close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలా!

కేంద్ర మంత్రి వర్గంలో అనూహ్యంగా చోటు సంపాదించారు సుబ్రహ్మణ్యం జయశంకర్‌. విదేశాంగ కార్యదర్శిగా రిటైరైన 16 నెలల్లోనే ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సమర్థతకీ, ప్రతిభకీ ఎప్పుడూ ఆదరణ ఉంటుందనడానికి నిదర్శనం 64 ఏళ్ల జయశంకర్‌ ప్రస్థానం. ఐ.ఎఫ్‌.ఎస్‌. నుంచి విదేశాంగ శాఖా మంత్రి వరకూ ఆయన చేసిన సుదీర్ఘ ప్రయాణం ఇది...

యశంకర్‌ ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌కి ఎంపికవుతూనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం కూడా సివిల్‌ సర్వెంటే. ‘ఆధునిక చాణక్యుడు’గా సుబ్రహ్మణ్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. విదేశాంగ విధానానికి సంబంధించి అనేక కేంద్ర పభుత్వ కమిటీల్లో పనిచేశారాయన. దాంతో మొదట్నుంచీ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటారనే అంచనాలు జయశంకర్‌మీద ఉండేవి. తండ్రికి తరచూ బదిలీలు ఉండటంతో... కుటుంబం దిల్లీలో ఉండేది. జయశంకర్‌ చదువు మొత్తం దిల్లీలో సాగింది. సెయింట్‌ స్టీఫెన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన జయశంకర్‌... జేఎన్‌యూ నుంచి రాజనీతి శాస్త్రంలో పీజీ, ‘అంతర్జాతీయ వ్యవహారాలు(అణు దౌత్యం)’ అంశంమీద పీహెచ్‌డీ చేశారు. యూనివర్సిటీలో ‘ఫ్రీ థింకర్స్‌’ అనే బృందంలో సభ్యుడిగా ఉండేవారు. ఏ పార్టీకీ అనుబంధంగా కాకుండా తమ ఆలోచనల్ని స్వేచ్ఛగా వ్యక్తంచేసే అవకాశం ఈ గ్రూప్‌ సభ్యులకు ఉండేది. కొద్దిరోజులు జర్నలిస్టుగానూ పని చేసిన జయశంకర్‌ 1977లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. అక్కడ ఏదైనా విదేశీ భాష నేర్చుకోవడం తప్పనిసరి. జయశంకర్‌ ‘రష్యన్‌’ నేర్చుకున్నారు. ఐఎఫ్‌ఎస్‌లో చేరాక మొదట్లో విదేశాంగ విభాగంలో తూర్పు ఐరోపా వ్యవహారాలు చూసే బృందంలో చేరారు. ప్రొబేషన్‌లో ఉండగానే సీనియర్ల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటూ, తన ఆలోచనల్నీ పంచుకునేవారు. జయశంకర్‌తో సంభాషణ ఆలోచనలు రేకెత్తించేదిగా, మేధోపరమైనదిగా, విలువైనదిగా ఉంటుందనేవారు చాలామంది సీనియర్లు. ఏదో ఒకరోజు విదేశాంగ విభాగంలో అత్యున్నత స్థానమైన ‘విదేశాంగ కార్యదర్శి’ స్థానాన్ని అధిరోహిస్తారనీ భావించేవారు. తన మొదటి విదేశీ ప్రాజెక్టులో భాగంగా మాస్కోలోని రాయబార కార్యాలయంలో 1979-81 మధ్య పనిచేశారు జయశంకర్‌. 1981-85 మధ్య ‘అమెరికా దేశాలు- పాలసీ ప్లానింగ్‌ డివిజన్స్‌’లో అండర్‌ సెక్రటరీగా పనిచేశారు. తర్వాత ఫస్ట్‌ సెక్రటరీగా, ‘ఇండియన్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌’కి సలహాదారుగా పనిచేశారు. ’90ల్లో జపాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో, ఆపైన మాజీ రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మకు ప్రెస్‌ సెక్రటరీగానూ పనిచేశారు. రాయబారి హోదాలో మొదటిసారి 2000లో చెక్‌ రిపబ్లిక్‌కు వెళ్లారు. 2004 వరకూ అక్కడ పనిచేసి తిరిగి భారత్‌ వచ్చారు.

అణుదౌత్య నిపుణుడిగా...
2004- 07 మధ్య ‘జాయింట్‌ సెక్రటరీ’ హోదాలో విదేశాంగశాఖ కార్యాలయంలో అమెరికా డివిజన్‌కు ఇంఛార్జిగా ఉండేవారు. ఆ సమయంలోనే భారత్‌ -అమెరికా అణు ఒప్పందంపైన చర్చలు మొదలయ్యాయి. ‘అణు దౌత్యం’ నిపుణులైన జయశంకర్‌... ఆ ఒప్పందం కార్యరూపం దాల్చడంలో కీలకపాత్ర పోషించి... భారత్‌-అమెరికా అణు ఒప్పందం నిర్మాణ  కర్తగా గుర్తింపు పొందారు. దౌత్యాధికారిగా ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద తొలి విజయమది. అణు ఒప్పందం కుదరడానికి మూడేళ్లు పట్టింది. అంతకాలం ఎంతో ఓర్పూ నేర్పుతో తన నైపుణ్యాల్ని ప్రదర్శించారు జయశంకర్‌.

చైనా రాయబారిగా...
2007లో సింగపూర్‌లో భారత హైకమిషనర్‌గా వెళ్లిన జయశంకర్‌ అక్కణ్నుంచి 2009లో చైనా రాయబారిగా బీజింగ్‌ వెళ్లారు. ఆ సమయంలోనే ఆయనకు దౌత్యవేత్తగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. చైనాతో భారత్‌ ఏయే రంగాల్లో ఎలాంటి సంబంధాల్ని కోరుకుంటుందన్న విషయాల్ని సుస్పష్టంగా చెప్పేవారు. చైనాతో సంబంధాల విషయంలో భారత్‌ రెండు అంశాల్లో ప్రధానంగా దృష్టి పెట్టింది. ఒకటి... రెండు దేశాలకూ లబ్ధి జరిగేలా వాణిజ్య ఒప్పందాలు మెరుగుపర్చుకోవడం, రెండు... సరిహద్దు వివాదాలూ, నదీ వివాదాలపైన తమ అభ్యంతరాల్ని బలంగా తెలియజేయడం. అయినా కూడా రెండు దేశాల మధ్యా తరచూ వివాదాలు తలెత్తేవి. 2010లో జమ్ము-కశ్మీర్‌ వాసులకి చైనా స్టాపెల్డ్‌(ప్రత్యేక కాగితాలు) వీసాలను అందిస్తే, ఆ దేశ అధికారులతో మాట్లాడి వాటిని నిలుపుదల చేయించారు జయశంకర్‌.  అదే సంవత్సరం భారత సైన్యానికి చెందిన నార్తర్న్‌ కమాండ్‌ ఇంఛార్జి చైనా పర్యటనకు దరఖాస్తు చేసుకోగా వీసా నిరాకరించడం వివాదమైంది. వీసాను అంగీకరించకుంటే సైన్యంతో సమాచారం ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయానికి స్వస్తి చెప్పాల్సి వస్తుందని సంకేతాలు పంపి నెలల వ్యవధిలోనే ఆ సమస్యని పరిష్కరించారు. అలాగే 2013లో డెప్సాంగ్‌ ప్రాంతంలో చైనా సైనికులు వివాదాస్పద స్థలంలో టెంటు వేసుకోవడంతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తగా ప్రధానిగా ఎంపికైన ‘లీ కిక్వెంగ్‌’ భారత పర్యటన అప్పటికే ఖరారైంది. ‘చైనా సైనికులు డెప్సాంగ్‌ నుంచి వెనక్కి తగ్గకుంటే ఆ పర్యటన జరగడం కష్టమే’ అని సంకేతాలు ఇవ్వడంతో ఆ దేశం సైన్యాన్ని ఉపసంహరించుకుంది. రాయబారిగా భారత్‌ అభిప్రాయాలను చైనాకు తెలియజేయడం, అదే సమయంలో ఆ దేశంలోని వాస్తవ పరిస్థితుల్ని ఇక్కడి ప్రభుత్వానికి అర్థమయ్యేట్టు వివరించడమూ పెద్ద సవాలే. ఆ బాధ్యతల్ని ఎంతో చాకచక్యంగా నిర్వర్తించారు జయశంకర్‌. చైనాలో భారత రాయబారిగా అత్యధికంగా నాలుగున్నరేళ్లపాటు పనిచేశారు. చైనాలో ఆయన పనితనానికి గుర్తింపుగా విదేశాంగ కార్యదర్శిగా నియమితులవుతారని అందరూ భావించారు. యూపీఏ ప్రభుత్వం ఆయన్ని నియమించాలనుకున్నా, సీనియర్ల నుంచి అసంతృప్తి ఎదురవుతుందని ఆఖరి నిమిషంలో వెనక్కితగ్గి 2013లో అమెరికా రాయబారిగా పంపింది.

అమెరికా నుంచి భారత్‌కు...
2013 డిసెంబరులో అమెరికా వెళ్లిన జయశంకర్‌... భారత దౌత్యాధికారి దేవ్యానీ ఖోబ్రగడే వివాదాన్ని చక్కదిద్దారు. మోదీ ప్రధాని అయ్యాక 2014 సెప్టెంబరులో అమెరికాకి మొదటిసారి వెళ్లినపుడు అక్కడ ప్రవాస భారతీయులూ, భారత సంతతి ప్రజలతో ఏర్పాటుచేసిన మేడిసన్‌ స్క్వేర్‌ సభ పెద్ద విజయవంతమైంది. ఆ సభకు 18 వేల మంది వచ్చారు. అలాగే అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతోనూ వ్యాపార వర్గాలతోనూ జరిగిన సమావేశాల్నీ విజయవంతమయ్యేలా చేశారు. మొత్తంగా ఆ పర్యటన ద్వారా మోదీ దృష్టిలో పడ్డారు. నిజానికి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా చైనాలో పర్యటించినపుడు 2012లో మోదీకి మొదటిసారి జయశంకర్‌తో పరిచయమైంది. 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికా నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రావడం అదే ప్రథమం. ఆ సమయానికి జయశంకర్‌ అమెరికా రాయబారిగా ఉన్నారు. అదే నెలలో ఉద్యోగ విరమణ పొందుతారనగా నాటి విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్‌ను తప్పించి జయశంకర్‌ను ఆ స్థానంలో నియమించింది మోదీ ప్రభుత్వం. మొదటిసారి ప్రధాని అయిన మోదీ... విదేశాంగ విధానానికి సంబంధించి జయ శంకర్‌పైన ఎక్కువగా ఆధారపడేవారు. మంత్రిగా సుష్మా స్వరాజ్‌ ఉన్నప్పటికీ విదేశీ వ్యవహారాల్లో మోదీ ప్రభుత్వానికి కళ్లూ, చెవులూ జయశంకరే అన్నట్టు ఉండేవారు. నేపాల్‌లో 2015లో భూకంపం వచ్చినపుడు ఆ దేశంలో భారత్‌ సహాయ కార్యక్రమాల్ని నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. 2017లో 73 రోజులపాటు కొనసాగిన చైనా, భారత్‌ సరిహద్దులోని డోక్లామ్‌ వివాదాన్ని పరిష్కరించడంలోనూ కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్న విజయ్‌ గోఖలే అప్పుడు చైనా రాయబారిగా ఉండేవారు. ఇద్దరూ కలిసి అన్ని దారుల్లో ప్రయత్నించి సమస్యని పరిష్కరించారు. ‘న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌’లో సభ్యత్వ యత్నం, జపాన్‌తో అణు చర్చలు, చైనా ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌’కి దూరంగా ఉండటం, పశ్చిమాసియా దేశాలకు చేరువ కావడం... మొదలైన అంశాల్లో ప్రభుత్వానికి దిశానిర్దేశం చేశారు జయశంకర్‌. తాను వెళ్లే ప్రతి విదేశీ పర్యటనలోనూ వెంట ఉండాలని జయశంకర్‌కు సూచించేవారు మోదీ. 2017లో జయశంకర్‌కు నిర్ణీత  పదవీ కాలం పూర్తయినప్పటికీ ఆయన పనితనంపైన ఉన్న విశ్వాసంతో మరో ఏడాది పొడిగించారు. గత నాలుగు దశాబ్దాల్లో అత్యధిక కాలం విదేశాంగ కార్యదర్శిగా ఉన్నది కూడా జయశంకరే. మోదీ విదేశాంగ విధాన రూపకర్త ఆయనే నంటారు. చురుకైన నిర్ణయాలూ, పదునైన వ్యూహాలూ, పారదర్శక ఆలోచనలూ చేయగల సమర్థుడిగా జయశంకర్‌కు పేరు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో ఆయనకు బాగా తెలుసు... అందుకే  క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని గట్టెక్కించే దౌత్యవేత్తగా పేరు సంపాదించుకున్నారు.

అనుకోకుండా మంత్రి...
2018 జనవరిలో విదేశాంగ కార్యదర్శిగా రిటైరయ్యాక టాటా గ్రూప్‌లో ‘గ్లోబల్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ ప్రెసిడెంట్‌’గా కొత్త కెరీర్‌ను ప్రారంభించారు జయశంకర్‌. అయితే సుష్మాస్వరాజ్‌ రాజకీయాల్లో కొనసాగనని చెప్పడంతో అనూహ్యంగా విదేశాంగ శాఖ మంత్రి అయ్యే అవకాశం జయశంకర్‌ను వరించింది. ‘మంత్రిని అవుతానని నేను కలలో కూడా అనుకోలేదు’ మంత్రి అయ్యాక సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జయశంకర్‌... అన్న మాటలివి. నిజానికి ఆ కార్యక్రమం నిర్వాహక కమిటీ సభ్యుల్లో జయశంకర్‌ కూడా ఉన్నారు. ‘సమావేశం కోసం ఏ మంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలా అన్న ఆలోచనతో ఉండేవాణ్ని. ఈరోజు నేనే అతిథిగా వచ్చాను’ అని చెప్పుకొచ్చారు. భారత్‌కు దక్షిణాసియా ముఖ్యమని చెబుతూనే పాక్‌ను ఏకాకిని చేస్తూ   సార్క్‌ని కాదని బిమ్‌స్టెక్‌ దేశాలకు  ప్రాధాన్యం ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. విదేశాంగ శాఖకు ఆర్ధిక, వాణిజ్య మంత్రిత్వ శాఖలతో మరింత ఎక్కువ సమన్వయం ఉండాలని చెప్పిన జయశంకర్‌... తాను బాధ్యతలు చేపట్టిన మొదటి వారంలోనే ఆ శాఖల మంత్రులతో చర్చలు మొదలుపెట్టినట్లు చెబుతారు. విస్తీర్ణం పరంగా చిన్నదే అయినా ప్రాధాన్యం పరంగా కీలకమైన సరిహద్దు దేశం భూటాన్‌తో మంత్రిగా తన విదేశీ పర్యటనల్ని మొదలుపెట్టారు. ‘ఆర్ధిక, రాజకీయ అంశాల మధ్య గీత మాయమైపోతోందనీ దేశ రక్షణ చుట్టూనే మిగతావన్నీ తిరుగుతున్నాయనీ ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి’ అని చెప్పే జయశంకర్‌... ప్రపంచంలో భారతీయులు ఎక్కడ కష్టంలో ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా సుష్మ వారికి భరోసా ఇచ్చి ఆదుకునేవారంటూ... ఈ అంశంలో తానుకూడా ఆమె అడుగుజాడల్లో నడుస్తాననీ హామీ ఇస్తున్నారు.


ఇంకొంత...

సోదరులు సంజయ్‌ సుబ్రహ్మణ్యం చరిత్రకారుడు, విజయ్‌కుమార్‌ ఐఏఎస్‌.
* జపాన్‌ మూలాలున్న క్యోకో సుమేకవాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు... మేధ, ధృవ్‌, అర్జున్‌. ధృవ్‌ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు.
* మాతృభాష అయిన తమిళంతోపాటు హిందీ, ఇంగ్లిష్‌, రష్యన్‌, మాండరిన్‌, జపనీస్‌, హంగేరియన్‌ భాషల్ని మాట్లాడగలరు. కికెట్‌ అభిమాని.
* 2019లో ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్నారు.
* జేఎన్‌యూ మొదటిసారి విశిష్ట పూర్వ విద్యార్థుల్ని ప్రకటించి అందులో శయశంకర్‌, నిర్మలా సీతారామన్‌లకు చోటిచ్చింది.

23  జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.