
హీరోగాకంటే డైరెక్టర్‌గానే బాగుంది!
అతడు తీసిన మొదటి సినిమా ‘పెళ్లిచూపులు’ ఓ ట్రెండ్ సెట్టర్. ఇండస్ట్రీకి ప్రతిభావంతులైన నటుల్నీ, సాంకేతిక నిపుణుల్నీ పరిచయం చేసింది. అతడి రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది?’ కూడా టాలీవుడ్‌కి కొత్త టాలెంట్‌ని అందించింది. తొలి, మలి సినిమాలతో తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ యువ దర్శకుల్లో ఒకడు అనిపించుకున్నాడు తరుణ్ భాస్కర్ దాస్యం. అతడి నుంచి నెక్స్ట్ ఏం సినిమా వస్తుందా అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో తరుణ్ హీరోగా కనిపించనున్నాడన్న వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘మీకు మాత్రమే చెప్తా’లో హీరోగా కనిపించడం వెనకున్న కథని తరుణ్ మనకు మాత్రమే చెబుతున్నాడిలా...
అరే, తరుణ్ ఓ కథ విన్నాను. చాలా బాగుంది. ఆ సినిమాని నేనే నిర్మిస్తున్నా...’ అన్నంతవరకూ చాలా కాజువల్‌గా అనిపించింది. విజయ్(దేవరకొండ) సినిమా నిర్మిస్తున్నాడంటే ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే తనకు సినిమా మీద ఉన్న ప్రేమ అలాంటిది. కానీ ‘అందులో నువ్వే హీరోగా చేయాలి’ అనేసరికి నమ్మబుద్ధి కాలేదు. ‘బాగా ఆలోచించావా’ అని అడిగా. ‘అన్నీ ఆలోచించాకే చెబుతున్నా. స్క్రిప్టు పంపిస్తున్నా చదువు’ అన్నాడు. ‘సరే’ అన్నాను. స్క్రిప్టు చదివాక ఓకే చెప్పాను. అందులో నాది హీరో పాత్ర అనేకంటే లీడ్ రోల్ అని చెప్పాలి. స్క్రిప్టు బాగా నచ్చింది. ‘మహానటి’, ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాల్లో నటించాను కానీ వాటిలో మాదిరిగా ఇది అతిథి పాత్ర కాదని అర్థమైంది. అందుకోసం ముందుగా చేసిన పని బరువు తగ్గడం. రెండు నెలల్లో ఆహారంలో మార్పులూ, వ్యాయామాలతో 105 కిలోల నుంచి 88 కిలోలకి తగ్గాను. నిజానికి సినిమా తీయడంలో ఉన్న అన్ని క్రాఫ్టుల గురించీ తెలుసుకోవాలనేది నా ఆరాటం. ఆ విధంగా ‘మీకు మాత్రమే చెప్తా’ నాకు చాలా పాఠాలు నేర్పింది. నటుడి కోణంలో దర్శకుడు ఆలోచించాలన్నది నేర్పింది. ఇకపైన నటుడిగానే స్థిరపడిపోతాను అనుకోవద్దు. నా సినిమా జర్నీలో ఇదో మజిలీ. రేపు ఇంకొకరు వచ్చి ఎడిటర్‌గా చేయమంటే ఆ పని కూడా చేస్తాను. ఎందుకంటే నాకు చిన్నప్పట్నుంచీ ఏదైనా కొత్తగా చేయడమంటే ఇష్టం. నా బాల్యం నుంచీ చెబితే ఆ ఇష్టానికి కారణం మీకే అర్థమవుతుంది.
యాసలు నేర్చేశా...
నాన్న ఉదయ్ భాస్కర్ ఇంజినీర్. సొంతూరు వరంగల్. అమ్మ గీత పెయింటర్, రచయిత్రి. తాతయ్య వాళ్లు తిరుపతి నుంచి వెళ్లి చెన్నైలో స్థిరపడ్డారు. అమ్మ పుట్టి పెరిగింది చెన్నైలోనే. అక్కడే ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసింది. ఇటు తెలంగాణ, అటు రాయలసీమ... చిన్నప్పట్నుంచీ రెండు యాసల్నీ బాగా గమనించేవాణ్ని. ఎక్కడి బంధువులతో అక్కడి యాసలో మాట్లాడేవాణ్ని. నేను పుట్టింది చెన్నైలోనే. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లో. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాను. అమ్మలోని సృజనాత్మకత నాకూ అబ్బింది. చిన్నప్పట్నుంచీ పెయింటింగ్స్ వేసేవాణ్ని. చాలా అవార్డులు గెల్చుకున్నాను కూడా. తబలా, గిటార్, సితార్ వాయించడంలోనూ ప్రవేశం ఉంది. ఏది నేర్చుకుంటానని చెప్పినా అమ్మ అడ్డుచెప్పేది కాదు. నాన్న మాత్రం ‘నేర్చుకోవడం కాదురా, అక్కడ గెలవాలి’ అనేవారు. చిన్నపుడు నలుగురిలో కలవాలంటే భయంగా ఉండేది. ఆ భయాన్ని పోగొట్టాలని నేను ఏది చేస్తానన్నా ప్రోత్సహించేవారు. ప్లస్‌వన్‌లో ఉండగా పుట్టినరోజుకి అమ్మ కెమెరా గిఫ్ట్‌గా ఇచ్చింది. దాంతో ఫొటోలూ, వీడియోలూ తీయడం మొదలుపెట్టాను. కంప్యూటర్లో ఆ ఫొటోలకు మెరుగులు దిద్దడం, వీడియోల్ని ఎడిట్ చేయడం చేసేవాణ్ని. వీడియో మేకింగ్ ఒక హాబీ అయిపోయింది. మా ట్వెల్త్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా స్కూల్లో వివిధ సందర్భాల్లో మేం దిగిన ఫొటోలతో వీడియో చేశాను. ఆరోజు దాన్ని తెరమీద ప్రదర్శిస్తే టీచర్లూ, విద్యార్థుల తల్లిదండ్రులూ ఎంతో మెచ్చుకున్నారు. ఆ చప్పట్లూ, ప్రశంసలూ చూశాక అందులో మజా ఉందనిపించింది. ఇంజినీరింగ్ చేస్తూనే షార్ట్‌ఫిల్మ్‌లు తీయడం మొదలుపెట్టాను. అమ్మ రాసిన ఓ ఆంగ్ల కవితకు ఫొటోల్ని జోడించిన వీడియోని ఐఐటీ మద్రాస్ నిర్వహించే సాంస్కృతిక ఉత్సవం ‘సారంగ్’కి పంపిస్తే ద్వితీయ బహుమతి వచ్చింది. ఇంజినీరింగ్ తర్వాత ‘వినూత్న గీతా మీడియా’ పేరుతో కంపెనీ పెట్టి గ్రాఫిక్ డిజైనింగ్, పోస్టర్స్ రూపొందించడంతోపాటు కార్పొరేట్ వీడియోలు చిత్రించేవాళ్లం. అవి చేస్తూనే షార్ట్‌ఫిల్మ్స్ తీసేవాణ్ని. 2012నాటి మాట. అప్పటికే డీఎస్ఎల్ఆర్లు వచ్చాయి. రూ.50 వేలు పెట్టి కొంటే వాటితో ఈజీగా షార్ట్‌ఫిల్మ్స్ తీసుకునే సౌలభ్యం ఉండేది. నేను ఎనిమిది షార్ట్‌ఫిల్మ్స్ తీశాను. వాటిలో ‘జర్నీ’, ‘అనుకోకుండా’, ‘సైన్మా’ షార్ట్ఫిల్మ్స్కి మంచి స్పందన వచ్చింది. ‘సైన్మా’ చూశాక చాలామంది సినిమావాళ్లు ఫోన్‌చేసి సినిమా చేద్దామన్నారు. వాళ్లలో ‘అష్టాచమ్మా’ నిర్మాత రామ్మోహన్ ఒకరు. దాదాపు ఏడాదిపాటు మేం కలిసి జర్నీ చేశాం. కానీ ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. అప్పుడే సురేష్‌బాబు గారినీ, అల్లు శిరీష్నీ, అఖిల్నీ కలిసే అవకాశం వచ్చింది. అఖిల్‌కి నేను రాసిన ‘బి.టెక్’ స్క్రిప్టుని వినిపించాను.
కానీ ఆ కథ తనకి నచ్చలేదు. చివరకు ‘అనుకోకుండా’ షార్ట్ఫిల్మ్నే ఇంకాస్త పొడిగించి సినిమా కథగా రాసుకున్నాను. దాని పేరునే తర్వాత ‘పెళ్లిచూపులు’గా మార్చాం. ఆ కథని మొదట మంచు లక్ష్మిగారికి వినిపించాను. ఆమెకు నచ్చింది. సరిగ్గా అప్పుడే మా నాన్న చనిపోయారు. ఊహించని ఆ పరిణామంతో షాక్‌కి గురయ్యా. దాన్నుంచి కోలుకుని మళ్లీ సినిమా చేద్దామనేసరికి లక్ష్మికి డేట్స్ కుదరలేదు.
కంపెనీ మూసేశా...
షార్ట్‌ఫిల్మ్స్ టైమ్‌లోనే విజయ్‌తో పరిచయమైంది. తనద్వారా రాజ్ కందుకూరి గారిని కలిసి కథ వినిపించాను. ఆయన నిర్మించేందుకు ముందుకు వచ్చారు. విజయ్ వాళ్ల మామయ్య యశ్ రంగినేని కూడా భాగస్వామిగా రావడంతో 33 రోజుల్లో రూ.64 లక్షలతో ‘పెళ్లిచూపులు’ ఫైనల్ కాపీ పూర్తిచేశాను. కానీ అక్కణ్నుంచి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. సినిమా చూసినవాళ్లు రకరకాలుగా మాట్లాడేవాళ్లు. ‘అసలు ఇది సినిమానా’ అనేవాళ్లు, ‘సినిమా బాగుంది. కానీ జనాలకి నచ్చుతుందో లేదో...’ ఇలాంటి మాటలతో కొత్త టార్చర్ మొదలైంది. కానీ రాజ్ మాత్రం నమ్మకంగా ఉండి నాకు ధైర్యం చెప్పేవారు. అప్పటికే నాకు పెళ్లయింది. ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. నేను పెట్టిన కంపెనీని కూడా మూసేశాను. ఆర్థికంగా, మానసికంగా బాగా డిస్టర్బ్ అయ్యాను. సురేష్ ప్రొడక్షన్స్ మాకున్న చిట్టచివరి ఆప్షన్. అక్కడా వర్కవుట్ కాకుంటే ‘చెన్నై వెళ్లి యాడ్స్ తీసుకోవడమే’ అనుకున్నా. సురేష్‌బాబు గారు ముందు ట్రైలర్ చూశారు. చూసీ చూడగానే ‘సినిమా తీసుకుంటున్నా’ అన్నారు. నే విన్నది నిజమేనా అనిపించింది. తర్వాత ఒకరోజు సినిమా మొత్తం చూసి ఫోన్ చేసి... ‘నిద్రపోతున్నావా’ అని అడిగారు. ‘లేదు సర్, నిద్ర పట్టడంలేదు’ అన్నాను. ‘సినిమా ఇప్పుడే చూశాను. మంచి విలువలతో తీశావ్. 100 రోజులు ఆడుతుంది. నిశ్చింతగా పడుకో’ అన్నారు. ఆరు నెలల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది ఆరోజే. ముందే సురేష్‌బాబు దగ్గరికి వెళ్లుంటేనా అనిపించింది. కానీ చాలామంది అక్కడికి వెళ్తే నువ్వు ఇరుక్కుపోతావ్ అని భయపెట్టారు. అదే మాట తర్వాత ఆయనతో చెబితే ఓ చిరునవ్వు నవ్వారంతే. ఆయన చెప్పినట్లే 105 రోజులు ఆడిందా సినిమా.
అన్నింటికంటే ఆ సినిమా ఎందరికో బ్రేక్ ఇచ్చింది. నా రెండో సినిమాకి వెంటనే అడ్వాన్స్ ఇచ్చి ‘నీకు నచ్చిన కథ రాసి తీసుకురా’ అన్నారు సురేష్‌బాబు. అదే ‘ఈ నగరానికి ఏమైంది?’. నా జర్నీ, ఫ్రెండ్స్ జీవితాల్లో చూసిన సంఘటనలతో కథ రాశాను. ఆయన సినిమా చూసిన రోజే ‘ఇది యూత్‌లోకి వెళ్తుంది. పెళ్లిచూపులు మాదిరిగా ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి రారు’ అని చెప్పారు. నేను కూడా ఒక గిరి గీసుకుని అందులో ఉండకూడదని ఈ కథ రాశాను. ఈ సినిమా కూడా నిర్మాతకి లాభాలు తెచ్చింది. కానీ పెళ్లిచూపులుతో పోల్చి మాట్లాడేవారు. నాకు అది
నచ్చలేదు. ‘అది అదే, ఇది ఇదే’ అన్న సంగతి ఎందుకు అర్థం చేసుకోవడంలేదో అనుకున్నాను.
వెబ్‌సిరీస్ తీస్తా...
సినిమాల్లో పడి సాధారణ జీవితానికీ, నేర్చుకోవడానికీ దూరమవుతున్నానేమో అనిపించింది. అందుకే కొద్దిగా విరామం తీసుకుని నెక్స్ట్ సినిమా చేద్దామనుకున్నా. ఆ టైమ్‌లోనే విజయ్ నుంచి ఫోన్. సినిమా జర్నీ చేస్తూనే కావాల్సిన విరామం ఎవరికి దొరుకుతుంది... కానీ నటుడిగా చేయడంద్వారా ఆ ఛాన్స్ నాకు దొరుకుతుందనిపించింది. ఈ సినిమాతో నాకు అనుభవమైంది ఏంటంటే, నాకు నటనకంటే కూడా డైరెక్షనే ఈజీ, సూటబుల్. సెట్లో బిజీగా ఉండటం అలవాటైపోయి... షాట్, కట్ల మధ్య మాత్రమే పనిచేయడం నావల్ల కాలేదు. డైరెక్టర్‌గా పనిచేస్తూనే భవిష్యత్తులో ఎడిటర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా ఇలా అన్ని ఫ్రేముల్నీ టచ్ చేయాలనేది నా ఆలోచన. అప్పుడే సినిమా గురించి 360 డిగ్రీల కోణంలో నేర్చుకునే అవకాశం వస్తుంది. ఆ అనుభవంతో తర్వాత తరాలకు నా అనుభవ పాఠాలు చెప్పాలనుకుంటున్నా. సినిమాలతోపాటు వాణిజ్య ప్రకటనలకూ పనిచేశాను కానీ నాకు అక్కడ అంత కిక్ దొరకలేదు. నేను రాసిన బి.టెక్. కథ ‘జీ ఫైవ్’ వాళ్లు వెబ్‌సిరీస్‌గా తెచ్చారు. నా ఫ్రెండ్ ఉపేంద్ర వర్మ దాన్ని డైరెక్ట్ చేశాడు. దానికి మంచి స్పందన వచ్చింది కూడా. నెట్‌ఫ్లిక్స్‌తో ఒక వెబ్ సిరీస్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. షార్ట్‌ఫిల్మ్, సినిమా, వెబ్‌సిరీస్... ఏది తీసినా కళాకారుడిగా ప్రేక్షకులకు జీవితంపైన నమ్మకాన్నీ, ఆశనీ కల్పించడమే నా లక్ష్యం.
సినిమా కుటుంబం...
నా శ్రీమతి లతా నాయుడు. వాళ్ల తాతగారు అబ్బయ్య నాయుడు కన్నడలో సినీ నిర్మాత. లత గ్రాఫిక్ డిజైనర్. మా సంస్థలో ఉద్యోగిగా చేరింది. తనకూ సినిమాలే ప్రపంచం. అలా ఇష్టాలు కలిశాయి. నేను సినిమాల్లోకి రాకముందే మాకు పెళ్లైంది. ఇద్దరమూ సినిమాలూ, వెబ్‌సిరీస్‌లు కలిసి చూస్తాం. నేను కథనీ డైలాగుల్నీ గమనిస్తే, తను రంగులూ, లైట్ గురించి పరిశీలనగా చూస్తుంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది?, యూ టర్న్(తెలుగు) సినిమాలకు ప్రొడక్షన్ డిజైనర్‌గానూ పనిచేసింది. ఇంటీరియర్ డిజైనర్కూడా. నా రియల్ హీరో అంటే ‘అమ్మ’ అనే చెబుతాను. నాన్న చనిపోయాక కుటుంబాన్ని ఆర్థిక కష్టాలనుంచి గట్టెక్కించింది. ప్రస్తుతం ఒక స్కూల్లో విజువల్ కమ్యునికేటర్గా పనిచేస్తోంది. ‘అనుకోకుండా’ షార్ట్‌ఫిల్మ్‌లో చిన్న పాత్ర చేసింది. తర్వాత ‘ఫిదా’, ‘118’ల్లో నటించింది. బయట తనను కొందరు గుర్తుపట్టి సెల్ఫీలు అడిగినపుడు చాలా సంతోషపడుతుంది. ఇంకొందరేమో ‘మిమ్మల్ని ఎక్కడో చూశాం’ అని అడుగుతుంటారు. ‘అరే, తెలిస్తే అందరికీ తెలియాలి, లేకుంటే తెలియకుండా ఉండాలి ఇలా సగం ఫేమస్ అవకూడదు’ అంటుంది నవ్వుతూ.
- సుంకరి చంద్రశేఖర్
29 సెప్టెంబరు 2019