close
విద్యార్థుల కోసం కొత్తగా...

 

పడ్డవాళ్లకే తెలుస్తాయి సాధకబాధకాలంటారు. అలా విద్యార్థి దశలో తమకి ఎదురైన ఇబ్బందులే వీళ్లని స్టార్టప్‌లు పెట్టేలా చేశాయి. ఆ అంకుర సంస్థలని ఏదో మఖలోపుట్టి పుబ్బలో అంతరించిపోయేట్టు కాకుండా నిరంతర శ్రమతో అగ్రశ్రేణి సంస్థలుగా నిలిపారు. లక్షలాదిమందికి సాయపడుతున్న ఆ మూడు స్టార్టప్‌లని పరిచయం చేసుకుందామా... 


విద్యార్థికి... ఆర్థిక సాయం 

పదో తరగతి తర్వాత మనం చదివే ప్రతి కోర్సుకీ ఏదో ఒక స్కాలర్షిప్‌ ఉంటుందని మనకు తెలుసు. కానీ ఒకటో తరగతి నుంచే ఇలాంటి ఉపకారవేతనాలు అందించే బోలెడన్ని సంస్థలనీ మనకు పరిచయం చేస్తుంది 
‘బడ్డీ4స్టడీ’ స్టార్టప్‌. ఐఐటీయే కాదు... ఐటీఐ చదివినా, కేవలం సర్టిఫికెట్‌ కోర్సుకైనా సరే ఆర్థిక సాయాలు పొందే దారులు చూపిస్తుంది. ఒక్క చదువు మాత్రమే అనుకోనక్కర్లేదు సంగీతం, నాట్యం వంటి కళలూ, క్రీడల్లో శిక్షణ పొందేందుకు ఏయే స్కాలర్షిప్పులున్నాయో కూడా వివరిస్తుంది. కేవలం వివరాలు ఇచ్చి ఊరుకోవడం కాకుండా, ఆయా స్కాలర్షిప్పులకి ఎలా దరఖాస్తు చేయాలో కూడా చెబుతుంది. మరోవైపు వివిధ కార్పొరేట్‌ సంస్థలు తమ సీఎస్సార్‌ కింద విద్యార్థులకి సేవలు అందించాలనుకుంటే... వాళ్లకీ సాయపడుతుంది. వాళ్ల కోసం తమ వెబ్‌సైట్‌లో విద్యార్థుల ప్రొఫైల్‌ రూపొందించి కార్పొరేట్‌ సంస్థలకి సిఫారసు చేస్తుంది. ఈ అంశమే ‘బడ్డీ4స్టడీ’ని విలక్షణంగా నిలుపుతోంది. 
అశుతోష్‌ బర్నవాల్‌ 2011లో ఘజియాబాద్‌ ఐఎంటీలో చదివేటప్పుడు ఈ సంస్థని ప్రారంభించాడు. దీని సహాయంతో గత మూడేళ్లలో 45 వేలమంది విద్యార్థులు 50 కోట్ల రూపాయలదాకా స్కాలర్షిప్పులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 20 రాష్ట్రాలూ, విదేశాల్లోని వివిధ సంస్థలు అందించే స్కాలర్షిప్పుల వివరాలన్నీ ఇందులో ఉంటాయి. ప్రస్తుతం వీరి వెబ్‌సైట్‌క (www.buddy.4study.com) సుమారు పదిహేడున్నర లక్షలమంది విద్యార్థులు చందాదారులుగా ఉన్నారు. 


పరిశ్రమల్ని చూసొద్దాం రండి... 


 

తెలుగు రాష్ట్రాల్లో పేరున్న విద్యాసంస్థలు ఎన్నో ఉన్నాయి. పెద్దపెద్ద బహుళజాతి సంస్థలు ఇక్కడ తమ పరిశ్రమలని ఏర్పాటుచేస్తున్నాయి. కానీ, ఆ విద్యాసంస్థల్లో చదివిన విద్యారులు ఈ పరిశ్రమల్లో ఉద్యోగిగా అడుగుపెట్టాక కొన్నాళ్లపాటు గందరగోళానికి గురవుతుంటారు. తాము చదివినవాటికీ, వాటిని ఆయా సంస్థల్లో ప్రాక్టికల్‌గా అప్లై చేస్తున్న విధానానికీ మధ్య ఉన్న తేడాని చూసి ఆందోళన చెందుతుంటారు. విద్యాసంస్థలకీ, పరిశ్రమలకీ మధ్య  అనుసంధానం లేకపోవడమే ఇందుకు కారణం. అలాకాకుండా విద్యార్థి దశలోనే ఫ్యాక్టరీలకి వెళ్ళి అక్కడ పనితీరుని పరిశీలించే సదుపాయం ఉంటే...? వాటిల్లో కొంతకాలం ఇంటర్న్‌షిప్‌ కూడా చేయగలిగితే...? విద్యార్థులకి అటువంటి అవకాశమే కల్పిస్తుంది ‘అక్యుమెన్‌ కనెక్ట్‌’ స్టార్టప్‌. హైదరాబాద్‌కి చెందిన ఈ అంకుర సంస్థ కోకా కోలా, మహీంద్ర, డామినోస్‌, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ), బిగ్‌ బాస్కెట్‌ వంటి 80 పెద్ద పరిశ్రమలకి విద్యార్థుల్ని విడిగానూ, బృందంగానూ క్షేత్రపర్యటనలకి తీసుకెళ్తుంది. ఆయా సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కూడా కల్పిస్తుంది. హైదరాబాద్‌కి చెందిన తాండవకృష్ణ మలిశెట్టి తన మిత్రులతో కలిసి 2015లో ప్రారంభించిన సంస్థ ఇది. మొదట్లో వివిధ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆయా విద్యార్థుల్ని బృందంగా తీసుకువెళుతుండేది. గత ఏడాది నుంచి తమ వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులకి వ్యక్తిగతంగా పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తోంది. 

 


బాధల్లేని బస కోసం... 

చదువుల కోసం బయటి రాష్ట్రాలూ, నగరాలకీ వెళ్లే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇలా వెళ్లే విద్యార్థుల్లో కేవలం 20 శాతం మందికి మాత్రమే ఆయా విద్యాసంస్థలు హాస్టల్‌ వసతి కల్పించగలుగుతున్నాయి. మిగతావాళ్లందరూ బయట హాస్టల్‌లోనో, షేరింగ్‌-రూముల్లోనో తలదాచుకోవాల్సిందే. వాటిల్లో ఉన్న ఇబ్బందేమిటో అందరికీ తెలుసు. ఎంత డబ్బు చెల్లిస్తున్నా శుభ్రంగా ఉంచే వాళ్లుండరు. శుచిగా, రుచిగా భోజనం చేసి పెట్టేవాళ్లుండరు. విద్యార్థులుగా ఇటువంటి బాధలెన్నో అనుభవించిన నిఖిల్‌ సిక్రీ, అఖిల్‌ సిక్రీ, స్నేహా చౌదరీలు ఏర్పాటుచేసిన సంస్థే ‘జోలో స్టేస్‌’. హైదరాబాద్‌తోపాటూ దిల్లీ, పుణె, ముంబయి, కోయంబత్తూరు, కోటా, బెంగళూరుల్లో సేవలందిస్తోందీ సంస్థ. వీళ్ల యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని కొంత అడ్వాన్స్‌ చెల్లిస్తే ఆయా నగరాల్లో వీళ్లకి చెందిన గదుల్లో తలదాచుకోవచ్చు. నెలకి ఐదు నుంచి పాతికవేలదాకా అద్దెతో చక్కటి గది, భోజనం, వై-ఫై సదుపాయాల్ని పొందవచ్చు. నిఖిల్‌ సిక్రీ వైద్యవిద్యార్థిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న అనుభవాలే జోలో స్టేస్‌కి బీజం వేశాయి. 2015లో కేవలం కొన్ని లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఈ సంస్థ ఆదాయం మూడేళ్లకే పాతిక కోట్ల రూపాయల్ని దాటింది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.