close
బాల వెంకన్న వెలసిన క్షేత్రం

మొక్కు తీర్చుకోలేని భక్తుడి కోసం సాక్షాత్తూ శ్రీనివాసుడే కదలి వచ్చాడు. వైనతేయ నదీతీరాన కొలువైన స్వామి అడిగినవి ఇచ్చే అభయప్రదాతగా పేరుపొందాడు. తూర్పుగోదావరి జిల్లా అప్పనపల్లిలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడి సన్నిధి భక్తుల పాలిట పెన్నిధే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే తొలిగా నిత్యాన్నప్రసాదాన్ని ప్రారంభించిన వేదిక కూడా. 
ప్రహ్లాదుడు తలిస్తే వచ్చాడు, గజేంద్రుడు పిలిస్తే వచ్చాడు పురాణాల్లోనే కాదు కలికాలంలోనూ స్వామి అలానే కదిలివచ్చాడు. దానికి ఓ నిదర్శనమే అప్పనపల్లి బాలబాలాజీ. శ్రీనివాసుడు భక్తసులభుడన్న మాట ఇక్కడ నూటికి నూరుపాళ్లూ వర్తిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి 65 కిలోమీటర్లు, అమలాపురానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనసీమలోని ఈ దివ్య క్షేత్రం పవిత్ర వైనతేయ నదీ తీరంలో పరుచుకున్న పచ్చదనం మధ్య నిత్య మనోహరంగా శోభిల్లుతోంది.

ఇలా వెలిశాడు... 
గ్రామానికి చెందిన మొల్లేటి మునియ్య, మంగమ్మ దంపతుల కుమారుడైన రామస్వామి తిరుమల శ్రీవారిని కొలుస్తుండేవాడు. కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ వచ్చిన లాభంలో కొంత వాటాను స్వామివారికి తీసిపెట్టేవాడు. ఆ క్రమంలో ఓ సారి తిరుపతి వెళ్లి ముడుపును మూల విరాట్‌ పాదాల చెంత పెట్టాలనుకున్నాడు. అలా కుదరదనీ ముడుపు హుండీలో వేయాలని అక్కడి వారు చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆ రోజు కొండమీదే నిద్రపోయాడు, అప్పుడే కలలో స్వామివారు కనిపించి తాను బాల్య రూపంలో అప్పనపల్లిలో అవతరిస్తానని చెప్పగా స్వగ్రామానికి చేరుకుని కొట్లోకి వచ్చి చూసేసరికి కొబ్బరికాయల మధ్య పంచలోహాలతో చేసిన చిన్న స్వామి విగ్రహం కనిపించింది. అక్కడే స్వామిని ఉంచి అర్చించడం మొదలు పెట్టాడు 

రామస్వామి. అలా 1962 నుంచి కొబ్బరికొట్టే ఆలయంగా మారింది. అయితే అక్కడికి పెద్ద ఎత్తున వచ్చే భక్తులు భోజనాల కోసం పడుతున్న ఇబ్బందులను చూసి చలించిన రామస్వామి ఆలయ ప్రాంగణంలోనే అన్న ప్రసాద వితరణను ప్రారంభించాడు. 1977లో తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదట నిత్యాన్న ప్రసాద వితరణ మొదలైంది ఇక్కడే. తొలుత బూరె, పులిహోరతో ప్రారంభమైన ఇది నేడు వాటితో పాటు అన్నం, పప్పు, కూర, సాంబారు, పచ్చడి, మజ్జిగతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా భక్తుల సంఖ్యతో నిమిత్తం లేకుండా కొనసాగుతోంది.

నిత్యకల్యాణం... 
భక్తుల సౌకర్యార్థం కొట్లో వెలసిన స్వామివారి ఆలయానికి చేరువలోనే మరో నవీన ఆలయాన్ని నిర్మించి స్వామి దివ్యసుందర విగ్రహంతో పాటు ఇరువైపులా పద్మావతి, ఆండాళ్‌తాయారు అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించారు. పాత ఆలయాన్ని చెక్కుచెదరనీయకుండా చుట్టూ అధునాతన ఆకృతులతో రూపకల్పన చేశారు. బాలబాలాజీస్వామి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి స్వర్ణ కిరీటం, స్వర్ణ కర్ణ, అభయ హస్తాలు అలంకరించారు. నవీన ఆలయం ముఖమండపం, గోపురాలపై ఉన్న శిల్ప సౌందర్యం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రధాన గోపురంపై స్వామివారి దశావతారాలు, అష్టదిక్పాలకులు సహా అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణుడు, శేషపాన్పుపై పవళించిన మహావిష్ణువు, పుట్టలో ఉన్న శ్రీవారికి ధారగా పాలు కురిపిస్తున్న గోమాతలాంటి శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఏటా వైశాఖ బహుళ పంచమి నుంచి సప్తమి వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి దివ్య కల్యాణం వైభవంగా జరుగుతుంది. పర్వదినాల్లో ప్రత్యేక పూజలతో పాటు, విజయదశమి రోజున పద్మావతి అమ్మవారికి లక్షకుంకుమార్చన, కార్తీక శుద్ధ ఏకాదశిన స్వామివారికి లక్ష తులసి పూజ, ధనుర్మాస దీక్షలూ నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం, గోదాదేవికి లక్ష చామంతి పూజ నిర్వహిస్తారు. పుష్య బహుళ చవితి రోజున గోదాదేవి కల్యాణం జరుగుతుంది. ఆలయంలో రోజూ  కల్యాణం, లక్ష్మీనారాయణ హోమం, సుప్రభాతం, నివేదన, వేదపారాయణం, పవళింపు సేవల్లాంటివి నిర్వహిస్తారు.

ఎలా వెళ్లాలి..? 
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చే వారికి రాజమహేంద్రవరం వరకు రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రాజమహేంద్రవరం నుంచి అటు అమలాపురం లేదా ఇటు తాటిపాక మీదుగా పాశర్లపూడి కూడలి నుంచి క్షేత్రానికి చేరుకోవచ్చు. విజయవాడ నుంచి పాలకొల్లు, నర్సాపురం వరకు రైలులో వచ్చే వారికి అక్కడ్నించి బస్సు సౌకర్యం ఉంది. తాటిపాక, పాశర్లపూడి కూడళ్ల నుంచి బస్సులతో పాటు ఆటోల సదుపాయాలున్నాయి.

- కడియం త్రినాథస్వామి, న్యూస్‌టుడే, మామిడికుదురు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.