close
ఎండవేళ...తెల్లగా... చల్లగా..!

నీలాకాశంలో దూదిపువ్వుల్లా విరిసిన మేఘాలూ, నిశిరాత్రివేళ తళుకులీనే అందాల తారకలూ, ప్రకాశవంతమైన వెన్నెలను కురిపించే జాబిల్లీ, సుగంధాలు వెదజల్లే మరుమల్లెలూ... అన్నీ శ్వేత వర్ణంలో శోభిల్లే చల్లని అందాలే. అందుకే వేసవిలో ప్రభాకరుడి ప్రకోపాన్ని తట్టుకోవడానికి మంచుకొండల్ని తలపించే తెలుపురంగుని ఆనందంగా స్వాగతిస్తుంటారు ఫ్యాషనిస్టులు!

తెలుపా... అందులో రంగేముంది... చూడ్డానికేం ఉంటుంది... అంటారు వర్ణపిపాసులు. కానీ రంగులన్నింటికీ మూలం తెలుపే. అంటే కాంతి... సప్తవర్ణ సంగమం. ఆ కాంతిలోని ఏదో ఒక రంగుని ప్రతిబింబించే గుణమే సృష్టిలోని రంగులకి మూలం. అందుకే అంటారంతా వర్ణాలెన్ని ఉన్నా సప్తవర్ణ సంగమం ధవళమేననీ అదే సంపూర్ణ వర్ణమనీ. అంతెందుకు... తెలుపు రంగులో కనిపించేంత ప్రశాంతత ఇతర వర్ణాల్లో కనిపించదు. రంగుల వస్త్రాలన్నింటికీ మూలమైన దూది విరిసేదీ తెలుపులోనే మరి. అంటే తెలుపు దుస్తులు ధరించాలన్నదే ప్రకృతిసూత్రం అన్నమాట. మిగిలిన రంగులన్నీ అంతో ఇంతో కాంతిని గ్రహిస్తే, తెలుపు ఆ కాంతిని వెదజల్లుతుంది. వేసవిలో ఇతర రంగులతో పోలిస్తే తెల్లనివి ధరించడం వల్ల ఒంటికి చల్లగా కంటికి హాయిగా అనిపిస్తుంది. అందుకే ఫ్యాషన్‌తో సంబంధం లేకుండా మండే ఎండల్లో పెద్దాచిన్నా అంతా తెల్లని దుస్తులకే ఓటేస్తారు. సినీ వానపాటల్లోని అందాల ఆరబోతలోనూ తెలుపు దుస్తులదే హవా. తెలుపురంగు తడిస్తే అంతా పారదర్శకమే. అవన్నీ పక్కనబెడితే, మనసుకి ప్రశాంతంగా ఉంటుందనో సృజనకి సంకేతంగా భావించో తెలియదుగానీ తెలుపును ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌గా ధరించేవాళ్లూ లేకపోలేదు. ఇక, నైట్‌ పార్టీలూ వేడుకలూ ర్యాంప్‌షోల్లో కొట్టొచ్చినట్లు కనిపించేదీ తెలుపురంగే. అందుకే తెలుపు ఎవర్‌గ్రీన్‌ ఫ్యాషన్‌.


 

తెల్లని సంస్కృతి! 
స్వచ్ఛమైనది అన్న కారణంతోనే అనేక దేశాల్లో పెళ్లికి తెల్లని గౌనునే ధరిస్తారు. మనదగ్గరా తలంబ్రాల చీర ఆ రంగులోనే ఉంటుంది. కేరళీయుల సంప్రదాయ చీర రంగూ ఇదే. పెళ్లికూతురు పుట్టింట్లో చనిపోయి అత్తింట్లో పుడుతుందన్న నమ్మకంతో పెళ్లిలో జపనీయులు తెల్లగౌను ధరిస్తే, గ్రీకులు మంచి కలలొస్తాయన్న కారణంతో రాత్రివేళ తెల్లని దుస్తులు ధరిస్తారట. తెల్లని తెలుపు సింగారానికీ శృంగారానికీ చిహ్నమేనట. మత్తెక్కించే మల్లెలూ సన్నజాజులూ విరజాజులూ ఛమేలీలూ అన్నీ తెల్లగానే విరుస్తాయి. అందుకే ‘తెల్లచీర కట్టుకో... మల్లెపూలు పెట్టుకో...’ అంటూ రెచ్చిపోయారు సినీకవులు.


 

తెలుపుతో రంగుల చెలిమి! 
శ్వేత వర్ణం ఎక్కువయితే ఒకలాంటి స్తబ్ధతకీ దారితీస్తుంది అంటారు కలర్‌ థెరపిస్టులు. అందుకే అచ్చంగా తెలుపే కాకుండా దాన్ని ఇతరత్రా రంగులతో మిళితం చేసేస్తుంటారు డిజైనర్లు. నీలమూ ఎరుపూ గులాబీ ఊదా నారింజా ఆకుపచ్చా... ఇలా ఏ రంగయినా తెలుపుకి ఓకే. కానీ దీనికి సరైనజోడు మాత్రం నలుపే అనీ, తెలుపురంగు దుస్తులు వేసుకున్నప్పుడు షూ, బెల్ట్‌.. వంటి యాక్సెసరీలన్నీ నల్లనివో లేదా తెలుపూ నలుపూ కలగలిసినవో అయితే బెటర్‌ అంటారు ఫ్యాషనిస్టులు. ఆ రెండింటిదీ ఎవర్‌లాస్ట్‌ కాంబినేషనే అయినప్పటికీ తెలుపుకి గులాబీ రంగు తోడయితే కళ్లకు ఎంతో హాయిగా ఆహ్లాదంగా అదీ పూల ప్రింట్లతో ఉంటే ఫెయిరీటేల్‌ ఉద్యానవనంలో విహరిస్తున్నట్లే అనిపిస్తుంది. నీలం రంగుతో జత కడితే హుందాగా అనిపిస్తుంది. నారింజ కలిస్తే ఎంతో ప్రకాశవంతంగా అనిపిస్తుంది. ఆకుపచ్చ తోడయితే ఆ అందమే వేరు.

తెలుపెంతో ఆరోగ్యం! 
ఇళ్లకి ఎక్కువగా తెల్లని వెల్లనే వేసేవారు ఒకప్పుడు. ఏటా ఇంటికి వెల్ల(తెల్లని సున్నం)వేయించడం వల్ల ఇల్లూ శుభ్రంగా ఉంటుంది. ఆ ఘాటుకి పురుగూ పుట్రా కూడా రావు. దాంతో ఇంట్లోని వాళ్లంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. తెలుపు రంగు పెయింట్‌ వేస్తే ఇల్లు విశాలంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మనుసుని ప్రశాంతంగా ఉంచుతుంది. తెల్లని సూర్యకాంతిలో సప్తవర్ణాలూ దాగున్నట్లే, తెల్లని పండ్లూ కూరగాయల్లోనూ పోషకాలూ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లూ పుష్కలమే. వీటిల్లో క్యాన్సర్లని నిరోధించే గుణాలూ అధికమేనట.

తెలుపంటే ఇష్టమా? 
తెలుపంటే ఇష్టపడేవాళ్లు శుభ్రతకీ ఆరోగ్యానికీ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లై ఉంటారట. అన్ని విషయాల్లోనూ కచ్చితంగా ఉండాలని అనుకుంటారు. ఆశావాదులూ స్థిరచిత్తులూ తెలివైనవాళ్లై ఉంటారు. వీళ్లకి ఆత్మవిశ్వాసమూ ఎక్కువే. సృజనశీలురు. ఏ రంగంలో ఉన్నా పాతను వదిలి, కొత్తగా ప్రయత్నిస్తుంటారు. నిజాయితీపరులు, నిరాడంబరులు. పశ్చిమ దేశాల్లో తెల్లటోపీ పెట్టుకుంటే మంచివాళ్లనీ నల్లటోపీ ధరిస్తే చెడ్డవాళ్లనీ నమ్మకం. కలలో తెల్లని కట్టడాలో వస్త్రాలో కనిపిస్తే ఇంట్లో సంతోషం నెలకొంటుందనీ విశ్వసిస్తారు. తెల్లదనం భావోద్వేగాలని నియంత్రిస్తుంది. ఆలయాలూ ఆధ్యాత్మిక కేంద్రాలన్నింటికీ తెలుపురంగునే వేసేది అందుకే మరి. 
తెలుపురంగుని చూడటం వల్ల రోగాలు త్వరగా తగ్గి, మానసికంగా ప్రశాంతంగా ఉంటారన్న కారణంతోనే వైద్యులూ నర్సులూ తెలుపురంగుని ధరించడం ప్రారంభించారట. సో...రంగుల మోజుతో ఎండల్లోనూ అవే వేసుకుని మాడిపోకుండా చల్లని తెల్లని దుస్తులతో హాయిగా విహరిస్తూ ఎండని తిప్పికొట్టేయండి..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.