానం. రాజుకెలాంటి లక్షణాలుండాలో అవన్నీ ఆయనలో మూర్తీభవించినట్టు కనిపిస్తాయి. అందుకే జానకీ నాయకుడు జగమంతటికీ నాయకుడయ్యాడు. పట్టాభిషేకమైన వేల సంవత్సరాల తర్వాతా పాలనంటే ఆయనదే అని ప్రజలు చెప్పుకునేలా జన హృదయనేత అయ్యాడు. ఆయన పరిపాలనను ఇప్పటి నాయకులూ ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేస్తే సెలయేటి పక్కన చెలమలలోనూ నీళ్లు ఊరినట్టు, సూర్యుడి తేజస్సు పడి చంద్రుడూ కాంతులు విరజిమ్మినట్టు మన దేశమూ రామరాజ్యపు ఛాయల్లో మెరవడం ఖాయం.

కలిగా ఉన్న భిక్షగాడికి పది రూపాయలు దానం చేస్తే...ధర్మ ప్రభువులు అంటూ రాముణ్ని తలచుకుంటాడు. శుభకార్యానికి ఓ పద్దు రాయాలంటే ముందు రాసే మాట శ్రీరామ. ముద్దులొలికే పసిబిడ్డకు స్నానం చేయించి శ్రీరామ రక్షంటూ చెంబెడు నీళ్లు తిప్పి పోస్తే ఇక తల్లికి నిశ్చింత. తనను ప్రేమగా చూసే భర్త గురించి మా ఆయన శ్రీరామ చంద్రుడమ్మా... అంటూ మురిసిపోతుంది ఓ ఇల్లాలు. రాముడిలాంటి బిడ్డే కావాలనుకుంటాడు ఏ తండ్రైనా. అలాంటి రాజైతే బాగుండుననుకుంటారు ప్రజలు. రామతత్వం గొప్పతనం అది. రాముడి కీర్తి అది. ఒక నాయకుడు సుపరిపాలనను అందిస్తే అప్పటికి ప్రజలు గుర్తుంచుకుంటారు. మరో నాలుగు తరాలయ్యాక మరో నాయకుడొస్తాడు. అతన్నే కీర్తిస్తారు. కానీ పాలనాకాలం ముగిసిన యుగాల తర్వాతా జనం గుండెల్లో పదిలంగా ఉన్నాడంటే ఆయనెంత గొప్ప నేతో... ఆయన నడచిన మార్గమెంత ఉత్తమమైనదో, ఆయన ఆచరించిన ధర్మమెంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు. రామకథా రూపంలో ఆ సూక్ష్మాన్ని మనకూ ఉపదేశించింది రామాయణ మహాకావ్యం.

రామచంద్రమూర్తి రాజుగానే పుట్టి ఉండవచ్చు. ఆయన పట్టాభిషేకం వంశపారంపర్యం ప్రకారమే జరిగి ఉండవచ్చు. కానీ ఇప్పటి పాలకుల్లా అమ్మ నగలు అమ్మాయికి ఇచ్చేసినట్టూ, తాత ఆస్తులేవో మనవలకు పంచిపెట్టినట్టూ, మామ సొమ్ము వరకట్నంగా ముట్టజెప్పినట్టూ... అర్హత లేని వ్యక్తులకూ, అనుభవం లేని వారికీ, అసలు పరిపాలనా దక్షతే లేని మనుషులకూ... వంశపారంపర్యంగా రాజ్యాధికారాన్ని కట్టబెట్టి ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దబడ్డ రాజు కాదు రాముడంటే. తమ ప్రభువు రాక కోసం ఆయన పరిపాలనలో తరించడం కోసం ఆ వ్యక్తి అడుగుజాడల్లో నడవడం కోసం అప్పటి ప్రజలు కలవరించి, పరితపించారు. ఆయనెప్పుడెప్పుడు పట్టాభిషేకం చేసుకుంటాడా ఆ పురుషోత్తముణ్ని ఎప్పుడెప్పుడు మారాజుగా చూసుకుంటామా అని ఉవ్విళ్లూరారు. అసలు రాజ్యానికి కొత్త రాజు వస్తున్నాడంటే జరిగిన సంబరాల్ని నిజంగా చూసింది కేవలం అయోధ్యానగరి మాత్రమే. నక్షత్రాలే తారాజువ్వలై మెరిశాయక్కడ, సూర్యచంద్రులే స్వామికి దివిటీలు పట్టారు, ఆకాశం ఆనందంతో పూల వర్షాన్ని కురిపించింది. మంగళ ధ్వానాలు చెవులను మార్మోగించాయి. పుర వీధులనిండా ఎక్కడ చూసినా సుగంధపు పరిమళాలే, ఆనందపు పరవశాలే!

ప్రజలెప్పుడూ రామ పక్షమే...
వృద్ధుడైన దశరథ మహారాజు రాముడికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయదలచి కులగురువు వశిష్ఠుడి దగ్గరా, మంత్రుల దగ్గరా ఆ ప్రతిపాదనను తీసుకువచ్చాడు. సకల గుణాభిరాముడిని రాజుగా చేసుకోవడం మాకెంతో సంతోషం... అన్నారు వారంతా. దశరథుడు ప్రజాస్వామ్యవాది. ఎన్నో ఏళ్లపాటు ఆయన ప్రజల మనస్సులను తెలుసుకుంటూ సుభిక్షంగా రాజ్యపాలన చేశాడు. తన పిల్లలకూ రాజ్యమంటే ఎంత గొప్పదో, రాజధర్మం ఎంత ఉత్తమమైనదో తెలుపుతూ పెంచాడు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయదలచిన విషయాన్ని పెద్ద సభపెట్టి ప్రజలందరినీ పిలిచి వాళ్లకి చెప్పాడు. ఇది తన ప్రతిపాదన మాత్రమేననీ, అందరికీ ఇష్టమైతేనే రాముడు రాజవుతాడనీ, ఆ విషయంలో జనం తమ అభిప్రాయాన్ని నిర్భయంగా తెలపాలనీ, ఒక వేళ ఆయన రాజుగా ఇష్టం లేని పక్షంలో ఉత్తములైన వారినెవరినైనా ప్రతిపాదించవచ్చనీ, మళ్లీ ఒకసారి మంత్రి వర్గంతో చర్చించి ఆ విషయం మీద నిర్ణయం తీసుకుందామనీ చెప్పాడు. రాముడి పేరు వినగానే ప్రజలంతా ఎగిరిగంతేశారు. తాము కూడా ఆ మహానుభావుడి పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఆనందంతో చప్పట్లు కొట్టారు, సంతోషం పట్టలేక నిండు సభలోనే ఆనంద నృత్యాలు చేశారు. అప్పుడు కూడా దశరథుడు తృప్తి పొందలేదు. ‘నేను నిబద్ధతతో ధర్మ పాలన చేస్తుండగా, నా కుమారుడు పట్టాభిషిక్తుడు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు’ అని అడిగాడు.

‘ఓ దశరథ మహారాజా... నీ కొడుకు సద్గుణ సంపన్నుడు. సాక్షాత్తూ విష్ణు స్వరూపుడు. సర్వ ప్రాణుల హితాన్ని కోరుకునేవాడు. ధీమంతుడు. అతన్ని మారాజుగా చేసుకోవడం నిజంగానే మాకెంతో ఆనందదాయకం’ అన్నారంతా.
అవేవో దశరథుడి ముఖస్తుతి కోసమే చెప్పిన మాటలయితే రాముడి గురించి ఈ నాటికీ ఇంత గొప్పగా చెప్పుకోవలసిన అవసరం ఏమీ ఉండదు. కైక కోరిక ప్రకారం దశరథుడి మాట మేరకు రాముడు పట్టాభిషిక్తుడు కాకుండా అడవులకు వెళుతున్నప్పుడు తెలుస్తుంది రామచంద్రుడికి ఎంత ప్రజాదరణ ఉందో. వాళ్ల మనసుల్లో ఆయన స్థానం ఎంత ఉన్నతమైనదో. అయోధ్యా ప్రజలు సర్వస్వతంత్రులు. వాళ్ల అభీష్టాన్ని కాదని భరతుడికి కైక మాటమీదుగా పట్టాభిషేకం జరుగుతోందని తెలిసి వాళ్లెంత బాధపడ్డారో అంతే ఆగ్రహావేశాలకూ లోనయ్యారు. ‘అయ్యో రామచంద్రా... నీకెంత కష్టం వచ్చింది’ అని వీధుల వెంటబడి ఏడ్చారు. ప్రభువు నిర్ణయం పట్ల దాదాపుగా తిరుగుబాటు ప్రకటించారు. ‘ఏమిటీ... రామచంద్రుణ్ని అడవులకు పంపి భరతుడి ద్వారా మనల్ని ఏలుదామనుకుంటోందా కైక. మన అభీష్టానికి వ్యతిరేకంగా అదెలా జరుగుతుంది. భార్య మాటకు లొంగి రాజు ఈ నిర్ణయం తీసుకుంటే మనమూ మన నిర్ణయం తీసుకుందాం. మనమందరం రాముడి వెంటే అడవులకు వెళదాం. పండితులూ, వేదాంతులూ, పురోహితులూ, మంత్రులూ, సామంతులూ... అందరికీ రామచంద్రుడంటేనే ప్రీతి. వారంతా కూడా అక్కడికే వస్తారు. అప్పుడు ఈ ఇళ్లన్నింటికీ ఎలుకలు కన్నాలు పెడతాయి. జనం లేక వీధులన్నీ కళావిహీనంగా మారిపోతాయి.

అర్చనలూ, నైవేద్యాలూ అర్పించే వాళ్లు లేకపోవడం వల్ల దేవతలూ ఆలయాలను వదిలిపెడతారు. ఇంత జనం అడవులకు వెళితే జంతువులన్నీ భయపడి అరణ్యాన్ని వదిలి అయోధ్యకు చేరతాయి. నగరమంతా శిథిలమైపోతుంది. రాముడి కోసం మనం అడవిలో అందమైన భవంతులను నిర్మిద్దాం. చెరువులు తవ్వుదాం. ఆయన ఎక్కడుంటే మనకు అదే అయోధ్య. ఇక ఈ పాడుబడ్డ నేలను భరతుడితో కలిసి కైక పాలించుకుంటుంది’ అనుకున్నారు. అరణ్యవాసానికి వెళ్లేందుకు ఆశీర్వచనం చేయమని దశరథుడి దగ్గరికి వెళతాడు రాముడు తనకు ఒక బుట్టా, గునపం, నారచీరలూ ఇమ్మంటాడు. ముందే అన్నీ సిద్ధంగా ఉంచిన కైక ఏమాత్రం బాధ లేకుండా రామయ్య అడిగిన వెంటనే అవన్నీ తెచ్చి చేతిలో పెడుతుంది. నార చీరను పట్టుకుని సీతమ్మ సిగ్గుగా రాముడిని చూస్తుంది. పుట్టినప్పటి నుంచీ పట్టుబట్టలు తప్ప నారచీరలు కట్టి ఎరుగనిదాయె ఆ తల్లి. వెంటనే రాముడు సీత దగ్గరకు వచ్చి ఆమె కట్టుకుని ఉన్న చీర మీద నుంచే... ‘ఇదిగో ఇలా ముడివేసి కట్టుకుంటారు సీతా మునిపత్నులు నార చీరను’ అంటూ కట్టి చూపిస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన దశరథ మహారాజు భార్యలంతా పెద్దగా రోదించారు. రాజగురువు

వశిష్ఠుడికి కోపం వచ్చి... ‘అతి స్వభావం కలదానా... నువ్వెవరివి సీతమ్మను నార చీర కట్టుకొమ్మనడానికి, రాముణ్ని అడవులకు వెళ్లమన్నావు, ఆయన వెళతాడు. నేను జానకికి ఇప్పుడే పట్టాభిషేకం చేస్తాను’ అంటాడు కైకతో. అక్కడ రాజ గురువుదీ రామపక్షమే మరి! ఇక రాముడు అడవులకు వెళుతున్నప్పుడు దశరథుడు రథం వెంట పడి ఏడుస్తూ వస్తాడు... కిందపడిపోతూ లేస్తూ రథాన్ని ఆపమని అరుస్తుంటాడు. లక్షల మంది జనం రాముణ్ని ‘ఆగు రాఘవా... మమ్మల్ని వదిలి వెళ్లొద్దు... పురుషోత్తమా నువ్వు లేకుండా మేం బతకజాలం... మమ్మల్ని అనుగ్రహించు...’ అంటూ వెంట పడతారు. రాముడికి ఇదంతా చూడటం ఎంతో క్లేశాన్ని కలిగిస్తుంది. అప్పుడు రాముడు సారథితో ‘త్వరగా పోనివ్వు... నా తండ్రి దుఃఖాన్ని నేను చూడలేకున్నాను. అయోధ్యావాసుల శోకాన్నీ నేను భరించలేకుండా ఉన్నాను. రథచక్రాల వల్ల దుమ్మురేగి నాకు వీళ్లెవరూ కనిపించనంత వేగంగా రథాన్ని తోలు’ అని ఆజ్ఞాపిస్తాడు. అయినా సరే జనమంతా ఆయన్ను అనుసరిస్తారు. సాయంత్రానికి రాముడు సేదతీరిన ప్రాంతానికి చేరతారు. రాముడు వాళ్లకెంత నచ్చజెప్పినా తిరిగి వెళ్లడానికి ఇష్టపడరు. తన వల్ల ఇంతమంది జనం అడవుల పాలు కావడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే మరునాడు చీకటితోనే మేల్కొని సారథి సుమంత్రుడిని పిలిచి ‘వాళ్లు లేచేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి... ఒక పని చేయి, ముందు రథాన్ని అయోధ్యాపురివైపు నడిపించు రథపు గాడి ఆ దిశగా పడుతుంది. మళ్లీ అదే దారిలో వెనక్కు వద్దాం... తర్వాత తమసా నది గుండా రథాన్ని పోనిచ్చి అడవుల్లోకి వెళదాం... అప్పుడు ఆ గాడిని చూసి జనం అయోధ్యవైపు వెళతారు, అక్కడ మనం కనిపించకపోతే ఇక చేసేదేం లేక ఇళ్లకు చేరతారు’ అని చెప్పాడు. అయోధ్యంటే అమిత గౌరవం, ప్రజలంటే వల్లమాలిన ప్రేమా ఉన్న రాజు తాను లేనంత మాత్రాన ఆ రాజ్యం కళావిహీనమైపోతే, నగరాలు శిథిలమైపోతే భరించగలడా... కనీసం ఆ ఊహనైనా మనసులోకి రానివ్వగలడా..!

నిజమైన రాజుకు రాజ్యమంటే ఉండాల్సిన ప్రేమ అదే. నాకు అధికారం రాకపోతే మీరెట్లా ప్రశాంతంగా జీవిస్తారో చూస్తా... నాకు పదవివ్వలేదు కనుక ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుందో తేల్చుకుంటా... అంటూ ఎద్దు రంకెలేసే మొద్దు రాజకీయ నాయకులు రాముడి నుంచి తెలుసుకోవలసిన నీతి ఇదే!


రాముడు చెప్పిన రాజనీతి

రామో రాజ్యముపాసిత్వా... అంటాడు వాల్మీకి మహర్షి. అంటే రాముడు రాజ్య పాలనను ఒక ఉపాసనలా చేశాడట. అది ఆయన పాలనా నిష్ఠ. ఆయనెక్కడున్నా మనసంతా రాజ్య ప్రజలెలా ఉన్నారు, పాలనెలా సాగుతోంది అన్నదాని చుట్టూనే తిరుగుతూ ఉండేది. అందుకే ప్రియ సోదరుడు భరతుడు అడవులకు రాగానే తల్లిదండ్రుల క్షేమ సమాచారంతో పాటు ముందుగా రాజ్యపాలన గురించే అడిగాడు. ‘నాయనా అంతా సవ్యంగా సాగుతోంది కదా!’ అని విచారించాడు. ఆ ప్రశ్నల్లోనే రాజ్యపాలనకు సంబంధించిన నీతి సూత్రాలు ఎన్నో చెప్పాడు.

భరతా... నువ్వు లేవవలసిన సమయానికే మేలుకుంటున్నావు కదూ! బండనిద్రకు వశుడవు అవలేదుగా? మంత్రాలోచనలు ఎప్పుడూ అర్ధరాత్రివేళ చెయ్యాలి, అది తప్పడం లేదు కదా? ఆలోచన ఎప్పుడూ ఒక్కడు చేయకూడదు, అలాగని మరీ ఎక్కువ మందితోనూ కలిసి చర్చించకూడదు. చేసిన ఆలోచన రాజ్యమంతటా పాకిపోకూడదు. ఏదైనా పనిచేస్తే అది కొద్ది ప్రయత్నం వల్ల అధిక ఫలాలిచ్చేలా చూసుకోవాలి. అలాంటి పనుల్ని ఆలస్యం లేకుండా వెంటనే చేసెయ్యాలి. సామంత రాజులకు నువ్వు చక్కగా పూర్తిచేసిన కార్యాల గురించే తెలియాలి. కానీ జరగవలసినవి మాత్రం తెలియకూడదు. నువ్వు ఆ జాగ్రత్తలోనే ఉన్నావు కదా? బంగారు కానుకలూ, బట్టలూ పంపి ఇవి అంతఃపుర స్త్రీలో లేదా పొరుగు దేశపు రాజులో మీకు పంపారని చెప్పాలి. అలాంటి పరీక్షలకు నిలబడ్డ వాళ్లనే మంత్రులుగా నియమించుకోవాలి. మేధావీ, శూరుడూ, చక్కని ఆలోచనలు చేయగల ఒక్క మంత్రి ఉన్నా రాజ్యం అభివృద్ధి పథంలో నడుస్తుంది.  సేనాధిపతి పరాక్రమం కలిగినవాడై ఉండాలి. ఉపాయశాలీ, ధైర్యవంతుడూ, మనో వాక్కాయ కర్మల్లో శుద్ధి కలిగిన వాడూ అవ్వాలి. ప్రభువంటే భయభక్తులూ ఆదరాభిమానాలూ కలిగినవాడై ఉండాలి. అలాంటి వాణ్ని నువ్వు ఎన్నో విధాలుగా సంతోషపెడుతూ ఉండాలి.

నీ సేనానాయకుడు ఇలాగే ఉన్నాడు కదూ! అపరాధులను తీవ్రంగా దండించలేదుగా? వారు తప్పులను తెలుసుకుని మారే అవకాశం ఇస్తున్నావా? ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ప్రజలు భరించలేనట్టు లేవు కదూ? వాళ్ల మీద అనవసరమైన పన్నులేం విధించడం లేదుగా?  పాలకుల వద్ద కుటిల స్వభావులూ, చాడీలు చెప్పేవారూ, స్తోత్రం చేసేవారూ చేరతారు. వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నావా? ప్రభుత్వోద్యోగులూ, సైనికులకు సకాలంలో జీతాలందిస్తున్నావు కదా? ఎందుకంటే వాళ్లు భృత్యం మీదే ఆధారపడి జీవిస్తారు, అందులో ఇబ్బంది కలిగితే తిరుగుబాటు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ధనికుడికీ, దరిద్రుడికీ వచ్చిన తగవుల్లో నీ మంత్రులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కదా... దోషం ఎరుగని వాళ్లను శిక్షిస్తే దాని వల్ల వాళ్లు విడిచే కన్నీళ్లు శిక్షించినవాడి కొడుకులనూ సంపదనూ తుడిచిపెట్టేస్తాయి. జాగ్రత్త సుమా! మధుర పదార్థాలూ, మంచి వస్తువులూ నువ్వొక్కడివే అనుభవించకుండా మిత్రులూ, నీ క్షేమం కోరేవారికీ పంచుతున్నావు కదా?  దొంగతనం చేస్తూ పట్టుబడ్డవాణ్నీ, లేదా దొంగతనం చేసిన ధనంలో వాటా ఇస్తానంటే ఒప్పుకున్నవాణ్నీ నువ్వు వదిలిపెట్టకూడదు, అలా చేస్తే నీ అధికారులూ నిన్ను అనుసరిస్తారు. అందువల్ల ప్రభుత్వం అవినీతి మయమవుతుంది. నువ్వు తరిమికొట్టిన శత్రువులు కొంతకాలానికి మళ్లీ వచ్చి నీ పంచన చేరతారు. బలహీనులు వీళ్ల వల్ల ఏమవుతుందని వాళ్లని నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి వాళ్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

దేవతలకూ, అతిథులకూ, పండితులకూ, గురువులకూ, వృద్ధులకూ నువ్వు నమస్కారాలు చేస్తున్నావు గదా?! డబ్బు కోసం ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. అలాగని ధర్మాన్ని మాత్రమే చేస్తూ డబ్బును అశ్రద్ధ చేయకూడదు. కామక్రీడల్లో తేలియాడుతూ డబ్బూ ధర్మమూ కూడా విడిచిపెట్టకూడదు. అంటే ఉదయంపూట ధర్మ కార్యాలు చేయాలి. మధ్యాహ్నం ధనం సంపాదించాలి. రాత్రిపూట కామాన్ని అనుభవించాలి. ఇలా చేస్తే ఈ మూడింటి వల్లా ఆనందం కలుగుతుంది. శాస్త్రాలు తెలిసిన వాళ్లూ, ప్రముఖులూ నీ క్షేమాన్నే కోరుతున్నారు కదా? క్షత్రియ యువకులందరినీ నీవంటే ప్రాణమిచ్చేలా చూసుకుంటున్నావు కదూ! పక్కరాజ్యపు శాఖల్లోని విషయాల్ని తెలుసుకునేందుకు మన దూతల్ని సవ్యంగా నియమిస్తున్నావా? మన వివిధ శాఖల అధిపతుల మీద గూఢచారుల్ని నియమించుకున్నావుగదూ!  దుర్గాల్లో ధనధాన్యాలూ, నీళ్లూ, ఆయుధాలూ, యంత్రాలకు కొరత లేకుండా ఉండేటట్టు చూసుకుంటున్నావా? నీ రాబడి అధికంగా, వ్యయం తక్కువగా ఉంది కదా? అపాత్ర దానాలు ఎప్పుడూ చేయకూడదు. స్త్రీల మాటలు విని నువ్వు అక్రమాలేమీ చేయడం లేదు కదా? ఏనుగులూ, గుర్రాలను ఇవి చాలు అనుకోకుండా లెక్కకు మిక్కిలి సమకూర్చుకుంటూనే ఉన్నావు కదూ? అంతఃపుర స్త్రీలను జాగ్రత్తగా చూసుకుంటున్నావా? చక్కగా అలంకరించుకుని ప్రజలకు దర్శనమిస్తున్నావుగా? తల్లి దండ్రుల సేవను జాగ్రత్తగా చేస్తున్నావు కదూ? కుల గురువు వశిష్ఠుణ్నీ, అసూయా రహితుడూ, పండితుడూ అయిన ఆయన కుమారుడూ నీ పురోహితుడూ అయిన సుయజ్ఞుణ్ని ఎప్పటిలాగే పూజిస్తున్నావు కదూ?  రాజయిన వాడు బుద్ధిమంతుడై న్యాయం తప్పకుండా పరిపాలన సాగిస్తే ఈ ప్రపంచంలోని అన్ని ప్రాణులకూ ప్రభువై, సకల సుఖాలూ పొంది పరలోకంలోనూ స్వర్గసుఖాలన్నింటినీ అనుభవిస్తాడు... అంటూ ఎన్నో మంచి మంచి మాటల్ని భరతుడికి చెప్పాడు.


మర్యాదా పురుషోత్తముడు...
దశరథ నందనుడు మర్యాదా పురుషోత్తముడు - సాక్షాత్తూ చక్రవర్తే అయినా ఎదురుగా ఎవరొస్తున్నా ముందు తానే పక్కకు తప్పుకునేవాడు, పూర్వభాషి - ఎంత చిన్న వారినైనా తానే ముందు పలకరించేవాడు. మృదుః- మృదుస్వభావం కలిగిన వాడు. స్మితభాషి- నవ్వుతూ మాట్లాడేవాడు, మితభాషి - చాలా తక్కువగా మాట్లాడేవాడు, మధుర భాషి - ఎంతో తియ్యగా, ఎదుటి మనిషికి హాయిని కలిగించేలా మాట్లాడగలిగే వాడు, నిభృతః - చాలా అణకువ కలిగిన వాడు.. అంటూ చెబుతాడు రాముడి గురించి వాల్మీకి.

అంతేకాదు ‘న చావమంతా భూతానాం’ అంటాడు... ఏ ప్రాణినీ తన జీవితంలో అవమానించి ఎరుగడు రామచంద్రుడు. ఎన్నడూ ఎవర్నీ తూలనాడిన సందర్భమూ లేదు. తనకు సీతాన్వేషణలో, రావణ యుద్ధంలో సాయపడ్డ వానర, భల్లూకాల్నీ సమాదరించాడు. రాజగురువు వశిష్ఠుణ్నీ, గిరిపుత్రి శబరినీ, పడవ నడిపే గుహుణ్నీ అందరినీ సమానంగా గౌరవించాడు. తనను అడవుల పాలు చేసిందని కైకమ్మను గురించి ఒక్కమాటా తప్పుగా అనడు. శత్రువైన రావణాసురుడి గురించి కూడా ఏ సందర్భంలోనూ చెడుగా మాట్లాడడు. మొదటిసారి రావణుణ్ని కలిసినప్పుడు ‘అహో దీప్త మహాతేజా రావణో రాక్షసేశ్వరః’ అంటూ అతని తేజస్సంపదను ప్రశంసించాడు.

చూడగానే అతని శక్తిని అంచనా వేశాడు. ఎంత తేజశ్శాలి... సీతను అపహరించకుండా ఉండి ఉంటే దేవలోకానికి కూడా ప్రభువయ్యేవాడేమో... అనుకున్నాడు. నిష్పక్షపాతంగా అతని శక్తిసామర్థ్యాలను అంచనా వేశాడు. కాబట్టే, అతని మీద విజయం సాధించగలిగాడు. రాముడికి ఈ గెలుపును సంపాదించి పెట్టింది ఆయనలో దాగి ఉన్న ఆ మర్యాదా గుణమే.

రాజ్యాధికారంతో సంబంధం లేకుండా రాముడికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది ఆ వ్యవహారశైలే. ఎదుటి వ్యక్తిని కనీసం గౌరవించలేని, ఆదరించలేని నాయకుడు తాను మాత్రం ఎక్కడి నుంచి మర్యాదను పొందగలడు.

సకలగుణనిధి
రాముడిని ఒక్కసారి చూసిన వాళ్లైనా, ఒక్కసారి ఆయనతో మాట్లాడిన వాళ్లెవరైనా జన్మలో ఆయన్ను మర్చిపోలేరట. దానికి ఆ దివ్య సుందర విగ్రహం ఒక కారణమైతే, ఆయన మర్యాదే ముఖ్య కారణం. అందుకే సీతను వెతుక్కుంటూ బయల్దేరినప్పుడు... రామ లక్ష్మణులిద్దరే ఉన్నారు. కానీ రావణుడిమీద యుద్ధం ప్రకటించే నాటికి ఆయన వెంట హనుమంతుడూ, జాంబవంతుడూ, విభీషణుడూ, సుగ్రీవుడిలాంటి యోధాను యోధులూ లక్షల మంది వానర, భల్లూక సైనికులూ ఉన్నారు.

నార చీరలు కట్టుకు తిరుగుతున్న ఆయన వెంట ఏ పదవుల్నీ ఆశించి వాళ్లు రాలేదు. ఏ అందలాల్నీ కోరుకుని ఆయన్ను అనుసరించలేదు. వాళ్లలో ఉన్నది కేవలం స్వామి భక్తి. సర్వదాభిగతస్సద్భిః సముద్ర ఇవ సింధుభిః... నదులు సముద్రాన్ని చేరినట్టు, మంచివాళ్లంతా రాముణ్ని ఆశ్రయిస్తారు. అందుకే రామచంద్రుడి చుట్టూ ఎప్పుడూ మునులూ, రుషులూ, జ్ఞానులూ, మేధావులూ, సత్కర్మలు ఆచరించే వారూ ఆయన నుంచి న్యాయం కోరి వచ్చే బాధితులూ పీడితులూ ఉండేవారట.

రాముడి కోటరీ సుగుణ సంపన్నులూ, మేధావులూ కాబట్టే ఆయన అంత సుభిక్షంగా పాలన చేయగలిగాడు. తమ చుట్టూ ఖూనీ కోరులూ, అవినీతి పరులూ, పదవీ వ్యామోహితులను తిప్పుకునే నేతకు మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి!

ధర్మస్వరూపుడు
రామో విగ్రహవాన్‌ ధర్మః - రామ చంద్రుడు మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు. ఆయన అబద్ధాలాడటం తెలియని వాడు. ఆయన మాటంటే మాటే! ధర్మమంటే ధర్మమే! అరిషడ్వర్గాల్ని జయించిన వాడు. సత్య ప్రియుడు. సత్యనిష్ఠా వ్రతుడు. ఎన్ని కష్టాలెదురైనా ధర్మాన్ని తప్పని మహనీయుడు. తండ్రి విశ్వామిత్రుడితో వెళ్లమంటే వెళ్లి తాటకిని చంపాడు. పట్టాభిషేకం చేసుకొమ్మంటే చేసుకుంటానన్నాడు, వద్దూ అంటే నార చీరలు కట్టుకుని అడవులకు పయనమయ్యాడు. ఎక్కడా ఆయన మాట జవదాటలేదు. అదే దశరథుడు ‘నాయనా నేను చేసింది తప్పు, నన్ను బందీగా చేసి నీవు పట్టాభిషేకాన్ని చేసుకో, నా మీద యుద్ధం ప్రకటించు, నేను ముసలివాడిని... నీతో పోరాడలేను కనుక ఎలాగూ ఓడిపోతాను’ అని చెప్పినా ఆ మాటలన్నీ కేవలం తన మీద ఉన్న వాత్సల్యంతో తండ్రి పలుకుతున్నవే తప్ప న్యాయ సమ్మతమైనవి కావు అని పట్టించుకోలేదు. భరతుడు అడవులకు వచ్చి... నీవే మమ్మల్ని పరిపాలించాలంటూ కాళ్లకి అడ్డంపడ్డా వినడు. రాజగురువులూ, మహర్షులూ, పురప్రజలూ అందరూ రాజ్యాన్ని చేకొనమని అభ్యర్థించినా తిరస్కరిస్తాడు. తండ్రిమాట నిలపడమే తన ధర్మమంటాడు. ‘ధర్మం వెంటే సంపద వస్తుంది. ధర్మం వెంటే సుఖం వస్తుంది. ధర్మాన్ని ఆదరించేవాడు సకలం పొందుతాడు. ప్రపంచానికి ధర్మమే పునాది’ అని వాల్మీకి చెప్పినట్టు, రాముడు ధర్మాన్ని అంత నిష్ఠగా అనుసరించడం వల్లే అఖండ సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఎన్నో సంవత్సరాలు ప్రజారంజకంగా పాలించాడు. అతని వంశానికీ, అతనితో నడచిన వ్యక్తుల వ్యక్తిత్వాలకూ వన్నెతెచ్చి, వారికి శాశ్వత కీర్తినందించాడు.

ఇవన్నీ కేవలం మానవుడిగా జీవిస్తూనే రాముడు సాధించాడు. ఆయనెప్పుడూ ఏ సందర్భంలోనూ దేవుడిగా చెప్పుకోలేదు. ప్రవర్తించనూ లేదు. మనలాగే చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమించాడు. కష్టనష్టాలను అనుభవించాడు. జనాన్ని ఆదరించాడు. రాజ్యాన్ని పాలించాడు. అయితే ఏ ఒక్క సందర్భంలోనూ ధర్మాన్ని వదలలేదు. అదే ఆయన్ను మహోన్నతుడిగా నిలబెట్టింది. మాయావి అయిన రాక్షసుణ్ని చంపే శక్తినిచ్చింది. ఇప్పటి ప్రజానాయకులకు అసుర సంహారం చేసే అవసరమేం లేదు. విల్లు ఎక్కుపెట్టాల్సిన అక్కరా లేదు. నార బట్టలు కట్టుకోవల్సిన అగత్యమూ లేదు. మనసులో రాముణ్ని ప్రతిష్ఠించుకుంటే చాలు, ఆయన ధర్మాన్ని అవగాహన చేసుకుంటే చాలు, రఘువీరుడి బాటలో నడిచే ప్రయత్నం చేస్తే చాలు... బతికున్నంత కాలమే కాదు ఆ తర్వాతా ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటారు. ఏ సింహాసనాలిస్తాయా సంతృప్తిని!
ధర్మస్య విజయోస్తు... తథాస్తు!

- లక్ష్మీహరిత ఇంద్రగంటి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.