close
సంతానాన్ని ప్రసాదించే సోమలింగేశ్వరుడు!

పిలిస్తే పలికే దైవంగా శివయ్యను ఆరాధిస్తారు. ఆ కైలాసనాథుడు స్వయంభూగా వెలసి, భక్తులపాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న గాథలు అనేకం. వాటిలో విశిష్టమైందిగా పంచమహాక్షేత్రాల్లో ఒక్కటిగా భాసిల్లుతోంది కామారెడ్డిలోని దుర్కి సోమలింగేశ్వర ఆలయం. సప్తరుషుల నుంచి స్థానిక పాలకుల వరకూ ... అందరితో పూజలందుకున్న ఈ ఆలయంలో ప్రతిదీ విశేషమే.

స్వామివారి ఆలయానికి దక్షిణదిశగా సుదూర ప్రాంతంలో పారుతున్న వాగూ... సమీపంలోని తటాకం.. చుట్టూ పచ్చని కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువై ఉందీ కామారెడ్డి జిల్లా దుర్కి సోమలింగేశ్వర ఆలయం. స్వయంభూగా వెలసిన సోమలింగేశ్వరుడి ఆలయాన్ని సప్తరుషులు సేవించారని ప్రతీతి. సుమారు 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని దర్శించడం వల్ల సర్వపాపాలూ నశిస్తాయని భక్తుల విశ్వాసం. కోరిన కొర్కెలు తీరుస్తూ కొంగుబంగారంగా పూజలందుకుంటున్న దుర్కి సోమలింగేశ్వరుడు సంతానాన్ని ప్రసాదించే స్వామిగా ప్రసిద్ధిచెందాడు. అందుకే ఈ ప్రాంతవాసులు ఎక్కువగా సోమవ్వ, సోమయ్య అనే పేర్లు పెడుతుంటారు. దుర్వాసుడు తపస్సు ఆచరించిన ప్రాంతంగా, సప్తరుషులు సేవించిన స్వయంభూ లింగేశ్వరుడిగా, తెలంగాణలోని పంచ మహాలింగాల్లో ఒక్కటిగా... ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నిలయం ఈ క్షేత్రం.

చారిత్రక నేపథ్యం
పూర్వం దుర్వాస మహాముని ఎత్తయిన ఈ కొండపైన తపస్సు చేస్తూ, తనతోటి రుషులతో కలిసి సోమేశ్వరుడిని సేవించడం వల్ల దుర్వాస మహాముని పట్టణంగా ఈ ప్రాంతాన్ని పిలిచేవారు. కాలక్రమంలో అది దుర్కిగా రూపాంతరం చెందింది. రాష్ట్రకూటులకు సామంతులైన కల్యాణి చాళుక్యులు క్రీ.శ. 973 నుంచీ 1189 వరకూ తెలంగాణలోని ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కల్యాణి చాళుక్య రాజైన సోమభూపాలుడు ఈ దుర్వాస మహాముని పట్టణాన్ని అధికార కేంద్రంగా చేసుకుని పరిపాలించేవాడు. ఆ సమయంలోనే స్వయంభూ సోమేశ్వరుడికి ఆలయాన్ని నిర్మించాడని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.
ఈ ప్రాంతంలోని సోమలింగేశ్వర స్వామిని కలుపుకొని పంచ మహాలింగాలు ఉన్నాయి. అవి... దుర్కి సోమలింగేశ్వర లింగం, అడ్కాస్‌పల్లి అడికేశ్వర లింగం, కొడుపుగంటి రామేశ్వరలింగం, కౌలాస్‌ పాపేశ్వర లింగం, వట్లం పరమేశ్వర లింగం. సూర్యోదయంతో ప్రారంభించి సూర్యాస్తమయం లోపల కాలినడకన ఈ పంచ మహాలింగాలను దర్శించి, తిరిగి మొదట దర్శించిన శివాలయానికి చేరితే జన్మ ధన్యమవుతుందని ప్రతీతి. సోమలింగేశ్వరుడిని సేవిస్తే సకల కోరికలూ నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయ ప్రాంగణంలోని ఓ రాయి పరిమాణం ఏటా  పెరుగుతోందని పండితులు చెబుతున్నారు.

లక్షలాదిగా భక్తులు
వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తుంటారు. మందిరం పొరుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉండడంతో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, మెదక్‌, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచీ భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కార్తికమాసం, మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. పార్వతీ పరమేశ్వరులకు కల్యాణం జరిపిస్తారు. ప్రత్యేక పూజలూ, అభిషేకాలూ, భజనలూ... లాంటి పలు కార్యక్రమాలను చేపడతారు. వివిధ గ్రామాల నుంచి భజన మండళ్ల సభ్యులు ప్రతి శని, సోమవారాల్లో భజనలు చేస్తారు. ఈ ఆలయంలో చాలా సంవత్సరాల నుంచీ నిత్యాన్నదాన కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది.

ఇలా చేరుకోవచ్చు...
కామారెడ్డిలోని దుర్కి సోమలింగేశ్వర ఆలయాన్ని చేరుకోవడానికి రైలూ, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి మెదక్‌, కామారెడ్డి మీదుగా వచ్చే భక్తులకు నేరుగా బాన్సువాడ చేరుకోవడానికి బస్సు సదుపాయం ఉంది. అక్కడి నుంచి ఆటోలో ప్రయాణించి సోమేశ్వరుడిని దర్శించుకోవచ్చు. రైల్లో వచ్చే భక్తులు... నిజామాబాద్‌ స్టేషన్‌లో దిగాలి. స్టేషన్‌కి 45 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

- ఎ. ప్రభాకర్‌, ఈనాడు డిజిటల్‌, నిజామాబాద్‌
చిత్రాలు: అంబటి మహేష్‌ గౌడ్‌

15 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.