close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గోరంత దీపం

- నందిరాజు కృష్ణకుమారి

‘‘అమ్మా, రేపు మనం వెంకటాపురం వెళుతున్నాం.’’
రెప్పవాల్చకుండా భర్త ఫొటోకేసి చూస్తూ దిగులుగా కూర్చున్న సునంద ఉలిక్కిపడి కొడుకువైపు చూసింది. శ్రావణ మేఘాల్లాంటి ఆమె కళ్ళలో క్షణకాలం ఆనందం తటిల్లతలా మెరవడం శ్రీరాం దృష్టిని దాటిపోలేదు. అందుకే ఉత్సాహంగా ‘‘ఔనమ్మా, తాతగారి ఊరు చూడాలనుందని నువ్వు నాన్నగారిని అడగటం... ‘నీ పిచ్చిగానీ ఇప్పుడక్కడ ఎవరున్నారు?’ అంటూ ఆయన నీకు సర్దిచెప్పడం నా చిన్నప్పటి నుంచీ చూస్తూనే ఉన్నాను. అందుకే ఒక వారం సెలవు పెట్టాను. పిల్లలు కూడా సరదా పడుతున్నారు. కొన్ని రోజులక్కడ గడిపేసి వద్దాం, సరేనా?’’ అన్నాడు.
కాఫీ ఇస్తున్న భార్యక్కూడా ‘‘సిరీ, రేపు ఆరింటికల్లా బయలుదేరితేగానీ లంచ్‌ టైముకి చేరలేం. అక్కడి స్కూల్‌ వాచ్‌మేన్‌ కొడుక్కి అన్నీ సిద్ధం చేయమని చెప్పాను. దారిలో అందరికీ తినడానికి ఏదైనా చెయ్యి’’ అని చెప్పాడు.
‘‘ఓ, అలాగే’’ అంటూ హుషారుగా లోపలికి పరుగెత్తింది శిరీష. భార్యతోపాటు తనూ లోపలికెళ్ళాడు.
‘‘అబ్బో, ఏమిటో విశేషం. శ్రీవారికి మామీద ఇంత దయ కలిగింది, సెలవుపెట్టి మరీ...’’ భార్య మాటలు పూర్తి కాకుండానే అందుకున్నాడు శ్రీరాం.
‘‘ఈ ప్రయాణం మనకోసం కాదు సిరీ, అమ్మకోసం. నాన్నగారు పోయి ఆరు నెలలైనా అమ్మ అసలు కోలుకోలేదు. పుట్టి పెరిగిన ఊరూ, ఆ పరిసరాలూ చూస్తే ఆమె మనసు కొంచెమైనా కుదుటపడుతుందేమోనని ఆశ.’’
‘‘నిజమేనండీ, అత్తయ్యగారినలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇలాగైనా ఆమె దిగులు మరచిపోతే మనకు కావలసిందేముంది’’ మనస్ఫూర్తిగా అంది శిరీష.
భోజనం చేసి మంచం మీద వాలిన సునంద కళ్ళముందు తండ్రి ఎంతో కష్టపడి కట్టిన పెంకుటిల్లూ... తల్లి ఇష్టంగా పెంచుకున్న మల్లె, మందార చెట్లకు విరగబూసిన పువ్వులూ... జామ, సపోటా, మామిడిచెట్లూ, నిండుగా పూత పూసిన మామిడి కొమ్మలకు ఉయ్యాల కట్టి నేనంటే నేనని పోటీ పడుతూ ఊగటమూ, తన చేతిలో కావాలని ఓడిపోయిన జ్యోతి మొహంలో వెన్నెలలాంటి నవ్వూ... ఇవన్నీ గుర్తు వస్తుంటే ‘ఒకసారి కోల్పోతే తిరిగి పొందలేని అద్భుతం బాల్యమేనేమో’ అనిపిస్తుంది. మరపురాని మరువపు మొలకలాంటి చిన్ననాటి నెచ్చెలి జ్ఞాపకాలు ఒక్కొక్క రేకూ విడివడుతున్న మొగలిపొత్తుల్లా గుబాళిస్తుంటే బాహ్య ప్రపంచాన్ని మరచిన మనసు అరవై ఏళ్ళు వెనక్కి పరుగెత్తింది.

*  *  *  *

ఆ రోజుల్లో రంగనాథంగారు వెంకటాపురం హైస్కూల్లో ప్రధానోసాధ్యాయుడు కావడంతో సునంద పిల్లలందరిలో మకుటంలేని మహారాణిలా వెలిగిపోయేది కానీ, బుద్ధిగా చదువుకునేది. ఒకరోజు మాస్టారు పాఠం చెబుతుండగా పక్కనే గూడెంలో ఉండే రాజయ్య అయిదేళ్ళ పిల్లను వెంటబెట్టుకుని వచ్చి ‘‘దండాలయ్యగారూ’’ అంటూ చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
‘‘బాబూ... ఇది నా బిడ్డ, మీకాడ సదూకుంటానని ఒకటే ఏడుపండయ్యా, దాని గోడు తట్టుకోలేక మీకాడికొచ్చా. బాబ్బాబు, దీనికి కూసింత సదవడం నేర్పండి. సచ్చి మీ కడుపున పుడతా’’ అంటూ కాళ్ళు పట్టుకోబోతున్న అతన్ని వారిస్తూ భుజం తట్టారు రంగనాథంగారు.
తైల సంస్కారంలేని చింపిరి జుట్టూ చిరుగుల గౌనుతో మసిపాతలో కట్టిన మాణిక్యంలా కనిపించిందా పిల్ల.
‘‘నీ పేరేమిటమ్మా’’ లాలనగా అడిగారు.
‘‘పేరు పోసెమ్మండీ, దానికా పేరు నచ్చలేదండయ్యా! మీరే మంచి పేరెట్టి రాసుకోండి’’ మురిపెంగా కూతుర్ని చూసుకుంటూ చెప్పాడు రాజయ్య.
‘‘అలాగే, ఏమ్మా ఆ పేరు నచ్చలేదా నీకు’’ నవ్వుతూ అడిగారు.
తల అడ్డంగా ఊపిందా పిల్ల.
‘‘సరే, ఈరోజు నుండి నీ పేరు జ్యోతి. అంటే అందరికీ వెలుగునిచ్చే దీపం అని అర్థం. నువ్వలా ఉండాలి.’’
నవ్వుతున్న ఆ పసిపిల్ల కళ్ళు స్థిరంగా తనకు ‘అలాగే’నని వాగ్దానం చేస్తున్నట్లనిపించిందాయనకి.
‘‘సరే రాజయ్యా, సాయంత్రం మా ఇంటికొచ్చి మా పాపవి రెండు జతల బట్టలు తీసుకెళ్ళు. రేపు స్నానం చేయించి, తల దువ్వి తీసుకొనిరా. ఈ పిల్లలందరూ ఎలా ఉన్నారో తనూ అలాగే ఉండాలి’’ అని చెప్పి పంపించేశారు రంగనాథంగారు.
మరునాడు స్కూలుకి వచ్చిన జ్యోతిని పిల్లలందరూ కళ్ళింతింత చేసుకుని చూశారు. తెల్లని పువ్వుల గౌనూ నున్నగా దువ్వి అల్లిన జడలూ కడిగిన ముత్యంలా ఉన్న ఆ పిల్ల చారడేసి కళ్ళూ సునందను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
పక్కనే కూర్చోబెట్టి ‘ఈరోజు నుంచి జ్యోతీ, నువ్వూ మంచి స్నేహితులవ్వాలి’ అని నాన్న చెబుతుంటే ఆనందంగా తలూపింది.

*  *  *  *

జ్యోతి రంగనాథం మాస్టారింట్లో తలలో నాలుకైపోయింది. భర్త సహచర్యంతో అబ్బిన సంస్కారం వల్ల సునందా వాళ్ళమ్మ జానకి కూడా ఆ పిల్లనెంతో ఆదరంగా చూసేది. కూతురితోపాటే తనక్కూడా తినడానికేమైనా పెట్టడం, బట్టలు కొనడం చేస్తూ ఉండేది.
సాయంత్రం సునందా వాళ్ళింట్లోనే కూర్చుని చదువుకునేది. తనకి తెలియని విషయాలు ఎంతో కుతూహలంగా అడుగుతుంటే ఓపిగ్గా కూతురితోపాటే ఆ పిల్లకూ అన్నీ చెబుతుండేవారు. జానకమ్మ కూడా పిల్లల స్నేహం చూసి తెగ ముచ్చటపడిపోయేది.
చూస్తుండగానే పదేళ్ళు గిర్రున తిరిగాయి. పదవ తరగతిలోకి వచ్చేశారిద్దరూ. వయసుతోపాటు వాళ్ళ బంధం ‘మూడు పూవులు ఆరు కాయలన్నట్లు’ కొనసాగింది.
ఒకసారి స్కూల్లో వక్తృత్వపు పోటీలు జరుగుతుంటే ఇద్దరి పేర్లూ ఇచ్చింది సునంద. మొదటి బహుమతి జ్యోతికే వచ్చినందుకు తనకొచ్చినంత సంబరపడి తండ్రి దగ్గరికి లాక్కొచ్చింది. సునందకు రాలేదని చిన్నబుచ్చుకున్న జ్యోతిని ఓదార్చటం వాళ్ళ వంతయింది. తనకొచ్చిన బహుమతిని రంగనాథంగారి చేతిలో పెట్టింది జ్యోతి.
అది ‘అన్‌ టూ దిస్‌ లాస్ట్‌’ అనే ఇంగ్లిషు నవల.
‘‘నాకేమర్ధమౌతుంది మాస్టారూ, మీరే దగ్గరుంచుకుని చదివి అందులో ఏముందో చెప్పరా...’’ ప్రాధేయపూర్వకంగా అడుగుతున్న జ్యోతి తలను ఆప్యాయంగా నిమిరారు రంగనాథంగారు.
‘‘‘రస్కిన్‌’ అనే ఆంగ్ల రచయిత రాసిన చాలా గొప్ప పుస్తకమమ్మా ఇది. మహాత్మా గాంధీజీకి స్వాతంత్య్ర ఉద్యమం నడిపేందుకు దిశానిర్దేశం చేసింది ఈ పుస్తకమే. ‘ఏదో చెయ్యాలి కానీ, ఏం చెయ్యాలి, ఎలా?’ అని సందిగ్ధంలో ఉన్న ఆయనకు స్పష్టమైన అవగాహన కలిగించడమేకాక సర్వోదయ సిద్ధాంతాలకు ఊపిరి పోసినది కూడా ఇదే’’ అంటూ విడమరచి చెబుతున్న మాస్టారికేసి ఎంతో భక్తిభావంతో చూస్తూ...
‘‘అంత గొప్పదాండీ ఇది. అయితే సునందమ్మకి ఇచ్చేస్తా’’ అంటున్న జ్యోతిని చూసి- సునంద రెండు చేతులూ జోడించి ‘‘తల్లీ, మదర్‌ థెరెసా, నువ్వే ఉంచుకో. నీక్కూడా ఏదో ఒక దారి చూపిస్తుందది’’ అంటూ ఆటపట్టించింది.

*  *  *  *

పదవ తరగతిలో ఇద్దరూ మంచి మార్కులతో పాసవడం, రంగనాథంగారికి మరొక ఊరికి బదిలీ కావడం ఒకేసారి జరగడంతో ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని బావురుమన్నారు. వీళ్ళు రైలెక్కే వరకూ సునందని ఒక్క క్షణం కూడా వదల్లేదు జ్యోతి. కదులుతున్న రైలు వెనకపరిగెత్తుతూ ‘‘సునందమ్మా, నన్ను మర్చిపోవుగదూ... మళ్ళీ వస్తావుగా’’ అని గట్టిగా అరుస్తున్న జ్యోతి నీళ్ళు నిండిన కళ్ళను మరచిపోవటానికి సునందకు చాలా కాలం పట్టింది.
సునంద కాలేజీలో చేరాక కొంతకాలం ఇద్దరిమధ్యా ఉత్తరాలు నడిచాయి.
ఆ తరువాత కొన్ని రోజులకే- ‘తను ఎంత మొత్తుకున్నా వినకుండా, చదివింది చాలంటూ పక్క ఊళ్ళోని గూడెంలో ఉండే కిష్టయ్యతో పెళ్ళి ఖాయం చేశారని’ కన్నీళ్ళతో జ్యోతి రాసిన ఆఖరి ఉత్తరం చదివి రంగనాథంగారు కూడా కూతురితోపాటే బాధపడ్డారు.
‘మనం అక్కడ ఉంటే ఇలా జరిగేది కాదంటూ’ ఏడుస్తున్న కూతురిని ఎలా ఓదార్చాలో తెలియలేదు.
కొంతకాలానికి డిగ్రీ అవగానే బ్యాంక్‌ ఉద్యోగం... అక్కడే మేనేజరుగా పనిచేసే మోహన్‌తో పెళ్ళి... వెంటనే ఇద్దరు పిల్లలూ... సంతోషంగా సాగే సంసారపు సందడితో ఆమె జ్ఞాపకాల నుంచి జ్యోతి కనుమరుగయిందనే చెప్పాలి.
కానీ ఒకసారి తల్లి ‘‘నందూ, నీకీ విషయం తెలుసా? బిడ్డ పుట్టిన పదిరోజులలోపే జ్యోతి భర్త కల్తీ సారా తాగి చనిపోయాడట. పాపం ఎంత మంచి పిల్లో, రాగూడని కష్టం వచ్చింది దానికి’’ అని బాధగా చెబుతుంటే హతాశురాలైంది.
ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్న భార్యను ఓదారుస్తూ ‘‘నందూ, బాధపడి మనం చేయగలిగిందేమీలేదు. దేశం ఎంత ప్రగతి సాధించినా ఇంకా కొన్ని తెగలలో కట్టుబాట్లూ దురాచారాలూ దుర్వ్యసనాలూ అలాగే ఉన్నాయి. కానీ, ఇంత తెలివైనపిల్ల వీటికి బలైపోవడం దురదృష్టం’’ అని బాధపడ్డాడు మోహన్‌.
అంత కష్టంలో ఉన్న స్నేహితురాలిని ఒక్కసారి చూసి ఓదార్చాలని ఎన్నోసార్లు అనిపించినా ఆమెనా స్థితిలో చూడలేనేమోనన్న భయంతో వెనుకాడింది.
‘మరి ఇప్పుడు... తన భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న ఈ పరిస్థితిలో అక్కడికి వెళితే... అసలు తనెలా ఉందో, చంకలో బిడ్డను కట్టుకుని చిలక జోస్యం చెప్పుకుంటూనో సవరాలు కట్టి అమ్ముకుంటూనో ఆ గూడెంలో ఎంత దుర్భర జీవితం గడిపి ఉంటుంది? వయసు మళ్ళి అనారోగ్యంతో ఎముకల పోగులా, జీవచ్ఛవంలా బతుకు వెళ్ళదీస్తుంటే, తన మానసికస్థితి ఇంకా దిగజారి తట్టుకోలేదేమో! అమ్మో వద్దు... ఇంద్రనీలాల్లా మెరిసే కళ్ళూ తీరైన ముక్కూ పువ్వుల పరికిణీ ఓణీలో సంక్రాంతి ముగ్గులా పొందికగా ఉండే ప్రియనెచ్చెలి- తీయని జ్ఞాపకంగా మిగిలిపోవాలంటే తను మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. ఆ నరకాన్ని చూసి భరించగలిగే శక్తి తనకిప్పుడులేదు. శ్రీరాంతో తను రానని చెప్పేయాలి, ఔను చెప్పాలి’ అనుకుంటూ, కలత నిద్రలోకి జారుకుంది. మూసిన కళ్ళముందు మాసిన చీరె, ముగ్గుబుట్టలాంటి జుట్టుతో ఏదో బొమ్మ అస్పష్టంగా కదలాడుతుంటే ఉలికిపాటుతో లేచి కూర్చుంది.
అప్పటికే అన్నీ సర్దేసిన శిరీష వచ్చి ‘‘అత్తయ్యా, అయిదయింది లేవండి.
పిల్లలు కూడా రెడీ అయ్యారు. మీదే ఆలస్యం’’ అంటుంటే ఆమె ఉత్సాహం చూసి మాటలు పెగల్లేదు.
ఐదేళ్ళ కవలలు... మనుమడు కార్తీక్‌, మనుమరాలు చైత్ర - ముచ్చటైన బట్టల్లో పుచ్చపూవుల్లా మెరిసిపోతూ వరండాలో ఆడుకుంటున్నారు.
‘‘అమ్మా లేచి త్వరగా స్నానం చేసిరా, లగేజీ కారులో సర్దేస్తాను’’ అంటూ రెండు చేతుల్లోనూ బ్యాగ్‌లు పట్టుకున్న కొడుకు మాట కాదనలేక బాత్‌రూమ్‌లోకి నడిచింది.
‘పాపం పిల్లలంతా సరదా పడుతున్నారు. ఇప్పుడు వద్దంటే వాళ్ళ ఉత్సాహం మీద నీళ్ళు చల్లినట్లవుతుంది. వెళ్ళక తప్పేలా లేదు. ఒక పని చేస్తే సరి, వెళ్ళినట్లే వెళ్ళి, అటుకేసి వెళ్ళకుండా ఎలాగో కాలక్షేపం చేసి తిరిగి వచ్చేయాలి’ అనుకుంటూ అయిష్టంగానే కారెక్కింది.
దారి పొడుగునా ఉత్సాహంతో కేరింతలు కొడుతున్న పిల్లల్నీ కోడల్నీ చూస్తూ ఉండిపోయింది.
దారిలో ఒకసారి శిరీష ‘‘అత్తయ్యా, మీకక్కడ ఒక మంచి ఫ్రెండ్‌ ఉందట గదా, మీ అబ్బాయి చెప్పారు. ఒకసారి ఆవిడని మాక్కూడా చూపిస్తారా?’’ అని అడిగి ఆమె ముభావంగా ఉండటం చూసి మరి రెట్టించలేదు.

*  *  *  *

ఒంటిగంటకల్లా వెంకటాపురంలోని పెంకుటింట్లో అడుగుపెట్టారు. రంగనాథం
గారితోపాటు స్కూల్లో పనిచేసిన వాచ్‌మేన్‌ కొడుకు రంగయ్య ఇల్లంతా చక్కగా సర్దేసి ఉంచాడు. ఇల్లంతా ఒకసారి కలయ తిరిగింది సునంద. సంబరంగా పిల్లలకు, చెట్లూ చేమలూ చూపిస్తున్న తల్లి మొహం కొంచెం తెరిపిగా ఉండటం చూసి శ్రీరామ్‌, శిరీష తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.
రంగయ్య భార్య కొసరి కొసరి వడ్డిస్తుంటే కడుపునిండా తినేసి కాసేపు హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. ఆరోజు రాత్రి పొద్దుపోయేవరకు అందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని తన ఊరి గురించీ అక్కడి రామాలయం, చెరువు గట్టునే ఉన్న స్కూలు గురించీ పొల్లు పోకుండా చెబుతూనే ఉంది కానీ, ఎక్కడా తన స్నేహితురాలి ప్రస్తావన మాత్రం రాకుండా జాగ్రత్తపడుతున్న తల్లి ఆంతర్యం అర్థమై, అడగబోతున్న భార్యను కళ్ళతోనే వారించాడు శ్రీరాం.
రాకూడదనుకుంటూనే వచ్చినా ఈ పరిసరాలు సునందలో కాసింత ఉత్సాహం రేకెత్తించిన మాట నిజం. చూస్తుండగానే వారంరోజులు గడిచిపోయాయి. ఇక మరునాడే తిరుగు ప్రయాణం.

*  *  *  *

బట్టలు సర్దుకుంటున్న తల్లి దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాడు శ్రీరాం.
‘‘అమ్మా, ఈరోజు మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళుతున్నాను. త్వరగా రెడీ అవండి.’’
‘‘ఎక్కడికి?’’ కుతూహలంగా అడిగింది శిరీష.
‘‘నాన్నా, ఈ ఊళ్ళో సర్కస్‌గానీ ఎగ్జిబిషన్‌కానీ ఉందా?’’ అని పిల్లలు అమాయకంగా అడుగుతుంటే-
‘‘ఇది పల్లెటూరు. అలాంటివేవీ ఉండవు. కానీ, అంతకంటే బాగుంటుంది. త్వరగా కారెక్కండి.’’
శ్రీరాం కళ్ళలో మెరుపు ఎందుకో తెలియకుండానే కారెక్కింది సునంద. ఊరికి రెండు మైళ్ళ దూరంలో ఆగింది కారు.
కారు దిగి కళ్ళెదుట అవిష్కృతమైన దృశ్యం చూడగానే ఒళ్ళు పులకరించింది.
విశాలమైన ఆవరణ నిండా పచ్చదనం నింపుకున్న రకరకాల చెట్లూ చుట్టూ రంగురంగుల బోగన్‌విల్లా తీగలు కమ్మేసిన కంచె, మధ్యలో వెదురుతో అందంగా తీర్చిదిద్దిన గేటు మీద బంగారు రంగులో చెక్కినట్లున్న పేరు చదివి కొడుకువైపు ప్రశ్నార్థకంగా చూసింది సునంద.
నవ్వుతూ తలూపాడు శ్రీరాం.
‘‘చూశావుగా అమ్మా, రంగనాథ నిలయం, తాతగారి పేరే.’’
తాను చూస్తున్నది కలో నిజమో అర్థంకాలేదు సునందకు.
‘నలభై ఏళ్ళుగా సొంత ఊరి మొహం మళ్ళీ చూడని నాన్నగారి మీద ఇంత అభిమానం ఎవరికుంది? సొంత ఇల్లు వాచ్‌మేన్‌కి అద్దెకిచ్చి ఉద్యోగరీత్యా ఎన్నో ఊర్లు తిరిగి రిటైరయ్యాక అన్నయ్య దగ్గరే ఉండి అక్కడే కాలం చేశారు గదా! మరి, ఆయన పేరుతో ఈ ఆశ్రమం ఎవరు నడుపుతున్నారు?’ అంతా అయోమయంగా ఉంది.
‘‘పదమ్మా, లోపలికెళదాం’’ అంటూ తల్లి చేయి పట్టుకొని ముందుకు నడిచాడు. శిరీష, పిల్లలూ వెనకే వెళ్ళారు.
దారికి అటూ ఇటూ విరబూసిన బంతి చెట్ల మధ్య రెల్లుతో నిర్మించిన పొదరిళ్ళలాంటి కుటీరాలూ... ఒక్కోదానికి ఒక్కో పేరూ... పరిశీలనగా చూస్తూ వాటిలో ఒక దానికి ‘సునంద’ మరొకదానికి ‘జానకి’ అని రాసి ఉండటంతో సునందకు నిజంగా మతిపోయినట్లనిపించింది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలనూ, ఆరుబయట కూర్చుని పనే తమ జీవిత ధ్యేయమన్నట్లు వంచిన తల ఎత్తకుండా వెదురు చాపలూ బుట్టలూ అల్లుతున్న పెద్దవారినీ చూస్తూ మంత్రముగ్ధురాలిలా నిలబడి ఉండగా... భుజం మీద ఏదో చల్లని, మృదువైన చేతిస్పర్శ... ఉలికిపాటుతో వెనక్కి తిరిగింది.
తెల్లటి చేనేత చీర, రవిక ధరించి, నలుపు తెలుపు కలనేత జుట్టును దువ్వి పొందికగా చుట్టిన ముడి, పెదవులపై గోరింట పూవులాంటి నవ్వుతో శాంతి కపోతంలా నిలబడి ఉన్న అరవై ఏళ్ళ స్త్రీమూర్తి... ఎవరో ఒక్క క్షణం అర్థంకాకపోయినా మరుక్షణంలోనే స్ఫురించింది.
ఆ పెద్ద పెద్ద కళ్ళూ ప్రశాంతమైన ఆ నవ్వూ... తను... ‘‘జ్యోతీ!’’ అప్రయత్నంగానే పెదవులు కదిలాయి.
‘‘సునందమ్మా, ఈ జన్మలో మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు. నేను బతికింది ఇందుకేనేమోననిపిస్తోంది. నిన్న బాబు వచ్చి వెళ్ళినప్పటి నుండీ క్షణమొక యుగంలా నీకోసం ఎదురుచూస్తున్నానమ్మా’’ చెమర్చిన కళ్ళు తుడుచుకొంటుంటే...
‘‘ఔనమ్మా, నిన్న రంగయ్య ‘ఊరి చివర తాతగారి పేరుతో ఆశ్రమం ఉంది బాబూ... జ్యోతమ్మగారే దాన్ని నడుపుతున్నారు. చాలా బాగుంటుంది, వెళ్ళిరండి’ అని చెప్పాడు. వెంటనే ఇక్కడికి వచ్చి ఆంటీతో మాట్లాడాను. మనింటికి వస్తానంటే ఆపేసి నిన్నే ఇక్కడికి తీసుకొస్తానని చెప్పాను.
ఎందుకంటే తనకంటూ ఎవరూ లేకున్నా పదిమంది కోసం బతుకుతున్న ఆంటీ ఆత్మవిశ్వాసం చూసి నువ్వు మామూలు మనిషివి అవుతావనిపించింది’’ కొడుకు మాటలు చెవులప్పగించి వింటున్న సునంద తుళ్ళిపడింది.
‘‘అంటే... నీకు... ఎవరూ...’’ అక్షరాలు కూడబలుక్కుంటున్న స్నేహితురాలిని చూసి చిరునవ్వు నవ్వింది జ్యోతి.
‘‘వీళ్ళంతా నావాళ్ళే. ఆమాటకొస్తే జగమంతా నా కుటుంబం అనుకుంటే ఒంటరితనం మన ఛాయలకు రాదు సునందమ్మా. భర్తనూ పుట్టిన బిడ్డనూ పోగొట్టుకున్నప్పుడు ‘ఎందుకీ జీవితం?’ అని నాకూ అనిపించింది. కానీ, మాస్టారు నేర్పిన చదువూ గూడెంలో పుట్టిన నన్ను మీలో ఒకదానిలా చూసిన మీ ఆప్యాయతా ఆదరణా, వరదలో గడ్డిపోచలా కొట్టుకుపోవలసిన నాకు ఒక ధ్యేయాన్నీ గమ్యాన్నీ చూపాయి. గుండె దిటవు పరుచుకుని జుగుప్సాకరమైన మావాళ్ళ జీవనశైలిని మార్చే ప్రయత్నంగా, మీ దగ్గర నేర్చుకున్నవన్నీ వీళ్లకు చెప్పాను. చీకట్లో మగ్గుతున్నవాళ్ళకు ‘గోరంత దీపం’లా ఒకదారి చూపించాలన్న నా ప్రయత్నం కొంతమేర ఫలించింది. ఇక్కడ ప్రశాంతంగా గౌరవప్రదంగా పనిచేస్తున్న వాళ్ళంతా ఒకప్పటి తాగుబోతులూ వ్యసనపరులే. ఊరంతా మారిపోవడంవల్ల నీకర్థం కాలేదేమోగానీ పందులు పొర్లుతూ దుర్గంధం నిండి ఉండే ఆ గుడిసెలే, ఇలా కొత్త రూపు సంతరించుకొన్నాయి. ఈ చిన్నపిల్లలను మాలాకాకుండా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని నా ఆశ.
ప్రవాహంలా సాగిపోతున్న మాటల్లో తొణికిసలాడుతున్న సంతృప్తిని చూస్తూ కళ్ళు విప్పార్చి వింటూ ఉండిపోయింది సునంద.
పంకంలో పద్మంలా విరిసి వసివాడిపోయిందనుకున్న తన ప్రియనేస్తం మహోన్నతమైన కోవెలలా కళ్ళముందు సాక్షాత్కరించడం నమ్మశక్యం కావడంలేదు. ఆనందం, ఆశ్చర్యం ముప్పిరిగొన్నాయి.
చిన్న వయసులోనే సర్వస్వం కోల్పోయి కూడా ఇంత స్థితప్రజ్ఞురాలైన ఆమె ఔన్నత్యం ముందు అన్నీ అనుభవించి, పండంటి పిల్లలతో ఏ లోటూ లేకుండా బతికి, మలిసంధ్యలో భర్తను కోల్పోయి ‘పుట్టిన ప్రతి జీవి మరణించక తప్ప’దనే సత్యాన్ని జీర్ణించుకోలేక కుంగిపోతున్న తన వ్యక్తిత్వం తల వంచి ఆమె ముందు మోకరిల్లుతున్నట్లు అనిపించి ఆమెను గట్టిగా గుండెలకు హత్తుకుంది.
‘‘జ్యోతీ, నిన్ను చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ‘జ్యోతి,
నా ప్రియనేస్తం’ అని దిక్కులు పిక్కటిల్లేలా అరవాలనిపిస్తోంది.’’
నవ్వేసింది జ్యోతి.
‘‘నేనంత గొప్పదాన్ని కాదమ్మా, మీరు వెలిగించిన చిన్న దీపాన్ని... అంతే.’’
‘‘కానీ, నువ్వు వాళ్ళందరి జీవితాల్లో నింపిన వెలుగు కొండంత. ఆ వెలుగులోనే నా దారి కూడా వెతుక్కోవాలని ఆశగా ఉంది.
నా ప్రయత్నం ఫలిస్తే మళ్ళీ తప్పకుండా నీ దగ్గరికొస్తాను.’’
తల్లి కళ్ళలో నిబ్బరం, ధైర్యం చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకుని తల్లినీ పిల్లలనూ చేయి పట్టుకొని బయటికి నడిచాడు శ్రీరాం.
చమర్చిన కళ్ళను తుడుచుకుంటూ తనకు వీడ్కోలు చెబుతున్న జ్యోతి తన వేదనకు ఉపశమనమిచ్చే దివ్యఔషధంలా కనిపించింది సునందకు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.