close
డార్జిలింగ్‌... ఓ వేసవి విడిది..!

‘అందమైన ప్రాంతాలను చూద్దామని కొందరూ భక్తితో మరికొందరూ పర్యటిస్తుంటారు. యాత్ర ఏదయినా ప్రకృతి అందాల వల్ల ఆనందంగా అనిపిస్తే, దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ రెండింటితోబాటు ఆ ప్రాంతంలోని ప్రజల భాష, కట్టూబొట్టు, ఆహారపుటలవాట్లు... ఇలా ఎన్నో  తెలుసుకుంటాం. డార్జిలింగ్‌ సందర్శనలో మాకు ఇవన్నీ దొరికాయి’ అంటూ ఆ విశేషాలను చెప్పుకొస్తున్నారు విజయవాడకు చెందిన ఎం.పి.ఎస్‌.కె.దుర్గాప్రసాద్‌.

విజయవాడ నుంచి రైల్లో కోల్‌కతా చేరుకుని, మళ్లీ రైలెక్కి పశ్చిమబెంగాల్‌లోని సిల్‌గురిలో దిగి, ట్యాక్సీ ఎక్కాం. ఆ దారిలో అన్నీ తేయాకూ, యాలకులూ, కమలా తోటలే. ఆ వంపుసొంపుల ఘాట్‌ రోడ్లమీద ప్రయాణిస్తూ దారివెంటే వచ్చే ఆ తోటల్నీ నీటి ప్రవాహాల్నే చూడాలో... అల్లంత దూరంలోని హిమాలయాల అందాల్నే చూడాలో తెలీక రెప్పవేయడం మర్చిపోయాం. డార్జిలింగ్‌ చేరుకున్నాక కాసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం అక్కడి మార్కెట్‌ రోడ్లన్నీ తిరిగి, టాయ్‌ ట్రెయిన్‌ ఎక్కడానికి వెళ్లాం.

టాయ్‌ ట్రెయిన్‌!
హిమాలయన్‌ రైల్వే ఆధ్వర్యంలో- కేవలం రెండే బోగీలతో ఆవిరితోనూ డీజిల్‌తోనూ నడిచే అక్కడి టాయ్‌ రైళ్లని చూడగానే ఆనందంగా అనిపించింది. మేం ఆవిరితో నడిచే జాయ్‌ రైలు ఎక్కాం. ఇది ఎక్కితే డార్జిలింగ్‌ నుంచి గూమ్‌ రైల్వేస్టేషన్‌, గూమ్‌ నుంచి తిరిగి డార్జిలింగ్‌ చేరుకుంటాం.

ఈ మొత్తం ప్రయాణం 16 కి.మీ. కానీ ఒక్క ట్రిప్పుకి రెండు గంటల సమయం పడుతుంది. కొండల్లోనుంచీ ఇళ్ల మధ్యలోంచీ వేసిన చిన్నపట్టాల మీదుగా ప్రయాణిస్తూ డార్జిలింగ్‌, గూమ్‌ పట్టణ అందాలను చూడటం మంచి అనుభూతిని కలిగించింది. గూమ్‌ దేశంలోకెల్లా ఎత్తైన రైల్వేస్టేషన్‌.

కొయ్యబారిపోతాం!
వేడి వాతావరణంలో నివసించే మనకు అక్కడి చలికి కొయ్యబారిపోవడం ఖాయం. కాళ్లకు సాక్సులూ చేతులకి గ్లోవ్సూ తలకి మఫ్లర్లూ చుట్టుకుని జెర్కిన్లు వేసుకుంటే తప్ప రాత్రిపూట నిద్రపోలేం. ఉదయం 16 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉండే ఉష్ణోగ్రత, రాత్రయ్యేసరికి 6 నుంచి 1 డిగ్రీకి పడిపోతుంది. రగ్గులు కప్పుకున్నా రూములో హీటరు ఉన్నా చలి చలే.

సంస్కృతీ సంప్రదాయాలు!
కొండ ప్రదేశమైన డార్జిలింగ్‌లో నేపాలీలూ లెప్చాలూ గోర్ఖాలూ భూటియాలూ టిబెటన్లూ తమంగ్‌లూ... ఇలా భిన్న తెగలకు చెందిన ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకుంటూ నివసిస్తున్నారు. అసలైన స్థానికులు లెప్చాలే. మిగిలినవాళ్లంతా వలస వచ్చినవాళ్లే. కూరగాయలు, చికెన్‌, పోర్క్‌ నింపిన మోమోలూ; వాయ్‌వాయ్‌లు ఎక్కువగా తింటారు. సూప్‌ నూడుల్స్‌, దమ్‌ ఆలూ, సాల్‌ రోటీ కూడా ఎక్కువే. వస్త్రధారణ కూడా ఎవరికి వాళ్లదే.  పెళ్లయిన స్త్రీలు మాత్రం కాలర్‌తో కూడిన యాప్రాన్‌ కట్టుకుంటారు. ఫ్యాషన్లూ ఎక్కువే.

టైగర్‌ హిల్‌!
ఉదయం నాలుగు గంటలకే లేచి 8,400 అడుగుల ఎత్తులో ఉన్న టైగర్‌హిల్స్‌కు చేరుకున్నాం. సూర్యోదయ సమయంలో 28,208 అడుగుల ఎత్తులోని కంచన్‌జంగ శిఖరం మీదుగా వచ్చే భానుడి తొలికిరణాలను చూసేందుకు పర్యటకులు వస్తుంటారక్కడికి. తరవాత గూమ్‌ మొనాస్టరీకీ వెళ్లాం.

బటాసియా లూప్‌
మొనాస్టరీ నుంచి బటాసియా లూప్‌కి వెళ్లాం. డార్జిలింగ్‌ను 360 డిగ్రీల కోణంలో చూడ్డానికి దీన్ని మించిన ప్రదేశం లేదు. బటాసియా అంటే గాలితో కూడిన ప్రదేశం అని అర్థం. దీన్ని టాయ్‌ ట్రెయిన్‌ రైడ్‌ కోసమే రూపొందించారట. ఎత్తైన కొండమీద వృత్తాకారంలో ఉద్యానవనాన్ని పెంచి దాని చుట్టూ రైల్వే పట్టాలు నిర్మించారు. కొండప్రాంతాల్లో పెరిగే మొక్కలతో కూడిన ఉద్యానవనమూ ఉంది. లూప్‌ మధ్యలో తమ ప్రాంత స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన గోర్ఖా సైనికుల స్మారకార్థం వార్‌ మెమోరియల్‌ను నిర్మించారు. అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వస్తే మార్కెట్‌ ఉంటుంది. స్థానికులు సమోసాలూ కూరగాయలతో స్టఫ్‌ చేసిన స్నాక్స్‌ అమ్ముతుంటారు.

టెన్జింగ్‌ రాక్‌
అక్కడ అల్పాహారం తిని డార్జిలింగ్‌లో ఉన్న కొండలు ఎక్కేందుకు తర్ఫీదు ఇచ్చే హిమాలయన్‌ మౌంటెనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి బయలుదేరాం. 1954లో స్థాపించిన ఈ కేంద్రానికి తొలి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించినది టెన్జింగ్‌ నార్గేనే. అక్కడే ఆయన స్మారక చిహ్నాన్ని నిర్మించారు. తరవాత నెహ్రూ జూలాజికల్‌ పార్కులో జంతువులను చూసి, టెన్జింగ్‌ రాక్‌కి వెళ్లాం. ఎవరెస్ట్‌ను శిఖరాన్ని అధిరోహించిన టెన్జింగ్‌కు గుర్తుగా అక్కడ ఏర్పడిన ఓ పెద్ద రాయికి ఆయన పేరు పెట్టారు. దాని ఎదురుగానే గోంబు రాక్‌ అని మరో రాయి ఉంది. టెన్జింగ్‌ మేనల్లుడైన గోంబుకి గుర్తుగా దానికాపేరు పెట్టారట. 1963, 65లలో రెండుసార్లు ఎవరెస్ట్‌ను ఎక్కిన తొలి వ్యక్తి అతనే. తరవాత టిబెటన్ల సేవాకేంద్రానికి వెళ్లాం. టిబెట్‌ నుంచి తప్పించుకుని వచ్చిన శరణార్థులు ఓ స్వీయ సేవాకేంద్రాన్ని ఏర్పాటుచేసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం వాళ్లకు నాలుగు ఎకరాల స్థలం కేటాయించి ఓ భవంతిని నిర్మించి ఇచ్చింది. మొదట్లో విరాళాల మీదే ఆధారపడినా శాలువాలూ కార్పెట్లూ హస్తకళలూ లెదర్‌ జాకెట్లూ కోటులూ... వంటివి తయారుచేయడం ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు.

తేయాకు తోటల్లో...
తరవాతి మజిలీ తేయాకు తోటలు. మకైబరి, హ్యాపీ ఎస్టేట్స్‌గా పేరొందిన అక్కడి కొండలమీద ఆకుపచ్చని శాలువాలు కప్పినట్లుగా ఉన్న ఆ తోటల్ని చూడ్డానికే అనేకమంది పర్యటకులు వస్తుంటారు. వేల ఎకరాల్లో పరచుకున్న ఆ తేయాకు కొండల్లో తిరుగుతుంటే చల్లని వానచినుకులతో కూడిన గాలి మనల్ని గిలిగింతలకు గురిచేస్తుంది. అక్కడ పెరిగే టీ రుచికి మరేదీ సాటి రాదట. అందుకే ఇది వరల్డ్‌ గ్రేటేస్ట్‌ టీగా పేరొందింది. మనదేశంలో తయారయ్యే టీలలో డార్జిలింగ్‌ నుంచి వచ్చేది ఒక శాతమే. కానీ దాన్ని వేలంవేసి మరీ కొంటుంటారు. ఆ గాలిలో నేలలో ఏదో మ్యాజిక్‌ ఉంది. అందుకే ఆ టీకి అంత రుచి అంటుంటారు దాని రుచి చూసినవాళ్లు. పైగా అక్కడి తేయాకు పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించినది. టీ ఎస్టేట్స్‌ దగ్గరే ఉన్న ప్రాసెసింగ్‌ యూనిట్‌లో రకరకాల టీ పొడుల తయారీని చూసి అక్కడ ఉన్న అవుట్‌లెట్స్‌లో నచ్చిన టీ పొడులనీ కొనుక్కోవచ్చు. కిలో ఏడు వందల రూపాయల బ్లాక్‌ టీ నుంచి 50 వేల ఖరీదు చేసే వైట్‌ టీ వరకూ అన్నీ దొరుకుతాయి. తోటల్లో రాత్రివేళ హోమ్‌స్టేల్లో ఉండాలనుకునేవాళ్లు టీ ఆకును తుంచే వాళ్ల ఇళ్లలోనే ఉంటారు. విలాసవంతమైన హోటళ్లలో ఉండాలనుకునేవాళ్లకి అవీ ఉన్నాయి.

మర్నాడు డార్జిలింగ్‌ కొండలమీదున్న ఊళ్లమీదుగా వేసిన రోప్‌వేలో విహరిస్తూ అక్కడి అందాలను చూసి మైమరిచిపోయాం. డార్జిలింగ్‌- రంగీత్‌ లోయ మార్గంలో ప్రయాణించే ఈ  కేబుల్‌ కారు ఆసియాలోకెల్లా పొడవైనదట. నైటింగేల్‌ పార్కులో ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకూ రోజూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంటుంది. టైగర్‌హిల్‌ నుంచి కంచన్‌జంగాని చూడలేనివాళ్లు ఇక్కడి నుంచి కూడా ఆ సూర్యోదయాన్ని చూడొచ్చు. తరవాత జపనీస్‌ పీస్‌ పగోడాకి వెళ్లాం. తెరవాడ బౌద్ధులు రోజూ నాలుగు గంటలకే లేచి డ్రమ్ములు వాయించుకుంటూ ఈ గుడికి నడిచి వస్తారట.

ట్రెక్కింగ్‌కీ వెళ్లొచ్చు!
డార్జిలింగ్‌ రైల్వే స్టేషన్‌కి కాస్త దిగువన ఉన్న ధీర్‌ధామ్‌ ఆలయాన్ని చూసి రాక్‌గార్డెన్‌కి వెళ్లాం. ఓ చిన్న జలపాతం, రాళ్లు, రంగురంగుల పూలమొక్కలతో నిర్మించిన ఈ ఉద్యానవనంలో స్థానిక దుస్తుల్ని అద్దెకు ఇస్తారు. ఇష్టమైనవాళ్లు వాటిని ధరించి ఫొటోలు దిగుతుంటారు. అక్కడి నుంచి అబ్జర్వేటరీ కొండమీద ఉన్న మహాకాళ్‌ ఆలయాన్ని చూశాం. హిమాలయాల్లో ట్రెక్కింగ్‌ చేసేవాళ్లకి డార్జిలింగ్‌ అనువైన ప్రదేశం. ప్రకృతి పచ్చని తివాచీ పరిచి, అందులో పూలబాట వేసి మరీ స్వాగతిస్తుంటుంది. కొండలనిండా రోడోడెండ్రాన్‌లూ మాగ్నోలియాలతోబాటు దాదాపు 600 రకాల ఆర్కిడ్లు అక్కడి నేలమీద విరబూస్తూ కనువిందు చేస్తుంటాయి. లాల్‌కోతి, ధీర్‌దాం టెంపుల్‌, ఆవ ఆర్ట్‌గ్యాలరీ చూసి వెనుతిరిగాం.

ఎలా వెళ్లాలి?
రైల్లో ప్రయాణించేవాళ్లు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం, సిల్‌గురిలోని న్యూజల్‌పాయ్‌గురి రైల్వేస్టేషనులో దిగి, డార్జిలింగ్‌కు చేరుకోవచ్చు(ఆ ఊరి పేరూ రైల్వే స్టేషన్‌ పేరూ రెండూ వేర్వేరు). విమానంలో ప్రయాణించేవాళ్లు బాగ్థోరా ఎయిర్‌పోర్టులో దిగాలి. అక్కడ డార్జిలింగ్‌, గ్యాంగ్‌టక్‌... ఇలా రకరకాల ప్రదేశాలకు వెళ్లే ట్యాక్సీవాలాలు సిద్ధంగా ఉంటారు.

(5  మే 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.