close

ఈ టైర్లకు గాలి అక్కర్లేదు!


దూరప్రయాణాలు చేసేప్పుడూ, అత్యవర పనుల మీద వెళ్లేప్పుడూ కారు టైరు పంక్చరైతే ఎంత ఇబ్బందో. ఎంత స్టెఫ్నీ టైరు ఉన్నా ఎండావానల్లోనూ, మట్టి రోడ్ల మీదా దాన్ని మార్చాలంటే మహాకష్టం. ఎక్కడికి బయల్దేరినా టైర్లలో గాలి సరిగ్గా ఉందో లేదో చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఉన్నట్టుండి టైర్లలో గాలిపోయినా, లేదా ఒత్తిడి అధికమై టైరు పేలిపోయినా యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదమూ ఉంది. వీటన్నింటికీ పరిష్కారంగా ప్రఖ్యాత ఆటోమొబైల్‌ సంస్థలు మిష్లిన్‌, జనరల్‌ మోటార్స్‌ సంయుక్తంగా గాలి అవసరం లేని టైర్లను రూపొందిస్తున్నాయి. ఉప్టిస్‌ (యునిక్‌ పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్‌ సిస్టం) పేరుతో తయారవుతున్న ఈ టైర్లు పైన చెప్పిన ఇబ్బందుల్ని తప్పిస్తూ అధిక గ్రిప్‌నిచ్చేలా ఉపయోగపడతాయి. ప్రస్తుతం టెస్ట్‌రన్‌లో ఉన్న ఉప్టిస్‌ టైర్లు త్వరలో రోడ్లపైనా కనిపించనున్నాయి.


గాలిని శుభ్రం చేసే కుండీ!

క్కడ కనిపిస్తున్నది ఏంటో చెప్పగలరా... ఏముంది పూలకుండీ అందులో మొక్కా అంటారా... అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది అచ్చం పూల కుండీలా కనిపిస్తున్న ఓ ఎయిర్‌ ప్యూరిఫయర్‌. గాలిలోని కాలుష్యాన్ని తొలగిస్తూ చెడుగాలిని పీల్చుకుని, దాన్ని శుభ్రపరిచి బయటికి పంపుతూ, వాతావరణంలోని తేమ శాతాన్నీ నియంత్రించేలా ఇది పనిచేస్తుంది. దీనిలోనే మొక్క పెంచుకునే ఏర్పాటూ ఉంది. గాలిలోని అలర్జీ కారకాల్లాంటి వాటిని మొక్క దగ్గర ఉండే మట్టిలోకి పంపుతూ శుభ్రమైన గాలిని బయటికి పంపేలా దీన్ని రూపొందించారు. ఈ పరికరం మొక్క పరిస్థితినీ, మనం నీళ్లు పోయాల్సిన సమయాన్నీ మనకు యాప్‌ ద్వారా తెలియజేస్తుంది. పచ్చదనమూ ప్యూరిఫయర్‌ రెండూ ఒక చోట ఉంటే కావల్సిందేముంది!


అందాల ఆకు గొడుగు!

పాతకాలపు వాన పాట అనగానే ఆకుచాటు పిందె తడిసె... పాటే గుర్తొస్తుంది. నిజంగా ఆ ఆకులే వానకు గొడుగులైతే భలే ఉంటుంది కదూ... అనే ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ రంగురంగుల ఆకులతో చూడగానే ఆకట్టుకునేలా మార్కెట్లోకి వస్తున్నాయి ‘ఫోలీజ్‌ అంబ్రెల్లా’లు. అటు ఎండావానల నుంచి మనల్ని రక్షించుకునేందుకు ఉపయోగపడుతూనే ఇటు ఎదుటివాళ్ల చూపునీ ఆకట్టుకుంటాయివి. రంగుల్లో చిత్రంగా కనిపిస్తుండటంతో ఫొటోషూట్‌లకూ బాగుంటాయి. మొత్తానికి ఈ గొడుగు వేసుకుంటే ఆకుచాటునా ఏమాత్రం తడవకుండా నిలబడొచ్చు. ఏమంటారు!


టీవీ మనవెంటే!

కాసేపు హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం, ఇంకాసేపు లివింగ్‌ రూమ్‌లో చేరిపోతాం, మరికాసేపు బెడ్‌రూమ్‌లో వాలిపోతాం... ఒక్క హాల్లో ఉంటే తప్ప టీవీలో మనం చూడాల్సిన సినిమానో సీరియలో మరేదైనా కార్యక్రమమో చూసే అవకాశం ఉండదు. అలాగని ప్రతి గదిలోనూ ఒక టీవీ పెట్టుకోలేం. అందుకే మనం ఎక్కడికి వెళితే అక్కడికే టీవీనీ తీసుకెళ్లగలిగేలా ‘ద బ్యాండ్‌ అండ్‌ ఒలుఫ్‌సెన్‌ బొయెవిజన్‌ హారిజాన్‌ టీవీ’ రూపొందుతోంది. ఇందులో టీవీతో పాటే చక్రాలుండే స్టాండు కూడా వస్తుంది. మనం ఏ గదిలోకి వెళ్లినా సులభంగా టీవీని కూడా తీసుకెళ్లొచ్చు. ఇక గదిలో ఉండే వెలుతురుని బట్టి టీవీ తెర వెలుతురు కూడా అడ్జస్ట్‌ అయ్యేలా దీన్ని రూపొందించారు. కావాలనుకుంటే స్టాండును తొలగించి మామూలు టీవీలా దీన్ని గోడకూ పెట్టుకోవచ్చు. ఇక టీవీ హచ్‌ కుక్కలా మన వెంటే ఉంటుందన్నమాట!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.