close
హేమంత సమీరం

- సింగమనేని నారాయణ

ఇంటి వసారాలో పెద్దమనుషులనే వారందరూ కుర్చీలలోనూ సోఫాలలోనూ కూర్చుని ఉన్నారు. పురోహితుడు కూడా వారితోపాటు సిద్ధంగా ఉన్నాడు. పెళ్ళిపత్రిక రాయడమే ఇక తరువాయి...
‘‘అమ్మా, పెళ్ళిపత్రికలో నీ పేరును ‘హేమ’గా మారుస్తున్నాము’’ అన్నాడు పురోహితుడు- కాబోయే పెళ్ళికూతురు సమీరతో.
‘‘నా పేరెందుకు మారుస్తారు- నా పేరు మార్చటానికి నేనొప్పుకోను. నా పేరు చాలా అందంగా ఉంది’’ అంది కాబోయే పెళ్ళికూతురు కోపం కనబరుస్తూ.
‘‘పేరుబలాలు కుదరలేదమ్మా, అబ్బాయి పేరు హేమంత్‌ కదా... అందుకోసం నీ పేరును ‘హేమ’గా మార్చాల్సి వచ్చింది’’ అన్నాడు పురోహితుడు- చాలా శాంతంగా నచ్చచెప్పే ధోరణిలో.
‘‘కుదరకపోతే నా పేరుకు సరిపడే విధంగా పెళ్ళికుమారుడి పేరే మార్చండి. నా పేరు మారిస్తే మాత్రం నేను ఒప్పుకోను. మా నాన్న చాలా ఇష్టంగా ఎంతో ప్రేమతో నాకీ పేరు పెట్టారు’’ అంటూ, ‘‘ఏం నాన్నా’’ అంటూ ఎదు
రుగా కూర్చున్న తండ్రిని కూడా తలూపించింది. ఆమె మాటలతోపాటు గలగలా నవ్వులు కూడా అక్కడున్న అందరికీ వినిపించినాయి.
‘‘ఎక్కడైనా కానీ పెళ్ళికూతురు పేరు మారుస్తారుగానీ పెళ్ళికుమారుడి పేరు మార్చరమ్మా’’ అన్నాడు పురోహితుడు కొంత అసహనంతో.
‘‘సరే, ఒక పనిచేద్దాం- పెళ్ళికూమారుడినే మార్చేద్దాం’’ అంది పెళ్ళికూతురు నవ్వుతూ సరదాగా.
‘‘అంటే, నీ అభిప్రాయమేమిటో అర్థంగాలేదమ్మా... శానా విచిత్రంగా మాట్లాడుతున్నావమ్మా నువ్వు’’ అన్నాడొక పెద్దాయన- పెళ్ళికొడుక్కి దగ్గర బంధువతడు.
‘‘అర్థం కాకపోవటానికి ఇందులో డొంక తిరుగుడేముంది పెద్దాయనా? నా పేరుకు సరిపడే పేరు బలాబలాలు కుదిరే మరో పెళ్ళికుమారుణ్ణి వెతుకుదాం- అంతేగా’’ అంది సమీర, చిరునవ్వులు చిందిస్తూ హాస్యంగానూ ఆటపట్టించేలాగానూ.
ఆ మాటకు అందరూ జడుసుకున్నారు. ఈ పిల్ల ‘ఏం రా, ఇట్లా మాట్లాడతా ఉంది, అసలు పెళ్ళిపత్రిక రాసేచోట ఈ పిల్లకేం పని?’ చెవులు కొరుక్కున్నారు. ‘ఇదేదో తెగే వ్యవహారంలా లేదే’ అనుకున్నారు. ‘పెళ్ళికొడుకు పేరును మార్చమనే పిల్లను మేమెక్కడా చూడలేదబ్బా’ అని గుసగుసలు పోయినారు, పెళ్ళికొడుకు తరఫున కూర్చున్న ఆడవాళ్ళూ మగవాళ్ళూ.
పెళ్ళికూతురు తరఫున కూర్చున్న బంధువులు మాత్రం ఆశ్చర్యపోయినట్టు కనిపించలేదు. ‘చిన్నప్పట్నుంచీ చూస్తున్నాం గదా, ఎడ్డెం అంటే తెడ్డెం అంటుంది ఈ పిల్ల’ అనుకుని నవ్వుకున్నారు.
పెళ్ళిచూపుల్లాంటివి జరిగీ పెట్టుపోతలు కూడా మాట్లాడటం అయిపోయీ పెళ్ళి తేదీలూ కల్యాణ మంటపం కూడా ‘ఫిక్స్‌’ అయిపోయీ తీరా పెళ్ళిపత్రిక రాసేరోజున ఈ హఠాత్పరిణామమేమిటి?
అక్కడ చేరిన చాలామందికి విచిత్రమనిపించింది జరుగుతున్న వ్యవహారం చూస్తూంటే.
అసలు సమీరను పెళ్ళికి ఒప్పించడమే గగనమయింది- అమ్మానాన్నా అన్నావదినా తమ్ముడూ దగ్గరి బంధువులూ స్నేహితులూ అందరికీ.
సమీర ఎంఏ పూర్తిచేసి, బిఈడీ కూడా చేసేసి సంవత్సరమయింది. ఎంఏలోనూ బిఈడీలోనూ లెక్కల సబ్జక్టులే.
‘‘ఇప్పుడే నాకు పెళ్ళి ఏమిటి? ఇక కొద్ది నెలల్లో డిఎస్‌సీ ప్రకటన కూడా వస్తుంది. నేను డిఎస్‌సీకి ప్రిపేర్‌ అవుతున్నాను. నేను పరీక్ష రాయాలి, స్కూల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాలి. నా ప్రయత్నంలో నేనుంటే, ఈ పెళ్ళి గోల ఏంటి?
మీకేం పనీ పాటా లేదా?’’ అంటూ అందర్నీ కసురుకుంది సమీర.
‘‘నిజమేనమ్మా, కానీ... మళ్ళీ ఇలాంటి సంబంధం దొరుకుతుందా? కోరికోరి ఇంటి గడపదాకా వెతుక్కుంటూ వచ్చిన సంబంధం. ఆ అబ్బాయి జూనియర్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు కూడా. ఆ అబ్బాయి నిన్ను ఇంతకుముందే చూసినాడట. నువ్వు బాగా నచ్చినావట. ఆ అబ్బాయే స్వయంగా పెద్దల్ని పంపించినాడు.’’
‘కాదనకూడదు’ అని, ఎందరో పోరిపోరి రోజుల తరబడి సతాయించగా సతాయించగా, వినీ వినీ... ఏ మూడ్‌లోనో ‘సరే’ అనేసింది.
అసలేం జరిగింది..? పెళ్ళికుమారుడు ఈ అమ్మాయిని ఎక్కడ చూశాడు, ఈ అమ్మాయిపట్ల ఎందుకు ఆకర్షితుడయ్యాడు, తనకు తానుగా ఈ సంబంధాన్ని ఎందుకు ఎంచుకున్నాడు...
అంటే మనం మూడు నెలలు వెనక్కు వెళ్ళాలి.

* * * * *

ఆరోజు సమీర అనంతపురంలో కడప వెళ్ళే బస్సు ఎక్కింది. కడపలో ఒక స్నేహితురాలి పెళ్ళికి హాజరుకావాలి. బస్సులో అడుగుపెట్టేసరికి బస్సంతా కిక్కిరిసి ఉంది. కూర్చోటానికి సీట్లు కనిపించటం లేదు. అసలే పెళ్ళిళ్ళ సీజన్‌. ఆడవాళ్ళకు కేటాయించిన ముందు వరుస సీట్లలో దాదాపు అందరూ మగవాళ్ళే కూర్చుని ఉన్నారు. వాళ్ళ నెత్తిమీదేమో ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అని పెద్ద పెద్ద అక్షరాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ‘గౌరవించకపోతే ఇబ్బందిలేదు, అవమానించకుండా ఉంటే చాలు’ అని ఆ ప్రకటన చదివినప్పుడల్లా గొణుక్కుంటోంది సమీర. ఆరోజు బస్సులో ముందు వరుసలో కూర్చున్న మగవాళ్ళు చదువూ సంధ్యలు లేని అమాయకులైన పల్లెటూరివారేం కాదు- దాదాపు అందరూ నలభై ఏళ్ళలోపువారే. బాగా చదువు కున్నవాళ్ళేనని వాళ్ళ ముఖాలే చెబుతున్నాయి. ఇన్నేళ్ళయినా బాగా చదువుకున్నవాళ్ళు కూడా కనీసం ప్రజాస్వామిక సంప్రదాయాలను పాటించకపోవటం విడ్డూరం అనిపిస్తుంది చాలాసార్లు సమీరకు.
ఆమెతోపాటు సీట్లులేక నిలుచున్న ఆడవాళ్ళు మరో నలుగురు కూడా అక్కడే ఉన్నారు నిస్సహాయంగా. ఇలాంటిది సమీరకు కొత్త అనుభవం ఏమీ కాదు. మగవాళ్ళను ‘లేవండి’ అని కోరటమూ, వాళ్ళు లేవకపోవటమూ, గొడవ పెట్టుకోవటమూ సమీరకు కొత్తకాదు.
ఆరోజు కూడా సమీర సహజంగానే ‘‘దయచేసి మీరు లేవండి’’ అని రిక్వెస్టు చేసింది. ‘‘వృద్ధులైన స్త్రీలు కూడా ఉన్నారు, దయచేసి మా సీట్లు మాకు ఇవ్వండి. కడప దాకా వెళ్ళాలి. అంతదూరం నిల్చోవటం సాధ్యంకాదు’’ అని నెమ్మదిగానే అడిగింది.
‘‘పోమ్మా, మేం మాత్రం అంతదూరం నిల్చోవాలా’’ అన్నారు ఇద్దరు.
‘‘అయ్యా, ఇవి ఆడవాళ్ళ సీట్లు. మీరలా అంటే ఎలా?’’ అంటూ వాదనకు దిగింది.
‘‘పోమ్మా, చూసినాంగానీ, ముందొచ్చినాం కూచున్నాం’’ అంటూ ఒకాయన ‘లా’పాయింట్‌ తీసినాడు.
‘‘అరె, మీరెప్పుడొచ్చినారని కాదండీ... ఇవి ఆడవాళ్ళ సీట్లు. మా సీట్లు మాకివ్వటానికి మీకేం అభ్యంతరం’’ అని నిలదీసినట్లు మాట్లాడినా వాళ్ళు ఉలకలేదు పలకలేదు.
ఇలా కాదనుకుని కండక్టర్‌ను పిలిచి ‘‘చూడండి, మా సీట్లు మాకు ఖాళీ చేయించండి’’ అంది.
కండక్టర్‌ పాపం, ఆమెవైపు జాలిగా చూసి ‘‘ఏం చేస్తామమ్మా, రోజూ ఈ గొడవలు పడుతూనే ఉన్నాం మేం. చెపితే ఈ మగమహారాజులు వినరు. మీరే ఎలాగో సర్దుకోండి’’ అంటూ నచ్చజెప్పపోయినాడు.
‘‘మీరే ఇలా అంటే ఎలాండీ, మీ బాధ్యత గదా ఇది’’ అని అంటూంటే, ఆ కండక్టర్‌ టికెట్లు కొట్టే హడావుడిలో ఈమె మాటల్ని పట్టించుకోలేదు.
సమీర కోపంగా డ్రైవర్‌ దగ్గరకు వెళ్ళి ‘‘చూడండి, మీరైనా వీళ్ళను లేపండి’’ అని తీవ్రంగా దబాయించేసరికి, ఆ డ్రైవర్‌ ముసిముసి నవ్వులు నవ్వుతూ ‘‘ఇది నా డ్యూటీ కాదమ్మా. బస్సు నడపటమొక్కటే నా డ్యూటీ’’ అనేసరికి, సమీర ‘‘మా సీట్లలో మమ్మల్ని కూర్చోనివ్వకుండా బస్సెలా నడుపుతారో నేనూ చూస్తాను’’ అంటూ గట్టిగా నిలదీసింది.
‘‘బస్సు కదలనివ్వను- అంతే!’’ అంటూ గట్టిగా అరిచేసరికి బస్సంతా సైలెంట్‌ అయిపోయింది.
ఈ వ్యవహారమేదో ముదిరేలా ఉంది అనుకుని భయపడ్డాడేమో కండక్టర్‌ ముందు సీట్లలో కూర్చున్న మగాళ్ళతో ‘‘లేవండి బాబూ, ఈమె బాగా చదువుకున్న అమ్మాయిలా ఉంది. రిపోర్టులూ గొడవలూ అంటే బావుండదు’’ అని బలవంతపెట్టేసరికి, మగవాళ్ళు రుసరుసలాడుతూ లేచినిలబడ్డారు. సమీరతోపాటు మరో నలుగురు ఆడవాళ్ళు సమీరను మెచ్చుకుంటూ సీట్లలో కూర్చున్నారు.
అసలు సంగతి ఇదికాదు- ఆరోజు ఆ బస్సులో హేమంత్‌ కూడా ప్రయాణం చేస్తున్నాడు.
ఆ అమ్మాయి తెగువకూ మాటతీరుకూ బహు ముచ్చటపడినాడు ఆ అబ్బాయి. మరో విషయం ఏమిటంటే, ఆ అబ్బాయి కూడా కడపకు, ఆ అమ్మాయి హాజరయ్యే పెళ్ళికే వెళ్తున్నాడు కూడా.
పెళ్ళి మంటపంలో ఆ అమ్మాయి ప్రతి కదలికనూ ప్రవర్తననూ ఆ రోజంతా ఆరాధనగా తిలకించినాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయికి సంబంధించిన అన్ని ఆరాలూ తీసినాడు. ఆమెతో అక్కడే మాట్లాడటం సభ్యతగా ఉండదనీ పెళ్ళి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ పనిలోనే ఉండిపోయి, ఇద్దరు బంధువుల్ని పెళ్ళి విషయమై వీళ్ళ ఇంటికి రాయబారం పంపినాడు. సమీర గట్టిగా తిరస్కరించింది ఈ పెళ్ళి ప్రస్తావనను. ‘నిన్ను చూసి చాలా ముచ్చటపడినాడమ్మా
ఆ అబ్బాయి. కాళ్ళ దగ్గరకొచ్చిన సంబంధాన్ని కారణం లేకుండా కాదనకూడదమ్మా’ అని పదేపదే కుటుంబసభ్యులూ మంచికోరే బంధువులూ స్నేహితులూ హితబోధ చేసేసరికి ‘సరే చూద్దాం’ అని ఒప్పుకుంది సమీర.
‘‘సరే, ఆ అబ్బాయిని ఒకసారి పెళ్ళిచూపులకు పిలిపిద్దాం. నువ్వూ చూసినట్టుంట్టుంది’’ అని అంటే, ‘‘అతన్ని పిలిపించడమేమిటి, నన్ను చూసినాడటగా ఇంతకుముందే, ఇక చూడాల్సింది నేనేగా. వీలుచూసుకుని నేనే వెళ్ళి చూసి వస్తాను’’ అనేసరికి ముక్కున వేలేసుకున్నారందరూ- ‘ఇది పిల్ల కాదురా బాబూ’ అనుకుంటూ.
‘‘నువ్వొక్కదానివే వెళ్తావేమే’’ అని తల్లి గదమాయిస్తే, ‘‘మీరు కూడా రండి, నా గంటేం పోతుంది. అబ్బాయినే కాదు, కుటుంబసభ్యులనూ వాళ్ళ ఇంటినీ కూడా మనం చూస్తే మంచిది గదా’’ అనేసరికి, ‘ఈ పిల్లకథ చిన్నప్పట్నుంచీ చూసిందే గదా, పెళ్ళికొడుకును చూసేందుకు పిల్ల వస్తున్నదంటే, వాళ్ళేమనుకుంటారో ఏమో’ అని వెనకా ముందూ ఆలోచించినారు- తల్లిదండ్రులూ బంధువులూ కూడా.
చివరకు ఈ మాటను పెళ్ళికొడుకు తల్లిదండ్రులకు చేరవేసినారు. ‘ఈ పిల్ల గుడినే కాదు, గుడిలో లింగాన్ని కూడా మింగేసేలా ఉంది. ఇలాంటి పిల్లతో వేగటం మున్ముందు చాలా కష్టమవుతుంది’ అని తర్జనభర్జన పడినారట అబ్బాయి తల్లిదండ్రులు.

కానీ, వరుడు హేమంత్‌ మాత్రం పకపకా నవ్వేసి, ‘‘ఆ అమ్మాయినే రానివ్వండి, సరదాగా ఉంటుంది’’ అనేసరికి కిమ్మనకుండా అందరూ ఒప్పేసుకున్నారు.
ఒక సుమోను కుదుర్చుకుని- సమీరా, తల్లిదండ్రులూ అన్నావదినా మరో ఇద్దరు బంధువులూ కలిసి పెళ్ళిచూపులకు వరుడి ఊరికి వచ్చేసినారు. వరుడి ఊరు మరీ చిన్నపల్లె.
వీళ్ళంతా సుమోలో దిగేసరికి- పెళ్ళికూతురు- పెళ్ళికుమారుడిని చూడ్డానికి వచ్చిందన్న సంగతి తెలిసి, చాలామంది వీళ్ళ ఇంటి దగ్గర గుమిగూడినారు.
పెళ్ళికొడుకు బంధువర్గమంతా కారు దిగిన ఈ అమ్మాయిని చూసి నివ్వెరపోయినారట. చాలా సాదాసీదాగా కాటన్‌ చీరతో, ఏ నగలూ నాణ్యాలూ ముస్తాబులూ లేకుండా ముచ్చటగా ముగ్ధంగా ఈ అమ్మాయి కనిపించేసరికి, ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారట.
పచ్చని బంగారు రంగుతో, సన్నగా పొడుగ్గా వినయంగా కనిపించే ఈ అమ్మాయిని చూసేసరికి ఒక వింతభ్రాంతికి లోనయ్యారట. ఎమ్మే చదువుకున్న అమ్మాయి ఇంత సాదాగా ఉందేమిటి అని పరవశించిపోయినారట.
వరుడు హేమంత్‌, స్వయంగా వచ్చి వీళ్ళను ఇంట్లోకి ఆహ్వానించాడు. సమీర కూడా అతణ్ణి చూసి ఏ సిగ్గూ ఎగ్గూ లేకుండా ‘హాయ్‌’ అని పలకరించింది సౌమ్యంగా. నిజంగా కూడా చూడగానే నచ్చేలా ఉన్నాడు హేమంత్‌ కూడా.
ఆ రోజంతా వాళ్ళ ఇంట్లోనే అందరూ కలివిడిగా గడిపినారు. ఈమధ్యనే కట్టుకున్న కొత్త ఇల్లు పొందికగా ఉంది. హేమంత్‌ తల్లిదండ్రులూ అక్కాచెల్లెలూ కూడా సమీరతో క్షణంలో కలిసిపోయారు. కొత్త మనుషుల్లా కాకుండా చిరకాల పరిచయమున్నవారిలా ముచ్చట్లు కలబోసుకున్నారు.
భోజనాల తర్వాత, హేమంత్‌, సమీర ఒక గదిలో కూర్చుని చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకున్నారు. సమీరకు కూడా హేమంత్‌ పలకరింపూ మాటతీరూ బాగా నచ్చినాయి.
‘‘నేనిలా రావటం మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను మన్నించండి. నాకు చిన్నప్పట్నుంచీ ఇలాంటి సరదాలు చాలా ఉన్నాయి’’ అంది సమీర.
‘‘అబ్బే, నాకూ సరదానే అనిపించింది. ఆరోజు బస్‌లో మీ వైఖరి చూసిన తర్వాత, నాకు చాలా గౌరవం కలిగింది మీమీద. కొడవటిగంటి కుటుంబరావు అనే ఒక గొప్ప రచయిత, ఏభై ఏళ్ళ క్రితమే ‘కొత్త కోడలు’ అని ఒక నవల రాసినారు. అందులో అచ్చంగా ఇలాగే పెళ్ళికూతురు- పెళ్ళికి ముందే అత్తగారి ఇంటికివచ్చి, ఇంట్లోవాళ్ళందర్నీ హడలగొట్టేస్తుంది. ఆ నవలలోని అమ్మాయితో పోలిస్తే మీరే నెమ్మదిగా కనిపిస్తున్నారు. ఈమధ్యనే ఒక కథ ‘వాసంత తుషారం’ చదివాను. ఆ కథలో ‘వసంత’ అనే అమ్మాయి ‘తుషార’ అనే స్నేహితురాలితో కలిసి పెళ్ళిచూపులకు వరుడి ఊరికి వచ్చేస్తుంది. సాహిత్యం ద్వారా ఇలాంటి విషయాలు నాకు పరిచయం కావటంతో, మీరు మా ఊరికి రావటం నాకు కొత్తేమీ అనిపించలేదు’’ అన్నాడు నవ్వుతూ.
‘‘మీరు చెప్పిన విషయాలు చాలా బావున్నాయి. నాకు సాహిత్యంతో చాలా తక్కువ పరిచయం. మీరు చెప్పిన తర్వాత ఆ పుస్తకాలను చదవాలని నాకూ అనిపిస్తోంది’’ అంది సమీర. ...ఇదీ మూడు నెలల కిందటి సంగతి.
వర్తమానంలోకి వస్తే- పెళ్ళికూతురు సమీర వ్యవహారం చూసేసరికి, అందరూ జడుసుకున్నారు అనుకున్నాం గదా.
పెళ్ళికుమారుడు లగ్నపత్రిక రాసే ఈ సందర్భంలో లేడు. అందువల్ల, పెళ్ళికుమారుడి బంధువు ఒకాయన వెంటనే హేమంత్‌కు ఫోన్‌ చేసి ‘‘ఒరేయ్‌ హేమూ, ఈ పిల్ల చాలా గడుగ్గాయిలా ఉందిరా. లగ్నపత్రికలో తన పేరు మార్చుకోను అంటోంది. అంతగా కావాలంటే తన పేరుకు తగ్గట్టుగా నీ పేరునే మార్చాలంటున్నదిరా’’ అని వెటకారంగా మాట్లాడేసరికి, హేమంత్‌ పగలబడి నవ్వీ నవ్వీ ‘‘ఎవరూ ఎవరి పేరూ మార్చుకోనవసరం లేదు. అంత సరదా అనిపిస్తే, నేనే నా పేరును ‘సమీర కుమార్‌’గా మార్చుకుంటా’’ అంటూ గలగలా నవ్వేసినాడు.

(9  జూన్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.