close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘పది’ విలువ నాకు తెలుసు కనకే...

ఇంటికో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఉంటున్న మన నగరాల్లో... పదో తరగతి పాస్‌ కావడం పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ గ్రామీణ నిరుపేద కుటుంబాల్లో పదో తరగతి ఫెయిల్‌ కావడమంటే చదువులకి అంతటితో స్వస్తి చెప్పడమే! జీవితాంతం కూలీనాలీ చేసుకుని బతకడమే. తాను పుట్టిన లంబాడి తండాలో ఆ కష్టాలేమిటో చూసినవాడు జగిత్యాల కలెక్టర్‌ అడావత్‌ శరత్‌. అందువల్లే ఒకప్పుడు 58 శాతం ఉత్తీర్ణత కూడా లేని జగిత్యాల జిల్లాని ఎస్సెస్సీలో టాప్‌గా నిలిపాడు. అదీ వరసగా మూడేళ్లు! దేశంలోనే ‘ది బెస్ట్‌’ కలెక్టర్‌గా గుర్తింపు సాధించిన శరత్‌ స్ఫూర్తి కథ ఆయన మాటల్లోనే...

ల్గొండ జిల్లాలో ఫర్తూనాయక్‌ తండా అనే లంబాడి గూడెం మాది. అమ్మ సోని, నాన్న చక్రు. మా ఊళ్ళో చాలావరకూ పేర్లు ఇంచుమించు ఇలాగే ఉంటాయి. మా కుటుంబంలో ఆ వరస కాస్త మారింది నా పేరుతోనే! అప్పట్లో మా తండాల్లో ఇంట్లోనే ప్రసవం చేసేవారట. మా అన్నయ్యా, ఇద్దరు అక్కలూ అలాగే పుట్టారు. నేను కడుపులో పడ్డప్పటి నుంచీ ప్రభుత్వ నర్స్‌లు కాన్పు కోసం ప్రభుత్వాసుపత్రికే రావాలని ఒత్తిడి తేవడంతో అమ్మ ఒప్పుకుందట. కానీ ఎంతైనా తండాలో పుట్టిపెరిగినామె కదా... ఆసుపత్రి అంటే భయంతో వణికిపోయిందట. అలా ఏడుస్తూ ఆసుపత్రికి వచ్చిన ఆమెకి ధైర్యం చెప్పి ఏ సమస్యాలేకుండా కాన్పు చేశారట శరత్‌బాబు అనే డాక్టర్‌. ఆ వైద్యుడు తన విధి నిర్వహణలో భాగంగానే ప్రసవం చేసి ఉండొచ్చుకానీ... ఆ పాటి సేవకే ఆ తండా తల్లి మనసు కృతజ్ఞతతో పొంగిపోయింది. ఆయన పేరే నాకు పెట్టింది! అంతేకాదు, ఆయనలా నేనూ డాక్టర్‌ కావాలని ఆమె కలలు కనేది. నా తర్వాత ముగ్గురు తమ్ముళ్లు పుట్టినా, ఆరుగురు సంతానంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్నా ఆమె ఆ కల నుంచి దూరం కాలేదు. నన్ను చదివించి తీరాలనే పట్టుదలా వీడలేదు. నేను మా తండాకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండప్రోలు అనే ఊళ్ళో చదువుకున్నాను. బస్సులు కాదుకదా... సైకిళ్లు కూడా మా ఊళ్ళో లేవప్పుడు. దాంతో ప్రతిరోజూ అటూ, ఇటూ ఐదు కిలోమీటర్లు నడవక తప్పేదికాదు. ఐదో తరగతి తర్వాత మిర్యాలగూడ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌లో చేరి... అక్కడి ప్రభుత్వ బడిలో చదువుకున్నాను. హాస్టల్‌లో ఉన్న నాకు ప్రత్యేకంగా డబ్బులు పంపించేంత స్థోమత నాన్నకి ఎక్కడిది? అందుకే ఆరో తరగతి నుంచీ రాత్రివేళల్లో రైస్‌మిల్లుల్లో పనిచేయడం మొదలుపెట్టాను. ఈ విషయాన్ని వార్డెన్‌లూ పెద్దగా పట్టించుకోకపోవడంతో నాలుగు కూలీడబ్బులు వెనకేసుకున్నాను. ఆరేళ్లపాటు ఆ పైసలే నన్ను ఆదుకున్నాయి. మా హాస్టల్‌లో పదో తరగతంటే జీవన్మరణ పోరాటంలాగే ఉండేది. పరమపద సోపాన పటం చూసుంటారు కదా... ఎస్‌ఎస్‌సీలో ఫెయిల్‌ కావడమంటే అందులో పెద్ద పామునోట్లో పడ్డట్టే! మళ్లీ తిరిగొచ్చే అవకాశం ఉంటుందో లేదో తెలియదు. పాస్‌ అయితే ఓ కీలకమైన నిచ్చెన ఎక్కినట్టే. కాబట్టి, తిండీనిద్రా మాని చదివి... ఎట్టకేలకు పది గట్టెక్కేశాను. ఆ తర్వాత నాగార్జున సాగర్‌ గురుకులంలో ఇంటర్మీడియట్‌ ముగించాను. హైదరాబాద్‌ నిజాం కాలేజీలో డిగ్రీలో చేరాను. జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన నాలో అక్కడే మొదలైంది. అదేమీ తెలియని మా కుటుంబం... నాకు పెళ్లి సంబంధాలు చూసే పనిలో పడింది!

తను వ్యవసాయపనులూ చేసింది... 
మా తండాలోని పెద్దలు నేను డిగ్రీ ముగించగానే పెళ్లి చేసి తీరాలని నిశ్చయించుకున్నారు... అప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. అలా మా బంధువులమ్మాయి పార్వతితో నాకు పెళ్ళయింది. తను ఇంటర్‌ మాత్రమే చదువుకుంది... మా కుటుంబాల్లో అమ్మాయిలు ఆ మాత్రం చదవడమే ఎక్కువ. చదువుకున్న అమ్మాయైనా పొలం పనులకి వెళ్లేది. డిగ్రీ తర్వాత నేను ఉస్మానియాలో ఎంబీఏలో చేరాక కూడా తను కాయకష్టం చేస్తూనే ఉండేది. ఎంబీఏ చేసేటప్పుడే ప్రయివేటు ఉద్యోగంకంటే నలుగురికీ మేలు చేసే ప్రభుత్వ ఉద్యోగం మేలనిపించింది. సివిల్స్‌ కోసం సిద్ధమయ్యాను. దాంతోపాటూ ఏపీపీఎస్సీ గ్రూప్‌ వన్‌కి కూడా నోటిఫికేషన్‌ పడటంతో అప్లై చేశాను. రిజల్ట్స్‌ వచ్చాక... సివిల్స్‌లో మామూలు ర్యాంకుతో కస్టమ్స్‌ సర్వీసుకి ఎంపికయ్యాను. ఏపీపీఎస్సీలో జనరల్‌ కేటగిరీలో నంబర్‌ వన్‌ ర్యాంకర్‌గా నిలిచాను! నా ముందున్న రెండు అవకాశాల్లో... రాష్ట్ర సర్వీసునే ఎంపిక చేసుకున్నాను. మొదట మహబూబ్‌నగర్‌ ఆర్డీఓగా వెళ్లాను. తర్వాత చిత్తూరు జిల్లా మదనపల్లెకి బదిలీ చేశారు. తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేక ఓఎస్డీగా పనిచేశాను. పాడేరు, భద్రాచలం గిరిజనాభివృద్ధి సంస్థలకు పీఓగా వెళ్లాను. అప్పట్లో మలేరియా, అతిసారం వంటి వ్యాధులవల్లా, ఇంటి దగ్గరే కాన్పులు చేయడం వల్లా అక్కడ ఏటా మూడువేల మంది చనిపోతుండేవారు. నేను వెళ్లిన మొదటి రోజు నుంచే అక్కడి ఆసుపత్రులపైన దృష్టిపెట్టాను. వాటిలో అన్నిరకాల చికిత్సలూ ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను. నా ప్రయత్నాలు మూడేళ్లలో ఫలితాన్నిచ్చి గిరిజనుల మరణాలు వేల సంఖ్య నుంచి పదిహేనుకి తగ్గాయి! దానికి గుర్తింపుగా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నన్ను ప్రత్యేకంగా సన్మానించారు. ఇతర గిరిజనాభివృద్ధి ప్రాంతాలన్నీ ఇవే పద్ధతుల్ని అనుసరించేలా మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజాసేవలో నాపై నాకు నమ్మకం కలిగించిన సందర్భం అది! ఆ తర్వాత గుంటూరు, సంగారెడ్డి జిల్లాలకి ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా చేశాను. రాష్ట్ర విభజన తర్వాత రెండేళ్లు మార్క్‌ఫెడ్‌ కమిషనర్‌గా పనిచేశాక... కొత్త జిల్లా జగిత్యాలకి కలెక్టర్‌గా వచ్చాను.

నన్ను శత్రువులా చూశారు... 
నాతోపాటూ పదో తరగతి దాకా చదువుకున్న వాళ్లు ఫెయిలై... తండాల్లో బతుకుని భారంగా వెళ్లదీయడం నాకు బాగా తెలుసు. పిల్లల ఆకలి తీర్చలేక చిన్నపాటి నేరాలకి పాల్పడి శిక్ష అనుభవించినవాళ్లూ ఉన్నారు. ఇక అమ్మాయిల పరిస్థితి మరీ దుర్భరం. కేవలం ఎస్‌ఎస్‌సీ పాస్‌ కాకపోవడం వల్ల ఎవ్వరూ ఆ పరిస్థితిలో పడకూడదని నేను అనుకునేవాణ్ణి. అందుకే జగిత్యాలకి రాగానే దానిపైనే దృష్టిపెట్టాను. జగిత్యాల... కరీంనగర్‌లో ప్రత్యేక జిల్లా కాకముందు, అంటే కేవలం ఓ డివిజన్‌గా ఉన్నప్పుడు ఇక్కడ పది ఉత్తీర్ణత కేవలం 58 శాతం! దాన్ని పెంచాలనుకున్నాను. ముందు, విద్యార్థులతోపాటూ ఉపాధ్యాయుల గైర్హాజరీని తగ్గించాలనుకున్నాను. నెలల తరబడి ఒక్కసారికూడా క్లాసుకి రాకుండా జీతాలు మాత్రం తీసుకునేవాళ్లూ, విద్యార్థుల్ని వాళ్ల మానాన వాళ్లని వదిలేసి చిట్టీలు నడిపేవాళ్లూ, స్థిరాస్తి వ్యాపారాలు చేసేవాళ్లని సస్పెండ్‌ చేయడం మొదలుపెట్టాను. దాంతో జిల్లాల్లో ఉన్న 50 పైచిలుకు ఉపాధ్యాయ సంఘాలు నన్ను శత్రువులా చూడటం ప్రారంభించాయి. వాళ్లని సమావేశానికి పిలిచి... నా వైఖరేమిటో గట్టిగా చెప్పాను. పదో తరగతిలో ఫెయిల్యూర్‌ శాతం పెరిగితే... వాళ్ల వార్షిక ఇంక్రిమెంట్లూ తగ్గుతాయని ప్రకటించాను. మొదట్లో వ్యతిరేకించినా... దీన్ని అందరూ ఓ సవాలుగా తీసుకున్నారు. 2016-17 పది ఫలితాల్లో 97.35 శాతం ఫలితాలతో జగిత్యాలని తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలిపారు. ఆ విజయం వాళ్లలో కేవలం ఆనందాన్నే కాదు... నేను ఊహించనంత ఔదార్యాన్నీ నింపింది. 2017-18 విద్యా సంవత్సరంలో, పరీక్షల ప్రిపరేషన్‌ సమయంలో స్వచ్ఛందంగా సెలవులన్నీ వదులుకున్నారు. అంతేకాదు, తాము ఆశించినంత ఫలితాలు చూపకపోతే కలెక్టర్‌గా నేనే చర్యలు తీసుకున్నా సిద్ధమంటూ ప్రమాణపత్రం కూడా అందించారు. అక్కడితో ఆగలేదు...  ప్రతి ఒక్కరూ చదువుల్లో వెనకపడ్డ పదిమంది విద్యార్థుల్ని దత్తత తీసుకుని వాళ్లని పాస్‌ చేయిస్తామని ప్రతినబూనారు. కేవలం వాళ్ల కృషి వల్లే ఆ తర్వాతి సంవత్సరం కూడా మా జిల్లా 97.56 శాతం ఫలితం సాధించింది. గత ఏడాదీ 99.73 శాతం సాధించగలిగామంటే అది వాళ్ల చలవే. నేను కేవలం ఓ మోటివేటర్‌గా వ్యవహరించానంతే! కాకపోతే అప్పుడప్పుడూ పాఠశాలలకి వెళ్లి వాళ్లతోపాటూ నేనూ పాఠాలు చెప్పాను. ప్రతి బడికీ మండలస్థాయి అధికారిని నియమించాను.


 

‘ఉత్తేజం’ కోసం... 
విద్యార్థులకి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు పెట్టడం బావున్నా... వాళ్లు అసలే పేద పిల్లలు. తల్లిదండ్రులు వేకువనే కూలీనాలీకి వెళుతుంటారు కాబట్టి పొద్దున ఇంట్లో టిఫిన్‌ తిని రారు. సాయంత్రం వేళల్లో ఆకలేసి ఏవైనా తినాలన్నా డబ్బుండదు. ఆకలైన కడుపుకి చదువేం ఎక్కుతుంది... అందుకే బడికి సమీపంలో ఉన్న గ్రామస్థులు విద్యార్థులకి పోషకాహారంతో కూడిన స్నాక్స్‌ అందించాలని పిలుపునిచ్చాను. ఈ కార్యక్రమానికి నా వంతుగా మొదటి ఏడాది పది లక్షల రూపాయలు, రెండో ఏడాది పదిహేను లక్షల రూపాయలు అందించాను. అది స్ఫూర్తిగా ఎంతోమంది దాతలూ, ప్రజాప్రతినిధులూ కాస్త డబ్బున్న తల్లిదండ్రులూ ముందుకొచ్చి విద్యార్థులకి ఆహారం వండిపెట్టడం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ‘ఉత్తేజం’ అనే పథకం కిందకి తెచ్చాను. ఇటీవల ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంస్థ దేశంలోని ఏడువందలమంది కలెక్టర్‌లని పరిశీలించి, ఈ పథకానికిగాను నాకు ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ గవర్నెన్స్‌’ అవార్డు ఇచ్చింది!

అలా ‘డాక్టర్‌’ని అయ్యాను...!

నేను డాక్టర్‌ కావడమే అమ్మ కలని చెప్పాను కదా! ఇంటర్‌ పూర్తయ్యాక నేను వైద్యవిద్యకి వెళ్లాలని తను ఎంతో పట్టుపట్టింది. అంత ఖర్చు చేయలేనని నాన్న చేతులెత్తేశాడు. అందువల్ల నేను బీఏలోనే చేరాను. కానీ గ్రూప్‌ వన్‌ రాయాలని నిర్ణయించుకున్నాను. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఇంతలో అమ్మ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. ఆపరేషన్‌ చేయాలన్నారు. అంతా సవ్యంగానే జరుగుతుందని అనుకుంటూ ఉండగా ఆపరేషన్‌లో ఏదో సమస్య వచ్చి అమ్మ చనిపోయింది. కొన్నాళ్లకే గ్రూప్‌ వన్‌ పోటీపరీక్షల్లో టాపర్‌గా వచ్చినట్టు ఫలితాలొచ్చాయి. నా విజయం చూడకుండానే  అమ్మ కన్నుమూసింది. నేను ఎన్ని విజయాలు సాధించినా మరచిపోలేని విషాదం అది! అందులో నుంచి బయటపడటానికే... కనీసం నా పేరుముందైనా డాక్టర్‌ చేర్చుకోవాలని పీహెచ్‌డీ పూర్తిచేశాను. 

చదువులొక్కటే కాదు... 
జిల్లాలోని అన్ని ఇళ్లలోనూ మరుగుదొడ్లు నిర్మించి, వాటిని వాడేట్టూ చైతన్యం తీసుకురావడంలో కేంద్రప్రభుత్వం నుంచి స్వచ్ఛ పురస్కార్‌, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయడంలో నంబర్‌వన్‌గా నిలిచినందుకు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎక్స్‌లెన్స్‌ పురస్కారం వరసగా రెండుసార్లు నాకు వచ్చాయి! ముక్కుసూటిదనం, ఎదుటివాళ్లలో ప్రేరణ నింపే గుణం... ఇవి రెండే నా విజయానికి ముఖ్యకారణాలని అనుకుంటున్నాను. మొదటి గుణం... స్వతహాగా వస్తే, రెండోది... నేను అధికారిగా నేర్చుకున్నది. అలా నేర్చుకున్నదాన్ని మొదట ప్రయోగించింది నా భార్య పార్వతిపైనే! పెళ్లయ్యేటప్పటికి పన్నెండో తరగతి మాత్రమే చదివి పొలం పనులకి వెళుతున్న తనతో డిగ్రీ చేయించాను. ఆ తర్వాత పీజీ కూడా పూర్తిచేసింది! చదువు విషయంలో నా భార్యలో నింపిన ఆ స్ఫూర్తినే అందరికీ పంచాలని ప్రయత్నించాను. మాకు ఇద్దరు పిల్లలు. మా అబ్బాయి అరుణ్‌ ఎంటెక్‌ చదువుతున్నాడు. పాప ఎంఏ జాగ్రఫీ చేస్తోంది. తన పేరు సోని. అవును... అమ్మ పేరే పెట్టాను!

- పునుగోటి రంగారావు, ఈనాడు, జగిత్యాల

(2 జాన్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.