close
వయసు మళ్లినా... కుర్రాళ్లే!

కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు... అని శ్రీశ్రీ ఎవరిని చూసి అన్నారోకానీ, ఇక్కడున్న వ్యక్తుల్ని చూసుంటే మాత్రం కొంతమంది వృద్ధులు ఎప్పటికీ యువకులు అని తప్పక చెబుతారు. వయసు వందకుచేరువవుతున్నా, అలుపెరుగని ప్రయాణం చేస్తున్నారు వీళ్లు!

వయసు 99... హాబీ ట్రెక్కింగ్‌!

కేరళకు చెందిన చిత్రన్‌ నంబూద్రిపాడ్‌కి 99 ఏళ్లు. ఈ వయసుకొచ్చాక మంచంపట్టి ఉంటారు వేరొకరైతే. కానీ ఈయన మాత్రం ఈ వయసులోనూ ట్రెక్కింగ్‌ బాట పడుతున్నారు. కేరళ విద్యాశాఖలో అధికారిగా పనిచేసి 1978లో రిటైరైన చిత్రన్‌... ఆ తర్వాత నుంచి జీవితాన్ని మరింత ఛాలెంజింగ్‌గా తీసుకుని హిమాలయాలకు ట్రెక్కింగ్‌కి వెళ్తున్నారు. ఈ అక్టోబరుకి ఆయనకు వందేళ్లు పూర్తవుతాయి. అప్పుడు మరోసారి హిమాలయాల ట్రెక్కింగ్‌కు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది ఆయనకు హిమాలయాల్లో 30వ ట్రెక్కింగ్‌ అవుతుంది. చిత్రన్‌ హిమాలయాల పర్యటన వెనక ఉన్న వ్యక్తి నంబీశన్‌. ఈయన 1950 ప్రాంతంలో చిత్రన్‌ ఇంటి దగ్గర్లో ఉండేవారట. కాలిబాటనే కాశీ, హిమాలయాలకు వెళ్లొచ్చి ఆ యాత్రా విశేషాల్ని చిత్రన్‌కు చెప్పేవాడట. అలా చిత్రన్‌కి హిమాలయాలపైన ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. 1956లో మొదటిసారి హిమాలయాలకు వెళ్లొచ్చిన చిత్రన్‌... రిటైరయ్యాక మాత్రం తరచూ వెళ్తున్నారు. గతేడాది డిసెంబరులో బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ వెళ్లి వచ్చారు. హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కి వెళ్లడానికి కారణం మానసిక, ఆధ్యాత్మిక ఆనందమే అంటారు. చిత్రన్‌కి కాస్త వినికిడి లోపం ఉన్నప్పటికీ, జ్ఞాపకశక్తి మాత్రం మెండుగా ఉంది. ఇప్పటికీ తన చదువు, ఉద్యోగం, యాత్రా విశేషాల్ని స్పష్టంగా గుర్తుచేసుకుంటారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలితోపాటు నడక, యోగా ద్వారా తాను ఆరోగ్యంగా ఉంటున్నట్లు చెబుతారు. నిండు నూరేళ్లు హాయిగా జీవించడమంటే ఇలాగేనేమో!

పాఠం చెబుతారు జీతం తీసుకోరు!

ద్యోగ విరమణ అనేది వయసుకి సంబంధించిందేకానీ మనసుకు సంబంధించింది కాదంటున్నారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శ్రీకృష్ణన్‌ శర్మ. రికార్డుల ప్రకారం 1995లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొందిన శర్మ అప్పట్నుంచీ గత 24 ఏళ్లుగా స్కూల్‌కి వస్తూ పాఠాలు బోధిస్తూనే ఉన్నారు. షాజహాన్‌పూర్‌ జిల్లా, కంత్‌ మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ హైస్కూల్లో ఇంగ్లిష్‌ బోధించే శర్మ ఇందుగ్గాను ఎలాంటి జీతమూ, గౌరవ వేతనమూ తీసుకోరు. కేవలం వృత్తిపైన ఉన్న ఇష్టం, పిల్లలమీద ఉన్న ప్రేమ కారణంగా ఆయన తన సేవల్ని కొనసాగిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఎక్కువ. దాంతో శర్మ సేవలకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. ఈయన ఉండేది మోహన్‌పూర్‌ గ్రామంలో. ఆయన పనిచేసే పాఠశాల ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 84 ఏళ్ల వయసులోనూ సైకిల్‌ తొక్కుకుంటూ స్కూల్‌కి వెళ్లొస్తారు. 1959లో ఉద్యోగంలో చేరినపుడు మొదటిసారి కంత్‌ పాఠశాలలోనే పాఠాలు చెప్పిన శర్మ... ఉద్యోగ జీవితంలో ఎక్కువ కాలం అక్కడే పనిచేశారు. ఉద్యోగ విరమణ రోజున విద్యార్థులూ, ఉపాధ్యాయులూ శర్మ పాఠాలు చెప్పడం కొనసాగించాలని కోరడంతో ఆయన కాదనలేకపోయారు. తన ఒంట్లో ఓపిక ఉన్నన్నిరోజులూ పాఠాలు చెబుతూనే ఉంటానంటారు. పాఠశాలలో మిగతా ఉపాధ్యాయులకు సెలవులు ఉంటాయి. శర్మ మాత్రం బడికి సెలవైతేనే సెలవు తీసుకుంటారు. గత 24 ఏళ్లలో ఎంతోమంది ఉపాధ్యాయులు ఆ బడికి వచ్చివెళ్లినా ఈయన మాత్రం కొనసాగుతున్నారు.

విరామం లేదు ఆనందం ఉంది!

నిక్కరూ, బనియన్‌ వేసుకుని కనిపిస్తున్న ఈయన... రోడ్డుమీద ఎక్కడైనా నీరు నిల్చిపోతే చీపురు పట్టుకుని ఊడ్చేస్తారు, రోడ్లమీద గుంతలు కనిపిస్తే పూడ్చేస్తారు, కాలువల్లో ప్లాస్టిక్‌ కవర్లు అడ్డంగా కనిపిస్తే తీసేస్తారు. చూడ్డానికి పారిశుద్ధ్య కార్మికుడిలా కనిపిస్తున్న ఈయన రిటైర్డ్‌ టీచర్‌. ‘మరి ఇవన్నీ చేస్తున్నారే...’ అంటారా దానికో కారణం ఉంది. రూప్‌నారాయణ్‌ నిరంజన్‌ది ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌ పట్టణం. అక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేశారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత కూడా. నిరంజన్‌ ఉండే ప్రాంతంలో స్కూల్‌కి వెళ్లే దారిలో వర్షాకాలంలో నీళ్లు నిల్చిపోతాయి. ఆ తర్వాత రోడ్డు నిండా గుంతలు ఏర్పడతాయి. దానివల్ల స్కూల్‌కి వచ్చే పిల్లలు తగ్గిపోతున్నారు.
ఈ సమస్యని పరిష్కరించమని మున్సిపాలిటీ వాళ్లకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునేవారు కాదట, దాంతో తానే ఆ పనిచేయడం మొదలుపెట్టాడు. గత పదిహేనేళ్లనుంచీ ఇప్పుడు 80 ఏళ్ల వయసులోనూ ప్రతి ఉదయం నాలుగు గంటలపాటు ఈ పని చేస్తున్నారు.  దాన్ని నామోషీ అనుకోరు. వీటితోపాటు ఆ బడిలో టాయిలెట్లు కట్టించారు, విద్యుత్‌ కనెక్షన్‌ తెచ్చారు, తాగునీటి కోసం ట్యాంకు కట్టించారు. ఆయుర్వేద డాక్టర్‌ కూడా అయిన నిరంజన్‌ సాయంత్రం వేళలో ఇంటి దగ్గర ఉచితంగా వైద్యం చేస్తారు. ‘నేను ప్రభుత్వం నుంచి నెలకు రూ.20 వేలు పెన్షన్‌ తీసుకుంటున్నాను. ఈ విధంగా అయినా ప్రభుత్వానికి కొంత వరకూ నా సేవలు అందిస్తున్నాను. దీనివల్ల ఆరోగ్యం, ఆనందం కూడా కలుగుతున్నాయి’ అంటారాయన.

(9  జూన్‌ 2019)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.