close

ఆ పాత నగరం ఆపాత రమ్యం

టైమ్‌ మెషీన్‌ని ఎవరో ఓ శతాబ్దం వెనక్కి తిప్పేశారేమో అనిపించిందీ అంటే అది కచ్చితంగా మలక్క నగరమే. పురాతన కాలంనాటి ఇళ్లూ భవనాలూ తమదైన మలయా భాషలో స్వచ్ఛంగా మాట్లాడుతూ సంస్కృతీసంప్రదాయాల్ని ప్రేమించే ప్రజలూ ఉన్న మలేషియాని చూడాలంటే యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించిన మలక్కలో తప్పక పర్యటించి తీరాల్సిందే అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన డా.పి.వి.రంగనాయకులు.

పచ్చని అడవులూ సుందర ప్రకృతి దృశ్యాలూ పరిశుభ్రమైన నగరాలూ క్రమశిక్షణతో మెలిగే ప్రజలూ సమర్థంగా పనిచేసే ప్రభుత్వమూ ఉన్న దేశమే మలేషియా. ఆ దేశంలోని ఆధునిక నగరాలైన కౌలాలంపూర్‌, పుత్రజయల్లో పర్యటించడం ఒకెత్తయితే, ఒకప్పటి రాజధాని నగరమైన మలక్కలో పర్యటించడం ఒక్కటీ మరోకెత్తు అనిపిస్తుంది. మలయా ద్వీపకల్పంలో కౌలాలంపూర్‌ రూపుదిద్దుకోకముందు మలేషియా రాజకీయ రాజధాని మలక్కానే. చేపలరేవుగా నౌకాశ్రయంగా దీనికి ఆరు శతాబ్దాల చరిత్ర ఉంది.

భిన్న సంస్కృతుల సీమలో..!
ఇండోచైనాగా పేరొందిన ఈ ఆగ్నేయాసియా ప్రాంతానికి రెండువేల సంవత్సరాలకు ముందే భారత్‌ నుంచి వ్యాపారులూ బౌద్ధభిక్షువులూ వెళ్లి వస్తుండే వారు. నిజానికి భారతసంతతే ఆయా ప్రాంతాలను పరిపాలించేది. తుమాసిక్‌(నేటి సింగపూర్‌) ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పరమేశ్వర 1400వ సంవత్సర ప్రాంతంలో జావా సామ్రాజ్య దాడితో మలక్క ప్రాంతానికి తప్పించుకొచ్చాడట. అప్పటికి అది ఓ చిన్న బెస్త గ్రామం. మలక్క కేంద్రంగా పరమేశ్వర మలయా రాజ్యాన్ని స్థాపించాడు. అదే మలేషియా.
అయితే మలక్క నగరం ఓ ఇరుకు జలసంధి దగ్గర ఉండడంతో భారత్‌ నుంచి చైనా వెళ్లడానికి దగ్గరి దారి ఇదే కావడంతో రద్దీ పెరిగింది. మలక్క నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఇండొనేషియా దేశానికి చెందిన సుమత్రాదీవి ఉంది. అక్కడికి వెళ్లాలంటే మలక్క గుండానే ప్రయాణించాలి.
సుదూరాలకు వెళ్లే నౌకలు మలక్కలో ఆగి సరుకులూ నీరూ నింపుకుని ప్రయాణం కొనసాగించేవి. అందువల్ల ప్రపంచ వాణిజ్యంలో ఈ రేవు ప్రాధాన్యం పెరిగింది. సుంకాలు బాగా వసూలయ్యేవి. దాంతో డచ్‌వారు ఈ మార్గంమీద కన్నేసి 1641లో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఆ తరవాత బ్రిటిష్‌వాళ్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ చరిత్ర అంతా అక్కడి భవనాల రూపంలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. అందుకే యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించింది.

జోంకర్‌ వీధిలో..!
మలక్క స్థాపకుడైన పరమేశ్వర తన ఆరోగ్యాన్ని కాపాడిన ఇస్లాం గురువు బోధనతో ఇస్లాం మతాన్ని తీసుకున్నాడు. ఆయన్నే అనుసరిస్తూ ప్రజలూ ఇస్లాం మతాన్ని స్వీకరించారు. తద్వారా మలేషియా ఇస్లాం ప్రధాన దేశంగా రూపుదిద్దుకొంది. తరవాత బ్రిటిష్‌వాళ్లు తెలుగు, తమిళ ప్రజలను అక్కడి రబ్బరు తోటల్లో పనిచేయడానికి తీసుకెళ్లారు. దాంతో అక్కడ భిన్న సంస్కృతులు కనిపిస్తుంటాయి. ఎవరి నమ్మకాల్ని వాళ్లు తు.చ. తప్పక పాటిస్తారు. ఇస్లాం దేశమే అయినప్పటికీ స్త్రీలు బురఖాలు ధరించరు. అయితే తలను పూర్తిగా కప్పి ఉంచే గుడ్డ కట్టుకుంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడతారు కానీ కొత్తవాళ్లు వాళ్లకి షేక్‌హ్యాండ్‌ ఇవ్వకూడదు. వాళ్ల వంక తేరిపార చూడకూడదు. ముందుగా మేం నగరంలోని చైనాటౌన్‌కి వెళ్లాం. అక్కడ చైనీయుల సంస్కృతిని ప్రతిబింబించే ఆలయాలు చాలానే ఉన్నాయి. చెంగ్‌ హూ టెంగ్‌ ఆలయంలో చెక్క పనితనాన్ని చూసి తీరాల్సిందే. తరవాత జోంకర్‌ స్ట్రీట్‌లోకి వెళ్లాం. సందర్శకులతో కిటకిటలాడిపోతోంది. రకరకాల యాంటిక్‌ వస్తువులూ హస్తకళాకృతులూ తినుబండారాలూ దొరుకుతాయక్కడ. తరవాత విక్టోరియా డచ్‌ మిశ్రమ శైలిలో కట్టిన బాబా న్యోన్యా హెరిటేజ్‌ మ్యూజియానికి వెళ్లాం. ఇది కూడా ఒకప్పటి నివాస భవనమే. అందులో మలక్క ప్రజల జీవనశైలికి సంబంధించిన ఆనవాళ్లన్నీ కనిపిస్తాయి. సందర్శకుల కోసం పోర్చుగీసు, డచ్‌, బ్రిటిష్‌ భవనాలన్నింటినీ ప్రదర్శనశాలల్లా మార్చేశారు. 1521లో నిర్మించిన సెయింట్‌పాల్‌ ఆలయం శిథిలమైపోయింది. ప్రస్తుతం గోవాలో ఉన్న సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ విగత శరీరం ఒకప్పుడు ఇక్కడే ఉండేదట. అక్కడినుంచి మేం మలక్కా మార్కెట్‌కి వెళ్లాం. మలేషియా కరెన్సీ రింగిట్‌. ఒక్క రింగిట్‌కి సుమారు 17 రూపాయలు. 20, 30 రింగిట్‌లకే ఎన్నో వస్తువులు వస్తాయి. అక్కడి వీధుల్లో ఎలక్ట్రానిక్‌ పరికరాలన్నీ చౌకగా దొరుకుతాయి. ఈ మార్కెట్‌లో నాన్‌వెజ్‌ తినుబండారాలు ఎక్కువ. రొయ్యలను పొట్టు తీయకుండానే,  చేపల్ని కోయకుండానే వండేస్తారు. అక్కడ ఉండే దురియన్‌ పండు చూడ్డానికి అచ్చం పనసపండులా ఉంటుంది. కానీ పట్టుకుంటే ముళ్లు గుచ్చుకుంటాయి. అందుకే మనవాళ్లు ముళ్లపండు అంటారు. కొబ్బరిబోండాన్నయితే కొబ్బరికుండ అనాలేమో. నీళ్లు అంత ఎక్కువగానూ తియ్యగానూ ఉంటాయి.

పెట్రోల్‌ చౌకే!
మలక్కాలో పెట్రోల్‌ లీటరు 40 రూపాయలే. దాంతో టాక్సీరేట్లు తక్కువ. టోల్‌గేట్ల బాధ ఉండదు. హోటల్‌ గదులూ తక్కువ ధరకే దొరుకుతాయి. హోటళ్లలో చెక్‌ ఇన్‌ మధ్యాహ్నం మూడు నుంచి అర్ధరాత్రి వరకే ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటల్లోపే గది ఖాళీ చేయాలి.
ఆ సాయంత్రం మలేకా నదిలో ప్రయాణిస్తూ నదికిరువైపులా ఉన్న ఆనాటి భవనాలను చూస్తూ ఆనందించాం.
మలక్కలో ఉన్న ఇళ్లూ భవనాలన్నీ కూడా దాదాపు శతాబ్దం క్రితం నిర్మించినవే. ముందు భాగంలో రంగురంగుల చిత్రాల్ని పెయింట్‌ చేశారు. తరవాత ప్రదర్శనశాలగా మార్చిన పెద్ద పోర్చుగీసు నౌక చూడ్డానికి వెళ్లాం. దీనికి సమీపంలోనే సముద్ర తీరాన్నీ చారిత్రక ప్రదేశాలనూ చూడ్డానికి టాంగ్‌ బెంగ్‌ స్వీ క్లాక్‌ టవర్‌ను నిర్మించారు. కొన్ని వాహనాలకు పడవలాంటి ఆకారాలను అలంకరించుకున్నారు. పడవలూ నౌకలూ మలక్క సంస్కృతిలో భాగం.
మలక్కలో పెరనాకన్‌- అంటే, మిశ్రమ సంస్కృతి కనిపిస్తుంది. వ్యాపారరీత్యా వచ్చిన చైనీయులు ఇక్కడే స్థిరపడటంతోబాటు స్థానిక జావా, బాతక్‌, ఎకెనీస్‌... తెగల అమ్మాయిల్ని చేసుకుని తమ సంప్రదాయలతోబాటు వాళ్ల పద్ధతుల్నీ నేర్చుకున్నారు. దాంతో భిన్న సంస్కృతులు కనిపిస్తుంటాయి. పోర్చుగీసుకు చెందిన యురాసియన్లూ ఎక్కువే. వీళ్లు తమదైన భాషనీ పద్ధతుల్నీ ఇప్పటికీ పాటిస్తుంటారు. అదేమాదిరిగా చిట్టీ అనే గ్రామంలో నివసించే వాళ్లంతా చిట్టీ ప్రజలు. ఒకప్పుడు కొందరు తమిళ వ్యాపారులు వచ్చి, అక్కడే స్థిరపడి స్థానిక మలయా, చైనా వాళ్లతో కలిసిపోయారు. చిట్టీ ప్రజల్లో చాలామంది మలయా పద్ధతుల్నే పాటిస్తారు. రెండంతస్తుల్లోని ఇండిపెండెన్స్‌ మ్యూజియంలో మలేషియా చరిత్ర కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.

చారిత్రక నగరిలో..!
అక్కడి నుంచి 18వ శతాబ్దంలో కట్టిన పోర్చుగీసుకు చెందిన క్రైస్ట్‌ చర్చ్‌ చూడ్డానికి వెళ్లాం. దీనికోసం ఇటుకల్ని నెదర్లాండ్స్‌లోని జీలాండ్‌ నుంచి తెప్పించారట. దీన్ని చుట్టి ఉండేదే డచ్‌ స్క్వేర్‌. అక్కడ సాయంకాలాల్లో పర్యటకులతోబాటు స్థానికులూ కృతిమపూలతో అలంకరించిన ట్రిక్షాల్లో పర్యటిస్తుంటారు. తరవాత స్ట్రెయిట్‌ మాస్క్‌నీ, పాయత వినాయక మూర్తి అనే ప్రాచీన హిందూ ఆలయాన్నీ పోర్చుగీసువాళ్లు నిర్మించిన పురాతన అఫమోసా భవంతినీ సుల్తానేట్‌ భవనాన్నీ చూశాం. ప్రస్తుతం శిథిలావస్థకి చేరినప్పటికీ ఇది సందర్శకుల్ని అమితంగా ఆకర్షిస్తుంటుంది. మర్నాడు మలక్కా నదీతీరంలోని పాతపట్టణంలో ఉన్న సంప్రదాయ ఇళ్లను చూడ్డానికి వెళ్లాం.  వీధులు ఇరుకుగా ఉంటాయి కానీ ఇళ్లు మాత్రం అందంగా ఉన్నాయి. దుకాణాలూ మసీదులూ ఆలయాలూ చాలానే కనిపిస్తాయి. చివరి రోజున మలక్క తీరం వెంబడి పది కిలోమీటర్లు ప్రయాణించి సాగరతీరంలోని మడ అడవుల్లో నిర్మించిన సీ ఫుడ్‌ రెస్టరెంట్‌ చూడ్డానికి వెళ్లాం. సముద్రంలో అప్పుడే పట్టిన చేపలు, రొయ్యలు, పీతలు, జెల్లీ చేపలు వంటి వాటిని కోరినట్టుగా వండి వడ్డిస్తారు. తిరుగు ప్రయాణంలో మలేషియా అంతర్జాతీయ విమానాశ్రయం కౌలాలంపూర్‌కి చేరుకున్నాం. ఇది నగర కేంద్రానికి 60 కి.మీ. దూరంలో ఉంది. కానీ నగరం మధ్యలోని సెంట్రల్‌లోనే లగేజీ తీసుకుని బోర్డింగ్‌ పాస్‌ ఇచ్చేస్తున్నారు. ఇది ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంది. అక్కడి నుంచి రైల్లో విమానాశ్రయానికి అరగంటలో చేరుకున్నాం.

4 ఆగస్టు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.