close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యాలకులు నల్లగా... మిరియాలు తెల్లగా..!

టీవీల్లో యూట్యూబుల్లో మాస్టర్‌ షెఫ్‌లు వంటలు చేసేస్తూ తెల్ల మిరియాలు, నల్ల యాలకులు, ఉల్లిగింజలు, పచ్చ ఆవాలు అంటూ మనకు ఏమాత్రం తెలీని కొత్త రకం దినుసుల గురించి టకటకా చెప్పేస్తూ వాటిని వంటల్లో వేసేస్తూ ఉంటారు. అసలు అవేంటో... వాటి ప్రత్యేకతేంటో... ఎలా ఉంటాయో... ఎందుకు వాడతారో... మనమూ తెలుసుకుందామా...

యాలకులు...ఎంత నలుపో..! వీటినే కొండ యాలకులు, బెంగాల్‌ యాలకులు, పెద్ద యాలకులు అనీ అంటారు. పచ్చ యాలకులు ఒకలాంటి తీపి వాసనతో ఉంటే, నల్లనివి కాస్త ఘాటుగా కర్పూరం వాసనతో ఉంటాయి. అందుకే మటన్‌, చికెన్‌ వంటకాల్లోనూ బేకరీ ఉత్పత్తుల్లోనూ నల్ల యాలకుల వాడకమే ఎక్కువ. సిక్కిం, డార్జిలింగ్‌ ప్రాంతాల్లో ఎక్కువగా పండే ఈ రకాన్ని ఆయుర్వేద వైద్యంతోబాటు చైనా సంప్రదాయ వైద్యంలోనూ ఎక్కువగా వాడుతుంటారు. నల్లయాలకుల నుంచి తీసిన నూనెని ఒత్తిడి, తలనొప్పి తగ్గడానికి చేసే మర్దనల్లో వాడతారు. పచ్చ యాలకుల మాదిరిగానే ఇవి జీర్ణ సమస్యల్నీ నివారిస్తాయి. అంతేకాదు, మలేరియా జ్వర చికిత్సలోనూ నల్ల యాలకుల కషాయాన్ని ఎక్కువగా వాడతారట. ఇంకా దగ్గూ జలుబూ బ్రాంకైటిస్‌, దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణకీ తోడ్పడతాయి. క్రమం తప్పకుండా వీటిని వాడటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది, బీపీ తగ్గుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు పేగు, రొమ్ము, ప్రొస్టేట్‌, అండాశయ క్యాన్సర్లు రాకుండానూ నిరోధిస్తాయి. రక్తప్రసరణకి తోడ్పడటం ద్వారా చర్మాన్ని తాజాగా ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు పెరుగుదలకీ తోడ్పడతాయి. అందుకే ఉత్తరాది మసాలా వంటల్లో వీలైనంత ఎక్కువగా నల్లయాలకుల్నే వాడుతుంటారు.


పచ్చని ఆవాలు

ఆవాల్లేని తాలింపు ఉండదంటే అతిశయోక్తి కాదు. అలాగే ఆవ ఘాటూ తెలియంది కాదు. అయితే ముదురు గోధుమ, నలుపు రంగుల్లో ఉన్న ఆవాల వాడకమే మనదగ్గర ఎక్కువ. కానీ కాస్త ఘాటు తక్కువగా ఉండే పసుపు రంగు ఆవాలూ ఉన్నాయి. మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా పండించే ఈ పసుపు రంగు ఆవాలు నలుపు వాటికన్నా పరిమాణంలో పెద్దగా ఉంటాయి. తెలుపు నుంచి పసుపు రంగులో ఉండే ఈ రకాన్ని హాట్‌ డాగ్స్‌, శాండ్‌విచ్‌లు, హాంబర్గర్లలో ఎక్కువగా వాడుతుంటారు. ఈ గింజల్లో కెరోటిన్‌, ప్రొటీన్‌, ఐరన్‌, కాల్షియంలు ఎక్కువగా ఉండటంతో వీటి నుంచి తీసిన నూనెతో మర్దన చేస్తే జుట్టు వత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇతర ఆవాల్లో మాదిరిగానే వీటిల్లోని పోషకాలు ఆర్థ్రయిటిస్‌, క్యాన్సర్లు రాకుండానూ; బీపీ, మెనోపాజ్‌, ఆస్తమా సమస్యలు తగ్గడానికీ; ఫంగల్‌, బ్యాక్టీరియా వ్యాధుల్ని తగ్గించడానికీ తోడ్పడతాయి. మత్తుమందులు, ఆల్కహాల్‌ ఎక్కువైనప్పుడూ విషాహారానికీ విరుగుడుగా ఈ గింజల్ని మరిగించిన డికాక్షన్‌ని ఇస్తే ఫలితం ఉంటుంది. వీటి నుంచి తీసిన నూనెతో మర్దన చేస్తే నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం ఉంటుంది. ఇంకా వీటిల్లోని మోనో, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఆమ్లాలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.


తెల్ల మిరియాలు!

మిరియాల ఘాటు మనకు తెలియంది కాదు. వాటితో పోలిస్తే తెల్లమిరియాలు ఘాటు తక్కువ. అలాగని ఈ రెండూ వేర్వేరు కాదు. ఒక చెట్టుకి వచ్చేవే. కాకపోతే ఎండిన తరవాతగానీ ఎండక ముందుగానీ తొక్క తీసినవే తెల్ల మిరియాలు. వైట్‌సాస్‌లూ ఆలూవంటకాలూ సూప్‌లూ వంటి వాటిల్లో వీటిని ఎక్కువగా వాడతారు. ఇవి ఆకలిని పెంచి, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. వీటిల్లోని ఖనిజాలూ, యాంటీ ఆక్సిడెంట్లు పేగు క్యాన్సర్‌ నివారణకీ, జీర్ణాశయ ఆమ్లాల విడుదలకీ, ఎముక ఆరోగ్యానికీ దంతసిరికీ, బరువు తగ్గడానికీ, చర్మం మీద ఉండే మచ్చల నివారణకీ దోహదపడతాయి. రోగనిరోధకశక్తిని పెంచడంతోబాటు హానికర టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. అదేసమయంలో రక్తప్రసరణ మెరుగయ్యేలా చేయడం ద్వారా గుండెజబ్బుల్నీ నివారిస్తాయి. కాబట్టి నల్ల మిరియాలు మరీ ఘాటు అనుకునేవాళ్లు తెల్ల మిరియాలని ఎందులోనైనా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.


నల్ల జీలకర్ర!

అచ్చం జీలకర్రలానే ఉంటుంది. కానీ ఇది వేరే జాతికి చెందినది. బునియమ్‌ బల్బోకాస్టానమ్‌ అనే మొక్కకి కాసే ఈ జీలకర్రను మనదేశంతోబాటు మధ్యఆసియా వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. దీన్నే కాలాజీరా, షాహీజీరా అనీ అంటారు. ఈ మొక్క గింజలే కాదు, ఆకులూ దుంపలూ అన్నీ ఔషధగనులే. సువాసనభరితమైన ఈ మొక్క ఆకుల్ని కొత్తిమీరలానూ కొబ్బరిముక్కల రుచితోనూ ఉంటాయన్న కారణంతో దుంపల్ని కూరల్లోనూ వాడుతుంటారు. మామూలు జీలకర్ర కన్నా మంచి సువాసనతో ఉండే ఈ జీలకర్రని పొడి చేస్తే ఆ పరిమళం పోతుందన్న కారణంతో నేరుగానే వేస్తుంటారు. మటన్‌, బిర్యానీ, బ్రెడ్‌ వంటి వంటకాల్లో వీటి వాడకం ఎక్కువ. ప్రాచీన కాలం నుంచీ ఆయుర్వేదంలో వాడే ఈ సుగంధద్రవ్యం కళ్లకి ఎంతో మంచిదట. వాంతుల్నీ వికారాన్నీ తేన్పుల్నీ తగ్గించడంతోబాటు మధుమేహ, వృద్ధాప్య సమస్యల్నీ అడ్డుకుంటుంది. ఈ జీలకర్రలో సహజంగా ఉండే యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు చర్మ సంబంధిత ఇన్ఫెక్లన్లనీ నివారిస్తాయి. పావుటీస్పూను జీలకర్రని తేనెతో కలిపి రెండు నెలలు తీసుకుంటే పీసీవోడీల్లో వచ్చే కంతి పరిమాణం తగ్గుతుంది. నెలసరినీ క్రమబద్ధీకరిస్తుంది. బరువునీ తగ్గిస్తుంది. ప్రసవం తరవాత రెండో రోజు నుంచి పది రోజుల వరకూ టేబుల్‌స్పూను నల్లజీలకర్రని పరగడుపున తింటే ఇన్షెక్లన్లేవీ రాకుండా ఆరోగ్యంగా ఉంటారట.


ఉల్లి గింజ కాదు... కాలోంజీ

నిజానికివి ఉల్లివిత్తులూ కాదు, నల్ల జీలకర్రా కాదు. కాలోంజీ గింజలివి. నైజెల్లా సెటైవా అనే మొక్క నుంచి వస్తాయి. ఈ మొక్క కూడా జీలకర్ర కుటుంబానికే చెందడంతో అలా పిలుస్తారు. సువాసన కలిగి ఉండే ఈ గింజల్లో ఔషధగుణాలు చాలా ఎక్కువ. వీటిల్లోని థైమోక్వినోన్‌, కార్వాక్రల్‌ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వీటిల్లో విటమిన్లూ అమైనో ఆమ్లాలూ ఫ్యాటీఆమ్లాలూ ఖనిజాలూ అన్నీ సమృద్ధిగా ఉండటంతో గుండె పనితీరుకి తోడ్పడతాయి. అందుకే వీటిని అనేక రకాల వంటల్లో ముఖ్యంగా సమోసాలు, కచోరీలూ పాప్డీల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఈ గింజల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆల్జీమర్స్‌ తగ్గుతుంది. ఊబకాయులకీ మంచిదే. అరటీస్పూను పొడిని గోరువెచ్చని నీళ్లలో వేసుకుని తాగితే శ్వాసకోశ సమస్యలన్నీ తగ్గుతాయి. వీటినుంచి తీసిన నూనె కీళ్లనొప్పుల్నీ తలనొప్పుల్నీ కూడా తగ్గిస్తుంది. కాళ్ల పగుళ్లనీ తగ్గిస్తుంది. చర్మసౌందర్యానికీ తోడ్పడుతుంది. క్యాన్సర్‌ కంతుల పరిమాణాన్ని తగ్గించే గుణం ఈ గింజలకి ఉన్నట్లు అనేక పరిశీలనల్లో తేలింది. మరందుకే... కాలోంజీనీ పోపుడబ్బాలో చేర్చేయండి.


గసగసాలు... నల్లనల్లగా..!

 

గసగసాల పాయసం రుచీ మసాలాకూరల్లో గసాల వాడకం తెలిసినవే. వంటకాలకి చిక్కదనాన్ని అందించే గసగసాల(పాపీ)మొక్కల్లో రకాలెన్నో. నీలం, ఊదా, ఎరుపు, తెలుపు... ఇలా రంగురంగుల పూలు పూసే ఈ మొక్కలకి కోలాకారంలో కాసే కాయల్లోని గింజలే గసగసాలు. మొక్క రకాన్ని బట్టి గింజలు కూడా తెలుపూ గోధుమా నలుపూ నీలమూ బూడిద వర్ణాల్లో ఉంటాయి. వీటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయ ఆరోగ్యానికీ తోడ్పడతాయి. గసాల్లో పీచు శాతమూ ఎక్కువే, ఇది హృద్రోగాలనీ అడ్డుకుంటుంది. వీటిల్లో సమృద్ధిగా ఉండే బి-కాంప్లెక్స్‌ విటమిన్లూ, ఖనిజాలూ బీపీని నిరోధిస్తాయి. అయితే ఈ గింజలు ఓపియమ్‌లానే మత్తును కలిగిస్తాయనే అపోహ ఉంది. వీటిల్లో కొద్దిపాళ్లలో మార్ఫీన్‌, పపా వెరైన్‌ వంటి ఆల్కలాయిడ్లు ఉన్నమాట నిజమే అయినప్పటికీ వాటి శాతం చాలా తక్కువ. పైగా వీటిని ఉడికించి వంటల్లో వాడేసరికి వాటి ప్రభావం చాలావరకూ తగ్గిపోతుంది. పైగా ఆ ఆల్కలాయిడ్లు కొద్ది మోతాదులో ఉండటం వల్ల అవి మంచి మందులా పనిచేస్తూ నరాలమీద ఒత్తిడిని తగ్గిస్తాయి. నొప్పులేమయినా ఉంటే తగ్గుతాయి. అందుకే గసగసాల్ని సంప్రదాయ వైద్యంలోనూ వాడుతుంటారు.


ఎర్రని తమలపాకు!

తమలపాకుకి సున్నం, వక్కా జోడిస్తే ఎర్రగా పండటం తెలుసుగానీ ఈ ఎర్ర తమలపాకేంటీ అనిపించడం సహజమే. ఇండొనేషియాలో పండించే ఈ ఆకు, అద్భుతమైన ఔషధం కూడా. అనేక వ్యాధుల నివారణలో దీన్ని వాడతారు. మూడు ఆకులు తీసుకుని మూడు గ్లాసుల నీళ్లలో వేసి మరిగించి వడబోసి, రోజుకి మూడుసార్లు భోజనానికి ముందు క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహం తగ్గుతుంది. దగ్గూ, జలుబుల నివారణకీ తోడ్పడుతుంది. ఈ నీటిని రోజుకి రెండుసార్లు తాగితే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌నీ నివారిస్తుందట.
ఈ ఆకుల్ని మరిగించిన నీళ్లను చల్లార్చి ముఖం కడిగితే మొటిమల బాధ తగ్గుతుంది. అలాగే ఈ నీటితో పుక్కిలిస్తే దంత సమస్యలూ తగ్గుతాయి. చర్మం నుంచి దుర్వాసన రావడమూ తగ్గుతుంది. రోజూ ఈ ఆకుల్ని మరిగించిన కషాయం తాగడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ కణాలు వ్యాపించకుండా ఉన్నట్లు కొన్ని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.


చూశారుగా మరి... సుగంధద్రవ్యాలలోనూ మనకు తెలీనివి ఎన్నో...వాటిల్లో రకాలు ఇంకెన్నో... ఔషధగుణాలు మరెన్నో..!

22 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.