close
చిట్టిపొట్టి పండ్లు చూశారా?!

ఓడ ముక్కలైపోవడంతో స్పృహతప్పిన గలివర్‌ కళ్లు తెరిచేసరికి ఒళ్లంతా కట్టేసిన తాళ్లనీ, తన ఒంటిమీద గంతులేస్తోన్న లిలీపుట్‌లనీ చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తరవాత అతను వాళ్లకి సాయం చేయడం, తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోవడం వేరే కథ. గలివర్స్‌ ట్రావెల్స్‌ నవల్లోని ఐదారు అంగుళాలకి మించని లిలీపుట్‌లు ఓ రచయిత ఊహే కావచ్చు కానీ ఇక్కడ మనం చూస్తోన్న చిట్టిపొట్టి పండ్లూ కూరగాయలూ మాత్రం నిజంగా నిజం. వాటి సంగతేంటో కాస్త చూద్దామా...

పండ్లూ కూరగాయలేవయినాగానీ కోసి తింటాం, వండుతుంటాం. కానీ ఆ శ్రమే లేకుండా గుటుక్కుమనిపించేంత చిన్నగా అవి కాస్తుంటే ఆశ్చర్యమే కదూ. పైగా వీటిల్లో కొన్ని వేల సంవత్సరాల నుంచీ సహజంగానే కాస్తుంటే, మరికొన్నింటిని సంకరీకరణం ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు వృక్ష శాస్త్రవేత్తలు. అలాగని వీటిల్లో పోషకగుణాలూ అంతంతమాత్రమే అనుకుంటే పొరబాటే. సాధారణ పండ్లలో మాదిరిగానే అన్ని రకాల పోషకాలూ ఉండటంతోబాటు, అదనంగా మరిన్ని ఔషధగుణాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు. స్ట్రాబెర్రీ జామనే తీసుకుంటే- ఇందులో పీచూ కాల్షియం సాదా జామ రకాల్లో కన్నా ఎక్కువ. అందువల్ల ఇది రక్తంలో చక్కెరశాతాన్ని ఏమాత్రం పెరగనీయదనీ బీపీనీ కొలెస్ట్రాల్‌నీ సైతం నియంత్రిస్తుందనీ చెబుతున్నారు. వీటిని రోజూ తింటే ఎముకలూ దంతాలూ బలంగా ఉంటాయట.

మధురమే మారియన్‌ మామిడి!
థాయ్‌, మలేషియాలో పండించే మారియన్‌ మ్యాంగో మధురమైన రుచికి మరేదీ సాటిరాదట. పైగా దీన్ని తొక్క తీయకుండా నేరుగా తినేయొచ్చట. ఇంకా ఇందులో పీచు తక్కువ. రోమన్ల కాలం నుంచీ పండిస్తోన్న లేడీ ఆపిల్స్‌ రుచీ అద్భుతమే. వీటినుంచి తరవాత పింక్‌ లేడీ ఆపిల్‌ అని మరో రకాన్నీ తయారుచేశారు. అలాగే మామూలు పైనాపిల్‌ పండ్లతో పోలిస్తే జపాన్‌లో పండించే మినీ పైనాపిల్‌ పండ్ల మధ్య భాగం కూడా గట్టిగా కాకుండా మృదువుగా తియ్యగా ఉంటుంది. అరచేతిలో ఇమిడిపోయే పుచ్చకాయల్నీ కర్బూజా పండ్లనీ బొప్పాయిల్నీ కూడా పండిస్తున్నారు. దీనివల్ల కాయ మొత్తాన్నీ ఒక్కరే తినేయొచ్చు. అరటిపండ్ల విషయానికొస్తే- స్పెయిన్‌లో పండించే చిక్వితా, మనదగ్గర పండే మరుగుజ్జు కర్పూరకేళి రకాలు మామూలువాటికన్నా తియ్యగా ఉండటమే కాదు, తొక్క కూడా పలుచనే. కిస్‌మిస్‌లను పోలిన లిలీపుట్‌ ద్రాక్ష పేరే షాంపేన్‌. బఠాణీ సైజులో ఉండే ఈ ద్రాక్ష ఎరుపు, ముదురు గులాబీ, నలుపు రంగుల్లో పండుతుంటాయి.
నాలుగు సెంటీమీటర్లకి మించని క్లెమంటినీ చూడ్డానికి అచ్చం కమలాపండ్లలానే ఉంటుంది. కానీ పట్టుకుందామంటే వేళ్లకి కూడా చిక్కదు. దీన్ని ఒలచాలంటే ఏ సూదో కావాల్సిందే. చైనాలో 1300 సంవత్సరాల క్రితం నుంచీ పండుతోన్న ఈ రకాన్ని అప్పట్లో రాజులు మాత్రమే తినేవారట. ఇందులో ఫోలేట్లూ పీచూ; విటమిన్‌-సి, పొటాషియం... వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతోబాటు తియ్యని రుచి వీటి సొంతం. దాదాపు ఇదే సైజులో కాస్త పొడవుగా ఉండే కుమ్‌క్వాట్‌లు సైతం కమలాపండ్లలానే ఉంటాయి. వీటినయితే తొక్క తీయకుండా కూడా తినొచ్చట. 12వ శతాబ్దం నుంచీ చైనాలో పండుతోన్న వీటిని ఉప్పు, పంచదార వేసి నిల్వ చేస్తే ఎన్ని సంవత్సరాలైనా అవి రుచిని కోల్పోవట. ఇలా నిల్వచేసిన పండ్ల జ్యూస్‌ని నీళ్లలో కలిపి పుక్కిలిస్తే గొంతునొప్పి తగ్గుతుందట. అలాగే అంగుళం సైజు కూడా లేని స్ట్రాబెర్రీ, కాక్విటో కొబ్బరి... ఇలా ఎన్నో రకాల మీనియేచర్‌ పండ్లని ప్రత్యేకంగా పండిస్తున్నారు. ఆగ్నేయాసియా దేశాలతోపాటు ఐరోపా, అమెరికా దేశాలూ ఈ బుల్లి పండ్ల పెంపకంమీద దృష్టి సారించాయి.

బుజ్జి కూరగాయలు!
పండ్లతోబాటు కూరగాయలూ క్రమంగా మీనియేచర్‌ సైజుని సంతరించుకుంటున్నాయి. సన్నగా పొడవుగా అమ్మాయిల చేతివేళ్లని తలపించే బెండకాయల్లోనూ మూడు అంగుళాలు మించని బర్గండీ రకాన్ని చూసినవాళ్లెవరైనా పిందెలే కోశారనుకోవచ్చు. కానీ పిట్ట కొంచెం కూత ఘనంలా వీటిల్లో విటమిన్లూ ఖనిజాలూ మెండుగానే ఉంటాయి. అలాగే రుచిలోనూ అదుర్సే. చిటికెన వేలు సైజులో తియ్యగా ఉండే మినీ క్యారెట్లను లంచ్‌బాక్సులో పెడితే చాక్లెట్‌ తిన్నంత ఆనందంగా చిన్నారులు తింటారనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. మొదట్లో ఈ సైజుకోసం పూర్తిగా తయారవ్వని క్యారెట్లని తవ్వేవారు. తరవాత ఆ రకం వంగడాన్ని తయారుచేశారు. మూడు నాలుగు సెంటీమీటర్లకి మించని ఈ మినీ క్యారెట్లల్లోనూ తెల్లని ఫ్రెంచ్‌ వెరైటీతోబాటు గుండ్రంగా నారింజవర్ణంలో ఉండేవీ ఉన్నాయి. తెల్లవి ఐదు అంగుళాల వరకూ పెరుగుతాయి. కానీ పొట్టిగా ఉండే గుండ్రని రకం మాత్రం చాలా తియ్యగా ఉంటుందట. హరికోట్‌ వెర్ట్స్‌ అనే మీనియేచర్‌ రకం బీన్స్‌ని సైతం ఇంట్లోనే కుండీల్లో పెంచుకోవచ్చు. పెద్ద ముత్యాల్ని తలపించే పెరల్‌    ఉల్లిపాయలూ; బేబీ పొటాటోలూ వంకాయలూ చెర్రీ టొమాటోలూ వంటివన్నీ కూడా ఈ కోవకే చెందుతాయి. ఇవే కాదు, గుమ్మడి, సొరకాయ, క్యాప్సికమ్‌, బీట్‌రూట్‌, ముల్లంగి, కాలీఫ్లవర్‌, క్యాబేజి, దోస, కీరా, వంకాయ... ఇలా అన్నీ మినీ సైజుల్లో పండుతున్నాయి. అసలెందుకీ మీనియేచర్‌ రకాలూ అంటే- ఓ పెద్ద జామకాయని కోస్తే తినేవాళ్లు కనీసం ఇద్దరైనా ఉండాలి. కానీ మీనియేచర్‌లో అయితే ఎన్ని కావాలంటే అన్నే తినొచ్చు. పైగా బుజ్జి బుజ్జి పండ్లను చూస్తే పిల్లలూ ఇష్టంగా తింటారు.
కూరగాయలనైతే కోసే పనిలేకుండా నేరుగానే  వండేసుకోవచ్చు. పొటాటో, ఉల్లి, టొమాటో... వంటివి ఇప్పటికే మన వంటింటిలోకి వచ్చేశాయి. త్వరలో మిగిలినవీ వస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే- కథలోని లిలీపుట్‌లు నిజంగా ఉన్నారో లేదో తెలీదుగానీ ఈ మీనియేచర్‌ పండ్లూ కూరగాయలూ మాత్రం నిజంగా నిజం సుమీ!

16 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.