close
ఆపిల్‌...రంగులద్దుకుంది..!

అందంగా ఉన్న పిల్లల్ని చూసి యాపిల్‌ పండులా ఉన్నారు... అంటారు. పండ్ల ప్రపంచంలో అందాల రాణి కిరీటమూ యాపిల్‌దే. ఎర్రని ఆ రంగూ గుండ్రని ఆ రూపమూ చూడగానే తినేయాలనిపిస్తుంది. కానీ లోపల ఉండే తెల్లని గుజ్జు మాత్రం కళ్లకీ నోటికీ అంతగా నచ్చదనే చెప్పాలి. అది గమనించే కాబోలు... ఆపిల్‌ గుజ్జు సైతం ఆకర్షణీయమైన రంగుల్లోనూ మధురమైన రుచుల్లోనూ మరిన్ని పోషకాలతోనూ ఉండేలా పండిస్తున్నారు..!

పండు... అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆపిలే. అలాగని ఇది అన్నిచోట్లా పండదు. కానీ బ్రిటిషర్ల పుణ్యమా అని ఇంగ్లిష్‌ భాషలోని ‘ఎ’ అక్షరంతోబాటే ఆపిల్‌ అన్నదీ ప్రపంచానికి పరిచయమైంది. మనిషి పెంచిన తొలి పండ్ల చెట్టు ఆపిలేనట. వేల సంవత్సరాల క్రితమే ఎన్నో రకాలు సృష్టించిందీ అందులోనేనట. ఆపిల్‌ స్వస్థలం మధ్య ఆసియా ఖండంలోని కజకిస్థాన్‌. అప్పట్లో ఆపిల్‌ చెట్లు అరవై అడుగుల పొడవు ఉండేవనీ, గులకరాయి నుంచి బంతి సైజు కాయలు కాసేవనీ కార్నెల్‌ విశ్వవిద్యాలయ నిపుణులు తేల్చి చెబితే, క్రీ.పూ. 6,500 ఏళ్ల నుంచీ దీన్ని తింటున్నట్లు ఇలినాయ్‌ యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేశారు. వ్యాపారరీత్యా కజకిస్తాన్‌ గుండా ప్రయాణించిన వాళ్ల ద్వారా ఈ పండు భిన్న ప్రాంతాలకు విస్తరించింది. అలా వ్యాపించిన ఆపిల్‌ పండ్లలో సహజంగానే- అంటే, పరపరాగ సంపర్కం ద్వారా వేల రకాలు పుట్టుకొచ్చాయి. చూడ్డానికి గుండ్రంగా ఎర్రగా ఒకేలా అనిపించే ఆపిల్‌ పండులో దాదాపు 7,500 రకాలుంటే, వాటిల్లో 2500 రకాలు ఒక్క అమెరికాలోనే ఉన్నాయి. అయితే ఆపిల్‌ ఉత్పత్తిలో మాత్రం సగం వాటా చైనాదే. తొక్క రంగుని బట్టి గులాబీ వర్ణంలోని షాంపేన్‌, ఎర్రని రెడ్‌ డెలీషియస్‌, పసుపు వన్నెలీనే గోల్డెన్‌ డెలీషియస్‌, ఆకుపచ్చ రంగులోని గ్రానీ స్మిత్‌ రకాలు ప్రధానమైనవి. ఇవే కాకుండా రాయల్‌ డెలీషియస్‌, హనీ క్రిస్ప్‌, మెకింతోష్‌, గాలా, పింక్‌లేడీ... ఇలా ఎన్నో రకాలున్నాయి. వీటన్నింటినీ మనదేశంలోని ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాంచల్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కశ్మీర్‌లలోనూ పండిస్తున్నారు. వీటితోబాటు స్థానికంగా అభివృద్ధి చేసిన అక్బర్‌, షిరీన్‌, లాల్‌ అంబ్రి, అంబ్రి కశ్మీర్‌, ఫిర్‌దౌసి వంటివీ కశ్మీర్‌ లోయలో పండుతున్నాయి. రకమేదయినా పెరిగే వాతావరణం, నేల తీరుని బట్టి ఆపిల్‌ రుచి ఉంటుంది. కొరికితే రసం కారే సిమ్లా, గుప్పుమనే వాసనతో తియ్యగా ఉండే అంబ్రి కశ్మీర్‌ రకాల ముందు మిగిలినవన్నీ బలాదూరే. ముదురు ఎరుపూ లేదా ఊదా రంగులో ఉండే బ్లాక్‌ ఆపిల్‌ టిబెట్‌ కొండల్లో మాత్రమే పండుతుంది. సముద్రమట్టానికి 3,100 అడుగుల ఎత్తులో ఉండటం, తీక్షణమైన సూర్యకాంతి, అతినీలలోహిత కాంతి, పగలూ రాత్రుల్లోని ఉష్ణోగ్రతా వ్యత్యాసాలే ఈ రంగుకి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్కాన్సన్స్‌ బ్లాక్‌ ఆపిల్‌ కూడా ముదురు ఎరుపుతో నల్లగానే అనిపిస్తుంది. తొక్క రంగుల్లో తేడాలే కాదు, జన్యుపరిజ్ఞానం ద్వారా గోల్డెన్‌ డెలీషియస్‌, టోపాజ్‌ ఆపిల్స్‌ను సంకరీకరించి కోసినా నల్లబడని ఓపల్‌ రకాన్నీ సృష్టించారు.

రంగురంగుల్లో..!
తొక్క రంగుల్లో తేడాలున్నప్పటికీ ఆపిల్‌ పండ్లన్నీ తెలుపూ లేదా లేత పసుపు గుజ్జుతోనే ఉంటాయి. కానీ ఆపిల్‌కు సంబంధించిన సమగ్ర జన్యు సమాచారాన్ని 2010లో డీకోడ్‌ చేయడం వల్ల కోరిన రంగుల్లో రుచుల్లో వాటిల్లో కొత్త వంగడాలను సృష్టించగలుగుతున్నారు. రంగులకు కారణమైన ఆంథోసైనిన్లను ప్రవేశపెట్టడం ద్వారా ఆపిల్‌ గుజ్జు సైతం ఎరుపూ, ఎరుపూ-తెలుపూ, నారింజా, గులాబీ రంగుల్లో ఉండేలా కిసాబెల్‌ రోజ్‌, జువానె, ఆరెంజ్‌, హిడెన్‌ రోజ్‌, పింక్‌ పెర్ల్‌, మౌంటెయిన్‌ రోజ్‌, పింక్‌ లేడీ వంటి కొత్త రకాలను రూపొందించారు. ఎరుపూ లేదా గులాబీ గుజ్జుతో పండే ఈ రకాలన్నింటికీ సుమారు రెండువందల సంవత్సరాల క్రితం అమెరికాలో పండించిన గులాబీ రంగు గుజ్జులోని సర్‌ప్రైజ్‌ రకాన్నే మూలంగా భావిస్తున్నారు. భవిష్యత్తులో అన్నిరకాల ఆపిల్స్‌నూ రంగురంగుల గుజ్జుతో పండించే ప్రయత్నం చేస్తున్నారు.

ఏమున్నాయిందులో..!
రకమేదయినా ఆపిల్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌, వంటి ఖనిజాలూ; బి6, బి12, సి, కె విటమిన్లూ; పీచూ; క్యుయెర్సిటిన్‌, ఎపికెటెచిన్‌ వంటి ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. పెక్టిన్‌ అనే పీచు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ పేరుకోకుండా చేయడం ద్వారా హృద్రోగాలను నిరోధిస్తుంది. ఓ పెద్ద సైజు ఆపిల్‌ పండును క్రమం తప్పకుండా ఆరునెలలపాటు రోజూ తీసుకున్నవాళ్లలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిందనీ, మంచి కొలెస్ట్రాల్‌ 4 శాతం పెరిగిందనీ తేలింది. ఈ పీచు ప్రొబయోటిక్‌గానూ పనిచేస్తుంది. అంటే పేగులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకి తోడ్పడటం ద్వారా జీర్ణశక్తిని పెంచుతుంది. పైగా రోజూ దీన్ని తినేవాళ్లలో బ్రెయిన్‌ స్ట్రోక్‌, పక్షవాతం వచ్చే అవకాశం తక్కువ.
* నిజానికి ఆపిల్‌ గుజ్జులో కన్నా తొక్కలోనే పీచూ యాంటీఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. పేగు, చర్మ, రొమ్ము క్యాన్సర్లనీ ఆల్జీమర్స్‌నీ నిరోధిస్తాయి. రక్తనాళాల్లో కొవ్వులు పేరుకోకుండా చేస్తాయి. ఎపికెటెచిన్‌ బీపీని తగ్గిస్తుంది. తద్వారా ఇవి హృద్రోగాలను అడ్డుకుంటాయి.
* ఇందులోని ఐరన్‌ ఎర్ర రక్తకణాల సంఖ్యని పెంచడం ద్వారా రక్తహీనతను నివారించడంతోబాటు శరీరమంతా రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆపిల్‌ నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది.
* ఆపిల్స్‌లో సమృద్ధిగా ఉండే పాలీఫినాల్స్‌ క్లోమగ్రంథి నుంచి శరీరానికి అవసరమైన ఇన్సులిన్‌ని ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అదే సమయంలో ఇన్సులిన్‌ రిసెప్టర్‌ కణాలను ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో గ్లూకోజ్‌ పేరుకోకుండానూ జీవక్రియ వేగంగా జరిగేలా చేయడంతో మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ పండు శరీరం పిండిపదార్థాలను తక్కువగా గ్రహించేలా చేస్తుందని ప్రయోగాల్లోనూ స్పష్టమైంది.
* ఆపిల్స్‌లోని పాలీఫినాల్స్‌ మెదడులో ఎసిటైల్‌కోలీన్‌ శాతాన్ని పెంచడం ద్వారా ఏకాగ్రతనీ జ్ఞాపకశక్తినీ పెంచుతాయి. క్యాంఫెరాల్‌, క్యుయెర్సిటిన్‌ వంటి పదార్థాలు ఎముక, కీళ్ల జబ్బులకు కారణమైన మంటని తగ్గిస్తాయి. ఆపిల్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు కంటి కండరాల క్షీణత, కేటరాక్ట్‌, గ్లకోమా నివారణకీ సాయపడతాయి. వయసుతోబాటు వచ్చే ముడతల్నీ మచ్చల్నీ ఆపిల్‌ అడ్డుకుంటుంది. ఇన్ని గుణాలున్నాయి కాబట్టే, రోజుకో ఆపిల్‌ తింటే వైద్యుడితో పనిలేదన్నది నూటికి నూరుశాతం నిజమే అంటున్నారు ఆధునిక పరిశోధకులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.