close
రైల్లోకి స్వాగతం

రైల్లోకి ఎక్కిన వెంటనే... ఓ అందమైన యువతి ఎదురొచ్చి... గులాబీ ఇచ్చి... లోపలికి స్వాగతం పలికితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇలాంటివి విమానాల్లో అయితే ఉంటాయి కానీ రైల్లో అందులోనూ మనదేశంలో సాధ్యమా... అని అనుమానిస్తున్నారా? అయితే ఇకమీద మీకలాంటి సందేహాలేం అవసరంలేదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ రైళ్లలోనూ మనం ఇలాంటి దృశ్యాలను చూడబోతున్నాం. ఇటీవలే ప్రారంభమైన గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా రైల్‌ హోస్టెస్‌ సేవలను ప్రవేశపెట్టారు. దిల్లీ ఆగ్రాల మధ్య ప్రయాణించే ఈ రైల్లో విమానంలో మాదిరిగానే హోస్టెస్‌ వచ్చి మనం ఆర్డర్‌ ఇచ్చిన పదార్థాలను అందిస్తారు. ఈ ప్రోగ్రాం విజయవంతం కావడంతో ఓ రెండువేల మందికి శిక్షణ ఇస్తోంది ఇండియన్‌ రైల్వే. శిక్షణ పూర్తయిన తర్వాత అన్ని రైళ్లలోనూ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తారు.


 

ఇవి మొక్కజొన్న బొమ్మలు!

విభిన్న ఆలోచనలకు కాస్తంత సృజనాత్మకత జతయితే వ్యర్థాలు కూడా అందమైన బొమ్మలుగా ముస్తాబవుతాయి. ఇక్కడున్న బొమ్మలను చూస్తే మీరూ ఆ విషయాన్ని  ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ మొక్కజొన్న కండెలతో తయారుచేసిన బొమ్మలు మరి. మణిపూర్‌కి చెందిన నెలి చాచెయా అనే పూలవ్యాపారికి మొక్కజొన్నలంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే ఈ మొక్కజొన్న పొత్తుల బొమ్మలకు ప్రాణం పోసేలా చేసింది. బొమ్మల శరీర భాగాలను మొక్కజొన్న కండెతోనూ దానిలోని పీచును జుట్టుగానూ వాటి పొట్టును దుస్తులుగానూ మార్చి ముచ్చటైన అమ్మాయి బొమ్మలను రూపొందించింది. ఇవి చూడటానికి బాగుండటంతో తన షాపులో వాటిని అమ్మడం ప్రారంభించింది. ఈ బొమ్మలు అక్కడి వారికి తెగనచ్చేయడంతో వ్యాపారం అద్భుతంగా సాగుతోంది.


 

ఇది సీతాకోకచిలుకల మొక్క

రివిల్లులోని రంగులను అందంగా రెక్కలకు అద్దేసుకుని కనువిందుచేసే సీతాకోకచిలుకలతో ఆడుకోని పిల్లలుండరు. అవి అందకుండా తుర్రుమంటే... వాటివెనక పరుగుతియ్యకుండా బాల్యమూ గడవదు. అలాంటిది గుంపులు గుంపులుగా సీతాకోకచిలుకలు ఒక మొక్కమీద చేరి ఊసులు చెప్పుకుంటున్నట్టుగా మారిపోతే... అంతకు మించిన అందం మరొకటి ఉండదు. అలాంటి అందాన్ని మన ఇంట్లోకి తీసుకొస్తున్నవే ఈ బటర్‌ఫ్లై ప్లాంట్‌లు. ఆక్సాలిస్‌ ట్రయాంగులారిన్‌, ఫాల్స్‌ షామ్రాక్‌గా పిలిచే వీటిని ఎక్కువగా ఇంట్లో అలంకరణకు పెంచుకుంటారు. ఈ మొక్కల ఆకులు చూడటానికి అచ్చం సీతాకోకచిలుకల్లా ఉండటం నిజంగా ఆశ్చర్యమే కదూ!


 

తియ్యని తారలు

జెల్లీలూ చూయింగ్‌ గమ్‌లూ మింట్‌లూ... పేర్లు వింటుంటేనే చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి చటుక్కున ఒక్కటి తీసి నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. అలాంటిది వాటితోనే తాము ఎంతగానో అభిమానించే సెలబ్రిటీల చిత్రాలు రూపుదిద్దుకుంటే... నోటికే కాదు కంటికీ తియ్యని విందే అంటారు అభిమానులు. ఇక్కడి చిత్రాలు ఆ కోవకు చెందినవే. మెక్సికోకు చెందిన క్రిస్టియం రామోస్‌ చేతిలో పురుడుపోసుకున్న ఈ చిత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో బాగానే హల్‌చల్‌ చేస్తున్నాయి. ఒక్కో చిత్రాన్ని రూపొందించడానికి జెల్లీలూ చూయింగ్‌ గమ్‌లూ కలిపి సుమారు అయిదువేల వరకూ అవసరమవుతాయట. వేరే ఎలాంటి రంగులూ ఉపయోగించకుండా కేవలం బబుల్‌గమ్‌, జెల్లీలతో తయారుచేసిన ఈ చిత్రాలు... పరిమాణం, ఉపయోగించిన క్యాండీలను బట్టీ రెండు లక్షల రూపాయల నుంచీ పదిలక్షల వరకూ అమ్ముడు పోవడం విశేషం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.