close
చిత్రాల సీతాకోకచిలుక!

సీతాకోకచిలుక అనగానే రంగు రంగుల రెక్కలతో వాటి మీద రకరకాల డిజైన్లతో అందంగా ఆకట్టుకునేవే మనకు తెలుసు. కానీ ఇక్కడ కనిపిస్తున్న సీతాకోకచిలుక అందుకు భిన్నం. అదాటుగా దీన్ని చూసిన వారెవరూ అదో సీతాకోకచిలుక అనే అనుకోరంటే అతిశయోక్తి కాదు. ఒక పక్షి రెట్ట మీద రెండు కీటకాలు వాలినట్టుగా కనిపించేలా దాని మీద చిత్రం ఉంటుంది మరి. సీతాకోకచిలుక మీద ఎవరో కుంచెతో చిత్రం గీసినట్టు కనిపిస్తున్న ఈ రకం పేరు మాక్రోసిలిక్స్‌ మైయా. భారత్‌ సహా జపాన్‌, కొరియా, థాయ్‌లాండ్‌ తదితర దేశాల్లో ఇవి ఉన్నాయి. రకరకాల పక్షులూ కీటకాల నుంచి తనను తాను రక్షించుకునేందుకు ప్రకృతి చేసిన ఏర్పాటిది. మనుషులే తికమక పడేలా ఉన్న దీని రూపం ఇక మిగతా జంతువుల్నీ, పక్షుల్నీ బురిడీ కొట్టిస్తుందనడంలో సందేహమేముంది!


క్లియోపాత్రా అత్తరు... ఇదేనట!

అందంలోనూ తెలివిలోనూ సాటిలేని మేటిగా ఈజిప్టురాణి క్లియోపాత్రాకి పేరు. కళ్లు తిప్పుకోనివ్వని ఆమె సౌందర్య రహస్యమేంటీ, ఎదుటివాళ్లను ఆకర్షించేందుకు ఆమె ఎలాంటి సౌందర్య సాధనాలు వాడేదీ అనేది ఇప్పటికీ జనానికి ఆసక్తికర అంశమే. ఆ ఆసక్తితోనే ఇప్పుడు పురాతత్వ శాస్త్రవేత్తలూ, పర్‌ఫ్యూమ్‌ తయారీదారులూ కలిసి రెండు వేల సంవత్సరాల నాడు క్లియోపాత్రా వాడిన పరిమళాన్ని తయారు చేశారు. కైరో నగర పరిసరాల్లో దాదాపు పదేళ్ల పాటు వివిధ అన్వేషణలు జరిపాక అందులో దొరికిన శతాబ్దాల నాటి సెంటుబాటిలు ఆధారంగా ఆమె వాడిన అత్తరును తిరిగి సృష్టించారు. ఆలివ్‌నూనెతో పాటు యాలకులూ, దాల్చిన చెక్కా, సాంబ్రాణిల మిశ్రమంగా తయారు చేసిన ఈ అత్తరు పరిమళం రోజుల తరబడి అలాగే నిలిచి ఉంటుందట, ఎంతో దూరం దాకా వ్యాపిస్తుందట.


గాడిద ప్యాంటేస్తే!

అందమైన బీచ్‌లూ పచ్చటి కొండలతో పాటు ఫ్రాన్స్‌లోని రియా దీవిలో గాడిదలు కూడా పర్యటకుల్ని ఆకర్షిస్తుంటాం. ఎందుకంటే అక్కడి గాడిదలు మనుషుల్లా ప్యాంట్లు వేసుకుని తిరుగుతుంటాయి మరి. దాంతో చూసేవారికి చిత్రంగా కనిపిస్తాయి. రియా దీవిలో కనిపించే పొయిటౌ జాతి గాడిదలు మామూలు గాడిదలకన్నా పెద్దగా ఉంటాయి. మరోపక్క ఆ దీవిలోని ప్రజలకు ఉప్పు తయారీనే జీవనాధారం. అందుకే, ఉప్పు చెరువుల నుంచి దగ్గర్లోని ప్రాంతాలకు ఉప్పు మోసేందుకు పొయిటౌ గాడిదల్ని ఉపయోగిస్తారు. అయితే, ఆ ప్రాంతంలో ఉండే దోమలూ ఇతర కీటకాలూ వీటి కాళ్లను కుడుతుండడం వల్ల అవి సరిగా నడవకుండా అడ్డదిడ్డంగా కాళ్లు ఆడిస్తుండటంతో ఉప్పు మూటలు పడిపోతున్నాయని యజమానులు గాడిదలకు ఇలా ప్యాంట్లు కుట్టించి తొడగడం మొదలుపెట్టారు.


గుహలోనే స్టేడియం!

ఆ ఊళ్లో ఓ పెద్ద గుహ ఉంది. ఆటలు ఆడాలనే కోరిక ఉన్న ఔత్సాహికులూ ఉన్నారు. వానలూ, మంచూ కారణంగా బయట ఆడాలంటే కష్టం. అంతేకాదు, మైదానమంటే బోలెడు స్థలమూ కావాలి. అందుకే వాళ్లంతా కలిసి అక్కడే ఉన్న పెద్ద గుహను ఇండోర్‌ స్టేడియంలా మార్చేశారు. చైనా దేశపు నాయోంగ్‌ కౌంటీలోని జింగ్‌చున్‌ అనే గ్రామానికి వెళితే ఈ స్టేడియాన్ని చూడొచ్చు. విశాలంగా ఉండే అక్కడి సున్నపురాతి గుహలో 28 మీటర్ల పొడవూ, 15 మీటర్ల వెడల్పూ ఉండేలా బాస్కెట్‌ బాల్‌ కోర్టును నిర్మించుకున్నారు ఆ ఊరివాళ్లు. ఎవరికి ఎప్పుడు నచ్చినా ఎంచక్కా అక్కడికి వెళ్లి ఆడుకోవచ్చు. టోర్నీలూ నిర్వహించుకోవచ్చు. సుమారు వెయ్యి మంది దాకా ప్రేక్షకులు ఈ ఆటలను వీక్షించే సౌలభ్యమూ ఉందట. భలే ఆలోచన కదూ!

15 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.