close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీతా రామభ్యోన్నమహః

- జి.కె.యస్‌.రాజా

అర్ధర్రాతి బస్సు వేగంగా వెళుతోంది. నేను తప్ప అందరూ నిద్రలో ఉన్నారు. బస్సు గతుకుల్లోకి వెళ్ళినప్పుడల్లా సీట్లలోంచి కాస్త ఎగిరిపడి మళ్ళీ అలాగే సర్దుకు పడుకుంటున్నారు. నాకు మాత్రం కుదుపు కుదుపుకీ గత జ్ఞాపకాలు ముసిరేసి, నిద్ర అన్నదే రావడం లేదు.
గతంలో ఇలాంటి రాత్రే ఇలాగే బస్సులో అబ్బాయి దగ్గరకు బయల్దేరినప్పుడు ఎంత ఆత్రుతా ఎంత సంబరం! ఉయ్యాల్లో వెయ్యబోతున్న మనవణ్ణి చూసుకోవాలని మాటిమాటికీ ఆయన్ను ఏదో ఒకటి అడుగుతూ ఉంటే ‘అలివేలూ నువ్వు తొందరపడినా మనం వెళ్ళేది తెల్లారాకనే. కాసేపు పడుకోరాదూ’ అంటూ ఆయన నిద్రకు ఉపక్రమించారు. మరి ఈరోజు వెనక్కు ఊరికి ప్రయాణం. ఆయన అలిసిపోయే నిద్దరోతున్నారో, ఊరికెళుతున్నాం అన్న తృప్తో కానీ నిద్దరైతే పోతున్నారు- హాయిగా నోరు తెరిచి. తిరిగి ఊరెళ్ళడం మాట బానే ఉంది కానీ అక్కడకెళ్ళాక ఇల్లు గడవడం ఎలా? ఈయనకు ఒంట్లో ఏమాత్రం సత్తువా మిగల్లేదు. నిద్ర రాకపోయినా బలవంతంగా కళ్ళు మూసుకున్నాను. మూతపడిన రెప్పల వెనుక ఎన్నెన్నో జ్ఞాపకాలు... తెరలు తెరలుగా కదిలిపోతున్నాయి.

* * * * *

అరవై ఏళ్ళు దాటేవరకూ మా వృద్ధాప్యం ఎలా గడుస్తుందనే ఆలోచనే రాలేదు. ఆయన సహచర్యం ఇచ్చిన ధీమాయే అనుకుంటాను- ఇబ్బందులూ ఒత్తిళ్ళూ ఎన్ని వచ్చినా అది కష్టంగా తోచలేదు. ఆయన ఎప్పుడూ ఎంత సాదాగా గడిపారనీ. అబ్బాయి చదువువరకూ ఆయన కాస్త హైరానా పడటం చూశాను కానీ, మరెప్పుడూ సంపాదన కోసం ఆరాటపడనూ లేదు, రేపటికోసం చింత పడనూ లేదు. ఏమున్నా, ఏం తిన్నా రేపటికి లేకున్నా నిశ్చింతగా ఉండేవారు. ఆయన పేరు ‘సీతారామశర్మ’ అని ఊళ్ళో వాళ్ళకే కాదు తనక్కూడా ఎప్పుడూ తోచదు. ఊరి వాళ్ళకూ, చుట్టుపక్కల ఊళ్ళవారికీ కూడా ఆయన ‘దేవుడయ్యవారే’ అగ్రహారంలోనూ, చుట్టుపక్కల ఊళ్ళలోనూ అష్టాదివర్ణాలూ ఆప్యాయంగా, ఆదరంగా ‘దేవుడయ్యా’ అనే పిలిచేవారు. ఒక్కగానొక్క కొడుకునూ ఉన్నంతలో పెద్ద చదువులే చదివించారు. వాడు మంచి ఉద్యోగంలో కుదురుకున్నాక పట్టణంవాళ్ళే కోరి పిల్లనిచ్చారు. కోడలు చదువుకున్న పిల్ల. పెద్దింటి పిల్ల.
పెళ్ళికీ తరువాత తతంగాలకీ వాళ్ళకు సరితూగలేకపోయానని ఈయన కాస్త బాధపడ్డారు.
ఆ తరవాత నుండీ తమ ఇద్దరి పొట్ట నింపుకోడానికి ఏ లోటూ లేకుండా గడిచిపోయింది. ఆయనకు తెలిసిన విద్యల్లా అడిగిన వాళ్ళందరికీ ముహూర్తాలు పెట్టడమే. పంచాంగమూ వచ్చేవాళ్ళ ఆదరణే మాకు ఆదరవు. ఇచ్చింది పుచ్చుకోవడమే తప్ప అడిగి తీసుకున్నది ఎప్పుడూ లేదు. నాకు తెలిసి గత పాతికేళ్ళల్లో వచ్చిన రెండు గోదావరి పుష్కరాలూ మా ఇంట మిగులు సొమ్ము తెచ్చిపెట్టాయి. అవే మా అబ్బాయి చదువుకీ నా కంటి ఆపరేషనుకీ మళ్ళీ వాడి పెళ్ళికీ లోటు రాకుండా గడిపేశాయి. కొడుకు పెళ్ళి అయిన తరవాత ఊర్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమని అందరూ పోరు పెట్టినా ఆయన చేసుకోలేదు. కొడుక్కి ఇష్టంలేదని ఆయన వ్రతం వద్దనుకున్నారు. అయినా కూడా, పక్క ఊరి పెదరెడ్డిగారి తలంపుతో అందరూ తలో చెయ్యి వేసుకొని మంచి జాతి ఆవును సమకూర్చారు. వచ్చిన వారానికే ఈనింది. పెయ్యదూడ. దానికి ‘మంగ’ అని పేరు పెట్టారు. నన్ను పేరెట్టి పిలవలేక ఇలా ముచ్చట తీర్చుకున్నారు. ఎవరైనా ఉంటే ఆ బుజ్జి ముండని ‘మంగా’ అని పిలిచేవారు. ఎవరూ లేనప్పుడు కొంచెం మెల్లగా ‘అలివేలు మంగా’ అని పిలిచి నాకు వినబడిందో లేదో అని నా వంక చూసేవారు. నేను నవ్వేలోపే తల తిప్పేసుకునేవారు. అంత మొహమాటం మనిషి.
పట్నం బయలుదేరేటప్పుడు ఆయనకున్న ఒకే బెంగ ‘మంగ’.
ఆ ఆవూ దూడల్ని ఏం చెయ్యాలి?
ఆ పశ్నకు మా దూరపు బంధువు కామేశం అన్నయ్య రూపంలో జవాబు దొరికింది. ‘మీరేం బెంగపడకండి బావగారూ.
మా దగ్గర విడిచిపెట్టండి మీ ఆవునూ దూడనీ, మేం చూసుకుంటాం మీరు తిరిగొచ్చేవరకూ’ అన్న మాటకు ఈయన ‘బావా’ అంటూ కృతజ్ఞతగా చూశారు.
అలా ఆనాడు కొడుకూ కోడలి దగ్గరకు చేరిన మాకు కొంతకాలం బాగానే జరిగింది. క్రమంగా- కోడలు ప్రవర్తనలో మార్పు రావడం, అంతకుమించి కొడుకు విసుక్కోవటం బాధగా ఉన్నా, మనవణ్ణి చూసుకుని సరిపెట్టుకునేవాళ్ళం. అబ్బాయీ కోడలూ అఫీసులకెళ్ళాక మనవడితో కాలక్షేపం చేస్తూ అన్ని పనులూ చేసి వండి, సర్దిపెట్టడంతో సాయంత్రం వరకూ బానే గడిచిపోయేది. వాళ్ళిద్దరూ తిరిగొచ్చాక అబ్బాయి పిల్లాణ్ణి ఆడించడానికి పార్కుకి తీసుకెళ్ళేవాడు. ఇక కోడలు సాధింపు మొదలయ్యేది సూటిపోటి మాటలతో... ‘ఇందులో బిస్కట్లన్నీ ఏమయ్యాయి. లీటరు పాలూ ఏమయ్యాయి’ అంటూ సవాలక్ష అనుమానాలతో కోడలు అనే మాటలకు ఆయన బిగుసుకుపోయేవారు. రాత్రిపూట అన్నం కూడా సయించేదికాదు ఇద్దరికీ. రాను రానూ పరిస్థితి మరింత దిగజారింది. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు వంటగదికి తాళం వెయ్యడం మొదలెట్టింది కోడలు. ఆ సంగతి ఈ మహారాజుకి తెలియక ఓ రోజు మధ్యాహ్నం ‘బాగా నీరసంగా ఉందే అలివేలూ, కాస్త అటుకులూ బెల్లం పెట్టు’ అని అడిగారు. నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. వరండాలోకి వెళ్ళి చీర కొంగు నోట్లో కుక్కుకుని వెక్కి వెక్కి పడుతుంటే వెనకాలే వచ్చి ‘వద్దులే అలివేలూ, ఊరికే అడిగాను ఊసుపోక. నాకేం ఆకలి లేదు, లోపలికి రా. ఎవరన్నా చూస్తే బావుండదు. అబ్బాయి గురించి చెడుగా అనుకోగలరు. వాళ్ళు వచ్చే టైమ్‌ అయిందిగా, అప్పుడేమన్నా తినొచ్చులే. నువ్వు లోపలికి రా’ అన్నారు. నా గుండె తరుక్కుపోయింది. ఎప్పుడూ ఆయనంతట ఆయన ‘ఇది వండి పెట్టూ’ అని అడిగిన పాపాన పోలేదు. ఎక్కడైనా భిక్షం ఎత్తయినా ఏదైనా చేసి పెట్టాలనిపించింది. మరికొద్ది రోజుల్లోనే ఆ ముచ్చటా తీరింది.
అబ్బాయి మూడురోజులు క్యాంపుకు వెళ్ళాడు. మనవణ్ణి ఏదో ఆయా స్కూలట. దాంట్లో చేర్పించారు. రాత్రి పడుకునే ముందు వంటిల్లు సర్దుతుండగా కోడలు... ‘‘పొద్దున్నే మీరూ ఆయనా కూడా రెడీ అవ్వండి. గుడికి వెళ్దాం’’ అంది. ఇది నిజమేనా, కలా అనిపించింది. తల ఊపాను. మనవణ్ణి రెడీ చేసి మమ్మల్ని భోజనం చేసెయ్యమని కంగారుపెట్టి, తొమ్మిది గంటలకే తీసుకెళ్ళి పెద్ద బజారు సందులో ఉన్న రామాలయం దగ్గర దించింది. ‘‘సాయంత్రం వస్తాను, మీకిక్కడ కాలక్షేపం బాగానే ఉంటుంది’’ అని చెప్పి మా మాటకోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. లోపలికెళ్ళి దర్శనం చేసుకుని, దూరంగా చెట్టుకింద సిమెంటు బెంచీ మీద ఇద్దరం కూలబడ్డాం. ఆయన నా మొహం వంక చూడలేదు. ఆయనకు ఏం అర్థం అయిందో తెలియలేదు. అలా గాల్లోకి చూస్తూ మెల్లగా సగం బెంచీ మీద ఒరిగి కళ్ళు మూసుకున్నారు.
మర్నాడు కోడలు చెప్పకుండానే సిద్ధం అయ్యాం. ఆయన రాత్రే చెప్పగా పంచాంగం, మరచెంబుతో నీళ్ళూ ఒక సంచీలో పెట్టుకుని బయల్దేరాం. గుళ్ళో పూజారిగారిని మంచి చేసుకొని ‘ముహూర్తాలూ మంచి ఘడియలూ చెబుతారు. అంతకంటే మరో విద్య తెలియదు. మీరే మాట సాయం చేయాలి’ అని అర్థించాను. కొడుకూ కోడలూ మమ్మల్ని దింపి వెళ్ళడం చూసి ఆయనకే అర్థం అయిందో ఏమో తెలియదు, మమ్మల్ని సానుభూతితో చూడటం మొదలుపెట్టారు. మధ్యాహ్నం వేళలో అరటి పళ్ళో మొక్కజొన్న పొత్తులో తెచ్చుకునేవాళ్ళం. యాచన తాలూకు దీనత్వం మమ్మల్ని ఆవహించలేదు. ఇంట్లోకంటే ఇక్కడే నయం అనిపిస్తోంది. పది తరవాత గుడి తలుపులు మూసేస్తారు. అప్పుడు అరుగు మీదే కాసేపు నడుం వాల్చేవాళ్ళం. ఇంటికంటే గుడి పదిలం అంటే ఇదేనా అనిపించేది. రోజూ గుడినుంచి బయటకు వెళ్ళేవాళ్ళు చెట్టు దగ్గరకు రాగానే ‘సీతారామభ్యోన్నమః’ అనే మాటకు అలవాటుపడ్డారు. కొందరు ఏదైనా చిల్లర మొహమాటపడుతూనే అక్కడపెట్టి వెళ్ళేవారు. ‘బాబూ, నేను పంచాంగం చెబుతాను’ అని- తిథీ, మంచి గడియలూ దుర్ముహూర్త వేళలూ చెప్పేవారు. రాను రాను కొందరికి అలవాటై ముహూర్తాలు అడగడం మొదలుపెట్టారు. అలాంటప్పుడు రెండో మూడో రూపాయలు దక్షిణగా ఇచ్చి దణ్ణం పెట్టి వెళ్ళేవారు.

ఆదివారమే కష్టం అనిపించేది- ఇంట్లో ఉండటానికి. అప్పుడప్పుడూ అలా మిగిలిన డబ్బులు ట్రంకు పెట్టెలో దాచుకున్నవి లెక్కపెట్టుకుంటుంటే, కోడలు చూసింది ఒకసారి. ‘‘ఏంటీ దాస్తున్నారు... ఇలా ఇవ్వండి నేను దాచిపెడతాను. మీకు ఏమైనా అయితే మందులకో, మాకులకో పనికొస్తుంది’’ అంది. ఏమీ అనలేక ఆ డబ్బు ఆవిడ చేతిలో పెట్టాను. ఇక అది రోజువారీ కార్యక్రమం అయిపోయింది. గుడి దగ్గర్నుంచి ఇంటికి వెళ్తూనే దక్షిణ డబ్బులు అడిగి తీసుకునేది.
అది ఆషాడమాసం, కొంచెం ముసురుగా ఉంది. గుడిలో కూడా సందడి లేదు. ఎవరూ ముహూర్తాలు అడగడం లేదు. రెండురోజుల్నుంచీ కొంచెం నలతగా ఉండి ఆయన నీరసంగా, వేళకాని వేళలో బెంచీ మీదే ముడుచుకుని పడుకున్నారు. నోటికి హితవు లేదని పొద్దున కూడా భోజనం చేయలేదు. చెయ్యివేసి చూశాను. కొంచెం వేడిగా తగిలింది. నాకేం తోచలేదు. ఎప్పుడూ లేనిది, పూజారిగారి దగ్గరకెళ్ళి ‘‘ఒక రూపాయుంటే ఇవ్వండి... రేపు ఇచ్చేస్తాను. కాస్త టీ దొరికితే ఆయనకు తేవాలి’’ అని అడిగాను.

ఆఫీసుకు వెళ్ళేటప్పుడు వంటగదికి తాళం వెయ్యడం మొదలెట్టింది కోడలు. ఆ సంగతి ఈ మహారాజుకి తెలియక ఓ రోజు మధ్యాహ్నం ‘బాగా నీరసంగా ఉందే అలివేలూ, కాస్త అటుకులూ బెల్లం పెట్టు’ అని అడిగారు. నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు.

‘‘ఎంత మాటన్నారమ్మా, ఇవిగో ఉంచండి’’ అని రెండు రూపాయలు చేతిలో పెట్టి, ‘‘ఉత్త టీ కాదు, కొంచెం బన్ను కూడా తెండి. మన గుడి వెనకాల సందులోనే సాయిబుగారి బేకరీ ఉందమ్మా. తాజాగా, శుభ్రంగా ఉంటాయి తెచ్చిపెట్టండి’’.
ఇక ఏమీ ఆలోచించలేదు. ఎప్పుడూ తిన్న అలవాటు లేదు. అయినా ఫరవాలేదు. ఇంట్లో తినే ముష్టి కూడుకంటే ఇదే ఎంతో నయం. ఈయన పైకి చెప్పుకోకుండా ఎంత దిగులు పడుతున్నారో తను గ్రహించగలదు. అనుమానించకుండా తొందరగా మరచెంబులో నీళ్ళు వంచేసి వెళ్ళి బన్ను, టీ తెచ్చాను. ఎక్కడివీ ఏమిటీ అని అడక్కుండా, బన్ను సగం తుంచారు. మరచెంబులోని టీ గ్లాసులోకి పొయ్యమన్నారు. సగం రొట్టె నాకిచ్చి ‘ఊఁ’ అన్నారు గ్లాసు ముందుకు చాపి. ‘‘మీరు తినండి’’ మాట పూర్తవ్వనివ్వలేదు. ‘ఊఁ’ అన్నారు మళ్ళీ. ఏమీ అనలేక కొంచెం ముక్క టీలో ముంచుకుని నోట్లో పెట్టుకున్నాను. కళ్ళనీళ్ళు ఆగలేదు. ఎందుకో ఆయనకి నీరసం తగ్గి ఏదో బలం పుంజుకున్నట్లు కనిపించారు. నవ్వుతూ ముక్క ముక్కకీ గ్లాసు నా ముందుకు చాచి తినమని తలాడిస్తూ హుషారుగా తినేశారు. మూతి తుడుచుకుంటూ ‘సీతారామభ్యోన్నమః’ అని పంచాంగం తెరిచి, ‘‘నీకు మంచి రోజులున్నాయోయ్‌ ముందర, శుభం’’ అన్నారు. దుఖం ఆపుకోలేక గ్లాసూ చెంబూ కడిగే మిషతో వెళ్ళిపోయాను.
మర్నాడు ‘సీతారామభ్యోన్నమః’ అన్న ఈయన మాటకు, గుడిలోంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటున్న ఓ పెద్దమనిషి, మాదగ్గరకొచ్చి, ‘‘అయ్యా దేవుడయ్యగారూ, మీరేనా’’ అన్నారు.
ఈయన బిత్తరపోయి చూస్తున్నారు.
ఆ ‘దేవుడయ్యా’ పిలుపు విని చాలా కాలం అయిపోయింది.
‘‘నేనండీ, పెద్దూరు సావిరెడ్డిని, మీరేంటీ, ఇక్కడ ఇలా? మీ అబ్బాయి ఇల్లు ఎక్కడ?’’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా...
‘‘సీతారామభ్యోన్నమః రెడ్డిగారూ, ఓ డెభ్బై రూపాయలుంటే ఇప్పించగలరా, మీ రుణం ఉంచుకోను’’ అని వెర్రి చూపులు చూస్తూ అడిగారు.
‘‘అది సరే దేవుడయ్యా, ఏమ్మా ఏమిటీ సంగతి...’’ అని నన్నడిగితే తలొంచుకున్నాను తప్ప ఏమీ చెప్పలేకపోయాను.
‘‘రెడ్డిగారూ, కాదనకండి. ఊరెళ్ళాలి ఓ డెబ్భై ఎలాగైనా సర్దండి’’ అంటుండగా, రెడ్డిగారు ‘‘ఇక మీరేమీ మాట్లాడకండి. ఊరికి నేను పంపిస్తాను. ముందు మా ఇంటికి వెళ్దాం’’ అని మా ఒప్పుదల కోసం చూడకుండానే ‘రండయ్యా’ అంటూ ఆయన చెయ్యి పట్టుకుని బయటకు నడిచారు. నేను ‘‘ఒక్క నిముషం బాబూ’’ అని గుడిలోకి పరుగు పరుగున వెళ్ళి ‘‘పూజారి గారూ, మీ రెండు రూపాయలు ఇవ్వలేకపోతానేమో. ఊరెళతాం. మాకోసం ఎవరడిగినా, ఎక్కడికెళ్ళారో ఏమయిపోయారో తెలియదని చెప్పండి. ఉంటాం బాబూ’’ అని నమస్కరించి వెనక్కి తిరిగాను. అప్పటికే రెడ్డిగారు ఆయన్ను కారులో కూర్చోబెడుతున్నారు.
రెడ్డిగారు ఎంతో ఆదరంగా, అపురూపంగా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెట్టి లోపలికెళ్ళారు. భార్యాభర్తలిద్దరూ వచ్చి వారిస్తున్నా ఊరుకోక వంగి కాళ్ళకు దణ్ణంపెట్టి నుంచున్నారు. ‘దీర్ఘాయుష్మాన్‌ భవ దీర్ఘ సుమంగళీభవ’ అని దీవించారు ఈయన గొణుగుతున్నట్లుగా. ఆవిడ ఒక పళ్ళెంలో పళ్ళూ, గ్లాసులో పళ్ళరసం తెచ్చి అక్కడపెట్టి, రెడ్డిగారి వంక చూశారు. ఆయన సంకోచిస్తూ ‘‘అమ్మా అప్పుడే మధ్యాహ్నం రెండయింది. ఎప్పుడు తిన్నారో ఏమో... కొంచెం ఆ పళ్ళు తినండి. సాయంత్రం మీ భోజనానికి మా పంతులు గారికి కబురెట్టి చెబుతాను. ఏం తీసుకుంటారో చెబితే, అవే చేస్తారు అక్కడ’’ అన్నారు.
నేను ఈయనవంక ఒకసారి చూసి ‘‘అయ్యా, మీకు ఇబ్బంది లేకపోతే మీ ఇంట్లోనే తింటాం సాయంత్రం’’ అన్నాను.
రెడ్డిగారు మహానందంతో దగ్గరకొచ్చి మళ్ళీ నమస్కారం పెట్టి గమ్మున ఉండిపోయారు.
‘‘భోజనానికేంగాని రెడ్డిగారూ, మాకో డెబ్బై రూపాయలిస్తే ఊరికెళ్తాం’’ అన్నారీయన.
‘‘అయ్యా దేవుడయ్యా, మీరు దాని గురించి ఏం బెంగ పెట్టుకోకండి.
ఈ ఒక్కరోజు మా ఇంట్లో ఉండి రేపు వెళుదురుగాని, ఇక ఏం చెప్పొద్దు’’ అంటున్న రెడ్డిగారి మాటకు అడ్డంపడి ఈయన ఏదో చెప్పబోతే నేను చెయ్యి నొక్కి ఆపుచేశాను.
‘‘అలాగేనండి’’ అన్న నా మాటకు పొంగిపోయి హడావిడిగా బయటకెళ్ళారు. దంపతులిద్దరూ మర్నాడు ఓ సంచీ నిండా ఏవో సర్దిపెట్టి దగ్గరుండి మమ్మల్ని ఈ బస్సు ఎక్కించారు. ‘లోకం గొడ్డుపోలేదు’ అనుకున్నాను నాలో నేను వందోసారి.

* * * * *

తెలతెలవారుతుండగా బస్సు అమలాపురం చేరింది. దిగేటప్పటికి ఒకాయన ‘‘రండి దేవుడయ్యగారూ, రండమ్మా’’

అనుకుంటూ సామాను తీసుకొని కారు దగ్గరకు నడిపించారు. అగ్రహారం చేరేసరికి ఎండ వచ్చింది. ఇంటిదగ్గర పది పన్నెండు మంది ఉన్నారు. మాకంతా అయోమయంగా ఉంది. ఇల్లు నేను అనుకున్నట్టు పాడుపడిపోలేదు. పైగా వాకిలి ముందంతా అలికి ముగ్గులు వేసి ఉన్నాయి. దిగీ దిగడమే అంతా ‘దేవుడయ్య గారూ’ అని పలకరిస్తుంటే మేం విస్తుపోయి చూస్తున్నాం. ఈయనకైతే మరీ అయోమయంగా ఉంది. వాళ్ళే తాము ఫలానా అని పరిచయం చెప్పుకుంటున్నారు.
‘‘అమ్మా మీరు స్నానాలు చేసి వంటకు సిద్ధంకండి. అన్ని సామాన్లూ లోపలపెట్టి ఉన్నాయి. రెడ్డిగారు నిన్ననే కబురెట్టారు మీరొస్తారని’’ అన్నాడో పెద్దాయన. ఈయన వెనక దొడ్లోకెళ్ళొచ్చి అటూ ఇటూ ఏదో వెతుకుతున్నట్లు చూస్తున్నారు.
అంతలో ‘‘వచ్చేశావా బావా’’ అంటూ కామేశం మరో మనిషీ కలిసి ఆవుల్ని తోలుకుంటూ వచ్చారు. రెండు ఆవులు, ఒక గిత్త, మరో లేగ దూడ. ‘‘ఇందులో నీ మంగను గుర్తుపట్టు దేవుడు బావా’’ అన్నాడు కామేశం.

గుడిలోకి పరుగు పరుగున వెళ్ళి ‘‘పూజారి గారూ, మీ రెండు రూపాయలు ఇవ్వలేకపోతానేమో. ఊరెళతాం. మాకోసం ఎవరడిగినా, ఎక్కడికెళ్ళారో ఏమయిపోయారో తెలియదని చెప్పండి. ఉంటాం బాబూ’’ అని నమస్కరించి వెనక్కి తిరిగాను.

ఈ మహారాజు మంత్రముగ్ధుడైపోయి అన్నిటినీ తడుముతూ చూస్తుండగా పేరినాయుడు సంచితో తెలగపిండి అచ్చులు తెచ్చి అందించాడు. ఒక్కొక్కదానికీ అందిస్తూ, మొహం మీద ముదురు గోధుమ వర్ణం ఉన్న ఆవును తల నిమిరి, గంగడోలు పావుతూ ‘మంగా’ అని వెనక్కి తిరిగి నావంక చూశారు.
ఆయన కళ్ళు మెరిసిపోతున్నాయి.
మొహం వెలిగిపోతోంది.
‘మంగ’ను పావుతూనే అందరికీ నమస్కరించి- ‘‘మీ అందరి ఋణం ఎలా తీర్చుకోగలను’’ అన్నారు బొంగురు గొంతుతో.
‘‘భలేవారే దేవుడయ్యగారూ మీరూ, మన్లోమనకి రునాలేటండే. మీరొచ్చేశారు మాకదే పదేలు’’ అన్నాడు పెదకాపుగారు.
కామేశంవంక తిరిగి దణ్ణం పెట్టబోతున్న ఈయన్ను వారించి ‘‘బావా, నేను చేసింది ఏమీ లేదు. ఈ గోసంతతినంతా వీళ్ళే చూసుకున్నారు. పేరుకే నా ఇంటి దగ్గర ఉన్నాయి. పోషణ అంతా వీళ్ళే చూసుకున్నారు. పైపెచ్చు మీ పుణ్యమా అని మేం ఇన్నేళ్ళూ వీటి పాడి అనుభవించాం హాయిగా’’ అన్నాడు.
‘‘మంగా’’ అని మెల్లగా అని, వెంటనే దర్పంగా ‘‘అలివేలు మంగా’’ అని గట్టిగా పిలిచారు. నేను వెనకాలే ఉన్న సంగతి గమనించి కూడా ఏమీ ఎరగనట్లు.
నేను గిన్నెతో జున్ను పట్టుకొచ్చి ఆయన పక్కనే మెట్టుపైన కూర్చున్నాను. మంగా, దాని దూడ గంగా మెడలెత్తి ఆయన్ను పావమని తలలాడిస్తున్నాయి. ఇదిగో పట్టు అని మొదటి స్పూను నా నోటికందించారు. ‘‘లోకం గొడ్డుపోలేదు’’ అన్నాను సంతృప్తిగా.
‘‘అవునుమరి, మనమే మన లోకంలోనే ఉండాలి’’ అన్నారు ఈ మహారాజు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు