close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎంత నిద్ర చెడితే... అంత మంచి పాత్రలన్నట్టు!

‘అందం ఉంటే చాలదు, నటన వస్తేనే సరిపోదు. మంచి పాత్రలు రావాలి. అప్పుడే కథానాయికలు కాస్తా స్టార్లవుతారు’ ఈమధ్య ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమంతని ఉద్దేశించి అన్నమాటలివి. సమంత ఎప్పుడో స్టార్‌ అయిపోయింది. కానీ... ఆమెకు గొప్ప పాత్రలు ఇప్పుడే ఎదురవుతున్నాయి, కాదుకాదు మంచి మంచి పాత్రలకు తానే ఎదురెళుతోంది. విభిన్నమైన పాత్రలని ఎంచుకుని విజయాల్ని అందుకుంటోంది. కెరీర్‌లో మాంచి దూకుడుమీదున్న సమంతని ‘మీకు బాగా నచ్చిన మీ పాత్రలేంటి?’ అని అడిగితే - ఒక్కోదాని గురించీ ఇలా చెప్పుకొచ్చింది.

సినిమా : ఏమాయ చేసావె
పాత్ర : జెస్సీ

ఏమిటి స్పెషల్‌ : జెస్సీకి తనకంటే రెండేళ్లు చిన్నవాడైన, తన మతానికి చెందనివాడైన కార్తిక్‌పైన ఇష్టం ఉంటుంది. ఇంట్లోవాళ్ల వ్యతిరేకతని దాటుకుని పెళ్లి చేసుకోలేనంత పిరికిదేమీ కాదు కానీ... ఆ తర్వాత తన భవిష్యత్తు ఏమిటనే సందిగ్ధం తనది. ఆ అస్పష్టత తన వ్యక్తిత్వంలోని లోపం. అదే జెస్సీని పక్కింటమ్మాయంత సహజంగా మనముందు నిలబెడుతుంది. హీరోతో ఆడిపాడే మామూలు కథానాయికలా కాకుండా ఆ అమ్మాయిలోని సంక్లిష్టతని చూపించాలన్నదే నాకున్న అసలైన ఛాలెంజ్‌.
తమిళంలో త్రిష చేస్తున్న పాత్రని, అప్పుడే సినిమాల్లోకి అడుగుపెట్టిన నా చేత చేయించడమే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. భయం వేసింది. తొలి చిత్రంతోనే అలాంటి పాత్ర దక్కడం నా అదృష్టం అని ఇప్పుడు అనిపిస్తోంది కానీ... షూటింగ్‌ అప్పుడు మాత్రం చాలా ఆందోళనగా ఫీలయ్యాను. కానీ పోనుపోను నాకు తెలియకుండానే జెస్సీలో పరకాయ ప్రవేశం చేయడం మొదలుపెట్టాను. ఇంటికెళ్లి ఏ పనిచేస్తున్నా కూడా ‘జెస్సీ అయితే ఈ సందర్భంలో ఎలా ఉంటుంది? ఎలా నవ్వుతుంది? ఎలా చూస్తుంది?’ అని ఆలోచించేదాన్ని. హీరోకి తన ప్రేమని చెప్పకనే చెబుతున్నప్పుడూ, తెలిసితెలిసీ అతణ్ణి బాధపెడుతున్నప్పుడూ ఓ నటిగా కాకుండా...
ఓ మామూలు అమ్మాయిలాగే ప్రవర్తించాలనుకున్నాను. ఒకస్థాయిలో నేను తనలాగే మారిపోయాను. అంతగా మనసుపెట్టి చేయగలిగాను కాబట్టే... ఆ పాత్ర ఇప్పటికీ అందరి మెప్పూ అందుకుంటోంది. ఆ జెస్సీ వల్లే నేను పరిశ్రమలో నిలబడగలిగాను. చైతూకి అది రెండో సినిమా. ఓ విధంగా తనకీ కొత్త సినిమానే. తనని తాను నిరూపించుకోవాలనే కసి ఉన్నా కూల్‌గానే కనిపించేవాడు. నేను సెట్లో కంగారుపడుతూ ఉంటే ‘ఆందోళనపడకు... అంతా మంచే జరుగుతుంది!’ అంటూ ధైర్యం చెప్పేవాడు. బహుశా చైతూపై నాలో ఫస్ట్‌ ఇంప్రెషన్‌ అప్పుడే పడిందేమో..?

సినిమా : రంగస్థలం
పాత్ర : రామలక్ష్మి

ఏమిటి స్పెషల్‌ : చెవిటివాడు, మొరటువాడైన చిట్టిబాబుని ప్రేమించి తల్లిదండ్రులని ఎదిరించి మరీ పెళ్లాడే ఫక్తు పల్లెటూరి అమ్మాయి రామలక్ష్మి. మొదట్లో అతని అమాయకత్వానికి నవ్వుకుంటూ ఉండే రామలక్ష్మి తర్వాతి భాగంలో హీరో ప్రతీకారంతో రగిలిపోతుంటే అతనికి తోడునిలుస్తుంది. హత్యలోనూ సహకరిస్తుంది! అప్పటిదాకా మోడర్న్‌ అమ్మాయి పాత్రలే చేసిన నేను పల్లెటూరమ్మాయిగా నటించి మెప్పించాలన్నదే ఇందులో నాకున్న పెద్ద సవాలు.
నాకు నచ్చిన మిగతా పాత్రలతో పోలిస్తే పెద్దగా సంఘర్షణలూ, వ్యక్తిత్వపరంగా పెద్దగా లేయర్‌లేవీ లేని పాత్ర ఇది! కానీ దాన్ని చేసేందుకు నేను పడ్డ శ్రమా, ఆ సినిమాకు దక్కిన విజయాలే ‘రామలక్ష్మి’ని నేనెంతో సంతృప్తిగా తలచుకునేలా చేశాయి. నేను అంత మాస్‌గా కూడా నటించగలనని తెలుసుకున్నదీ అప్పుడే. నగరంలో పుట్టి పెరిగిన నాకు గోదావరి జిల్లా అమ్మాయిల హావభావాలు చూపించడం అంత సులభం కాదేమో అనిపించింది. అందుకనే షూటింగ్‌ కోసం రాజమండ్రి వెళ్లినప్పుడు అక్కడి అమ్మాయిలని పిలిపించుకుని వాళ్లతో మాట్లాడటం మొదలుపెట్టాను. వాళ్ల వేషభాషల్ని క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించాను. మామూలుగా మనమంతా పల్లెటూరి అమ్మాయిలంటే ఏమీ తెలియనివాళ్లని చిన్నచూపు చూస్తుంటాం కదా! తొందరగా పెళ్లి చేసుకుంటారనీ, స్వతంత్రంగా ఉండలేరనీ అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్లు చాలా ధైర్యవంతులనే నిజం అప్పుడే నాకు అర్థమైంది. ఇంకొకటి, రామలక్ష్మి పాత్రకి నల్లగా కనిపించాలని చెప్పారు. మామూలుగానే నేను కాస్త చామనఛాయలో ఉంటాను... ఇంకాస్త నల్లబడాలని ఎండలో నిల్చునేదాన్ని. సినిమా విడుదలయ్యాక రామలక్ష్మి పాత్రకి వచ్చిన ప్రశంసల్ని పక్కనపెడితే ‘పెళ్లయ్యాక ముద్దు సన్నివేశాల్లో నటించొచ్చా?’ అని నోళ్లు నొక్కుకున్నారు చాలామంది. నిజానికి, అది ముద్దుకాదు... కెమెరా ట్రిక్‌ అన్నది వేరే విషయం. అయినా ‘పెళ్లయ్యాక హీరోలు ముద్దు సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు కథానాయికలు నటించకూడదా... ఏమిటీ!?’ అన్నదే నా ప్రశ్న.

సినిమా : సూపర్‌ డీలక్స్‌(తమిళం)
పాత్ర : వేంబు

ఏమిటి స్పెషల్‌ : పెళ్లై ఆరునెలలే అవుతున్న వేంబు... భర్తలేనప్పుడు తను ఇదివరకు ప్రేమించినవాడితో గడుపుతుంది. కలయిక సమయంలోనే అతను చనిపోతాడు. ఇంతలో భర్త రానేవస్తాడు. ఏం జరిగిందో అతనికి నిజాయతీగా చెబుతుంది. ‘ముందు ఈ శవాన్ని వదిలించుకుని... విడాకులు తీసుకుందాం!’ అనుకుని ఆ పనిలో పడతారు ఇద్దరూ. ఇదంతా గమనించిన ఓ పోలీసు వీళ్లని బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. ‘నువ్వెలాగూ చెడిపోయిందానివి కాబట్టి నాతోనూ గడుపు!’ అని వేంబుని బెదిరిస్తాడు. ఇందులో వేంబు పాత్ర చేసింది చెడే అయినా... ప్రేక్షకులకి ఆమెపైన ఏమాత్రం చులకనభావం రానీయకుండా నటన ఉండాలి!’ అన్నదే నాకు నేను పెట్టుకున్న నియమం. అసలు చెడు అనే పదానికీ, అనైతికత అనే భావనకీ జీవితంలో అర్థం ఉందా అని ప్రశ్నించే సినిమా ఇది. ఈ సినిమా దర్శకుడు కుమారరాజా ఏడేళ్లకిందట ‘అరణ్యకాండం’ అనే జాతీయ అవార్డు సినిమా తీసినవాడు. ‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రంలో వేంబు పాత్ర కోసం ఇండస్ట్రీలో ‘వీళ్లు చాలా బోల్డ్‌’ అని పేరుతెచ్చుకున్న చాలామంది హీరోయిన్‌లకి కథ వినిపించాడట. అందరూ భయపడి పారిపోవడంతో నాకోసం హైదరాబాద్‌ వచ్చాడు. కథ విని రెండ్రోజుల్లో నిర్ణయం చెబుతానన్నాను. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదు. ఇంత సవాలుతో కూడిన పాత్రని వదులుకుంటే మళ్లీ దక్కదనిపించింది. కానీ ఎలా...? దానికి న్యాయం చేయగలనా అనే భయం పీడించింది. తర్వాతి రోజు జిమ్‌ చేస్తుండగా చైతూతో ‘సూపర్‌ డీలక్స్‌’లో కథానాయిక పాత్ర గురించి చెప్పాను. ఆసక్తిగా విని, ‘సూపర్‌ క్యారెక్టర్‌ కదా?’ అన్నాడు. ఆ తర్వాత ‘ఈ పాత్ర నేనే చేయాలనుకుంటున్నా!’ అని బాంబు పేల్చాను. తను షాకయ్యాడు. ‘ఏంటీ... ఈ పాత్ర నువ్వు చేస్తున్నావా’ అని పదే పదే అడిగాడు. చివరికి ‘ఆల్‌ ది బెస్ట్‌’ అన్నాడు. సినిమా షూటింగ్‌కి ముందు మూడు రోజులు నేను అస్సలు నిద్ర పోలేదు. కేవలం ఆ పాత్ర గురించే ఆలోచిస్తూ ఉన్నా. అప్పుడే తొలిసారి సెట్స్‌లోకి వెళ్తున్నంత భయంగా అనిపించింది. ఆ సినిమా విడుదలైన తరవాత రివ్యూలు చూసుకుని ఎంత మురిసిపోయానో. నాకు దొరికిన బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌లో సగం.. ఆ సినిమా కోసం వచ్చినవేనంటే నమ్మండి! షూటింగ్‌కి ముందు భయాందోళనలతో ఎంతగా నా నిద్ర చెడితే అది అంత మంచిపాత్రన్నట్టని ఈ సినిమాతోనే అర్థమైంది.

చిత్రం : ఓ బేబీ.
పాత్ర : బేబీ

ఏమిటి స్పెషల్‌ : శారీరకంగా ఇరవై ఏళ్ల అమ్మాయిగా మారిన... డెభ్భైఏళ్ల బామ్మ పాత్ర! వయసు తగ్గిన ఉత్సాహంతోపాటూ జీవితానుభవం ఇచ్చిన గాంభీర్యాన్నీ ఆ పాత్ర చూపించాలి. తన మనవడికంటే కొద్దిగా ఎక్కువ వయసున్న కుర్రాడొకడు ప్రేమిస్తున్నానని వెంటపడితే ఏం చెప్పాలో పాలుపోక నిల్చోవాలి. పైగా... ఈ ఒక్క పాత్రే సినిమా మొత్తాన్ని తన భుజాలపైన మోసి నడిపించాలి.

చిన్నప్పుడు నేను అమ్మమ్మ, తాతయ్యలతో గడపలేదు. వృద్ధుల తీరు ఎలా ఉంటుందో... వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయో దగ్గరగా చూసిందాన్ని కాదు. అందుకే షూటింగ్‌కు ముందు ఓ వృద్ధాశ్రమానికి వెళ్లి చాలాసేపు గడిపి వచ్చాను. ఇంత హోమ్‌వర్క్‌ చేసినా రాజేంద్రప్రసాద్‌గారి లాంటి సీనియర్‌ నటుణ్ణి నా స్నేహితుడిగానూ, రావు రమేష్‌గారిని నా కొడుకుగానూ భావించి నటించాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిపడిపోయాను. ఎంత చేసినా సహజంగా అనిపించలేదు. ఓ దశలో ‘కాసేపు షూటింగ్‌ ఆపేద్దాం’ అని చెప్పి గంటసేపు ఆ సెట్లోనే పచార్లు చేశాను. చివరికి ఏదోలా ఆ షాట్‌ ఓకే చేయించుకోగలిగాను. ఈ సినిమా చేస్తున్నంతసేపూ మా అమ్మ మీద ప్రేమ పెరిగిపోయింది. అమ్మ నా కోసం ఇంత చేసిందంటే... ఆమె ఎంతగా తన యౌవనాన్నీ, ఆశల్నీ త్యాగం చేసి ఉంటుందో అనిపించి ఉద్వేగానికి గురయ్యాను. ఓరోజు ఉండబట్టలేక ‘అమ్మా... చిన్నప్పుడు నీకంటూ ఏమైనా ఆశలూ, ఆశయాలూ ఉండేవా? వాటిని మధ్యలోనే వదులుకోవాల్సివచ్చిందా?’ అని అడిగాను. ‘నువ్వు సంతోషంగా ఉండడం కంటే నాకు ఎలాంటి ఆశలూ ఆశయాలూ లేవు’ అంటూ నవ్వేసింది. అమ్మలంతా అంతేనేమో మరి!

చిత్రం : మజిలీ
పాత్ర : శ్రావణి

ఏమిటి స్పెషల్‌ : శ్రావణి చిన్నప్పటి నుంచీ ప్రేమించిన అబ్బాయి మరొకరి ప్రేమలో విఫలమై తాగుబోతుగా మారి, క్రికెట్‌ కెరీర్‌నీ పోగొట్టుకుంటాడు. ఆమెకి అతనితోనే పెళ్లవుతుంది. అతను భార్య సంపాదనతోనే బతుకీడుస్తాడు! భర్త పట్టించుకోకున్నా అతన్నే ప్రేమించే పాత్ర. మరో కోణంలో చూస్తే ఎంతో పరిణతి ఉన్న నేటితరం అమ్మాయి తను. ఆ రెండు వైరుధ్యాలనీ చూపడమే ఈ పాత్ర గొప్పతనం.

ఈ సినిమాలో నేను సెకండ్‌ హాఫ్‌లో కనిపించినా కథ మాత్రం నాచుట్టూనే తిరుగుతుంటుంది. సినిమా చూసి ‘చైతూని డామినేట్‌ చేసేశావ్‌’ అని చాలామంది కాంప్లిమెంట్లు ఇచ్చారు. అందులో నిజం లేదు. చైతూలోని అసలైన నటుడు ఈ సినిమాతోనే బయటకు వచ్చాడనిపించింది నాకు. ముఖ్యంగా-ఇద్దరి మధ్యా పండిన పతాక సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. నిజ జీవితంలో నేనూ, చైతూ అలా ఉండం. అలాంటి మేము... ఈ పాత్రల్ని సవాలుగా తీసుకున్నాం. ముందు ఈ కథ చైతూ దగ్గరకు వెళ్లింది. ‘శ్రావణి పాత్రకు సమంత అయితేనే బాగుంటుంది’ అని దర్శకుడు శివ నిర్వాణ పట్టుబట్టాడట. ‘నీకు నచ్చితేనే చెయ్‌. లేదంటే ఏదో ఒకటి చెబుదాంలే’ అని చై చెప్పాడు. కానీ కథ వినగానే నాకు చాలా నచ్చింది. మరోవైపు పెళ్లయ్యాక ఇద్దరం కలిసి చేస్తున్న తొలి సినిమా... ఆడకపోతేనో... అనే భయం కూడా వెన్నాడింది. చైతూతో మాత్రం ఇది తప్పకుండా హిట్టవుతుంది చూడు... అంటుండేదాన్ని. ‘మజిలీ’ విజయాన్ని పెళ్లయ్యాక మా ఇద్దరికీ అందిన తొలి బహుమతిగా భావిస్తున్నాను.

- మహమ్మద్‌ అన్వర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.