close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తేజస్‌తో తలెత్తుకున్నాం..!

‘ఆకాశానికి నిచ్చెనవేయడం ఎంత సాధ్యమో భారతదేశం సొంతంగా ఓ యుద్ధ విమానాన్ని తయారుచేయడం కూడా అంతే సాధ్యం!’ అంటూ వెక్కిరించాయి ప్రపంచ దేశాలు. వాటిని పట్టించుకోకుండా ఆయన తన ప్రాజెక్టుని చేసుకుంటూ పోతే ‘డబ్బు వృధా... దీన్ని ఆపాల్సిందే!’ అన్నారు నాటి ప్రభుత్వ పెద్దలు. ఇలాంటివెన్నో ప్రతికూలతల నడుమ పట్టుబట్టి మరీ ‘తేజస్‌’ని రూపొందించారు తెలుగు శాస్త్రవేత్త కోట హరినారాయణ. ఆ విమానంతో మనదేశం సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఆయన జీవన ప్రస్థానం...
తేజస్‌... ఓ తేలికరకం యుద్ధ విమానం. ‘ఈ తరహావాటిల్లో ప్రపంచంలో ఇదే మేటి’ అంటున్నాయి అమెరికా వంటి దేశాలు. సాంకేతికతలో అద్భుతాలు సృష్టిస్తున్న ఇజ్రాయెల్‌ కూడా దీని టెక్నాలజీ తమకి కావాలని కబురంపింది. మలేషియా, సౌదీ అరేబియా వంటి దేశాలూ దీన్ని మన దగ్గర్నుంచి దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అలా తేజస్‌ ద్వారా,  యుద్ధ విమానాలని దిగుమతి చేసుకునే స్థితి నుంచి ఎగుమతి చేయగల స్థాయికి భారత్‌ ఎదిగింది! గత ఫిబ్రవరిలోనే తేజస్‌ని పూర్తిగా సైనిక వినియోగంలోకి తీసుకోబోతున్నట్టు భారత వైమానిక దళం ప్రకటించింది. దాన్ని తయారుచేసిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) సంస్థకి దశలవారీగా దాదాపు రెండొందల విమానాలకు- అంటే లక్ష కోట్ల రూపాయలగ్గాను ఆర్డర్‌ ఇచ్చింది. నా వరకు తేజస్‌ పనితీరుని అందరూ పొగుడుతూ ఉంటే... నేను కన్నబిడ్డని అందరూ మెచ్చుకుంటున్నంతగా సంబరపడిపోతున్నా. కాకపోతే, ఈ బిడ్డకోసం నేను పడ్డ పురిటినొప్పులు చిన్నవేమీ కాదు. నెలలు కాదు... దాదాపు రెండు దశాబ్దాల నొప్పులవి!

ఆ యుద్ధాలే కారణం...
ఒడిశాలోని బరంపురానికి చెందిన తెలుగు కుటుంబం మాది. నాన్న సారథీ చౌదరి ఓ చిన్న కిరాణాకొట్టులో పనిచేసేవాడు. తన తండ్రితో కలిసి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న అనుభవమూ ఉంది. అమ్మ పేరు ముత్యం. ఇంట్లో ఐదుగురం పిల్లలం. నేను నడిపివాణ్ణి. చదువులో ముందు నుంచీ టాపర్‌ని. ఇంటర్మీడియెట్‌ అయ్యాక కటక్‌లోని ఓ కాలేజీలో ఎంబీబీఎస్‌, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌లో సీట్లొచ్చాయి. బెనారస్‌ విశ్వవిద్యాలయం స్వాతంత్య్ర సమరంలో కీలకపాత్ర పోషించిన సంస్థ కాబట్టి నాన్న అక్కడికే వెళ్లమన్నారు. పెద్ద చదువులు చెప్పించే స్థోమత తనకు లేకున్నా... ఎంతో ప్రయాసతో ఇంజినీరింగ్‌లో చేర్పించారు. అలా కాశీలో అడుగుపెట్టాను. బెనారస్‌ విశ్వవిద్యాలయంలో అడుగడుగునా దేశభక్తి భావన ప్రతిధ్వనిస్తుండేది అప్పట్లో! అది ఆత్మాభిమానం అనండీ, మన సంస్కృతిపైన గౌరవం అనండీ... మనదేశం మరేదేశానికీ ఎందులోనూ తక్కువకాదనే భావం నాలో ఏర్పడింది అక్కడే. 1962లో నేను ఇంజినీరింగ్‌ రెండో ఏడాది చదువుతున్నప్పుడు చైనా మనపైన యుద్ధానికి దూకింది. అప్పుడప్పుడే స్వతంత్ర రాజ్యంగా తొలి అడుగులు వేస్తున్న పసికూనలాంటి మనదేశం... అతిపాత యుద్ధవిమానాలతో రణరంగంలోకి దిగి తీవ్రంగా నష్టపోయింది. ఇది పోరాడి ఓడిన యుద్ధం కాదనీ ఓటమి తప్పదని తెలిసీ చేసిన ఆత్మాహుతిలాంటిదనీ అర్థమై... మాలాంటి యువకులమంతా ఆవేశంతో రగిలిపోయాం. మూడేళ్ల తర్వాత... మన దేశం పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈసారి కాస్త ఫర్వాలేదు... ఇంగ్లండు అందించిన నాట్‌-ఎంకే1 విమానాలు మనకున్నాయి. కానీ పాకిస్థాన్‌ దగ్గర అంతకన్నా అధునాతనమైన అమెరికాలో తయారైన ఎఫ్‌-86 విమానాలుండేవి. అయినా, మన చిన్న విమానాలతోనే వాటిని మట్టికరిపించాం! ఆ విజయంతో సంబరపడటమే కాదు, నా దృష్టిని యుద్ధవిమానాలవైపు మళ్లించాను. అప్పటిదాకా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్న నేను... విమానాల తయారీకి సంబంధించిన ఏవియానిక్స్‌ వైపు వెళ్లాలనుకున్నాను. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌(ఐఐఎస్‌సీ)లో ఎయిరో ఇంజినీరింగ్‌ పీజీ కోర్సులో చేరాను.

నా తర్వాతే ‘నాసా’!
ఐఐఎస్‌సీలో చేరానేగానీ... తొలి ఆరునెలలూ ఎందుకిలా వచ్చానబ్బా అనుకుని తెగబాధపడిపోయాను. అక్కడి బోధనా వాతావరణం చాలా కఠినంగా ఉండేది. వారంలో ఎప్పుడైనా సరే... ఉన్నపళంగా పరీక్షలు పెట్టేవారు. అకస్మాత్తుగా పిలిచి, నిపుణుల ముందు నిలబెట్టి... వై-వా పరీక్ష అనేవారు. ఆ ప్రశ్నలవీ విని నా గుండెలు జారిపోయేవి. కానీ, మెల్లగా పుంజుకున్నాను. లెక్కల్లో తిరుగులేదనిపించుకున్నాను. నా కోర్సు పూర్తికాగానే హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ సంస్థలో ‘ఫ్లైట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌’గా 1967లో అడుగుపెట్టాను. మూడేళ్ల తర్వాత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)లో చేరాను. ఆ సంస్థ తరపున నాసిక్‌లోని ఎయిర్‌బేస్‌కి రెసిడెంట్‌ ఇంజినీర్‌గా వెళ్లాను. అప్పట్లో మనదగ్గర రష్యా అందించిన మిగ్‌-21 విమానాలుండేవి. ఆ దేశం మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా యాభై దేశాలకి వాటిని సరఫరా చేస్తుండేది. ఎవరికివాళ్లు తమ అవసరాలకి తగ్గట్టు వాటిల్లో చిన్నచిన్న మార్పులు చేసుకుంటూ ఉండేవారు. అంతేతప్ప... మొత్తం డిజైన్‌ని మార్చేవారు కాదు! ముఖ్యంగా విమానం భద్రతలో కీలకమైన రెక్కలూ, ముందువైపు భాగాలని తాకే సాహసం ఎవ్వరూ చేసేవారు కాదు. నేను అది చేయాలనుకున్నాను! మిగ్‌-21 ముందు భాగాన్ని కాస్త మార్చి ‘వొర్టెక్స్‌ ప్లేట్‌’ అనే పరికరాన్ని పెట్టి... దాని పనితీరుని పెంచాను. అప్పటిదాకా నాసా కూడా ఆ పనిచేయలేకపోయింది. మేం చేసిన నాలుగేళ్ల తర్వాత అమెరికాకి చెందిన ఎఫ్‌-16 విమానం డిజైన్‌ని మార్చినట్టు ఆ సంస్థ ప్రపంచానికి ఘనంగా చాటుకుంది!

తేజస్‌కి బీజం...
తేజస్‌కి ముందు హెచ్‌ఎఫ్‌-26 మారుత్‌, హెచ్‌జేటీ-60 వంటి యుద్ధవిమానాలు మనదేశంలో తయారైనా అవన్నీ విదేశీ సహకారంతో రూపుదిద్దుకున్నవే. వాటిలా కాకుండామనదైన టెక్నాలజీతో మిగ్‌-21కి ప్రత్యామ్నాయంగా, తేలికపాటి యుద్ధవిమానాన్ని (ఎల్‌సీఏ) తయారుచేయాలనే ఆలోచన ప్రభుత్వానికి 1965 నుంచే ఉంది. 1984లో ఆ ప్రతిపాదనకి ఓ స్పష్టత వచ్చింది. ఈ ప్రయోగం కోసం హెచ్‌ఏఎల్‌కి అనుబంధంగా ‘ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ’(అడా)ని ఏర్పాటుచేశారు. దానికి నన్ను డైరెక్టర్‌గా నియమించారు. ఎల్‌సీఏ తయారీ క్రతువులో ఓ కొత్త ఒరవడికి నాందిపలికాను. నేను ఇదివరకు మిగ్‌-21లో మార్పుచేర్పులు చేస్తున్నప్పుడు అందుక్కావాల్సిన పరికరాలని స్థానికంగా ఉండే చిన్నతరహా పరిశ్రమలకి ఇచ్చి చేయిస్తుండేవాణ్ణి. వాళ్లు నేను అడిగినట్టు అలవోకగా చేసిచ్చేవారు. మనదేశంలో ప్రతిభకీ, సాంకేతిక నైపుణ్యానికీ కొదవలేదనే విషయం నాకు అప్పుడే అర్థమైంది. అందుకే, తేజస్‌ తయారీ ప్రక్రియలోకి వాళ్లనీ తేవాలనుకున్నాను. వాళ్లతోపాటూ అప్పటిదాకా యుద్ధవిమానాల తయారీలో పాలుపంచుకోని పలు విద్యా, పరిశోధనా కేంద్రాల్నీ ఆహ్వానించాను. అలా వందసంస్థలూ... వాటిలోని మూడువందలమంది నిపుణుల్ని భాగస్వాముల్ని చేసుకున్నాను. విదేశాలకి చెందిన కొన్ని సంస్థలు కూడా స్వచ్ఛందంగా మాకు సహకరిస్తామంటే కొన్ని పనులు అప్పగించాం. సగం ఏరు దాటాం అనుకుంటుండగా రెండు బలమైన అవరోధాలొచ్చాయి.

లాబీయింగ్‌ ఆస్థాయిలో...
‘తేజస్‌’కి బడ్జెట్‌ సుమారు మూడున్నరవేల కోట్ల రూపాయలవుతోందనీ అంతకన్నా విదేశాల నుంచి యుద్ధవిమానాలని కొనడం లాభదాయకమనే ప్రచారం మొదలైంది. ముఖ్యంగా విదేశీ విమానాల కొనుగోళ్లకి ఇక్కడ దళారులుగా ఉన్న రాజకీయనాయకులు ఈ వాదనని బలంగా వినిపించారు. ప్రధానిస్థాయిలో మా ప్రాజెక్టుకి ఒప్పుదల ఉన్నా... రాజకీయ ఒత్తిళ్లు బలంగా పనిచేశాయి. అసలు మా ప్రాజెక్టు కొనసాగించాలా వద్దా అనే అంశంపైన సమీక్షా కమిటీని వేసింది కేంద్రప్రభుత్వం. అందులో రతన్‌టాటా, రాహుల్‌ బజాజ్‌ వంటివాళ్లతోపాటూ పలువురు నిపుణులూ సభ్యులుగా ఉన్నారు. ఆ కమిటీ తన నివేదిక ఇవ్వడానికి ముందు నాటి రక్షణమంత్రి శరద్‌పవార్‌ ఓ మీటింగ్‌ ఏర్పాటుచేశారు. మొదట రతన్‌టాటా మాట్లాడుతూ ‘ఈ ప్రాజెక్టుని ఆపడంకన్నా సిగ్గుచేటు ఇంకొకటి లేదు. యుద్ధవిమానాలని ప్రయివేటు వాళ్లు తయారుచేయకూడదనే నిబంధనకానీ మనదేశంలో లేకుంటే... ఈ ప్రాజెక్టుని మా టాటా సంస్థే తీసుకునేది!’ అన్నారు. ఆ సమావేశంలో పాల్గొన్న 99శాతం మంది నిపుణుల మాట అదే. దాంతో ప్రభుత్వ పెద్దలు దిగిరాక తప్పలేదు. మూడేళ్ల తర్వాత మరో ఉపద్రవం వచ్చిపడింది. పోఖ్రాన్‌ అణుపరీక్షల దరిమిలా అమెరికా విధించిన నిషేధాల కారణంగా... అప్పటిదాకా మాతో పనిచేస్తూ వచ్చిన విదేశీ కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. దాంతో ఆ పనుల్ని మళ్లీ ‘సున్నా’స్థాయి నుంచి ప్రారంభించి పూర్తిచేశాం. ఇన్ని సవాళ్ల మధ్యే విమాన నమూనాని తయారుచేశాం. నాటి ప్రధాని వాజ్‌పేయీ దానికి ‘తేజస్‌’ అని పేరుపెట్టారు. ఇంత చేసినా దాని వేగాన్ని పరీక్షించాలంటే మళ్లీ రష్యాకో, జర్మనీకో వెళ్లాలి. అప్పట్లో అది సాధ్యంకాదు. అందుకని... మనదేశంలోనే ఓ పెద్ద టన్నెల్‌ తవ్వి అందులో దాని వేగాన్ని పరీక్షించే వసతులు ఏర్పాటుచేశాం. అలా ఎన్నో సవాళ్ల తర్వాత 2001 జనవరిలో తేజస్‌ నమూనా విమానాన్ని బెంగళూరు నుంచి నింగిలోకి పంపాం! ఆ కార్యక్రమానికి హాజరైన నాటి రక్షణమంత్రి జార్జిఫెర్నాండెజ్‌ వెళ్తూ వెళ్తూ నా చేతిలో ఓ కవర్‌పెట్టారు. అదో నివేదిక. అమెరికా నుంచి వచ్చింది. ‘భారతదేశం చేపడుతున్న తేజస్‌ ఓ వృధా ప్రయత్నం. మా కంపెనీల సహకారం లేకుండా దాన్ని ఎప్పటికీ పూర్తిచేయలేదు!’ అన్నది దాని సారాంశం. తేజస్‌ ప్రయోగానికి నాలుగురోజుల ముందు అగ్రరాజ్యం వెలువరించిన నివేదిక అది. దాన్ని చదివి నవ్వుకున్నాను!

‘కొంపముంచావయ్యా!’
విదేశీ విమానాలతో పోలిస్తే తక్కువ   ఖర్చుతో మేం తేజస్‌ని రూపొందించాం. వైమానిక దళం వీటికోసం 45 స్క్వాడ్రన్‌ (ఫ్లైయింగ్‌ డాగర్స్‌) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. గత 18 ఏళ్ల కాలంలో వాళ్లు మొత్తం మూడువేలసార్లు వాటిని నడిపినా... ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. ప్రపంచంలో మరే యుద్ధవిమానమూ సాధించలేని ఘనత అది. ఈ విమానం తయారీకి మేం అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ని జర్మనీ వైమానిక దళం ఎయిర్‌బస్‌ కూడా కొనుగోలు చేసిందంటే... మన ప్రమాణాలు ఎంత ఉన్నతమైనవో ఆలోచించుకోండి. అంతేకాదు, నమూనా స్థాయిలోనే అంతర్జాతీయ ఎయిర్‌షోల్లో  పాల్గొన్న ఘనత కూడా తేజస్‌దే. అలా తొలిసారి ఎయిర్‌షోలో పాల్గొన్నప్పుడు నా పక్కన విమాన కొనుగోళ్ల దళారీ సంస్థకి చెందిన ప్రతినిధి ఒకాయన కూర్చున్నాడు. తేజస్‌ ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేయడం చూస్తూ ఉన్న ఆయన నా వైపు తిరిగి ‘కొంపముంచావుకదయ్యా! తేజస్‌తో మా రెండొందల విమానాల వ్యాపారం పోగొట్టావు!’ అన్నాడు. ‘అవునండీ... ఆ మేరకు మా దేశం సొమ్ముని ఆదా చేయగలిగాను!’ అనుకున్నాన్నేను ఆనందంగా.

బుల్లి విమానాలతో బిజీ!

తేజస్‌ సృష్టికర్తగా నాకు కేంద్రప్రభుత్వం 2002లో పద్మశ్రీ పురస్కారం అందించింది. ఆ తర్వాతి ఏడాది రిటైరయ్యాక, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో వైస్‌ఛాన్సలర్‌గా పనిచేశాను. అప్పట్లో నాకొచ్చిన లక్ష రూపాయల మరో అవార్డు డబ్బుతో మారుమూల గ్రామాల్లో విద్యాభ్యాసాన్ని పెంచాలనే లక్ష్యంతో వికసిత్‌ భారత్‌ ఫౌండేషన్‌ను స్థాపించాను. నగరంలో కాకుండా ఇబ్రహీంపట్నం దగ్గర మాంచాల్‌ అనే మారుమూల పల్లెలో దాని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసి... సేవలందించడం మొదలుపెట్టాం. మొన్న జూన్‌ 23తో నాకు 75 ఏళ్లు నిండాయి. ఖాళీగా కూర్చోవడం ఇబ్బందిగా అనిపించి... రెండేళ్లకిందట బెంగళూరు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లోనూ ప్రొఫెసర్లూ, విద్యార్థులతో కలిసి ఓ స్టార్టప్‌ పెట్టాను. ఏరోనాటిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే ఈ సంస్థ ద్వారా అత్యవసర వైద్య చికిత్సకీ, చిన్నపాటి రవాణాకీ ఉపయోగపడే అతిచిన్న విమానాలని తయారుచేసే పనిలో ఉన్నాను!
- ముకుంద, ఈనాడు డిజిటల్‌, బెంగళూరు
ఫొటోలు: సీఎన్‌ రావు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.