close
కుర్రాళ్లూ మీకు జోహార్లు

పుస్తకాల మధ్య గడవాల్సిన బాల్యం, ఆటపాటల మధ్య సాగాల్సిన బాల్యం, మధుర జ్ఞాపకాల్ని కూడగట్టుకోవాల్సిన బాల్యం... పాలిథీన్‌ కవర్ల వేటలో గడిచిపోతుంటే, ఆకలికేకల మధ్య నలిగిపోతుంటే, రూపాయల వేటలో కరిగిపోతుంటే... ఆ యువకులు చూస్తూ ఉండలేకపోయారు. తమదైన శైలిలో స్పందించి బాలల భవిష్యత్తుకు బంగారుబాటలు వేస్తున్నారు!


ఆకలి తీరుస్తూ!

న్‌లైన్లో ఆహారం సరఫరా చేసే సంస్థ జొమాటో పాలసీ ప్రకారం వినియోగదారులు మధ్యలో ఆర్డర్‌ని క్యాన్సిల్‌ చేస్తే ఆ ఆహారాన్ని డెలివరీ బాయ్స్‌ తమ ఇంటికి తీసుకువెళ్లొచ్చు లేదంటే, పేదవాళ్లకి ఇవ్వొచ్చు. కోల్‌కతాకు చెందిన పతిక్రీత్‌ సాహా ఈ రెండో విధానానికి ఓటు వేశాడు. నాలుగేళ్ల కిందట తనకు ఎదురైన ఒక సంఘటన పేద పిల్లల గురించి ఆలోచించేలా చేసిందని చెబుతాడు సాహా. ‘డమ్‌ డమ్‌ రైల్వేస్టేషన్‌ మీదుగా వెళ్తున్నపుడు ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఆరేళ్ల పిల్లాడు వచ్చి డబ్బులివ్వమని అడిగితే, మొదట పట్టించుకోలేదు. తాను డబ్బు తీసుకువెళ్లకపోతే అమ్మ కొడుతుందని చెప్పాడు. ఆరోజు తోచినంత ఇచ్చాను కానీ వాడిని మర్చిపోలేకపోయాను. ఆరోజు నుంచీ నా ఆర్డర్‌ క్యాన్సిల్‌ అయినపుడు ఆ చుట్టుపక్కల పిల్లలకు ఇవ్వడం మొదలుపెట్టాను’ అని గుర్తుచేసుకుంటాడు. ఇతడి ప్రయత్నం మెచ్చి మరో అయిదుగురు డెలివరీ బాయ్స్‌ కూడా సాహా బాటలోనే నడుస్తున్నారు. అంతేకాదు, ఓ హోటల్‌ యాజమాన్యంతో మాట్లాడి మిగిలిపోయిన ఆహారాన్నీ ఇలాంటి పిల్లలకు ఇచ్చేందుకు ఒప్పించాడు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు తెచ్చే డబ్బు గురించే ఆలోచిస్తున్నారు కానీ, భవిష్యత్తు గురించి ఆలోచించడంలేదని గ్రహించిన సాహా... ఖాళీ సమయంలో వాళ్లకు చదువు చెప్పడమూ మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల్ని ఒప్పించి ఇప్పటివరకూ 21 మంది పిల్లల్ని బడిలో చేర్పించాడు కూడా. 


రోడ్లువదిలి బడిబాట...

త్తర్‌ప్రదేశ్‌కు చెందిన సుశీల్‌కుమార్‌ మీనా వయసు పాతికేళ్లు... రైల్వేలో సెక్షన్‌ ఇంజినీర్‌ ఉద్యోగం చేస్తూనే, పేద నిరుద్యోగుల కోసం తానుండే ఘజియాబాద్‌లో శిక్షణ సంస్థను పెట్టాడు. అక్కడి మురికివాడల్లో  చాలామంది బడి ఈడు పిల్లలు రోడ్లమీద వివిధ రకాల వస్తువుల్ని అమ్ముతూ కనిపించేవారు. వాళ్లని బడికి పంపమని అడిగితే తల్లిదండ్రులు అంగీకరించరని తెలుసు. అందుకే తరచూ వాళ్ల దగ్గరకు వెళ్లి పిల్లలకు కొత్త బట్టలు ఇస్తుండేవాడు. తర్వాత ఓరోజు ‘మీ పిల్లలకు లెక్కలు తెలియకపోతే వాళ్లు పెద్దయ్యాక మోసపోతారు’ అని చెప్పి వాళ్లకి చదువు చెబుతానని అడిగాడు. సగం మందికిపైగా తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. వచ్చిన కొద్దిమందినే ఆ ప్రాంతంలో ఒకచోట కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం ప్రారంభించాడు సుశీల్‌. ఆ పిల్లలు బాగా చదువుకోవటాన్ని చూసి మిగిలిన తల్లిదండ్రులూ తమ పిల్లల్ని పంపడం మొదలుపెట్టారు. ఈ వీధి బడుల నిర్వహణలో సుశీల్‌కు అతడి స్నేహితులూ, శిక్షణ సంస్థలో ఉండే విద్యార్థులూ సాయంగా ఉండేవారు. క్రమంగా పిల్లల్లో అర్హతలు ఉన్నవారిని బడుల్లో చేర్పించారు. ఎక్కడా చేరే పరిస్థితి లేనివాళ్లకి ‘నిర్భేద్‌ ఫౌండేషన్‌’ను పెట్టి వాళ్లకి చదువుతోపాటు వృత్తి నైపుణ్యాల్ని నేర్పిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌లలో ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి 23 స్కూల్స్‌ను నడుపుతూ అక్కడ 3000 మందికి చదువు చెబుతున్నారు.


బాలికలకు భరోసా!

ష్టాల్ని ఎదుర్కొన్నవాళ్లే సాటివారి సమస్యల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. అందుకు ఉదాహరణ హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ రాథోడ్‌. చిన్నపుడే తండ్రిని కోల్పోవడంతో పద్నాలుగేళ్లకి కుటుంబ భారాన్ని మోశాడు శ్రీనివాస్‌. తాను చదువుకుంటూనే తోబుట్టువుల్ని చదివించాడు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి తెలుగులో పీజీ చేసిన శ్రీనివాస్‌... ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తున్నాడు. ‘తనలాంటి పరిస్థితి ఆడపిల్లలకు వస్తే’ అని ఆలోచించి... ఎక్కడ అనాథ బాలికలు కనిపించినా అనాథ ఆశ్రమాల్లో చేర్పించేవాడు. తర్వాత తానే ఓ ఆశ్రమాన్ని ఎందుకు ప్రారంభించకూడదనుకున్నాడు. అలా ‘శిశుమంగళ్‌’ని ప్రారంభించి అనాథ బాలికలకు ఆశ్రయం కల్పిస్తున్నాడు. హైదరాబాద్‌లోని నల్లగుండ్ల ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ఏడు నుంచి పద్నాలుగేళ్ల మధ్య బాలికలకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తాడు. ప్రత్యేక సందర్భాల్లో అబ్బాయిలకీ ఆశ్రయం ఇస్తారు. ప్రస్తుతం శిశుమంగళ్‌లో 25 మంది పిల్లలు ఉన్నారు. యోగా శిక్షకుడు కూడా అయిన శ్రీనివాస్‌ తన సంపాదనలో అధిక మొత్తాన్ని ఆశ్రమ నిర్వహణకే ఖర్చుచేస్తాడు. కొంతమంది విరాళాలూ అందిస్తుంటారు. పిల్లలందరినీ ఒక ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నాడు. పిల్లల బాగోగులన్నీ అతడే చూసుకుంటాడు.

16 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.