close
నాన్న కల నిజం చేశాను!

భారత క్రికెట్‌లో మరో ధోనీ అనిపించుకుంటున్న ఆటగాడు రిషభ్‌ పంత్‌. 20 ఏళ్లకే టీమ్‌ ఇండియాలో చోటు దక్కించుకున్న ఈ దిల్లీ బ్యాట్స్‌మేన్‌... వికెట్‌ కీపర్‌గా ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధికంగా 11 క్యాచ్‌లు అందుకుని ప్రపంచ రికార్డుని సమం చేశాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా గడ్డపైన అత్యధిక పరుగులు చేసిన భారతీయ వికెట్‌ కీపర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. 2018 ఐపీఎల్‌లో ఎమర్జింగ్‌ ప్లేయర్‌,స్టైలిష్‌ ప్లేయర్‌ అవార్డులతోపాటు ఐసీసీ ఎమర్జింగ్‌ క్రికెటర్‌గానూ ఎంపికైన రిషభ్‌... తన క్రికెట్‌ కలని నిజం చేసుకోవడం గురించి చెబుతున్నాడిలా...

నాకపుడు ఎనిమిదేళ్లుంటాయి... రూ.14వేలు పెట్టి ఎస్జీ క్రికెట్‌ బ్యాట్‌ కొని తెచ్చారు నాన్న. అంత ధర పెట్టి కొనడం అమ్మకి నచ్చలేదు కానీ, నేనైతే ఆనందంతో ఎగిరి గెంతేశాను. దాన్ని మొదటిసారి నా చేతుల్లోకి తీసుకోవడం, ఆడటం ఇప్పటికీ గుర్తే. ఆ బ్యాట్‌తో మా సొంతూరు ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఆడని గ్రౌండ్‌ అంటూ లేదు. ఆ బ్యాట్‌ ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. అంత డబ్బు పెట్టి నాన్న నాకోసం బ్యాట్‌ కొనడం వెనక కారణం... నన్ను టీమ్‌ ఇండియా తరఫున ఆడించాలన్న ఆయన కలే. నాన్న యూనివర్సిటీ స్థాయి క్రికెట్‌ ఆడారు. కానీ ఆయనకు ఇంట్లో మద్దతు ఉండేది కాదట. అందుకే నాకు ఆ విషయంలో పూర్తి మద్దతు ఉండేది ఆయన్నుంచి. అయిదేళ్లకే క్రికెట్‌ని నాకు
పరిచయం చేశారు. కాస్త పెద్దయ్యాక మేమిద్దరం కూర్చొని నా క్రికెట్‌ కెరీర్‌ గురించి ప్రణాళికలు వేసేవాళ్లం. నాకు తొమ్మిదేళ్లు వచ్చేసరికే టీనేజ్‌ కుర్రాళ్లతో ఆడేవాణ్ని. రూర్కీలో జరిగే టోర్నమెంట్‌లలో వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆడేవారు. అలాంటిచోట నాకు తరచూ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు వచ్చేవి. మేం ఆడే మ్యాచ్‌లు 10, 12, 15 ఓవర్లు ఉండేవి. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మేన్‌గా ఆడేవాణ్ని. అలా హిట్టింగ్‌ అలవాటైంది.

దిల్లీ ప్రయాణం...
మాది చిన్న పట్టణం. అక్కడ క్రికెట్‌కి సంబంధించి సరైన శిక్షణ సంస్థలు లేవు. అందుకే దిల్లీలో కోచింగ్‌ ఇప్పించాలనుకున్నారు నాన్న. ఎక్కడ బాగుంటుందో కనుక్కున్నాక ‘సానెట్‌ క్రికెట్‌ అకాడమీ’నడుపుతున్న తారక్‌ సిన్హా దగ్గర చేర్చారు. ఆయన నా ఆటను కాదు, జీవితాన్నే మార్చేశారు. నా బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఎలా ఉండాలీ, ఏ స్థానంలో ఆడాలీ, కెరీర్‌ కోసం ఏం చేయాలీ... ఇవన్నీ చెప్పేవారు. మొదట్లో వారాంతాల్లో శిక్షణ తీసుకునేవాణ్ని. రూర్కీ నుంచి దిల్లీకి బస్సులో ఆరు గంటల ప్రయాణం. శుక్రవారం రాత్రి ఒంటి గంటకు బస్‌ ఎక్కి శనివారం ఉదయం దిల్లీ చేరుకునేవాణ్ని. అప్పటికి నా వయసు 12 ఏళ్లు. నాతోపాటు అమ్మ వచ్చేది. తెల్లవారి తాగడానికి కాఫీ, తినడానికి టిఫిన్‌ కూడా మాతో పట్టుకుని వెళ్లేవాళ్లం. నాకిష్టమైన పన్నీర్‌ పరాఠాలు చేసి తెచ్చేది అమ్మ. బస్సులో అమ్మకి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. కానీ నేను హాయిగా నిద్రపోవాలనీ ప్రాక్టీసు బాగా చేయాలనీ నాతోపాటు వచ్చేది. దిల్లీలో అమ్మా, నేను మోతీబాగ్‌ ప్రాంతంలోని గురుద్వారాలో తలదాచుకునేవాళ్లం. నేను ప్రాక్టీసుకి వెళ్తే అమ్మ గురుద్వారాలో వలంటీరుగా ఉంటూ భక్తులకు వంటలు వండటం, అన్నం వడ్డించడం చేసేది. ఆ పుణ్యం కూడా కలిసొచ్చిందేమో నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. శనివారం ప్రాక్టీసు ముగిశాక అమ్మా, నేనూ గురుద్వారాలోనే నిద్రపోయేవాళ్లం. మళ్లీ ఆదివారం రాత్రి బస్సు ఎక్కి సోమవారం రూర్కీలో దిగేవాళ్లం. తారక్‌ సిన్హా క్రికెట్‌తోపాటు జీవిత పాఠాలూ చెప్పేవారు. కానీ ఇలా తిరగడంకంటే దిల్లీలో ఉంటేనేమంచిదని, ఓ ఏడాది తర్వాత దిల్లీలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నాô. ఇల్లు అంటే ఒకటే గది. అందులోనే అమ్మానాన్నా, అక్కా, నేనూ ఉండేవాళ్లం. నాన్న రూర్కీలో నడుపుతున్న స్కూల్‌ని వేరేవాళ్లకి అప్పగించి వచ్చి కొన్నాళ్లు దిల్లీలో ఉద్యోగం, ఆపైన వ్యాపారంలోకి అడుగుపెట్టారు.

రాజస్థాన్‌ జట్టులో...
తీవ్రమైన పోటీతోపాటు రాజకీయాలూ ఉండే దిల్లీ జట్టులో చోటు దక్కడం కష్టమని మొదట రాజస్థాన్‌ జట్టు తరఫున ఆడమని చెప్పారు సిన్హా. తెలిసిన వ్యక్తిద్వారా అక్కడికి వెళ్లాం. ఆ రాష్ట్ర జట్టు తరఫున అండర్‌-13, అండర్‌- 15 జట్లలో ఆడించారు. కానీ ఆ తర్వాత బయటి రాష్ట్రం వాళ్లకి చోటులేదని పంపించేయడంతో దిల్లీ వచ్చేశాను. ఇక్కడ అండర్‌-17 జట్టులో చోటు సంపాదించగలిగాను. ఆ సమయంలో దాదాపు ఏడాదిపాటు పెద్ద స్కోర్లు నమోదుచేయలేకపోయాను. వరసగా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’లు గెలిచిన అనుభవమున్న నాకు ఇలాంటి పరిస్థితి రావడం అదే తొలిసారి. అప్పుడే బ్యాటింగ్‌ స్టాన్స్‌, బ్యాట్‌ విసిరే తీరూ, గ్రిప్‌ పట్టుకునే శైలీ అన్నీ మారాలని చెప్పారు కోచ్‌. కానీ అప్పటికే నాకు 16 ఏళ్లు. ఆ వయసులో టెక్నిక్‌ మార్చుకోవడం కష్టమే. కానీ, కోచ్‌ సూచనతో ఆ ప్రయత్నం మొదలుపెట్టాను. మధ్యలో నావల్ల కావడంలేదని చెప్పాను. కానీ ఇంకా కష్టపడాలనీ, ఆ మార్పు వస్తే కచ్చితంగా రాణిస్తాననీ చెప్పారు. ఆయన మీద నమ్మకం ఉంచి కొత్త శైలిని అలవాటు చేసుకోవడం కొనసాగించాను. కొన్నిసార్లు అర్ధరాత్రి వరకూ బ్యాట్‌ పట్టుకుని ప్రాక్టీసు చేసేవాణ్ని. నిద్రపట్టక రెండు గంటలప్పుడూ బ్యాట్‌ పట్టుకునేవాణ్ని. దాదాపు రెండేళ్లపాటు ప్రాక్టీసు చేశాక, ఆ మార్పులతో నాకు సహజమైన స్టైల్‌ అలవాటైంది. చాలామంది కోచ్‌ని తక్కువ అంచనా వేస్తారు. నేనెప్పుడూ ఆ పనిచేయలేదు. దిల్లీ జట్టులో చేరి ఏడాది దాటినా నన్ను నిరూపించుకోలేక పోయాను. ఆ అవకాశం ఒక అండర్‌-19 మ్యాచ్‌లో వచ్చింది. అసోంతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఫాలో ఆన్‌ ఆడుతూ 150 పరుగులు చేశాను. అప్పట్నుంచీ దిల్లీ క్రికెట్‌లో నా పేరు గురించి చర్చ మొదలైంది. అండర్‌-19 టీమ్‌ ఇండియాకి ఆడటానికి ముందే 2015లోనే రంజీ ఆడాను. అదే సంవత్సరం టీమ్‌ ఇండియా అండర్‌-19 జట్టుకి ఆడాను. 2016లో అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులోనూ ఉన్నాను. ఆ టోర్నీలో 267 పరుగులు చేశాను. ఫైనల్‌కి వెళ్లినా దురదృష్టవశాత్తూ. విండీస్‌ చేతిలో ఓడిపోయాం. కానీ అక్కడ నా ప్రతిభ చూసి ఐపీఎల్‌లో దిల్లీ జట్టు రూ.1.9కోట్లకు తీసుకుంది. ఆ సీజన్లో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాను. ఇక టీమ్‌ ఇండియాకి ఎంపిక కావడమే తరువాయి. కానీ అదంత సులభం కాదని తెలుసు. నేను వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మేన్‌ని. ‘ధోనీ జట్టులో ఉండగా నాకు స్థానం దక్కుతుందా’ లాంటి ఆలోచనతో కాకుండా ‘ధోనీకి ప్రత్యామ్నాయంగానే ఎందుకు, 11 మందిలో ఒకడిగా ఉండాలి’ అనుకుని నా ఆటను మెరుగు పర్చుకుంటూ ఆడాను. 2016-17 రంజీ సీజన్లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 972 పరుగులు చేశాను. అందులో ఒక ట్రిపుల్‌ సెంచరీ సహా నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఆ గణాంకాలే నాకు టీమ్‌ ఇండియాలో చోటు దక్కేలా చేశాయి. స్వదేశంలో ఇంగ్లండ్‌తో 2017 ఫిబ్రవరిలో జరిగిన టీ20 సిరీస్‌ చివరి మ్యాచ్‌లో అరంగేట్రం చేశాను. ఆ మ్యాచ్‌కి బ్యాట్స్‌మేన్‌గా ఎంపికయ్యాను. లోయర్‌ ఆర్డర్‌లో రావడంతో కేవలం అయిదు పరుగులు చేసి అజేయంగా నిలిచాను.

ఆ కబురు ఓ పెద్ద షాక్‌...
ఐపీఎల్‌ 2017 ప్రారంభమైంది. ఎన్నో ప్రణాళికలూ, ఆలోచనలతో బుర్ర నిండిపోయింది. ఈసారి ప్రదర్శన నాకు టీమ్‌ ఇండియాలో స్థిరమైన స్థానం తెస్తుందన్న ఆశతో ఉన్నాను. సరిగ్గా మొదటి మ్యాచ్‌కు ముందురోజు నాన్న గుండెపోటుతో చనిపోయారని ఫోన్‌... నాన్న లేరని తెలియగానే నా కాళ్లకింద నేల కుంగిపోయినట్టు అనిపించింది. ఇంటికి వెళ్తున్న దారిలో అమ్మ గురించీ, అక్క గురించీ ఆలోచించాను. ‘దుఃఖాన్ని కాదు, సంతోషాన్ని మాత్రమే పంచు’ అనేది నా స్వభావం. రూర్కీ నుంచి దిల్లీకి బస్సులో తిరిగినపుడూ, రాజస్థాన్‌ క్రికెట్‌ సంఘం పొమ్మన్నపుడూ, దిల్లీ జట్టులో చోటు సంపాదించే ప్రయత్నంలో ఇబ్బందులు ఎదురైనపుడూ... ఎప్పుడూ నా బాధని ఇంట్లో చెప్పలేదు. నాన్న మరణంతో నేను దిగులు పడితే అమ్మ పరిస్థితి ఏంటి అనిపించింది. అందుకే నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. అంత్యక్రియలు పూర్తయ్యాక ‘మ్యాచ్‌కు వెళ్తావా’ అని తాతయ్య అడిగితే, నాన్న కోరిక నెరవేర్చడమే నా పని అనుకుని, వెళ్తానని చెప్పాను. ఉదయం ఎనిమిదింటికి బెంగళూరు బయలుదేరి జట్టుతో చేరి ఆరోజు మ్యాచ్‌ ఆడి 36 బంతుల్లో 57 పరుగులు చేశాను. నాకు కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే, నాన్న బతికుండగానే టీమ్‌ ఇండియాకి ఆడటం. లేకపోతే అది ఆయనకు తీరని కలగా మిగిలిపోయేది.

అదే నా లక్ష్యం
టీ20 చాలా ఒత్తిడితో కూడుకున్న ఫార్మాట్‌. అయితే ఐపీఎల్‌ అనుభవంతో ఆ ఫార్మాట్‌లో ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ఆడటం నేర్చుకున్నాను. అంతర్జాతీయ ఆటగాళ్లతో డ్రెసింగ్‌ రూమ్‌ పంచుకోవడం మన ఆలోచనా ధోరణినీ మార్చుతుంది. 2018 ఐపీఎల్‌లో 684 పరుగులు చేశాను. అందులో కొన్ని మ్యాచ్‌ని గెలిపించిన ఇన్నింగ్స్‌ ఉన్నాయి. దాంతో నాకు ఇండియా-ఎ జట్టులో చోటు దొరికింది. అక్కడా రాణించడంతో 2018 ఆగస్టులో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కీ, అదే ఏడాది అక్టోబరులో స్వదేశంలో విండీస్‌తో వన్డే సిరీస్‌కూ ఎంపికయ్యాను. ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ గెల్చిన జట్టులో ఉండటాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అదో మధుర జ్ఞాపకాల సిరీస్‌. ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియాపైన చేసిన 159 పరుగులు నాకు చాలా ప్రత్యేకం. నేను టీ20కి ఎంపికయ్యాక ‘నిన్ను అంతర్జాతీయ ఆటగాడిగాకంటే టెస్టు ఆటగాడిగా చూడాలనేది నా కోరిక’ అన్నారు మా కోచ్‌. ఈరోజు నేను ఇండియాకి టెస్టుల్లో ఆడుతున్నాను. అంతకంటే సంతోషం ఏం ఉంటుంది. మరో 10-15 ఏళ్లు టీమ్‌ ఇండియాకి ఆడటమే నా ముందున్న ఏకైక లక్ష్యం. దానికోసం ఎంతైనా శ్రమిస్తాను.

ట్రెక్కింగ్‌కి వెళ్లాల్సిందే!

మా కుటుంబం రూర్కీలో స్కూల్‌ని నడపాలనేది నాన్న కోరిక. అమ్మ రూర్కీ వెళ్లిపోయి ప్రస్తుతం నాన్న స్థాపించిన స్కూల్‌ని నిర్వహిస్తోంది.

* నాకు ఐ20 కారు కొనాలని ఉండేది. ఐపీఎల్‌కి ఎంపికయ్యాక వచ్చిన డబ్బుతో నేను చేసిన మొదటి పని ఆ కారు కొనడం. ఆ కారులోనే నేరుగా స్టేడియంకి వెళ్లాను. కారులో లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లడం ఇష్టం. ప్రస్తుతం నా దగ్గర కొత్తగా కొన్న ఫోర్డ్‌ మస్టాంగ్‌ ఉంది. దాంట్లోనే షికార్లు చేస్తా.

* విరామ సమయాన్ని కుటుంబంతో గడపటానికే కేటాయిస్తాను. ఎక్కువగా ట్రెక్కింగ్‌కి వెళ్తాను. నైనితాల్‌లో మా పిన్ని ఉంటుంది. ఖాళీ దొరికితే స్నేహితులతో అక్కడికి వెళ్తాను. వాళ్లతో ట్రెక్కింగ్‌కి వెళ్తే మానసికంగా చాలా ఉపశమనం ఉంటుంది.

* ఫిట్‌నెస్‌ కోసం... రన్నింగ్‌ చేస్తాను. కార్బొహైడ్రేట్స్‌ తక్కువగా ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటాను. ఆహార ప్రియుణ్నే... కానీ ప్రొఫెషనల్‌గా మారాక మాత్రం నియంత్రణ పెట్టుకున్నాను. జంక్‌ ఫుడ్‌ ఒకప్పుడు ఇష్టంగా తినేవాణ్ని. ఇప్పుడు అది ముట్టను. మాంసాహారం బాగా ఇష్టం. బటర్‌ చికెన్‌, చిల్లీ చికెన్‌ బాగా లాగించేవాణ్ని. ఇప్పుడు కాస్త తక్కువ పరిమాణంలో తింటున్నాను.

* క్రికెట్‌ మాత్రమే కాదు బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, స్నూకర్‌, టేబుల్‌ టెన్నిస్‌, టెన్నిస్‌, వాలీబాల్‌... కూడా ఆడగలను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.