close
సేవాపథం.. వారి అభిమతం

వారందరివీ భిన్న నేపథ్యాలు. అయితేనేం... తమ సంపాదనలోని కొంత భాగం పేదలకు ఉపయోగపడాలని తలచారు. ఇద్దరు మిత్రులు పేద పిల్లలకు పాదరక్షలు అందజేస్తుంటే... ఓ వృద్ధుడు సొంత డబ్బుతో విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. మరో వ్యక్తి వృద్ధులకూ, వికలాంగులకూ ఉచితంగా అన్నదానం చేస్తూ ఔదార్యం చాటుతున్నాడు.

చదువుల దాత

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లా ఖార్దియా గ్రామానికి చెందిన కేశవ్‌ సారన్‌కు ఇప్పుడు డెబ్భై యేళ్లు. ఉన్నత చదువు చదవాలని తన చిన్ననాట కలలు కన్నాడు. కానీ, తన గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలో పాఠశాల ఉండటంతో తొమ్మిదో తరగతికే పరిమితమయ్యాడు. తన లాగా.. గ్రామంలో బడి లేదన్న కారణంగా ఎవరూ చదువుకు దూరం కాకూడదని అనుకున్నాడు. గ్రామంలోని కొందరు బడి ఈడు పిల్లలను ఇంటికి తీసుకొచ్చి పాఠాలు బోధించాడు. కొన్ని రోజుల్లోనే ఆయన దగ్గరకు వచ్చి పాఠాలు నేర్చుకొనే వారి సంఖ్య రెండు వందలకు చేరింది. ఇల్లు సరిపోకపోవడంతో పిల్లలకు సౌలభ్యంగా 1989లో తన నాలుగు ఎకరాల పొలంలో రెండు గదులను నిర్మించాడు. వాటిలో ‘కేశవ్‌ పాఠశాల’ పేరిట ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు నిర్వహించాడు. పిల్లల సంఖ్య పెరుగుతుండటం, పై చదువులకు వెళ్లాలని వారు ఆశపడటం గమనించిన కేశవ్‌... ఆ పాఠశాల స్థాయిని పెంచాలనుకున్నాడు. విద్యాశాఖ నుంచి 2007లో అనుమతి పొంది నాలుగు నుంచి పదో తరగతి వరకు నిర్వహించాడు. పదో తరగతి చదివిన విద్యార్థులు ఇంటర్‌ చదవడానికి దూరప్రాంతాలకు వెళ్లకుండా 2013లో మరిన్ని తరగతి గదులను నిర్మించి పాఠశాలను కళాశాలగా మార్చాడు. ప్రస్తుతం ఈ కళాశాలలో 1200 మంది విద్యార్థులు చదువుతుండగా... 21 మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. పాఠశాల, కళాశాల నిర్వహణ ఖర్చూ, సిబ్బంది జీతాలను ఆయనే భరిస్తున్నాడు.


వృద్ధులకు ఉచిత భోజనం

సంతానం ఉన్నా వృద్ధులను పట్టించుకోకపోవడం, సొంత వారెవరూ లేక ఆకలితో అలమటిస్తూ వృద్ధులు మరణిస్తున్న ఘటనలను ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలే గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మురికిపూడి ప్రసాద్‌ను కదిలించాయి. ఇంత అభివృద్ధి చెందుతున్న సమాజంలో వృద్ధుల ఆకలి చావులు ఏంటీ అని ప్రశ్నించుకున్నాడు. వెంటనే తాను నివసిస్తున్న ప్రాంతంలోని పేద వృద్ధుల వద్దకు వెళ్లి వారి వివరాలను ఆరా తీశాడు. ఒక్కో వృద్ధుడికి అయిదు కిలోల చొప్పున బియ్యం, కొంత వంట సామగ్రిని ఉచితంగా అందజేశాడు. అయితే.. వృద్ధాప్యం కారణంగా వారు వంట చేసుకోవడం లేదని అర్థమై 2011లో తనే స్వయంగా భోజనం తయారు చేసి వృద్ధులకూ, దివ్యాంగులకూ అందించడం ప్రారంభించాడు. జిరాక్స్‌ కేంద్రం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ప్రసాద్‌... తన సంపాదనలో సగభాగం అన్నదానానికి వెచ్చిస్తుండటం ఇతరులనూ ఆలోచింపజేసింది. ఈ మంచి పనికి స్నేహితులూ తోడయ్యారు. వారి సహకారంతో ప్రసాద్‌ మూడేళ్ల క్రితం బాపూజీ ఛారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేసి అనాథాశ్రమాన్ని ప్రారంభించాడు. అందులో పది మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించాడు. ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉన్నవారితో కలిపి ప్రతి రోజూ నలభై మంది వృద్ధులకూ, దివ్యాంగులకూ రెండు పూటలా భోజనం అందజేస్తూ ఉదారత చాటుకుంటున్నాడు.


పేద పిల్లలకు పాదరక్షలు

శ్రీయన్‌ భండారి, రమేష్‌ ధామి స్నేహితులు. ముంబయిలోని ప్రియదర్శిని పార్కుకు వ్యాయామం, అథ్లెటిక్స్‌లో శిక్షణకోసం వస్తుండే వారు. శిక్షణలో భాగంగా ఏడాదికి మూడు నుంచి నాలుగు జతల షూస్‌ను వాడి... పాడైపోయిన తరవాత పడేసేవారు. ప్రతి సంవత్సరం ఇలా ఎంతోమంది వేలాది రూపాయల విలువైన షూస్‌ను వాడి పడేయడం వల్ల కాలుష్యం పెరగడంతోపాటు పరిసరాలూ అపరిశుభ్రంగా మారుతుండటం శ్రీయన్‌ భండారిని ఆలోచింప చేసింది. ఈ విషయాన్ని మిత్రుడు రమేష్‌ ధామితో పంచుకున్నాడు. వాటిని ఏదో ఒక మంచి కార్యక్రమానికి వినియోగించాలని ఆలోచించారు. చివరికి వాటిని పాదరక్షలు(స్లిప్పర్లు)గా మార్చి పేద పిల్లలకు అందజేయాలన్న నిర్ణయానికొచ్చారు. వృథాగా పడిఉన్న షూస్‌ను వారు సేకరించి కొన్ని రోజులపాటు స్థానికంగా పాదరక్షలు తయారు చేయించారు. 2013 నుంచి ‘గ్రీన్‌సోల్‌’ సంస్థ ద్వారా పేద పిల్లలకు ఉచితంగా పాదరక్షలను అందజేస్తున్నారు. లిబర్టీ, అడిడాస్‌, ఇన్‌బ్లూ, స్కెచర్‌, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదితర సంస్థల సహకారంతో పాత షూస్‌ను పాదరక్షలుగా, కొత్త షూస్‌గా మార్చి పేద పిల్లలకు అందజేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ సంస్థ వివిధ రాష్ట్రాల్లో కలిపి లక్షన్నరకు పైగా పాదరక్షలనూ, షూస్‌నూ పేద పిల్లలకు అందజేసింది. 2023 నాటికి దేశంలోని ప్రతి చిన్నారికీ పాదరక్షలు అందజేయడమే తమ లక్ష్యం అంటున్నారు శ్రీయన్‌ భండారి, రమేష్‌ ధామి.


22 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.