close
భాగ్యాలు పంచే భాద్రపదం!

హైందవ సంప్రదాయంలో ప్రతి మాసానికీ ఏదో ఒక విశేషం ఉంటుంది. వాటిల్లో ముఖ్యమైంది భాద్రపదం. చాంద్రమానం ప్రకారం పౌర్ణమి రోజున చంద్రుడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో సంచరించడం వల్ల ఈ మాసానికి భాద్రపదం (31 ఆగస్టు నుంచి) అనే పేరువచ్చింది. తొలిపూజలందుకునే వినాయకుడు పుట్టిందీ, స్థితికారకుడైన శ్రీహరి భక్తులను రక్షించడానికి వరాహ, వామనావతారాలు ధరించిందీ ఈ మాసంలోనే.

భాద్రపద మాసంలో వచ్చే అతి పెద్ద పండగ వినాయక చవితి. ఊరూవాడా చిన్నాపెద్దా అన్న తేడాలేకుండా ప్రతి ఒక్కరూ గణనాథుడిని శక్తిమేర పూజిస్తారు. అయితే దానికంటే ముందు వచ్చే విశేషం... శుద్ధ తదియనాటి వరాహ జయంతి. కల్పాంత సమయంలో భూమి మొత్తం జలమయమైపోయింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు మనువును పిలిచి భూమిని పాలించాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మనువు నీట మునిగిన భూమిని పైకి తీసుకురావాల్సిందిగా బ్రహ్మను ప్రార్థిస్తాడు. ఆ సమయంలోనే బ్రహ్మ తుమ్మగా ఆ తుమ్ము నుంచి యజ్ఞవరాహమూర్తి పుడతాడు. యజ్ఞవరాహం అంటే యజ్ఞంలో ఉపయోగించే ద్రవ్యాలనే శరీరభాగాలుగా కలిగినవాడని అర్థం. బొటన వేలంత దేహంతో పుట్టిన స్వామి క్షణాల్లో ఆకాశమంత ఎత్తు పెరిగిపోతాడు. హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి మరీ సముద్రంలో ఉన్న భూమిని పైకెత్తి తన కోరలమీద నిలబెట్టాడు. విష్ణుమూర్తి ధరించిన దశావతారాల్లో మూడో అవతారమే వరాహ అవతారం. ఆ రోజు మరో విశేషం కూడా ఉంది. అదే పదహారు కుడుముల తద్దె. ఆ రోజున గౌరీదేవిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయంటారు.
భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో గణపయ్యను పూజిస్తే విద్యాబుద్ధులతోపాటు సకల సంపదలూ లభిస్తాయి.  మర్నాడు రుషి పంచమి. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మరాజుతో చెప్పాడంటారు. ఈ వ్రతం చేసేటప్పుడు కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు మొదలైన సప్తరుషులతోపాటు అరుంధతీ దేవినీ ఆరాధించాలి.
ఆ తర్వాతి రోజు షష్ఠి. దీన్నే స్కంద షష్ఠి, సూర్యషష్ఠి అని కూడా అంటారు. నిజానికి మాఘమాసంలో మాదిరిగానే భాద్రపద మాసంలో వచ్చే అన్ని ఆదివారాలూ సూర్యభగవానుడిని అర్చించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని చెబుతారు. ఈ నెలలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశినాడు పాలసముద్రంలో శేషతల్పంమీద శయనించిన విష్ణుమూర్తి పరివర్తన ఏకాదశి రోజున మరో పక్కకి ఒత్తిగిలుతాడు. ఈ రోజంతా ఉపవాసం ఉండి శ్రీహరిని స్మరిస్తే కరవుకాటకాలు దరిచేరవట.
భాద్రపద మాసం శుక్ల పక్షంలో వచ్చే మరో ప్రత్యేక తిథి ద్వాదశి. శ్రవణా నక్షత్రం ఉన్న ఈ రోజునే వామనావతారానికి శ్రీకారం చుట్టాడు శ్రీహరి. ప్రహ్లాదుడి మనవడైన బలిచక్రవర్తి పరమ ధార్మికుడు. అతడు స్వర్గాన్ని జయించడంతో దేవతలు అక్కణ్ణుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. బలిచక్రవర్తిని సంహరించకుండానే అతడి నుంచి స్వర్గాన్ని తీసుకుని దేవతలకు ఇచ్చేందుకు... అదితి, కశ్యప ప్రజాపతులకు బిడ్డగా జన్మిస్తాడు శ్రీహరి. సకల భూమండలాన్నీ స్వర్గాన్నీ దానంగా పొందుతాడు. దానికి ప్రతిగా సుతల లోకాన్ని బలిచక్రవర్తికి ఇచ్చి, చివరిలో మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఈ రోజున శ్రీహరిని స్మరించినంతనే మోక్షం లభిస్తుందట. పౌర్ణమి రోజున ఉమామహేశ్వర వ్రతాన్ని చేస్తారు. పార్వతీదేవి ఈ వ్రతాన్ని చేసి శివుడి శరీరంలోని అర్ధభాగాన్ని మళ్లీ పొందిందని చెబుతారు.

మహాలయ పక్షాలు
భాద్రపద బహుళ పాడ్యమి నుంచీ మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. దీన్నే పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెబుతారు. ఈ పదిహేను రోజులూ నిత్యం తర్పణాలు వదలడం, శ్రాద్ధ విధులను నిర్వహించడం ద్వారా పితృదేవతల అనుగ్రహాన్ని పొందుతారు. పాడ్యమి నుంచి అమావాస్యవరకూ వీటిని ఆచరించలేని వారు కనీసం మహాలయ అమావాస్య రోజైనా పితృదేవతల ఆరాధన చేయాలి. భాద్రపద బహుళ తదియను ఉండ్రాళ్ల తదియ ఉంటారు. అట్ల తద్దె మాదిరిగానే ఉండ్రాళ్ల తద్దెనాడు కూడా పెళ్లీడుకొచ్చిన కన్నెపిల్లలు గౌరీదేవిని పూజించి నైవేద్యం పెడతారు. ఇంత విశేషమైన మాసం కాబట్టే కలియుగం భాద్రపద మాసంతోనే మొదలైందంటారు. భాద్రపదం అంటే కేవలం ఒక మాసాన్నో ఒక నక్షత్రాన్నో కాకుండా ప్రజలంతా భద్రంగా ఉండాలన్న ఆకాంక్షనూ సూచిస్తుందని పెద్దలు చెబుతారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.