close

రిఫ్రెష్‌ అవుతారిలా..!

కార్పొరేట్‌ ప్రపంచంలో ఉండేవాళ్లకి ఒత్తిడి ప్రభావం అంతా ఇంతా కాదు. సాధారణ ఉద్యోగులే ఒత్తిడికి తలకిందులవుతుంటారు. అలాంటిది పెద్ద పెద్ద సంస్థల్ని నడిపేవారి సంగతి చెప్పేదేముంది. అందుకే చాలామంది వ్యాపార దిగ్గజాలు ఒత్తిడిని దరిచేరకుండా తమవైన దారుల్ని ఎంచుకుంటారు. ఇక్కడున్న ఈ  ప్రముఖులు ఎలా రిఫ్రెష్‌ అవుతారంటే...

వాహ్‌ తాజ్‌! 

టీ కాస్తూ, తాగుతూ ప్రపంచాన్ని మర్చిపోతారు సంజీవ్‌ మెహతా. వ్యాపారులెవరైనా ఈయన ఆఫీసుకి వెళ్తే ప్రపంచంలోనే అత్యుత్తమమైన టీ రకాల్ని రుచి చూడొచ్చు. ఆయనే స్వయంగా కాచి వాటిని అందిస్తారు. కెన్యాకు చెందిన ‘లిప్టన్‌ ఎల్లో’, మన ‘తాజ్‌మహల్‌’ టీ పొడుల్ని కలిపితే వచ్చే రుచి అంటే సంజీవ్‌కి అమితమైన ఇష్టం. యునీలీవర్‌కు ముంబయిలో ‘తాజ్‌మహల్‌ టీ హౌస్‌’ పేరుతో రెస్టరెంట్‌ ఉంది. అక్కడి ‘స్పైస్డ్‌ టీ టాడీ స్టైల్‌’ వెరైటీ సృష్టికర్త మెహతానే. 
బ్లాక్‌ టీలో సుగంధ ద్రవ్యాలు కలిపి దీన్ని తయారుచేస్తారు. రోజూ ఉదయాన్నే ఇంట్లోవాళ్లకి ఆయనే టీ చేసి అందించడం హాబీ.

- సంజీవ్‌ మెహతా
ఛైర్మన్‌, హెచ్‌యూఎల్‌ 

కుటుంబం తర్వాతే... 

దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీకి ఎండీ ఆదిత్య సెల్‌ఫోన్‌ వాడరు. తన కెరీర్‌లో ప్రతిరోజూ ఠంచనుగా తొమ్మిది గంటలకు ఆఫీసుకు వెళ్లి, సాయంత్రం అయిదున్నరకు ఇంటికి బయలుదేరడం అలవాటు. ఇంట్లో గార్డెనింగ్‌ చేస్తూ, గరిటె తిప్పుతూ సేదదీరుతారు. సినిమాలు చూడ్డానికి ఇష్టపడతారు. ‘జీవితం అంటే గెలుపూ, డబ్బూ మాత్రమే కావని తెలుసుకున్నరోజు అంతా సవ్యంగా కన్పిస్తుంద’ంటారు. తనకు ఏదైనా కుటుంబం తర్వాతే అని చెప్పే ఆదిత్య ‘ఉద్యోగం ఒకటి కాకపోతే ఇంకోటి ఉంటుంది. జీవితం అలా కాదు’ అంటూ తత్వం బోధపరుస్తారు.

- ఆదిత్య పూరి
ఎండీ హెచ్‌డీఎఫ్‌సీ

ఆనందం... ఆరోగ్యం

లక్ష కోట్ల ‘మహీంద్ర’ వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి 64 ఏళ్ల ఆనంద్‌ మహీంద్ర. ఒత్తిడిని చిత్తుచేయడానికీ, ఆరోగ్యానికీ రోజూ ఉదయం ఇంట్లోనే ట్రెడ్‌ మిల్‌మీద క్యాలరీలు కరిగిస్తారు. ‘మధ్య వయస్కులు 40 పుషప్స్‌ తీస్తే హృద్రోగానికి దూరంగా ఉండొచ్చ’ని ఇటీవల ఓ పరిశోధన చెబితే- ఇప్పటికే తాను రోజుకు 25 పుషప్స్‌ తీస్తున్నాననీ, నలభైకు చేరేందుకు ప్రయత్నిస్తాననీ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. తరచూ ట్విటర్‌ద్వారా ఆలోచనల్ని రేకెత్తించే, నవ్వించే వీడియోలూ, ఫొటోల్ని పంచుకుంటారు. సంగీతం, క్రీడలూ, సినిమాలూ, నాటకాలూ, పుస్తక పఠనం, ఫొటోగ్రఫీ... లాంటి హాబీలతో రిఫ్రెష్‌ అవుతుంటారు.

- ఆనంద్‌ మహీంద్రా
ఛైర్మన్‌ మహీంద్రా గ్రూప్‌

ప్రకృతితో మమేకం!

ఉదయంపూట 20 నిమిషాలు యోగాకీ, 40 నిమిషాలు ట్రెడ్‌మిల్‌కీ కేటాయిస్తారు సైయెంట్‌ వ్యవస్థాపకులైన మోహన్‌రెడ్డి. తీరికవేళల్లో కుటుంబ సభ్యులతో తెలుగు సినిమాలు చూస్తారు. మనవలూ మనవరాళ్లతో ఆడుకుంటారు.  కుటుంబంతో కలిసి పర్యటనలకు వెళ్తుంటారు. అందుకు దేశవిదేశాల్లోని ప్రకృతి రమణీయ ప్రదేశాలను ఎంచుకుంటారు.
న్యూజిలాండ్‌, ఐస్‌లాండ్‌లలో పర్యటించడం ఈయనకెంతో ఇష్టం. టెక్నాలజీ, నాయకత్వం, ఇన్నోవేషన్‌పైన వచ్చే పుస్తకాల్ని ఎక్కువగా చదువుతారు. కర్ణాటక సంగీతం అంటే ఇష్టం. పాత పాటలు వింటూ సేదదీరుతారు.

- బి.వి.మోహన్‌రెడ్డి
ఛైర్మన్‌ సైయెంట్‌

ఏకాంతం తప్పనిసరి

రోజూ ఉదయం ఒక గంట యోగా చేయడానికీ, మరో గంట నడకకీ టైమ్‌ కేటాయిస్తారు రోనీ. అది తనతోతాను పూర్తిగా గడిపే సమయమని చెబుతారు. పునరుత్తేజం కోసం అలాంటి ఏకాంతం చాలా అవసరమంటారాయన. ఇంకా తన కూతురితో మాట్లాడుతూ కూర్చుంటే ప్రపంచాన్ని మర్చిపోగలనంటారు. ‘పుస్తకాలు బాగా చదువుతా. అందులోనూ నాన్‌ ఫిక్షన్‌ ఇష్టం. ‘సేపియెన్స్‌’, ‘ది టిబెటన్‌ బుక్‌ ఆఫ్‌ లివింగ్‌ అండ్‌ డయింగ్‌’ నాకు బాగా ఇష్టమైన పుస్తకాలు’ అని చెప్పే రోనీ...  బిజీ పనుల నుంచి నాలుగు రోజులు విరామం దొరికితే గోవా, కశ్మీర్‌ పర్యటనలకు వెళ్లొస్తారు.
- రోనీ స్క్రూవాలా
సినీ నిర్మాత, వ్యాపారవేత్త

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.