close
ఉడుతలకి పక్షి భాష తెలుసు!

‘ఉడతా ఉడతా ఊచ్‌... ఎక్కడికెళతావోచ్‌...’ అంటూ పాడుకుంటాం. కానీ ఉడుతలు మాత్రం పక్షుల పాటల్నీ వాటి కువకువల్నీ శ్రద్ధగా వింటాయట. పక్షులు శత్రువులూ లేదా వాతావరణం నుంచి ఎదురయ్యే ఆపద గురించీ, ఆ తరవాత అది తప్పిందనే విషయం గురించీ పాటలూ కువకువల ద్వారా సంకేతాల్ని అందించుకుంటాయి. ఆ భాషని ఉడతలు కూడా నిశితంగా వింటాయట. ఒహాయోకి చెందిన పరిశోధకులు ఉద్యానవనాలూ ఇళ్ల చుట్టుపక్కలా నివసించే 54 ఉడతల ప్రవర్తనమీద ఓ కన్నేసి మరీ ఈ విషయాన్ని గమనించారట. ఎందుకంటే ఆ ప్రాంతంలో నివసించే చిన్న పక్షులకీ ఉడతలకీ ఎర్రతోక డేగ ఉమ్మడి శత్రువు. ఆయా పక్షులు దాన్ని చూసినప్పుడు హెచ్చరించుకునే పాటల్నీ అది వెళ్లిపోయాక ఇచ్చుకునే సంకేతాల్నీ కృత్రిమంగా వినిపించడం ద్వారా ఉడతల ప్రవర్తనను గమనించారట. శత్రువు దగ్గరలోనే ఉందన్న విషయం వినగానే అవి కదలకుండా ఎక్కడివక్కడ బిగదీసుకుని ఆకాశంలోకి చూసేవట. అది వెళ్లిపోయిందన్న కూత వినిపించగానే మళ్లీ పైకీ కిందకీ గెంతుతూ హాయిగా ఆడుకునేవట. అంటే పక్షుల కువకువల భాషని అవసరార్థం మిగిలిన జంతువులూ నేర్చుకుంటాయన్నమాట.


కాలేయం గుట్టు తెలిసింది!

శరీర కణజాలాలన్నీ భిన్న కణాలతో నిర్మితమై విభిన్న పనులు నిర్వర్తిస్తుంటాయన్నది తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఆ కణజాలాల్లోని కణాల పనితీరుని విశ్లేషించగలిగారు కానీ విడివిడిగా ఒక్కో కణం ఎలా పనిచేస్తుంది అన్నదానిమీద స్పష్టత లేదు. మొట్టమొదటగా మిచిగన్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు జీవక్రియలో కీలక పాత్ర నిర్వహించే కాలేయంలోని ఒక్కో కణం పనితీరునీ స్పష్టంగా తెలుసుకోగలిగే ‘సింగిల్‌ సెల్‌ ఆర్‌.ఎన్‌.ఎ. సీక్వెన్సింగ్‌ టెక్నాలజీ’ అనే విధానాన్ని రూపొందించారు.
ఎందుకంటే నాన్‌ ఆల్కహాలిక్‌ స్టియాటోహెపటైటిస్‌ అనే వ్యాధి కారణంగా కాలేయంలో కొవ్వు పేరుకోవడంతోబాటు కాలేయ కణాలు దెబ్బతింటాయి. ఫలితంగా జీవక్రియాలోపం తలెత్తడమేగాక క్యాన్సర్లు వచ్చే అవకాశమూ ఉంది. ఇంతవరకూ దీనికి సరైన చికిత్స కూడా లేదు. అందుకే ఈ కొత్త విధానం ద్వారా ఆరోగ్యంగా ఉన్న కాలేయాన్నీ వ్యాధితో దెబ్బతిన్న కాలేయాన్నీ పోల్చి చూడటం ద్వారా ఆయా కణాల పనితీరుని క్షుణ్ణంగా తెలుసుకున్నారు. లివర్‌ ఫైబ్రోసిస్‌ అనే వ్యాధికి కారణమైన నక్షత్రాకార స్టెల్లాట్‌ కణాలనీ గుర్తించారు. సో... ఈ కొత్త విధానంలో కణాలు ఎలా పనిచేస్తున్నాయి, అవి ఒకదాంతో ఒకటి ఏ విధంగా సమాచారాన్ని అందించుకుంటున్నాయి... అన్నదానిమీద పూర్తి అవగాహన వచ్చింది కాబట్టి మున్ముందు వ్యాధి నివారణ సులభం కావచ్చు అంటున్నారు సంబంధిత నిపుణులు.


చెమటతో చెకప్‌!

చేతికి పెట్టుకునే ఫిట్‌బిట్స్‌ ద్వారా తినే తిండినీ, పల్స్‌రేటునీ... ఇలా పలు ఆరోగ్య అంశాల గురించి తెలుసుకోవచ్చన్నది తెలిసిందే. కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు- చెమట ద్వారా ఆరోగ్య స్థితిని గ్రహించగలిగే వేరబుల్‌ సెన్సర్లను కొత్తగా రూపొందించారు. రోల్‌ టు రోల్‌ అనే ప్రాసెసింగ్‌ విధానంతో తయారైన ఈ సెన్సర్లతో కూడిన ప్లాస్టిక్‌ ప్యాచ్‌లను నుదురు, వీపు, భుజం... ఇలా ఆయా భాగాలమీద అతికిస్తే అవి శరీరానికి పట్టే స్వేద శాతాన్ని లెక్కించడంతోబాటు అందులోని పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లూ; గ్లూకోజ్‌, సుక్రోజ్‌ వంటి మెటాబొలైట్స్‌ని లెక్కించడం ద్వారా సంబంధిత వ్యక్తి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు అంటున్నారు. ఇందుకోసం కొందరు వ్యక్తుల్ని ఎంపికచేసి వాళ్లు వ్యాయామం చేసేటప్పుడు ఈ ప్యాచ్‌లను అతికించి వాటి ద్వారా చెమట శాతంతో బాటు అందులోని గ్లూకోజ్‌ శాతాన్నీ లెక్కించి దాన్ని రక్తంలోని గ్లూకోజ్‌ శాతంతో పోల్చి చూశారట. కొంతవరకూ ఇవి సరిపోవడంతో భవిష్యత్తులో రక్తపరీక్షలతో పనిలేకుండా మధుమేహ సమస్యల్నీ గుర్తించవచ్చు అంటున్నారు.


కంటి నిండా తింటున్నారా?

కొందరికి ఉన్నట్టుండి కంటిచూపు తగ్గిపోతుంటుంది. దానికి కారణం ఏమిటనేది ఓ పట్టాన అర్థంకాదు. పోషకాహారలోపం వల్ల కంటినాడి పనితీరు తగ్గిపోవడమే కారణం కావచ్చని బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొంటున్నారు. దీన్నే న్యూట్రిషనల్‌ ఆప్టిక్‌ న్యూరోపతీ అని పిలుస్తున్నారు. ఇదిలానే కొనసాగితే పూర్తి అంధత్వానికి దారితీస్తుందట. చూడ్డానికి ఎత్తూ బరువూ సరిగ్గానే ఉన్నప్పటికీ తినే తిండిలో పోషకాలు లోపించడంతో కంటిచూపు మందగిస్తుందని వాళ్ల పరిశోధనలో తేలింది. ముఖ్యంగా జంక్‌ఫుడ్‌ అధికంగా తీసుకునేవాళ్లలో ఈ రకమైన అంధత్వాన్ని వాళ్లు గుర్తించారు. చూపు దెబ్బతిన్న 16, 17 ఏళ్ల వయసువాళ్లని గమనించినప్పుడు వాళ్లలో బి12, విటమిన్‌-డి, కాపర్‌, సెలీనియం శాతాలు తక్కువగా ఉండటంతోబాటు మ్యాక్రోసైటిక్‌ అనీమియాతో బాధపడుతున్నట్లూ గుర్తించారు. ప్రాథమిక దశలోనే ఆ లోపాన్ని పసిగట్టి, వాళ్లకి ఆయా పోషకాల్ని సప్లిమెంట్ల రూపంలో అందిస్తే అది పూర్తిస్థాయిలో మెరుగయ్యే అవకాశం ఉందనీ లేదంటే అంధత్వానికి దారితీస్తుందనీ చెబుతున్నారు.

15 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.