close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐదేళ్లు... ఇంటిముఖం చూడలేదు!

పరీక్షలు తప్పితే... ప్రేమలో విఫలమైతే... కాపురంలో మనస్పర్ధలొస్తే...ఆత్మహత్యే పరిష్కారమనుకుంటారు చాలామంది. ఒక్క కారణం చూపి ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడతారు కానీ, ధైర్యంగా బతికి చూపడానికి వందల దారులుంటాయని మర్చిపోతారు. కోమల్‌ గనత్ర మాత్రం అలా చేయలేదు. పెళ్లైన పదిహేను రోజులకే భర్త వదిలేసి వెళ్లిపోతే తన తలరాతను తానే మార్చుకోవాలని కసిగా చదివింది. కష్టాలు దాటుకుని సివిల్స్‌ ర్యాంకు సాధించింది. గృహహింస బాధితురాలనే ముద్ర చెరిపేసుకుని ఐఏఎస్‌ అధికారిగా కొత్త జీవితం మొదలుపెట్టిన కోమల్‌ ఎందరికో ఆదర్శం.

నాకు రోజుకి కనీసం ఓ ఇరవై ఫోన్‌ కాల్స్‌ వస్తుంటాయి. వాటిలో ‘మా కాలేజీకి లేదా స్కూల్‌కి మోటివేషనల్‌ స్పీకరుగా వచ్చి మీ జీవితపాఠం చెబుతారా’ అని అడిగే కాల్స్‌ పదైనా ఉంటాయి. సమయం కుదిరితే తప్పకుండా వెళ్లి నా గురించి చెప్పొస్తుంటా. ఇలా రోజూ నాకు ఫోన్లు రావడానికి కారణం నేను ఆరేడు నెలల క్రితం ‘జోష్‌ టాక్స్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడటమే. అది చూసి వివిధ పత్రికలు నా గురించి రాశాయి. ఫలితమే- పలు విద్యాసంస్థలూ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్లూ మోటివేషనల్‌ స్పీకరుగా నన్ను ఆహ్వానించడం. ఈ మధ్యనే గాంధీనగర్‌, బొంబే ఐఐటీల నుంచీ పిలుపొచ్చింది. త్వరలోనే ఆ విద్యార్థులకీ నా గురించి చెప్పబోతున్నా. అంతకంటే ముందు నా జీవితానుభవాల్ని మీతో పంచుకుంటా...

మాది గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో ఉన్న సమర్‌కుండ్ల. నాన్న టీచర్‌. ఆ ప్రాంతంలో అమ్మాయిల పట్ల వివక్ష ఉన్నా మా నాన్న మాత్రం బాగా చదువుకోవాలని నన్ను ప్రోత్సహించేవారు. ఆయన టీచర్‌ కావడంతో ఇంట్లోనూ ఎప్పుడూ చదువు గురించే మాట్లాడేవారు. అందుకేనేమో 
నేనెప్పుడూ చదువులో ముందుండే దాన్ని. పదో తరగతి, ఇంటర్‌ గుజరాతీ మాధ్యమంలో పూర్తి చేశాక రాజ్‌కోట్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో డిప్లొమా చదివా. ఆ తరవాత మూడు వేర్వేరు యూనివర్సిటీల నుంచీ సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో బీఏ లిటరేచర్‌ పూర్తిచేశా. ప్రైమరీ టీచర్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ కూడా పొందా. అప్పటికే నాకు ఇరవై ఐదేళ్లు నిండాయి. మా బంధువులూ, ఇరుగుపొరుగు వారూ ‘ఇంకా ఎన్నాళ్ళు చదివిస్తారు... మీ అమ్మాయికి పెళ్ళి చేస్తారా అసలు’ అని వెటకారంగా మాట్లాడేవారు. నేను పట్టించుకోకుండా సివిల్స్‌పైన దృష్టి పెట్టా. ఇంతలో మ్యారేజ్‌ బ్యూరో ద్వారా రాజ్‌కోట్‌ నుంచి ఓ సంబంధం వచ్చింది. అబ్బాయికి న్యూజిలాండ్‌లో ఉద్యోగం. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఆస్తులూ ఉన్నాయి. ‘నా కూతురు విదేశాల్లో స్థిరపడుతుంది’ అనుకున్నారు నాన్న. వెంటనే సంబంధం ఖాయం చేశారు. నేనూ న్యూజిలాండ్‌ జీవితాన్ని ఊహించుకొని ఎంతగానో మురిసిపోయా.  కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టా. అక్కడకు వెళ్ళి ఒక్కరోజైనా గడవకముందే- తమకిచ్చిన కట్నం చాలదనీ అదనంగా మరికొంత కట్నం డబ్బూ, బైకూ, కారూ తీసుకురావాలనీ డిమాండ్‌ చేశారు. ‘నాన్నది చాలీచాలని జీతం. అవన్నీ ఇచ్చే స్తోమత ఆయనకు లేద’ంటే కొట్టేవారు. అన్నం పెట్టకుండా పస్తులుంచేవారు. అమ్మానాన్నలకు ఈ విషయాలు తెలిస్తే బాధ పడతారని చెప్పేదాన్ని కాదు. ఎంత తిట్టినా కొట్టినా పుట్టింటికి వెళ్లకుండా వాళ్లడిగినవి తేకుండా ఉండటంతో నన్ను వదిలించుకోవాలనుకున్నారు. ఒక రోజు రాత్రి... నన్ను ఇంటి బయట పడుకోమని, నేను నిద్రపోయాక కనీసం మాటమాత్రమైనా చెప్పకుండా ఇంటికి తాళం వేసుకుని నా భర్త తన తల్లిదండ్రులతో సహా న్యూజిలాండ్‌ వెళ్లిపోయాడు.

అతడిని శిక్షించాలని... 
కాళ్ల పారాణి ఆరకముందే... పెళ్లైన పదిహేను రోజులకే కట్టుబట్టలతో పుట్టింటికి చేరాల్సి వచ్చింది. నేను ఒంటరిగా వెళ్లడం చూసి బెంగతో వచ్చాననుకున్నారు అమ్మానాన్నలు. నేను చెప్పిన విషయం విన్నాక గుండెలు బాదుకున్నారు. అమ్మ దిగులుతో మంచం పట్టింది. నా భర్త మనసు మార్చుకుని తిరిగి వచ్చాడేమోనని మధ్య మధ్యలో మా అత్తారింటికి వెళ్లి చూసి మూసిన తలుపుల ముందే కాసేపు కూర్చుని వచ్చేదాన్ని. ఒకరకంగా చెప్పాలంటే పిచ్చిదానిలా ప్రవర్తించేదాన్ని. ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యూజిలాండ్‌లో అతడి వివరాలు తెలియలేదు. అతడు నన్ను అంత అవమానకరంగా వదిలేసి వెళ్లిపోయాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయా. కట్నం కోసం, కారు కోసం నన్ను వదిలేశాడనే బాధకంటే మోసం చేశాడనే కసే నాలో పెరిగింది. ఎలాగైనా అతడిని వెతికి పట్టుకోవాలని మ్యారేజీ బ్యూరోని సంప్రదించా. ‘పెళ్లి కుదర్చడం వరకే మా పని’ అంటూ వారు మాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేద్దామంటే పరువు పోతుందని అమ్మ గోల చేసింది. చివరికి న్యూజిలాండ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశా. మెయిల్‌ కూడా పెట్టా. నెలలు గడిచినా ఎవరూ స్పందించకపోయేసరికి గవర్నర్‌ జనరల్‌కు లేఖ రాశా. ‘అతనెవరో తెలుసుకుంటాం’ అని తిరుగు సమాధానం పంపారు తప్ప ఏ చర్యా తీసుకోలేదు. నా నిస్సహాయ స్థితికి బాధేసింది. దాదాపు ఆరునెలలపాటు తిండీ, నిద్రా మరచి జీవచ్ఛవంలా బతికా. ఏడ్చీ ఏడ్చీ కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయాయి. రోజులు గడిచే కొద్దీ నాకు నేను సర్ది చెప్పుకోవడం మొదలుపెట్టా.  అటకెక్కిన పుస్తకాలు బయటకు తీశా. చదువు గురించి తప్ప మరో ఆలోచన చేయదల్చుకోలేదు. కానీ నేను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. భర్త మోసం చేయడంతో పుట్టింటికి తిరిగొచ్చిన కూతుర్ని ఆదరించడం తమ బాధ్యతని అమ్మానాన్నలు అనుకున్నా మా వదిన మాత్రం అలా అనుకోలేకపోయింది. నా వల్ల వాళ్ళ డబ్బు ఖర్చయిపోతోందని సాధించేది. ఇరుగుపొరుగు వాళ్లూ రకరకాలుగా మాట్లాడేవారు. ఎంత పట్టించుకోవద్దనుకున్నా ఏదో ఒక సందర్భంలో ఆ మాటలు మనసును నలిపేసేవి.  ఆత్మాభిమానం చంపుకుని అలా పుట్టింట్లో ఉండటం సరికాదనిపించింది.

అందరికీ దూరంగా... 
నా కాళ్ళమీద నేను నిలబడాలని టీచర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేశా. మా సొంతూరుకు యాభై కిలోమీటర్ల దూరంలోని భావ్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్‌ టీచర్‌గా ఉద్యోగమొచ్చింది. ఒంటరిదాన్ని కావడంతో ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ఒప్పుకోలేదు. చివరికి ఓ స్టూడెంట్‌ తల్లిదండ్రులకు నా గురించి అంతా చెప్పి ఎలాగైనా ఇల్లు అద్దెకి ఇప్పించమని అడిగా. వాళ్లింట్లోనే ఓ గది అద్దెకిచ్చారు. పగలంతా టీచర్‌గా పని చేస్తూ సివిల్స్‌ సాధన మొదలుపెట్టా. కానీ ఆ పల్లెటూళ్ళో ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్లూ, ఇంగ్లిష్‌ పత్రికలూ, ల్యాప్‌టాపులూ... ఏవీ అందుబాటులో ఉండేవి కాదు. నాకు టీచర్‌గా వచ్చేది ఐదు వేల రూపాయల జీతం. అది నెల గడవడానికి తప్ప పుస్తకాలు కొనుక్కోడానికి సరిపోయేది కాదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు తెలిసినవాళ్లు అహ్మదాబాద్‌లో ప్రభుత్వం సివిల్స్‌ సాధించాలనుకునే ఔత్సాహికులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న సర్దార్‌ పటేల్‌ అకాడమీ గురించి చెప్పారు. అక్కడకు వెళితే వారాంతంలోనూ శిక్షణ ఇస్తామన్నారు. దాంతో ప్రతి శనీ, ఆదివారాలు వెళ్లి ట్రైనింగ్‌ తీసుకోవాలని చేరిపోయా. కానీ భావ్‌నగర్‌ నుంచి నాలుగు బస్సులు మారి నూట డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేసి అహ్మదాబాద్‌ వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నేను ఇంటికి చేరుకునే సరికి అర్ధరాత్రి అయ్యేది. ఊళ్ళో చాలామంది ‘ఈ అమ్మాయి చదువుకే వెళుతుందో ఇంక దేనికన్నా వెళుతుందో’ అంటూ సూటిపోటి మాటలనేవారు. ఉబికివచ్చే కన్నీళ్ళను గుండెల్లోనే అదిమిపట్టి చదువు మీదే దృష్టి పెట్టేదాన్ని. ఒక్కోసారి ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయేదాన్ని. నా జీవితమే ఇలా ఎందుకైందని వెక్కివెక్కి ఏడ్చేదాన్ని. మానసికంగా శారీరకంగా ఒత్తిడి తట్టుకోలేక నాల్రోజులు విశ్రాంతి తీసుకోవాలనిపించేది. కానీ ఒక్కపూట స్కూలు మానేసినా జీతం రాదు. అందుకే ఆరోగ్యం పాడైనా స్కూలుకెళ్లడం కానీ, కోచింగుకు వెళ్ళడం కానీ మానలేదు.

నాలుగు ప్రయత్నాలు చేసి... 
2009లో మొదటిసారి యూపీఎస్‌సీ ప్రవేశ పరీక్ష రాశా. ఉద్యోగం, ట్రైనింగ్‌ కోసం ప్రయాణాల వల్ల అంత మెరుగ్గా ప్రిపేర్‌ కాలేదనిపించింది. ఎంపికవుతానన్న నమ్మకం లేకపోయింది. అనుకున్నట్టుగానే అయింది కానీ నేను నిరుత్సాహపడలేదు. అదొక అనుభవం అనుకున్నా. రెండోసారి మాత్రం పట్టుదలతో రాశా. ర్యాంకు వస్తుందని ఆశపడ్డా. కానీ మళ్ళీ నిరాశ తప్పలేదు. చాలా బాధనిపించింది. పైగా నా గురించి తెలిసిన వాళ్లు ఫలితాలొచ్చిన ప్రతిసారీ ‘ఐఏఎస్‌ అంటే అంత ఈజీనా... నీకు ఎప్పుడు రావాలీ...’ అంటూ హేళనగా మాట్లాడేవారు. ఆ మాటలకి బదులు చెప్పి తీరాలని 2011లో మూడోసారి మరింత కష్టపడి పరీక్ష రాసినా ర్యాంకు రాలేదు. ఫలితాన్ని అంత తేలిగ్గా జీర్ణించుకోలేకపోయా. అమ్మ ఒళ్లో తల పెట్టుకుని ఏడవాలనిపించింది. కానీ, ఓడిపోయి కన్నీళ్లతో ఆ గుమ్మం తొక్కి నలుగురిలో పలచన కాకూడదని నన్ను నేనే  సముదాయించుకున్నా. చివరి ప్రయత్నంగా మరొక్కసారి పరీక్ష రాసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నా. మూడు ప్రయత్నాల్లో చేసిన తప్పులేంటో విశ్లేషించుకున్నా. ప్రిపరేషన్‌ పరంగా బలాలూ, బలహీనతల్ని జాబితాగా రాసుకున్నా. బలాలు మరింత పెంచుకుంటూ బలహీనతల్ని తగ్గించుకునే ప్రయత్నం చేశా. కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని. కొన్నిసార్లు ఆ కాస్త నిద్ర కూడా పట్టేది కాదు. పరీక్షకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడానికి ఒక యుద్ధమే చేశా. 2012లో పరీక్ష రాశా. ఈసారి అంచనా తప్పలేదు. 591వ ర్యాంకు వచ్చింది. ఐదేళ్ళపాటు నేను పడిన కష్టం గుర్తొచ్చి కన్నీళ్ళు ఓ పట్టాన ఆగలేదు.

ర్యాంకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది... 
అమ్మానాన్నా ఇంటికి రమ్మన్నారుగానీ నేను అట్నుంచి అటే ముస్సోరీ శిక్షణ కేంద్రానికి వెళ్లా. ఆ శిక్షణ పూర్తిచేసుకున్నాకే- ఐదేళ్ల తర్వాత- అమ్మావాళ్లింటికి వెళ్లా. నా గురించి తెలిసి మా ఊళ్లో వాళ్లంతా వచ్చారు. ఒకప్పుడు విమర్శించిన వారే మా పిల్లలకి నువ్వే ఆదర్శమంటూ తెగ మెచ్చుకున్నారు. అప్పటి వరకూ భర్త వదిలేసిన మహిళగా బయటకు రావాలంటే ఏదోలా అనిపించేది. సివిల్స్‌ సాధించాక అలాంటి ఆలోచనలన్నీ పోయాయి. అందరూ గౌరవంగా చూస్తున్నారు. శిక్షణ అయ్యాక దిల్లీలో డీఆర్‌డీవో(డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌)లో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకున్నా. ప్రస్తుతం డీఆర్‌డీవో డైరెక్టర్‌ హోదాలో ఉన్నా. ఈ ఆరేళ్లలో అమ్మానాన్నల అప్పులన్నీ తీర్చా. అన్నయ్య మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చూశా. కుటుంబమంతటినీ విమానంలో దేశవిదేశాలన్నీ తిప్పా. అంతేకాదు సివిల్స్‌ సాధించాక మా అత్తింటి వాళ్లు రాజ్‌కోట్‌ వచ్చారని తెలిసి అక్కడికి వెళ్లా. ‘జరిగిందేదో జరిగిపోయింది మమ్మల్ని క్షమించు’ అంటూ మా అత్తగారు నా కాళ్లు పట్టుకున్నంత పనిచేసింది. నాకు మాత్రం వాళ్లని వదిలిపెట్టాలనిపించలేదు. కానీ మా నాన్న ‘గౌరవమైన హోదాలో ఉన్నావు. కేసులూ, గొడవలని మనసు పాడుచేసుకోకు. విడాకులిచ్చెయ్‌’ అని చెప్పారు. అలానే చేశా. నాలుగేళ్ల క్రితం ఓ ఉన్నతస్థాయి వ్యక్తి నన్ను ఏరి కోరి పెళ్లాడాడు. మా పాపకిప్పుడు రెండున్నరేళ్లు. చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకోవాలని ఆలోచించే వారికి నేను చెప్పేది ఒక్కటే- నన్నూ నేను పడిన కష్టాల్నీ సాధించిన విజయాల్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోమనీ, ధైర్యంగా అడుగు ముందుకు వేయమనీ.!

- పద్మ వడ్డె

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.